కళ్ల ముందే భార్య చనిపోయింది...
కన్నీరుమున్నీరయ్యాడు...
ఆ బాధ నుంచి తేరుకుని తన బతుకేదో తాను చూసుకుని ఉంటే అతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు...
కానీ అతడలా చేయలేదు...
తన భార్యలాగా తన ఊళ్లో మరెవరూ చనిపోకూడదనుకున్నాడు...
ఒక సుత్తి, ఒక ఉలి తీసుకుని ఆ ఊరికి అడ్డంగా ఉన్న కొండను తొలవడం మొదలు పెట్టాడు...
ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని...
రోజులు గడిచాయి...
నెలలు మారాయి...
సంవత్సరాలు దొర్లాయి...
అతడిది మాత్రం ఒకటే పని...
ఎండ...
వాన...
చలి...
పని ఆపలేదతడు...
అలా ఏకంగా 20 ఏళ్లు!
మొదట్లో అతడిని చాలా మంది పిచ్చివాడన్నారు...
ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు...
అర్థం చేసుకున్న కొందరు మాత్రం చేతనైన సాయం చేశారు...
భార్య పోయిన బాధ లోంచి, ఊరికి ఉపకారం చేసే అతడి సంకల్పానికి, వెనుదిరగని అతడి పట్టుదలకి ఆ కొండ తలవంచింది! దారిచ్చింది!!
అతడి పేరు దశరథ్ మాంఝీ...
‘ద మౌంటైన్ మ్యాన్’!
ఏమిటతడి కథ?...
బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం గెహ్లౌర్...
ఆ ఊరి చుట్టూ భారీ కొండలు...
ఊర్లో వాళ్లు ఆసుపత్రికి వెళ్లాలన్నా...
మార్కెట్‌కు వెళ్లాలన్నా...
పాఠశాలకు వెళ్లాలన్నా...
ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే...
దాదాపు 55 కిలోమీటర్లు...
ఆ ఊరివాడే దశరథ్ మాంఝీ...
నిరు పేద కూలీ...
రోజూ కష్టపడితేనే కుటుంబానికి భోజనం...
అతడి భార్య ఫల్గుణీ దేవి...
ఒక రోజు ఆమె భర్తకు భోజనం తీసుకెళ్లడానికి కొండ ఎక్కుతూ వెళ్తోంది...
అనుకోకుండా జారి కిందపడింది...
తీవ్రంగా గాయపడింది...
ఆసుపత్రికి తీసుకెళ్లాలి...
కానీ మధ్యలో పెద్ద కొండ...
రోడ్డు లేదు...
సమయానికి వైద్యం అందలేదు...
ఆమె మరణించింది...
దశరథ్ మాంఝీ గుండె పగిలిపోయింది...
భార్యను కోల్పోయిన బాధ ఒకవైపు...
తన గ్రామ ప్రజలు కూడా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్నారనే ఆలోచన మరోవైపు...
అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు...
"ఈ కొండే నా భార్యను నాకు దూరం చేసింది...దీన్ని తొలిచేస్తాను...’’
జనం నవ్వారు...
పట్టించుకోలేదతడు...
ఒక సుత్తి, ఒక ఉలి కొనుక్కున్నాడు...
అనుకున్న పని మొదలుపెట్టాడు!
అలా 22 ఏళ్లు గడిచాయి...
అందరూ అసాధ్యం అన్న పనిని అతడు సాధ్యం చేశాడు!
కొండలోంచి 360 అడుగుల పొడవు...
30 అడుగుల వెడల్పు...
25 అడుగుల లోతు గల మార్గాన్ని సృష్టించాడు!
ఒకప్పుడు 55 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దూరాన్ని, కేవలం 15 కిలోమీటర్లకు తగ్గించాడు!!
- ఇవిగివిగో అతడి వివరాలు...
దశరథ్ మాంఝీ బీహార్‌లోని గయ సమీపంలో ఉన్న గెహ్లౌర్ అనే గ్రామంలో పేద దళిత కుటుంబంలో 1934లో పుట్టాడు. అక్కడే పెరిగాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య చనిపోయాక 1960 నుండి 1982 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు ఒంటరిగా కొండను తొలిచాడు.
అతడు చేసిన ఈ అద్భుతాన్ని గుర్తించి బీహార్ ప్రభుత్వం గౌరవించింది. 2007లో ఆయన క్యాన్సర్‌తో మరణించినప్పుడు, బీహార్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
- ఆయన జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా "Manjhi - The Mountain Man" (2015) అనే సినిమాను రూపొందించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దికీ, దశరథ్ మాంఝీ పాత్రలో అద్భుతంగా నటించారు.
- ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన "సత్యమేవ జయతే" టీవీ షో మొదటి ఎపిసోడ్‌ను దశరథ్ మాంఝీ జీవితానికే అంకితం చేశారు.
- ఓ శిలా విగ్రహం, ఓ పోస్టల్ స్టాంపు అతడి పట్టుదలకు జోహార్లు చెబుతాయి.
- అతడి గురించి తెలిశాక మనలో కలిగే స్ఫూర్తి... ఎప్పటికీ ఆరిపోని జ్యోతి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి