ఫ్యాన్ తిరుగుతోంది. ఆనందరావు చూస్తున్నాడు. అంటే దానర్థం ఫ్యాన్ కిందే ఉన్న మంచం మీద ఆనందరావు పడుకుని ఉన్నాడని. ఫ్యాన్‌నే చూస్తున్నాడంటే ఆ గదిలో చూడడానికి ఇంకెవరూ లేరని. అలా చూస్తూనే ఉంటే కథ ముందుకు సాగదని అనుకున్నాడో ఏమోకానీ, ఆనందరావు తలగడ మీద తలని పక్కకి తిప్పి చూశాడు. పక్కనే సెలైన్ స్టాండ్ కనిపించింది. దానికో సీసా, దానికి గుచ్చి ఉన్న గొట్టం, ఆ గొట్టంలోంచి కిందికి చుక్క చక్కగా పడుతున్న సెలైన్
కనిపించాయి. ఈ గొట్టం మీంచే అతడి చూపులు జారాయి. అవి తన మణికట్టు సూది దగ్గర ఆగాయి. ఇలా పది నిమిషాల్లో ఓ పాతిక సార్లు చూసుంటాడు ఆనందరావు. అలాంటి పది నిమిషాలు గంటన్నరగా తొమ్మిది సార్లు జరిగాయి.
ఉండుండీ వరండాలో ఎవరివో అడుగుల చప్పుడు, బయట చెట్టు మీద కాకి అరుపు తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం. ఇంతలో డోర్ తీసిన చప్పుడు. ఆనందరావు అటు కేసి చూశాడు. ఆడో, మగో తెలియని విధంగా ఒళ్లంతా కప్పేసిన ప్లాస్టిక్ ముసుగు. ముఖం మీద షీల్డ్. పైగా మూతికి మాస్క్. గుచ్చి గుచ్చి చూస్తే కళ్లు ఒకటే కనిపిస్తాయి. ఆ కళ్ళలోకి తొంగి చూసినా ఏ భావమూ కనిపించదు. అదో రకం నిర్లిప్తత. వచ్చిన ముసుగు మనిషి సిరెంజ్ తీసేసరికి ఆనందరావు లేచి కూర్చుని జబ్బ పైకి లేపాడు. ఇంజెక్షన్ చివుక్కుమంది.
“నన్నెప్పడు డిశ్చార్జి చేస్తారు?” అనడిగాడు ఆనందరావు. చాలా సేపు నుంచి మౌనంగా ఉండడం వల్ల తన గొంతు తనకే వింతగా వినిపించింది. ముసుగు మనిషి మాట్లాడకుండా థర్మామీటర్ తీసేసరికి, చేసేది లేక నోరు తెరిచాడు. ఇంకేమీ మాట్లాడడానికి లేకుండా నాలిక కింద థర్మామీటర్ దూరింది. ముసుగు మనిషి టైం చూసుకుని ఆనక థర్మామీటర్ తీసి చూసి వెళ్లిపోయాడు. మళ్లీ ఆనందరావు, ఫ్యాను, సెలైన్ సీసా మిగిలారు.
ఇంతలో సెల్‌ఫోన్ ఓ ఈల లాంటిది వేసింది. అంటే ఏదో మెస్సేజ్ వచ్చిందన్నమాట. ఆనందరావు చూశాడు.
“గెట్ వెల్ సూన్ సార్. డోన్ట్ హెసిటేట్ ఫర్ ఏనీ హెల్ప్. ఐ ప్రే గాడ్ ఫర్ యువర్ స్పీడీ రికవరీ”...
రాకేష్ కళ్ల ముందు కదిలాడు ఆనందరావుకి.
“హు... నిజంగానే తన గురించి దేవుడ్ని ప్రార్థిస్తాడా రాకేష్?” నిట్టూర్చాడు ఆనందరావు. సరిగ్గా వారం క్రితం ఆఫీసులో
జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
“సార్... ఒళ్లంతా నొప్పులు. ఆఫ్ డే సెలవు పెడదామనుకుంటున్నాను” అన్నాడు రాకేష్.
“ప్రతి వాడూ ఏదో ఒక వంక పెట్టండయ్యా. పెండింగ్ పని ఎవడు చేస్తాడు? అడగడానికైనా సిగ్గుండాలి”…
ఎంత కఠినంగా పలికింది తన గొంతు? రాకేష్ మొహం చిన్నబోయింది. ఆ మొహం ఇప్పడు గుర్తొచ్చింది ఆనందరావుకి. ఆ రోజు పనంతా చేశాకే ఇంటికెళ్లాడు రాకేష్. వెళ్తున్నానని చెబుతున్నప్పడు రాకేష్ మొహంలో అలసట చూసి అప్పుడెంతో ఆనందం కలిగింది తనకి.
ఇప్పడెందుకో తనకే సిగ్గుగా అనిపిస్తోంది. అసలు తనేనాడైనా సరిగా మాట్లాడాడా స్టాఫ్‌తో? అనుకున్నాడు.
నిజమే... ఆనందరావు నోరు తెరిస్తే చాలు, అధికారం ఖంగుమనేది. దర్పం నొసలు చిట్టించేది. గర్వం రుసరుసలాడేది. వెటకారమో, వంకరతనమో మాటల్లో ముళ్లు దింపేది. అవతలి వారి మొహం ఎర్రబడినా, చిన్నబోయినా ఆనందరావుకి ఆనందం కలిగేది. ఆఫీసంతా తన ఒక్కడి వల్లనే నడుస్తున్నట్టు, అందరూ పని దొంగలైనట్టు, తనొక్కడే నిజాయితీతో
పనిచేస్తున్నట్టు అనుకునేవాడు.
రాకేష్ పెళ్లికి సెలవడినప్పుడూ అంతే.
“పది రోజులా? పెళ్లికి ఇన్నాళ్లెందుకయ్యా. నాలుగు రోజులు తీసుకో చాలు. నేను పెళ్లి చేసుకున్న రెండో రోజు డ్యూటీకి
వచ్చేశాను తెలుసా? నీకు ఇన్ని రోజులు సెలవిస్తే నాకు శోభనం జరిపిస్తారు పైవాళ్లు” అంటూ విరగబడి నవ్వాడు . పాపం రాకేష్. మొహం వేలాడేసుకుని వెళ్లిపోయాడు.
“ఛ... తను మరీ అంత దారుణంగా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది” అనుకున్నాడు ఆనందరావు. ఆలోచించిన కొద్దీ తన ప్రవర్తన తనకే వెగటుగా, పొగరుగా అనిపించింది.
ఎవరైనా ఏదో పని మీదో, ఏదైనా అడగడానికి తన గదిలోకి వస్తే చాలు. బిగుసుకుపోయేవాడు. వచ్చినట్టు తెలిసినా, గమనించనట్టు నటించేవాడు. వచ్చినవాళ్లు కాసేపాగి చూసి గొంతు పెగల్చుకుని భయంగా ‘సార్...’ అంటే అప్పడు కూడా
తలెత్తకుండా ‘ఊ..’ అనేవాడు గంభీరంగా. వాళ్లు ఏదో అడిగేవారు. ఆనందరావు వాళ్ల కేసి నొసలు చిట్టించి, సాధ్యమైనంత చికాగ్గా చూసేవాడు. కనీసం చిరునవ్వు కూడా లేకుండా జాగ్రత్త పడేవాడు. ఇక ఎవర్నీ కూర్చోమన్నదే లేదు.
ఆనందరావు గదిలోకి ఎవరు వెళ్లినా వచ్చేటప్పుడు గంటు మొహం పెట్టుకు రావల్సిందే. వెళ్లేప్పుడు నవ్వుతూ వెళ్లినా
వచ్చేప్పుడు ఏడుపు మొహం తప్పదు. అలాంటి వాడు ఆనందరావు. మాటలతో కించ పరచడంలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. వెటకారం చేయడంలో డాక్టరేట్ చేశాడు. నోరట్టుకుని పడడంలో నోబెల్ ప్రైజ్ పొందాడు. తిట్టడంలో అతడి
పరిశోధన తిరుగులేనిది. అసలా మాటకొస్తే వాళ్లమ్మకి ముందు అహంకారం పుట్టి, ఆ తర్వాతే ఆనందరావు పుట్టాట్ట. అంటే అహంకారం అతడికి అన్నగారన్నమాట. అలా కవల పిల్లల్లా పుట్టిన వాళ్లిద్దరూ కలిసే పెరిగారు.
ఆనందరావు గురించి మాట్లాడుకున్నప్పుడల్లా వాళ్ల ఆఫీస్ స్టాఫ్ అతడి భార్యను తల్చుకుంటారు.
“వీడితో వేగుతున్నందుకు ఆవిడకి సన్మానం చేయాలి” అంటూ జోక్ చేసుకునేవారు. “లోకంలో సహనానికి ఎవరైనా పరీక్ష పెడితే ఆవిడదే ఫస్ట్ ర్యాంక్” అనుకుని నవ్వుకునేవారు. ఆ నవ్వులన్నీ వాళ్ల బాధలోంచి పుట్టినవే. వాళ్ల నిస్సహాయతకి నిదర్శనాలే. తన గురించి ఆఫీస్ స్టాఫ్ మాట్టాడుకునే విషయాలన్నీ ఆనందరావుకి చేరేవి. అవన్నీ ఆనందరావుకి కోపం తెప్పించేవి కావు సరికదా, బోలెడంత ఆనందాన్ని కలిగించేవి. అంతటి శాడిజానికి శాంపిల్ పీస్ ఆనందరావు.
కానీ ఇప్పుడు అవే జ్ఙాపకాలు ఆనందరావుకి భయం కలిగిస్తున్నాయి. మరో విధంగా బాధ కలుగుతోంది కూడా.
“తనిప్పుడు పోతాడా?” ఆనందరావు గదిలో తిరుగుతున్న ఫ్యాన్‌తో పాటు బుర్రలో గిరగిరా తిరుగుతున్న ఆలోచన ఇదే. ‘అవును... కరోనా వార్తలు ఎన్ని చూడలేదు?
దిక్కులేని చావు చస్తున్నారు చాలామంది. భార్యా బిడ్డలు కూడా చూడ్డానికి లేకుండా, ఆసుపత్రి నుంచే శవాన్ని ఎవరో
శ్మశానానికి తీసుకుపోతే, ఎవరో తగలేసే కేసులు ఎన్ని చదవలేదు?’
ఆనందరావుకి భార్య జానకి గుర్తొచ్చింది. తను చనిపోతే జానకి చూడ్డానికి కూడా రాలేకపోవచ్చు. ఒక వేళ వచ్చినా, దూరం నుంచే చూపిస్తారు. ‘అవునూ... అప్పుడు జానకి నిజంగానే ఏడుస్తుందా? పైకి ఏడ్చినా లోలోపల సంతోషిస్తుందేమో!’
ఆనందరావుకి ఉన్నట్ట్టుండి గుండె పట్టేసినట్టు అనిపించింది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది. ఆయాస
పడుతూనే ఆసుపత్రి బెడ్ పక్కనే ఉన్న స్విచ్‌ను నొక్కాడు. కాసేపట్లో నిండా పీపీఈ ముసుగేసుకున్న నర్స్ వచ్చింది.
వస్తూనే ఆనందరావు పరిస్థితి అర్థమైంది. గబగబా బయటకి పరిగెత్తింది. ఆ పై స్ట్రెచర్ తీసుకొచ్చారు. ఐసీయూలోకి చేర్చారు.
‘అయిపోయింది... ‘ అనుకున్నాడు ఆనందరావు. రక్తంతో ఆక్సిజన్ తగ్గిపోయినట్టుంది. పైగా ఎప్పుడూ ఎరగని ఆయాసం. సహజంగా తీసుకునే ఊపిరికి కూడా ఆపసోపాలు పడాల్సి వస్తోంది. బహుశా... ఇవే తన ఆఖరి క్షణాలేమో.
ఆనందరావుకి జానకి గుర్తొచ్చింది. కళ్ల కొలుకుల నుంచి తెలియకుండానే నీళ్లు జారాయి.
తన కళ్లలోంచి నీళ్లా? ఆశ్చర్యపోయాడు ఆనందరావు. ఎప్పుడూ అందరినీ ఏడిపించి ఆనందించే ఆనందరావుకిది కొత్త అనుభవమే.
ఇంట్లో ఆనందరావు భోగమే భోగం. అతడి పైశాచిక ఆనందానికి ఓ ఔట్‌లెట్ అతడి భార్యే. ఇతరులని బాధపెట్టి అదే విజయమనుకునే ఆనందరావు జీవితంలో సగానికి సగం విజయాలకు చిరునామా ఆమె.
పొద్దున్నే లేవగానే అతడితో పాటే అతడి అహంకారం ఒళ్లు విరుచుకునేది. పొగరు లేచి కూర్చునేది. శాడిజం గొంతు
సవరించుకుని హుంకరించేది.
“ఏయ్... ఎక్కడ చచ్చావ్?” తో మొదలయ్యేది ఆనందరావు వికృత ఆనంద కేళి. ఏ గరిటతోనే పరిగెత్తుకు వచ్చిన జానకి
కళ్లలో భయం అతడి మొదటి విజయం. ఆ విజయం ఇచ్చిన కిక్కు రోజంతా కొనసాగేది. ఆపై అడుగడుగునా విజయాలే. అతడి భాష, ఆమె మనసుపై చేసే గాయాలకి ఆమె కళ్లలో నిర్లిప్తతే మౌన సాక్షి.
అలాంటి నిస్తేజమైన ఆ కళ్లల్లో తనకి కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు కలిగిన బెంగ ఆనందరావుకి గుర్తొచ్చింది. ఆమె
కళ్లల్లో సన్నటి కన్నీటి పొర అప్పట్లో తనకి నటనగా అనిపించింది.
“ఏడిశావ్‌లే. వెధవది తప్పుడు రిపోర్ట్ ఏడిసినట్టుంది. మరోసారి చేయిస్తా” అన్నాడు తను. రెండోసారీ పాజిటివ్ రావడమే కాదు, రాత్రికి జ్వరం, ఎడతెగని దగ్గు. అప్పుడు జానకి పడిన కంగారులో తనకి వెర్రిబాగులదనమే కనిపించింది.
“ప్రతిదానికి వెధవ నెగిటివ్ ఆలోచనలు. ఇప్పుడు నాకేమైందని?” అని తిట్టాడు.
ఇప్పడునిపిస్తోంది ఆనందరావుకి. జానకివా నెగిటివ్ ఆలోచనలు? తనవే.
“ఛీ... నేనే పెద్ద నెగిటివ్! నా ఆలోచనలు నెగిటివ్. నా వ్యక్తిత్వం నెగిటివ్. నా మాటలు నెగిటివ్. నెగిటివ్‌నెస్ నా నరనరానా
రక్తంతో బాటు ప్రవహిస్తోంది....”
ఆక్సిజన్ మాస్క్, ఆసుపత్రి గొట్టాలు, మోనిటర్లో పరిగెడుతున్న గీతలు, ఒంట్లోకి దిగుతున్న ఇంజక్షన్లు, చుట్టూ నర్స్‌లూ, డాక్టర్లూ ఉన్నా…ఆనందరావు ఆలోచనలు ఎడతెగక కుండా సాగుతున్నాయి.
“అసలు ప్రపంచంలో నా అంత నెగిటివ్ మనిషంటూ ఎవరూ ఉండరేమో. ప్రపంచంలోని వారందరూ పాజిటివ్. నేనొక్కడినే నెగిటివ్” …
ఆనందరావుకి మొదటి సారిగా ఏడుపొస్తోంది.
ఆయాసపడుతూ, ఎప్పుడూ లేనంత నీర్సంగా ఉండేసరికి ఆనందరావుకి అర్థమైపోతోంది, ఇవే తన ఆఖరి రోజులని.
“భగవాన్! నన్ను బతకనీ. నా భార్యకి క్షమాపణలు చెప్పుకోవాలి. నా సహోద్యోగులకు సారీ చెప్పాలి. నేను బాధ పెట్టిన వారందరినీ నేను సంతోషపరిచే అవకాశం ఒక్కటి ఇవ్వు. ప్లీజ్...”
ఎన్నడూ లేని కొత్త ఆలోచనలు కలుగుతుంటే మగతలోకి జారిపోయాడు ఆనందరావు. ఆనందరావు పరిస్థితి అత్యంత
విషమం అనే విషయం విన్న జానకి వెక్కి వెక్కి ఏడ్చింది. పూజ గదిలోకి వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంది.
“దేవుడా! ఆయన పాపం... అమాయకుడు. మనసులో భావాలను దాచుకోలేని చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన్ని
క్షమించు” అంటూ ప్రార్థించింది.
ఎవరి ప్రార్థన ఫలించిందో తెలీదు కానీ, ఆనందరావు కోలుకున్నాడు. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉన్నాక డాక్టర్ వచ్చి చెప్పాడు.
“కంగ్రాట్యులేషన్స్ ఆనందరావుగారూ! మీకు నెగిటివ్ వచ్చింది. మీరిక ఇంటికి వెళ్లొచ్చు”
ఆనందరావు ఇంటికి వచ్చాడు. భార్య కళకళలాడుతూ నవ్వుతూ ఎదురొచ్చింది. ఆపై కళ్లలో ఒత్తులు వేసుకుని సపర్యలు చేసింది. ఆనందరావుకి ఆమె కళ్లల్లో ఇప్పుడు నటన కనిపించడం లేదు. ప్రేమ కనిపించింది. ఆఫీస్ స్టాఫ్ చూడ్డానికి
వచ్చారు. అందరితో సరదాగా మాట్లాడాడు ఆనందరావు. ఆప్యాయంగా పలకరించాడు. హాయిగా నవ్వాడు.
స్టాఫ్ తిరిగి వెళుతుంటే దారిలో రాకేష్ అన్నాడు... “బాస్ నెగిటివ్ అయినప్పుడు ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా నెగిటివ్ వచ్చేసరికి బాస్ నిజంగా పాజిటివ్ అయిపోయాడు”...
అందరూ నవ్వుకున్నారు.
*****
నెల రోజుల తర్వాత...
ఆనందరావు పొద్దున్నే లేచాడు. అతడి గొంతు ఖంగుమంది... “ఏయ్! ఎక్కడ చచ్చావ్!”...
ఇప్పుడు కరోనాతో పాటు ఆనందరావు కూడా నెగిటివే.
కరోనా వస్తే మనుషులు మారిపోతే ఇక కథేం ఉంటుంది? అందుకే కరోనా కంచికి! కథ మొదటికి!!
PUBLISHED IN VISALAKSHI DEEPAVALI SANCHIKA AS A PRIZED STORY IN NOV'21
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి