బుధవారం, ఆగస్టు 14, 2024

గోదాట్లో సావిత్రి... అక్కినేని తెలివి!

మూగమనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న సమయంలో ఓ చిన్న ప్రమాదం జరిగింది. పడవ మీద నుంచి సావిత్రి నీటిలో పడిపోయింది. యూనిట్లో ఒక్కసారిగా కలకలం. ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.

ఆ సినిమాలో "ఈనాటి ఈ బంధమేనాటిదో .." పాట చిత్రీకరణ సమయంలో జరిగిందీ సంచలన సంఘటన. పాట షూటింగ్‌ లాంచీపై జరుగుతోంది. హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్‌ సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు . పి . ఎల్ . రాయ్ కెమెరా .  పాటలో భాగంగా "ఎవరు పిలిచారనో... ఏమి చూడాలనో... ఉప్పొంగి ఉరికింది గోదావరీ...." అనే చరణం తీస్తున్నారు. సావిత్రి పడవ మీద నుంచి గోదావరి వైపు ఓ పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. అందరూ ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఇంతలో లాంచి కింద ఉండే ప్రోపెల్లర్‌ కు సావిత్రి చీర కొంగు తగులుకుంది. ఇంకేముంది? ప్రొపెల్లర్‌ పళ్ళ చక్రం గిర్రున తిరిగేసరికి చీర మరింత చిక్కుకుపోవడంతో సావిత్రి, ఎవరో బలంగా గుంజిలాగినట్టుగా హఠాత్తుగా ఆ లాంచీ మీంచి గోదావరిలో పడిపోయారు. అనుకోని ఉపద్రవమే అయినా చటుక్కున తేరుకున్న సావిత్రి వెంటనే సమయస్ఫూర్తితో  లాంచి అంచును పట్టుకోగలిగారు. ఆమె అలా లాంచీ పట్టుకుని  వేలాడుతుంటే... యూనిట్టంతా హాహాకారాలు. లాంచీ ఆగిపోయింది. మరో పడవలోనున్న యూనిట్ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు హడావుడిగా లాంచీలోకి దూకారు. గబగబా ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు కానీ పైకి రావటం లేదు. ప్రమాదం లేదని తెలుసుకున్న యూనిట్‌ సభ్యులు ఊపిరి పీల్చుకుని ''రండమ్మా... అంటూ అరుస్తున్నారు . అయినా ఆవిడ నీట్లోంచి పైకి రావటం లేదు. పరిస్థితిని ఏయన్నార్ గ్రహించారు. వెంటనే లాంచీలో ఓ మూల ఉన్న కేన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. సాసేపటికి ఆ కాన్వాస్ పట్టాను చుట్టుకుని సావిత్రి బయటకు వచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రోపెలర్ కు చుట్టుకుపోయి ఉంది. అప్పుడుగానీ, సావిత్రి నీటిలోంచి బయటకు రావడానికి ఎందుకు తటపటాయించారో అక్కడివారికి తెలియలేదు. చీర మొత్తం చుట్టుకుపోయి ఉంటుందని ఏయన్నార్ తెలివిగా ఊహించి కాన్వాస్ పట్టాను ఇవ్వడంతో సావిత్రి సమస్య తీరింది.  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి