"గురూగారూ! నమస్కారం..."
"ఏంట్రోయ్... చాలా కాలానికి కనిపించావ్.
నా దగ్గర ఇక రాజకీయ పాఠాలు చాలనుకున్నావా?"
"అమ్మమ్మ... ఎంత మాట. చాలనుకుంటే మళ్లీ
ఎందుకు కనిపిస్తాను సార్. మీమీద ఏదో కేసు బనాయించి మీ స్థానంలో గురువునైపోనూ?"
"వార్నీ! నా మీదే సెటైర్లు వేసేంతటివాడవయ్యావన్నమాట.
మొత్తానికి నేను చెబుతున్న పాఠాలు కాస్తో కూస్తో వంటబట్టినట్టే ఉన్నాయ్. ఇంతకీ
ఏంటిసయం?"
"ఏంలేదు గురూగారూ! మీ పాఠాలు వల్లె వేస్తుంటే
ఓ సందేహం వచ్చిందండి. ఉన్నపళాన లేచి చక్కా వచ్చేశా..."
"సందేహం వచ్చిందంటే బుర్రకెక్కుతున్నాయన్నమాటే.
అదేంటో అడుగు..."
"ఎలాగోలా మసి పూసి మారేడుకాయ చేసో, బతిమాలో, బామాలో, ఏడ్చో, ఓదార్చో,
వాగ్దానాలు చేసో, హామీలిచ్చో, నమ్మించో, కన్నీళ్లు కార్చో, లేని
కన్నీళ్లు తుడిచో, బుగ్గలు తడిమో, బుర్రలు
రాసో, కాళ్లావేళ్లా పడో... మొత్తానికి అధికారం సంపాదించాననుకోండి...
ఆ తర్వాత చెప్పినవన్నీ ఎలా చేయాలి?
వాగ్దానాలన్నీ ఎలా పూర్తి చేయాలి? ఇచ్చిన
హామీలు ఎలా నెరవేర్చుకోవాలి? ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రజాభిమానాన్ని ఎలా నిలట్టుకోవాలి?
ఇలాంటి సందేహాలతో బుర్ర తిరిగిపోయిందండి..."
"ఒరే... రాజకీయాలు పూర్తిగా నేర్చుకోకుండానే
ఏకంగా అధికారం గురించి ఆలోచిస్తే ఇలాగే అవుతుందిరా. నువ్వు అధికారంలోకి వస్తే నీ బుర్ర
తిరగకూడదురా... నిన్ను గెలిపించిన ప్రజానీకం బుర్ర తిరగాలి. అదీ అసలు సిసలు
పాలనంటే. నువ్వడిగిన ప్రశ్నలకు సమాధానంగా నీకొక కథ చెబుతా. మధ్యలో ప్రశ్నలడుగుతా.
వాటికి నువ్వు ఎలాంటి సమాధానాలు చెబుతావో,
వాటిని బట్టి నీకసలు అధికార యోగం ఉందో లేదో చెబుతా. సరేనా?"
"మీరిలాంటి లింకులెట్టడంలో ఘటికులు కదండీ...
మరయితే చెప్పండి ఆ కథేంటో..."
"అనగనగా అమారా దేశంలో కొమారా రాజుగారురా.
గొప్ప తెలివైన వాడు. ఆయనకొక రాకుమారుడు. వీడు ఆ తండ్రిని మించిన వాడు. తండ్రి పాలనను
అడ్డం పెట్టుకుని కొడుకు చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. తండ్రి కోసం వచ్చే వాళ్లని
మధ్యలో అడ్డంకొట్టి వాళ్లతో ఏదో మాట్లాడేవాడు. తర్వాత వాళ్ల దగ్గర దండిగా దుడ్లు
వసూలు చేసేవాడు. అలా ఖజానాకి చేరాల్సిన ప్రజల సొమ్ముని దారి మళ్లించి తన సొంత
బొక్కసం నింపుకునేవాడు. మరి... అసలిదంతా ఎలా సాధ్యమైంది? రాకుమారుడు వాళ్లకేం చెప్పేవాడు?
వాళ్లంతా అతడికి ఎందుకు దుడ్లు ఇచ్చేవారు?"
"చిక్కు ప్రశ్నే గురూగారూ! కానీ ఆలోచిస్తే
సమాధానం దొరికేసిందండి. తండ్రి దగ్గర అధికారం ఉంది కాబట్టి ఆయన దగ్గరకి రకరకాల
పనుల కోసం వచ్చేవారుంటారండి. ఆ పనేంటో కొడుకు ముందుగా తెలుసుకునేవాడన్నమాటండి.
ఆ పనిని బట్టి ఇంత ధరని తేల్చేవాడండి. ఆ సొమ్ము ముట్ట చెప్పగానే కొడుకు ఆ తండ్రికి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడండి. వెంటనే ఆ రాజుగారు వాళ్ల పని చేయించేసేవారన్నమాటండి"
"బాగానే చెప్పావురా. కానీ ప్రజల ఖజానాకి
చేరాల్సిన సొమ్ము ఎలా దారి మళ్లినట్టు?"
"ఇది అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు
చెప్పుకోవాలండి. రాజ్యంలో చాలా కీలకమైన ప్రదేశంలో ఎవరికైనా ఎకరాలకెకరాలు భూమి
కావాలనుకోండి. వాళ్లు నేరుగా కొడుకును కలుసుకుని దుడ్లు సమర్పించుకునేవారండి. ఆ
తర్వాత రాజుగారు ఆ భూమిని వాళ్లకి దఖలు పరిచేవారన్నమాటండి. అంతేనాండీ?"
"అదంత సులువేంట్రా? ఎంత రాజుగారైనా విలువైన భూమిని
ఇచ్చేస్తే ప్రజలు గగ్గోలు పెట్టరూ? చట్టం ఊరుకుంటుందా?
అది చెప్పు చూద్దాం..."
"గురూగారూ! మీరు మరీ నన్ను చిన్న పిల్లాడిని
అడిగినట్టు అడుగుతున్నారండి. రాజుగారు రాజ్యమేలుతుంటే చట్టానికి గంతలు కట్టడం
పెద్ద పనా చెప్పండి? అది కూడా చెబుతాను వినండి. కొడుక్కి దుడ్లు ముట్ట చెప్పిన వాళ్లు రాజుగార్ని
నేరుగా సభలోనే కలిసేవారండి. ఫలానా చోట ఫలానా భూమి కావాలని సభాముఖంగా కోరుకునేవారండి. రాజుగారు 'ఎందుకు' అని గంభీరంగా
అడిగేవారండి. దానికి వాళ్లు ఆ భూమిలో పెద్ద కర్మాగారం కడతాం, చుట్టు పక్కల జనానికి ఉద్యోగాలు
అవీ కల్పిస్తామనో... లేకపోతే అనాధ ఆశ్రమాలు నిర్మించి ప్రజా సేవ చేస్తామనో విన్నవించుకునేవారండి.
అప్పుడు రాజుగారు ఆ విన్నపాన్ని పరిశీలించినట్టు నటించి, వీళ్లు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు కాబట్టి, అక్కడి భూమిని వీళ్లకి చాలా తక్కువ ధరకి దఖలు పరిచేలా మాట ఇస్తున్నాను...
నా మాటే శాసనం... అని చెప్పేసి డైలాగొకటి కొట్టి దస్కతు మీద రాజముద్ర వేయించేసేవారండి. అంటే చాలా
విలువైన భూమి అతి చవగ్గా వచ్చేసినట్టే కదండీ? మరలా చేసినందుకు
కొడుక్కి అందులో వాటా ఇచ్చినా లాభమే కదండీ? మామూలుగా అయితే ఆ భూమికి
భారీ కిమ్మత్తు చెల్లించి దక్కించుకోవాలండి. అప్పుడా సొమ్ము నేరుగా ఖజానాకి
జమ అవుతుందండి. ఇప్పుడు ఆ రాజు, కొడుకులు ఇలా చేయడం వల్ల ఖజానాని
చెందాల్సిన సొమ్ముకి గండి పడినట్టే కదండీ?"
"బాగానే చెప్పావురా. అధికారంలో కిటుకేంటో
సులువుగానే అర్థం చేసుకున్నావ్. ఇప్పుడు మళ్లీ కథలోకి వద్దాం. ఇలా ఆ రాకుమారుడు
కోట్లకి పడగలెత్తాడు. ఇంతలో పాపం ఆ రాజుగారు కాలం చేశారు. వెంటనే ఆ రాకుమారుడు సింహాసనం ఎక్కాలని తెగ ఉబలాటపడ్డాడు. వాళ్ల దగ్గర వీళ్ల దగ్గరా దస్కతులు అవీ సేకరించి, అప్పట్లో సామంత
రాజ్యమైన అమారా దేశం వ్యవహారాలన్నీ చూస్తున్న సామ్రాజ్ఙి రాజమాతకు నివేదించాడు.
కానీ అప్పటికి ఈ రాకుమారుడికి పరిపాలన అనుభవం
లేకపోవడంతో వేరే వృద్ధ మంత్రిని రాజుని చేసింది. అప్పుడు రాకుమారుడు గుర్రమెక్కి
దేశాటనం మొదలు పెట్టాడు. ఎందుకలా చేశాడు? దేశాటనం వల్ల అతడికి ఏమిటి ఉపయోగం?"
"గురూగారూ! కథ మీరు చెబుతూ ఆ కథలో పాత్రల
గురించి నన్ను అడిగితే ఎలాగండీ?
సరే... రాజకీయంగా ఆలోచించి చెబుతాను, వినండి.
అప్పటికీ ఆ రాకుమారుడికి అధికారంలో ఉన్న మజా ఏంతో తెలిసిందండి. అదంటూ ఉంటే ఎంతలేసి
సంపాదించవచ్చో రుచి తెలిసిందండి. అందుకు ప్రజాబలం ముఖ్యమని గ్రహించాడండి. అయితే
అధికారంలో ఉండాలి, లేకపోతే ప్రజల మధ్య ఉండాలని అనుకుని దేశాటనం
బయల్దేరాడండి. ఆ దేశాటనలో ఊరూవాడా తిరుగుతూ ప్రజల్ని కలుసుకుని తన తండ్రి పాలన
గురించి ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడండి. ఎందుకంటే తన తండ్రిని ప్రజలు మర్చిపోతే
తనకిక రాజయ్యే అవకాశాలుండవు కదండీ? ప్రజలంతా రాజుగారు
పోయిన దుఃఖంలో ఉన్నారనే వంక పెట్టుకుని వాళ్లని ఓదార్చే నెపంతో సానుభూతి పొందుతూ
ఉండాలనేది అతడి ఆలోచనండి. పనిలో పనిగా తాను గనుక రాజయితే తన తండ్రిని మించి,
ఇంత చేస్తాను, అంత చేస్తానూ అంటూ భ్రమలు కల్పించి
ఉంటాడండి. అంతేనాండీ?"
"సెభాష్‌రా... కథలో ఆంతర్యాన్ని బాగానే
గ్రహించావు. ఇప్పుడు మళ్లీ కథలోకి వద్దాం. అలా ఆ రాకుమారుడు తాను రాజైతే స్వర్ణయుగం
తెస్తానని ప్రజలను నమ్మబలికాడు. ప్రజలు పాపం... నమ్మారు. దాంతో ప్రజలంతా కలిసి మూకుమ్మడిగా రాకుమారుడిని
తీసుకెళ్లి కనకపు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఇక నువ్వే మా రాజువన్నారు. ఆపై ఆ
స్వర్ణయుగం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డం మొదలు పెట్టారు. కానీ పాపం...
ఆ స్వర్ణయుగం రాలేదు సరికదా,
దేశం మొత్తం భ్రష్టుపట్టింది. అధికారం కోసం ఎదురు చూస్తూ దేశాటనం చేసి,
ఊరూరూ తిరిగిన ఆ రాకుమారుడు, సింహాసనం ఎక్కాక
అసలు ఏ పనీ చేయలేదు. పైగా దేశాన్ని అప్పుల కుప్పలా మార్చేశాడు. ప్రజల నుంచి పన్నుల
రూపంలో వస్తున్న డబ్బంతా ఏమవుతోందో ఏమో కానీ, ప్రతి నెలా
రాజోద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి ఆ రాజ్యంలో
దాపురించింది. జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని దయనీయ స్థితిలో ఉద్యోగులు పడిపోయారు.
దాంతో వాళ్లు బాహాటంగానే రాకుమారుడిని దూషించడం మొదలు పెట్టారు. ఆఖరికి సమ్మెలు
కూడా చేస్తామనే స్థితికి వచ్చారు. రాకుమారుడు
దేశంలో ఏ పనికీ నిధులు విడుదల చేయడం మానేశాడు. దాంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
రాజ్యానికి సంబంధించిన పనులు చేసే గుత్తేదారులకు కోట్లాది రూపాయలు బకాయిలు రాలేదు.
దాంతో వాళ్లు మరే కొత్త పనులూ చేసేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. దేశంలో రహదారులన్నీ గోతులు గొప్పులతో నిండిపోయాయి. వాటిపై ప్రయాణించే ప్రజలకు ఒళ్లునొప్పులు రాసాగాయి.
వృద్ధులకు అందే పింఛను డబ్బులు కూడా ఎప్పుడొస్తాయో తెలియదు. ప్రజలు ఇళ్లు నిర్మించుకుందామంటే
ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. సామాన్యులకు
నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నిఅంటాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే
రైతులు, సరైన ఆదాయం
లేక ఆత్మహత్యలకు పాల్పడడం మొదలు పెట్టారు. ఇలా ఏ వర్గం ప్రజల్ని తీసుకున్నా
ఏవేవో సమస్యలతో సతమతమవసాగారు. ఎవరైనా ఇదేం అరాచకం అని ప్రశ్నించడానికి
కూడా భయపడేలా రక్షక భటులను వాళ్లపై దాడులకు ఉసిగొల్పసాగాడా రాకుమారుడు. ఎదురుతిరిగిన
వాళ్లపై ఏవో సాకులు పెట్టి అరదండాలు వేసి కారాగారాల్లో పడేసి చితగొట్టడం ఆ రాజ్యంలో
సర్వ సాధారణమైపోయింది. ఇదిరా ఆ అమారా దేశంలో అరాచక పాలన కథ. ఇంతకీ ఆ రాకుమారుడు
ఎందుకలా చేశాడు? అనుభవ
రాహిత్యం వల్లనా? బాధ్యతా
రాహిత్యం వల్లనా? తెలివి
తక్కువతనం వల్లనా? అహంకారం వల్లనా? వీటికి సమాధానం చెప్పగలవేమో ప్రయత్నించు..."
"గురూగారూ! బాగా ఆలోచించి చూస్తే... ఆ రాకుమారుడు
అందరూ అనుకుంటున్నట్టు తెలివితక్కువ వాడు కాడండి. అపారమైన అతి తెలివి మీరినవాడు.
అసలు అతడు తండ్రి పాలనలోనే చక్రం తిప్పిన వాడు కాబట్టి, తానే రాజయ్యాక ఏం చేయాలో తెలియని
వాడని అస్సలు అనుకోలేం. దేనికైనా డబ్బే ప్రధానం అని అతడికి తెలుసు. అధికారం చేతిలో
ఉంటే దాన్ని ఎంత భారీగా సంపాదించవచ్చో గ్రహించాడు. మీరు కథలో చెప్పకపోయినా అతడు
ఈ పాటికే తనకి ఎంతో దగ్గరవాళ్లయిన వారికి, తన మాట వినే
వారికి దేశంలోని భూములు, ఓడరేవులు, గనులు లాంటి విలువైన వనరులని లోపాయికారీగా
దాఖలు చేసేసి ఉంటాడు. ఆ విధంగా వారి నుంచి దండిగా దుడ్లు తన సొంత బొక్కసానికి మళ్లించి
ఉంటాడు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలను కూడా తాకట్టు పెట్టి
ఉంటాడు. దేశ ఖజానాకి రాబోయే ఆదాయాన్ని కూడా
చూపించి అప్పులు చేసి ఉంటాడు. ఆ సొమ్మంతటినీ దారి మళ్లించే ఉంటాడు. ఇక ప్రజల్లో
తనకు మద్దతు పలికే వారెవరో పసిగట్టి ఏవేవో పథకాల పేరు చెప్పి వారికి నేరుగా
దుడ్లు అందే ఏర్పాటు చేసి ఉంటాడు. తానే ఎప్పటికీ రాజుగా ఉండిపోయేలా సకల మార్గాలూ
నిర్మించుకుని ఉంటాడు. మీరు కథలో స్వర్ణయుగం రాలేదని చెప్పారు. అది తప్పు. నిజానికి స్వర్ణయుగం వచ్చింది. అయితే అది ప్రజలకు
కాదు, ఆ రాకుమారుడికే. ఏమంటారు?"
"అద్బుతంరా. చాలా బాగా చెప్పావు. అయితే
మరి ప్రజలు ఇవన్నీ పసిగట్టలేరంటావా? రాకుమారుడు చేసే పనుల ప్రభావం చివరకి
తమ మీదనే పన్నుల రూపంలో పడుతుందని, తామే ఆఖరికి బాధితులుగా మిగిలిపోతామని గ్రహించరంటావా? దీనికి కూడా నీ సమాధానం ఏంటో చెప్పు?"
"గురూగారూ! ప్రజలు మీకన్నా, నాకన్నా, ఆ రాకుమారుడి కన్నా తెలివైన వారండి. ఎప్పుడు ఎవరికి ఎలా వాత పెట్టాలో తెలుసు.
అయితే ఈ ఒక్క సంగతి మాత్రం ఆ రాకుమారుడు గమనించినట్టు లేదు. జనం ఒట్టి అమాయకులని
అనుకుంటున్నట్టున్నాడు. జన చైతన్యం పెల్లుబికిన నాడు ఇలాంటి భ్రష్ట రాజకీయ నాయకులంతా
ఆ ప్రభంజనంలో కొట్టుకుపోతారని తెలుసుకోలేకపోతున్నాడు. అంతేనంటారా?"
"ఒరే... నువ్వు రాజకీయాల్లో నిజంగానే రాటు
దేలావురా. ఇక పోయిరా!"
-సృజన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి