శనివారం, జనవరి 14, 2023

జన చైతన్య సంక్రాంతి!

 


 ప్రజాకర్షక, జన వంచక విధానాల గురించి ఆలోచిస్తూ అలసిపోయి ఆదమరిచిన అధినేతకి కుర్చీలోనే కాస్తంత కునుకు పట్టిందో లేదో, సన్నాయి నాదంతో పాటు పాట వినిపించి మెలకువ వచ్చింది.

''అయ్యవారికి దణ్ణం పెట్టు...

అమ్మవారికి దండం పెట్టు...

డూ డూ డూ డూ బసవన్నా...

చూడూ చూడూ బసవన్నా...''

అంటూ గంగిరెద్దుల వాళ్లు పాట పాడుతూ రావడం కనిపించింది.

''ఏంటి బాబూ ఇదీ... ఈ పాటలేంటీ... ఇలా వచ్చారేంటీ...'' అంటూ సాగదీశాడు అధినేత.

''దండాలు బాబయ్యా... రాజ్యమేలే రాజులు తమరు... పండగ కదాని వచ్చాం బాబయ్యా... ఆపై తమ దయ...'' అన్నాడు గంగిరెద్దు మేళం పెద్ద.

''మంచిది బాబూ... మీ గురించి కూడా గంగిరెద్దు భరోసా పథకం పెడతానూ... గంగడోలు దువ్వుతానూ...'' అన్నాడు అధినేత.

''మమ్మల్ని కూడా నమ్మిస్తున్నారా బాబయ్యా... ముందు మా పాట వినండి అయ్యా....'' అన్నాడా పెద్ద నర్మగర్భంగా. ఆ తర్వాత పాట అందుకున్నాడు.

''డూ డూ డూ డూ బసవన్నా...

బంగరు గిట్టల బసవన్నా...

పైడి కొమ్ముల బసవన్నా...

నిజాలు చెప్పు బసవన్నా...

ప్రజలను వీడు బసవన్నా...

పశువుల చేసెను బసవన్నా...

అబద్దాలతో బసవన్నా...

ఆకర్షించెను బసవన్నా...

కుర్చీ ఎక్కి బసవన్నా...

అన్నీ మరిచెను బసవన్నా...

మత్తులో ముంచి బసవన్నా...

మాయ చేసెను బసవన్నా...''

అధినేత తుళ్లి పడ్డాడు. ''ఏయ్... ఏంటా పాట?'' అన్నాడు కోపంగా.

''శాంతించండి బాబయ్యా... మేం గంగిరెద్దునే ఆడిస్తాం. మీరు ప్రజల్నే గంగిరెద్దుల్ని చేసి ఆడిస్తున్నారు. అమాయక జనం మీరు చెప్పినదానికల్లా మొదట గంగిరెద్దుల్లాగే తలలూపారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతోంది బాబయ్యా... అందుకే మా పాట కూడా కొత్తగా సాగుతోంది...ఇక వెళ్లొస్తాం'' అన్నాడు. గంగిరెద్దు పెద్దగా రంకె వేసి కొమ్ములు విసిరి సాగిపోయింది.

అధినేతకి ఏమనాలో తోచలేదు. వీళ్లపై ఏదైనా అడ్డగోలు కేసు బనాయించాలనుకున్నాడు. లేదా గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికీ తిరగకుండా ఆంక్షలు విధిస్తూ ఏదైనా కొత్త జీవో జారీ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో ఉండగానే మరో పాట వినిపించింది.

''హరిలో రంగ హరీ... నిజం తెలుసుకో మరి...'' అంటూ హరిదాసు వచ్చాడు.

''నువ్వెవరు నాయనా? ఎందుకిలా వచ్చావూ? నీక్కూడా ఏదైనా పథకం కావాలా?'' అన్నాడు అధినేత.

''ధర్మప్రభువులు... అక్కర్లేదయ్యా... మమ్మల్నిలా బతకనిస్తే చాలు...'' అంటూ హరిదాసు చిడతలు వాయిస్తూ పాటందుకున్నాడు.

''హరిలో రంగ హరీ...

భ్రమలు వదులుకో మరి...

ఎన్నికలొస్తే ఈసారి...

ఆలోచించుకో ఓసారి...

వచ్చాడమ్మా కిందటి సారి...

వంచన నేర్చిన మాయలమారి...

ఆ ఉచ్చులో పడితే మరోసారి...

నీ భవితకు అదే అవుతుంది ఘోరీ...

హరిలో రంగ హరీ!''

చిడతలు వేస్తూ హరిదాసు పాడేసరికి అధినేత ఉలిక్కిపడ్డాడు.

''ఏంటయ్యా... ఏం పాడుతున్నావు?'' అంటూ గద్దించాడు.

''ఊరుకోండి బాబయ్యా... మూడున్నరేళ్ల క్రితం ఇలాగే మీరు ఊరువాడా, ఇల్లూ వాకిలీ తిరుగుతూ హరికథలెన్నో చెప్పారు. జనం అవన్నీ నిజమనుకుని నమ్మారు. అప్పట్లో జనం ఏడవకున్నా మీరు ఓదార్చారు. అదే జనం ఇప్పుడు బోరుమని ఏడుస్తున్నారు. అందుకే నా వంతుగా వాళ్లని చైతన్య పరచాలని ప్రయత్నిస్తున్నా. ఇక వస్తా...'' అంటూ వెళ్లిపోయాడు.

అధినేతకి ఏమీ అర్థం కాలేదు. ''ఏం జరుగుతోంది?'' అనుకున్నాడు.

'కొంపదీసి జనం నిద్రలోంచి మేలుకోలేదు కదా?' అని భయపడ్డాడు. తర్వాత ఆ ఊహకే బెంబేలెత్తి పోయాడు. ఇంతలో కొందరు మహిళలు  చకచకా వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేయసాగారు. మరి కొందరు ఆడవాళ్లు ఆ ముగ్గుల్లో గొబ్బిళ్లు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటందుకున్నారు.

''గొబ్బీయలో... గొబ్బీయలో...

సంక్రాంతి పండగొచ్చె గొబ్బీయలో...

అందరినీ మేలుకొలిపె గొబ్బీయలో...

ఊరువాడ ఏకమై గొబ్బీయలో...

ఊదరగొట్టేయాల గొబ్బీయలో...

ఓటు రాజకీయాలను గొబ్బీయలో...

ఓడించి తరమాల గొబ్బీయలో...

గూడుపుఠానీగాళ్లకు గొబ్బీయలో...

గూబగుయ్యిమనాల గొబ్బీయలో...

ఆడవాళ్ల శక్తి చూపి గొబ్బీయలో...

ఆటకట్టు చేయాల గొబ్బీయలో...''

అధినేతకు ఏమనాలో తోచలేదు. ''ఏంటింది? ఏమంటున్నారు? ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అవ్వ... మీ కోసమే కదా ఎన్నో పథకాలు పెట్టాను? అవన్నీ మరిచారా?'' అన్నాడు.

''ఊరుకోవయ్యా... పెట్టావులే పథకాలు. ఇంటా బయటా ఆడవాళ్లకి రక్షణ లేకుండా చేశావు. మద్యాన్ని సారాని ఏరులై పారించేసరికి మా మగాళ్లంతా పూటుగా తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకుంటున్నారు. నాటు మద్యం మరిగి అనారోగాల పాలవుతున్నారు. ఇక బయట మా మహిళలకు భద్రతే లేదు నీ హయాంలో. ఆడాళ్లపై అత్యాచారాల్లో మన రాష్ట్రం దేశంలోనే ఘనతకెక్కిందంటే నువ్వేంటో, నీ పాలనేంటో తెలుసుకోలేమనుకుంటున్నావా? అందుకే ఈ పండగ పేరు చెప్పి అందరినీ మేలుకొలుపుతున్నాం... తెలిసిందా?'' అంటూ గయ్యిమన్నారు. అధినేత నోరెళ్లబెట్టాడు. ఇంతలో గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు, ఆడవాళ్లు అందరూ కలసి కోలాటం ఆడసాగారు.

''హే... భగ భగ భగ భగ భోగి మంటలే...

 గణ గణ గణ గణ గంగిరెద్దులే...

కణ కణ కణ కణ కిరణ కాంతులే...

హే ధగ ధగ ధగ ధగ ధనుస్సూర్యుడే...

చక చక చక చక మకర రాశిలో...

మెరిసే మురిసే సంక్రాతే...'' అంటూ కలిసికట్టుగా నాట్యం చేయసాగారు.

అధినేతకు ముచ్చెమటలు పట్టాయి. కళ్లు బైర్లు కమ్మాయి. జనం చైతన్యవంతులైపోతే ఎలా ఉంటుందో అర్థమైంది.

గొంతు తడారిపోయింది. గుండె పట్టేసింది. ఆ సరికి పీడకల నుంచి మెలకువ వచ్చింది!

-సృజన

 PUBLISHED ON 15.01.2023 ON JANASENA WE BSITE

మంగళవారం, జనవరి 10, 2023

నెంబర్ వన్‌ ఛీటర్‌!


 

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను పనిపెట్టే కేడీ నెంబర్‌ వన్‌...

నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...''

అధినేత అంతరంగం పిచ్చెత్తినట్టు గెంతుతోంది. అద్దం ముందు అధినేత మాత్రం మెత్తగా నవ్వుతూ నిలబడ్డాడు.

''ష్‌... మరీ అంత రెచ్చిపోకు. ఇది ప్రజాస్వామ్యం...'' అన్నాడు అధినేత స్వగతంగా.

''హ...హ్హ...హ్హ... హ్హ! ఎందుకు గురూ... నా దగ్గర కూడా ప్రజల ముందు మాట్లాడినట్టు నయవంచక కబుర్లు చెబుతావ్‌. నేను నీ అంతరంగాన్నే కదా? నువ్వు అధికార పీఠం మీద కూర్చున్నాక ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పు? అహ... మనలో మన మాటలే...'' అంది అంతరంగం వికటంగా నవ్వుతూ.

''అవుననుకో. కానీ ప్రజలు గెలిపిస్తేనే గెలిచాను కదా? అది ప్రజాస్వామ్యం కాదంటావా?''

''అబ్బ...అబ్బ... ఎంత జాగ్రత్త! ఎంత అప్రమత్తత! అంతరంగం ముందు అంత నాటకాలెందుకమ్మా? ప్రజలు  పట్టం కడితేనే గెలిచావులే. కానీ ఆ ప్రజల్ని ఎంతలా నమ్మించావని? ఎంతలా వంచించావని? ఒక్కటంటే ఒక్కటైనా సాధ్యమైన హామీ ఇచ్చావా అని? అరచేతిలో స్వర్గం చూపించావు. అధికారం అందాక నరకం చూపిస్తున్నావు. నువ్విచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా అని?''

''అదే కదా రాజకీయం? నీకు తెలియనిదేముంది. కానీ నాకర్థం కాక అడుగుతానూ... ఆ పాంటేంటి? ఆ గెంతులేంటి? అవతల ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనేమైనా ఉందా?''

''ఏంటో గురూ... ఎందుకో ఆ పాట నీకు బాగా నప్పిందనిపిస్తోంది. కేడీలను కనిపెట్టి చూసుకుంటున్నావు. రౌడీలను పనిపట్టి చేరదీస్తున్నావు. నీ అనుచరులను సొంత గూండాలుగా ఉపయోగించుకుంటున్నావు. ఈ విషయంలో నిన్ను మించిన నెంబర్‌ వన్‌ ఎవరుంటారు చెప్పు?''

అధినేత ముసిముసిగా నవ్వుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ చొక్కా చేతులు మడతపెట్టుకుని, ''అయితే నిజంగా నేనే నెంబర్‌ వన్‌ అంటావా?'' అన్నాడు అంతరంగం చేత మరింత వాగిద్దామని.

అంతరంగం ఇంకా రెచ్చిపోయింది.

''ఇది జనతా బస్సు... జాగ్రత జాగ్రత మనీపర్సు...

ఎవ్వరు ఎక్కడ దిగుతారో... ఎంత లగెత్తుకు పోతారో...

ఎవడికి తెలుసు?'' అంటూ చూపుడు వేలు పైకెత్తి చూపిస్తూ స్టెప్పులేయసాగింది.

అధినేత అటూ ఇటూ చూసి ''ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావ్‌...'' అన్నాడు ముద్దుగా మందలిస్తున్నట్టు.

అంతరంగం ఊరుకోలేదు.

''నువ్వూరుకో గురూ... ఆ పాటలో చెప్పినట్టు ఇది జనతా బస్సేకదూ? అందుకేగా నీ మనీ పర్సును అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అవునుగానీ... కుర్చీ ఎక్కాక ఎంతకి లగెత్తావు గురూ?'' అంది లోపాయికారీగా.

''చాల్లే సతాయిస్తున్నావ్‌... ఇంకా లెక్కలు తేలందే? అన్ని వ్యవస్థల్నీ ప్రజల పేరు చెప్పి గాడి తప్పించడానికే ఇంకా సమయం సరిపోలేదు. అయినా నా లెక్కలే అడుగుతావెందుకు? ప్రజలకు కూడా పంచిపెడుతున్ననుగా?''

''భలే చెప్పావు గురూ..'' అంటూ అంతరంగం అధినేత చుట్టూ స్టెప్పులేస్తూ పాట పాడసాగింది.

''ముద్రలు వేసే నోట్ల కట్టలు, ముడుపుగ వేసే పెద్ద మనుషులు...

ముసుగులు తీస్తే రాస్కెల్సు...

మూట విప్పితే బాటిల్సు!

ఎస్‌...నేనే నెంబర్‌ వన్‌''

అధినేత చిరుకోపం ప్రదర్శించాడు.

''అంటే ఏంటి నీ ఉద్దేశం?'' అన్నాడు.

''ఇంకా విడమర్చి చెప్పాలా గురూ? ప్రజల పేరు చెప్పి నువ్వు దోచుకుంటున్నదెంత? అందులోంచి పథకాల పేరు చెప్పి వాళ్లకిస్తున్నదెంత? నీకు తెలియదా? నాకు తెలియదా చెప్పు? అసలు నాకు తెలియక అడుగుతానూ... కనీసం ఓ అరశాతమైనా ఉంటుందా బాసూ?  నీ ముసుగు తీస్తే నువ్వు ఎవరివో ప్రజలు పోల్చుకోలేనంత వరకు నీకి ఢోకా ఎక్కడుంటుంది? మరి నువ్వు కాక ఇంకెవరు నెంబర్‌ వన్‌?''

అద్దంలో అధినేత మొహం వెలిగిపోయింది.

''ఈ లోకం గాంబ్లింగ్‌ హౌస్‌... ఆడేవాళ్లు బ్లడీఫూల్స్‌...

ముక్కలు మార్చే వాడెవడో, లెక్కగ కొట్టే వాడెవడో...

ఎవడికి తెలుసు?

రాజూ రాణీ జోకర్లు... కలిసొస్తేనే లాకియర్లు...

రంగురంగుల టోపీలు... రకరకాలుగా దోపిళ్లు...''

అంతరంగం వెర్రెత్తిపోతూ డ్యాన్స్‌ చేయసాగింది.

ఆసరికి అధినేతకి కూడా హుషారొచ్చింది. ఎవరూ లేని ఆ ఏకాంత సమయంలో అధినేత కూడా అంతరంగంతో గొంతు కలిపి గెంతసాగాడు.

''ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌...

కేడీలను తలదన్నే రౌడీ నెంబర్‌ వన్‌...

రౌడీలను మరిపించే కేడీ నెంబర్‌ వన్‌...

ప్రజలందరినీ ఏమార్చే నేతా నెంబర్‌ వన్‌...

ప్రకృతి వనరులు కొల్లగొట్టే నీచా నెంబర్‌ వన్‌...

రాష్ట్రాన్ని దోచుకునే త్రాష్ట నెంబర్‌ వన్‌...

జనం జెల్లకొట్టి జోకొట్టే జగజ్జేతా నెంబర్‌ వన్‌...

వోటర్లకు ఎరలేసే లోఫర్‌ నెంబర్‌ వన్‌...

అధికారంతో ఆడుకునే తొండీ నెంబర్‌ వన్‌...

ఎస్‌... నేనే నెంబర్‌ వన్‌!''

అధినేత, అతడి అంతరంగం కలిసి ఉప్పులకుప్ప, చెమ్మచెక్క, కోలాటం లాంటి నాట్యవిన్యాసాలతో గోలగోలగా పాడుతూ స్టెప్పులు వేయసాగారు.

ఇంతలో... ''స్టాపిట్‌! నాన్సెస్‌!!'' అనే కేకలు గట్టిగా వినబడ్డాయి. అంతరంగం గబుక్కున అధినేతలోకి దూరిపోయింది. అధినేత అటూ ఇటూ చూసేసరికి, అద్దం వెనక నుంచి తనలాంటిదే మరో రూపం బయటకి వచ్చింది.

''ఎవరు నువ్వు? సీబీఐ ఆఫీసర్‌ వా? నిఘా సంస్థ ప్రతినిధివా? దర్యాప్తు సంస్థ అధికారివా? సుప్రీం కోర్టు అబ్సర్వర్‌ వా? ప్రతిపక్ష నాయకుడివా?'' అంటూ అధినేత ప్రశ్నల వర్షం కురిపించాడు.

''ఆఖరికి నన్నే గుర్తు పట్టలేకపోయావన్నమాట. నేను నీ అంతరాత్మను'' అందా రూపం.

''అంతరాత్మా? అది ఉన్నట్టే నాకు తెలియదే?'' అన్నాడు అధినేత.

''అవునులే.  నా నోరునొక్కి, అడ్డమైన పనులు చెప్పే అంతరంగంతో చేతులు కలిపి అడ్డగోలుగా ఎదిగిన వాడివి. నీకు నేనెందుకు గుర్తుంటాను?'' అంది అంతరాత్మ.

''అడ్డగోలుగా ఎదిగానా? అడ్డమైన పనులు చేశానా? ఏంటి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నావ్‌? నేనెవరో తెలుసా? రాజకీయంలో నెంబర్‌ వన్‌. అరాచకీయంలో నెంబర్‌ వన్‌. ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న అధినేతా నెంబర్‌ వన్‌...'' అంటూ అధినేత జేగురించిన మొహంతో అరిచాడు.

అంతరాత్మ పగలబడి నవ్వింది. అధినేత చూస్తుండగానే ఎత్తుకు ఎదిగింది.

''మూర్ఖుడా! ఆఖరికి ఇంతలా దిగజారావన్నమాట. నీలో ఉండే నన్నే గుర్తించలేక పోతున్నావ్‌. పైగా నన్నే బెదిరించాలని చూస్తున్నావ్‌. నీకు నువ్వే నెంబర్‌ వన్‌ అనుకుంటున్నావ్‌. అందుకే ఎవరు ప్రశ్నించినా సహించలేకపోతున్నావ్‌. ఎవరు నీ లోపాలను చెప్పినా, వాటిని సరిదిద్దుకోకపోగా, వారి గొంతునే నులిమేయాలని చూస్తున్నావ్‌. అందుకే ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని చూస్తున్నావ్‌. అందుకోసం జీవో నెంబర్‌ వన్‌ రూపొందించావ్‌. ఇది ప్రజాస్వామ్యమనే సంగతినే విస్మరించావ్‌. అంతా నీ ఇష్టారాజ్యమనుకుంటున్నావ్‌. ఇప్పుడు ఎవరైనా నీ అసలు స్వరూపాన్ని బయటపెడతారేమోనని బెదిరిపోతున్నావ్‌. అందుకనే అడ్డమైన ఆంక్షలు పెడుతున్నావ్‌. లేనిపోని నిబంధనలు విధిస్తున్నావ్‌. కానీ ఒక్క సంగతి విస్మరిస్తున్నావ్‌. ప్రజలు నిన్ను, నీ అంతరంగాన్ని కనిపెడుతూనే ఉన్నారనే సంగతిని గుర్తించలేకపోతున్నావ్‌. ఒకప్పుడు సొంత ఇల్లయినా లేని నువ్వు కొన్నేళ్లలోనే ఇతర రాష్ట్రాల్లో సైతం పెద్ద పెద్ద భవంతులు ఎలా నిర్మించగలిగేవో ప్రజలు గ్రహించలేరనుకుంటున్నావా? ఒకప్పుడు కేవలం చిన్న కంపెనీతో కాలక్షేపం చేసే నువ్వు కొన్నేళ్లలోనే కోట్లకు కోట్లు ఎలా సంపాదించావో జనం కానుకోలేరనుకుంటున్నావా? ఒకనాడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు అనతి కాలంలోనే కోట్లకు కోట్లు పన్ను కట్టగలిగే స్థాయికి ఎలా ఎగబాకావో సామాన్యులు గమనించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు నువ్వు, నీ అనుచరులు  కలిసి సాగించే ఇసుక మాఫియా ఎంతలా వేళ్లూనుకుని పోయిందో బడుగులు అంచనా వేయలేరనుకుంటున్నావా? రేషన్‌ బియ్యాన్ని సైతం అడ్డగోలుగా సేకరించి మరపట్టించి విదేశాలకు సైతం తరలిస్తున్న బియ్యం మాఫియా జాడల్ని పేదలు పసిగట్టలేరనుకుంటున్నావా? మద్యం వ్యాపారాన్ని అయినవాళ్లకి అప్పజెప్పి ముడుపులెలా పుచ్చుకుంటున్నావో ప్రజలు ఆకళింపు చేసుకోలేరనుకుంటున్నావా? ప్రజల పేరు చెప్పి, అభివృద్ధి ఆశలు చూపించి ప్రజల ఆస్థి అయిన భూముల్ని, గనుల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేసి వాళ్ల నుంచి ఎలా వాటాలు అందుకుంటున్నావో నువ్వు అమాయకులనుకుంటున్న జనం ఊహించలేరనుకుంటున్నావా? కళ్ల ముందు కోటానుకోట్లు దోపిడీ చేస్తూ కాసిన్ని డబ్బులు కాతాల్లో వేసేసినంత మాత్రాన వోటర్లు నిజాలేంటో నిగ్గుతేల్చుకోలేరనుకుంటున్నావా? అడిగినా, ప్రశ్నించినా, నిరసన వ్యక్తం చేసినా, అసమ్మతి చూపించినా లేనిపోని కేసుల్లో ఇరికించి ఎలా వేధిస్తున్నావో ప్రజలు తెలుసుకోలేరనుకుంటున్నావా? నీ హయాంలో ఏ రంగం అభివృద్ధి చెందిందని ఇలా విర్రవీగుతున్నావ్‌?  విద్యా వ్యవస్థ ఎలా గతి తప్పిందో తల్లిదండ్రులకు తెలియదా? వ్యవసాయం ఎలా కునారిల్లిందో రైతులకు తెలియదా? అధికార రంగం ఎలా చతికిల పడిందో ఉద్యోగులకు తెలియదా? రాష్ట్రం ఎంతలా అప్పుల పాలైందో ఆర్థికవేత్తలకు తెలియదా? పరిశ్రమలు ఎందుకు రావడం లేదో నిరుద్యోగులకు తెలియదా? నీ పాలనలో ఇన్ని లోపాలు పెట్టుకుని నువ్వు, నీ అంతరంగం కలిసి నేనే నెంబర్‌ వన్‌ అనుకుని గెంతులు వేస్తే సరిపోతుందనుకుంటున్నావా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నువ్వొక నెంబర్‌ వన్‌ నీచుడివి. నెంబర్‌ వన్‌ నికృష్టుడివి. నెంబర్‌ వన్‌ ఛీటర్‌ వి. నెంబర్‌ వన్‌ ఫూల్‌ వి. నెంబర్‌ వన్‌ భ్రష్టుడివి. ఇక ఇప్పుడు పాడుకో ఎలా పాడుకుంటావో''.

అంతరాత్మ ఒకో ప్రశ్న వేస్తూ ఆకాశమంత ఎదిగిపోయేసరికి అధినేత అంతకంతకు చిన్నవాడై బిక్క మొహం వేశాడు.

-సృజన

PUBLISHED ON 10.01.2023 ON JANASENA WEBSITE

బుధవారం, డిసెంబర్ 28, 2022

దేవుడా? దెయ్యమా?


 

''ఏరా... పది రోజులుగా అయిపూ అజా లేవు. ఎక్కడికి పోయావ్‌?''

''అదేంటి గురూగారూ! మీరే కదా అసైన్‌మెంట్‌ఇచ్చారు? ఆ పని మీదే తిరిగానండి...''

''ఒరే... నా దగ్గర రాజకీయాలు నేర్చుకుంటున్న శతకోటి శిష్యుల్లో నువ్వో బోడి శిష్యుడివి. కాబట్టి నీకిచ్చిన అసైన్‌మెంటేంటో కూడా చెప్పి ఏడు. అప్పుడుగానీ గుర్తు రాదు నాకు...''

''అదేనండి. మన పరగణా పాలకుడు చేసే పనులేంటో, ఆయన మాటలేంటో, వాటిని బట్టి ఆయన మీద నా అభిప్రాయమేంటో క్షేత్ర పరిశీలన చేసి మరీ రాసుకుని రమ్మన్నారు కదండీ. తీసుకొచ్చానండి...''

''ఓ... అదా... మరయితే చెప్పు. ఆయన ఎలాంటి వాడని నీ అభిప్రాయం?''

''అబ్బబ్బ... ఏం చెప్పను గురూగారూ! ఆయన దేవుడండీ బాబూ దేవుడు. ఆయన మనసంతా పేదలేనండి. ఆయన బతుకంతా బడుగుల కోసమేనండి. ఇక ఆయన గుండెకాయ లబ్‌డబ్‌మని కాదండీ బాబూ... సామాన్యుల కోసం లబోదిబో అని కొట్టుకుంటుందండి. ఇహ ఆయన తపనంతా తాడిత పీడిత ప్రజల కోసమేనండి. ఎంత వినయం? ఏం ఒద్దిక? అసలా నవ్వుంది చూశారూ... అబ్బో... మహా ముసిముసిగా ఉంటుదండి...ఆయ్‌!''

''సరే... నీ దృష్టిలో ఆయన దేవుడంటున్నావు కదా? మరి నీకు అలా ఎందుకనిపించిందో చెప్పు చూద్దాం...''

''ఎందుకేంటండి బాబూ... నిన్నటికి నిన్న ఏమన్నాడండాయన? అవినీతి అనేది ఎక్కడా కనిపించకూడదన్నాడండి. మంత్రులందరూ అవినీతికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ఇచ్చేశారండి. ఎంత మంచి పిలుపండి అది?''

''ఒరే ఆయన కొలువుదీర్చి మూడున్నరేళ్లు అయింది కదా? ఇప్పుడు అవినీతికి దూరంగా ఉండమన్నాడంటే... మరి ఇంత వరకు వాళ్లు  దగ్గరగా ఉన్నట్టేనని నీకు అనిపించలేదా?''

''ఊరుకోండి సార్‌... మీరన్నీ తిరకాసుగా చెబుతారు. మీరు చెప్పేది పాఠమో, పరాచికమో ఓ పట్టాన బోధపడదండి. నిజానిజాలేంటో సరిగ్గా చెబుదురూ...''

''చెప్పడానికేముందిరా కళ్ల ముందు కనిపిస్తుంటేనూ? ఓ మంత్రి మీద ఫోర్జరీ పత్రాల కేసుంది. ఈయనగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎగస్పార్టీ మంత్రి మీద తప్పుడు ఆరోపణలతో తప్పుడు పత్రాలు దాఖలు చేసిన ఘనుడు. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళితే, చిత్రాతిచిత్రంగా ఏం జరిగిందో తెలుసా? రాత్రికి రాత్రి ఓ దొంగ కోర్టులో ప్రవేశించి ఈయన ఫోర్జరీ పత్రాలు పట్టుకుపోయాడు. దీనిపై ఏకంగా హైకోర్టు స్పందించి కేసును సీబీఐకి అప్పగించింది. మరలాంటి ఫోర్జరీ ఫోర్ట్వంటీ అమాత్యులుంగారు హాయిగా అధికారంతో అష్టాచెమ్మా ఆడుకుంటున్నారని నువ్వు గమనించలేదా?''

''లేదు గురూగారూ! మీరు చెబుతుంటే సిగ్గేస్తందండి. ఛీ... ఇలాంటాయన ఇంకా పదవి పట్టుకుని వేలాడ్డం ఏంటండీ కంపరం కాపోతేనీ?''

''అంతేకాదురా... భూముల్ని రక్షించే మరో మంత్రివర్యులు కోట్ల రూపాయల విలువ చేసే భూమికి నిరభ్యంతర పత్రాలు ఇప్పించుకుని బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట రాయించుకుని భోంచేశారన్న సంగతి నీ క్షేత్ర పరిశీలనకు తగల్లేదేంట్రా? పేరులొనే ధర్మం ఉన్న ఆయనగారు అలా అధర్మంగా భూముల్ని ప్రసాదంగా అరచేతిలో వేసుకుని నాకేసిన సంగతి తెలీలేదంట్రా నీకు? ఆయన మీద విచారణ సైతం జరిగి తప్పు వెలికి వచ్చినా, బర్తరఫ్‌చేయకపోగా నివేదికను కూడా పైకి రాకుండా కాపాడుతున్న అధినేత మాటల్లో లొసుగుల లోతెంతో తెలుసుకోవద్దురా నువ్వు?''

''అవునండోయ్‌... మీరు చెబుతుంటే ఇట్టాంటోళ్లా మన ఏలికలని అసహ్యమేస్తోందండి...''

''కంత్రీ మంత్రుల కహానీలు ఇక్కడితో అయిపోలేదొరేయ్‌. పురపాలనలో రెపరెపలాడుతున్న మరో సచివుడు, ఆయన సతీమణి కలిసి ఆదిలో చేసిన ఉద్యోగంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసు సంగతి మర్చిపోగలమంట్రా? పరిశోధన చేసిన సీబీఐ మీదనే ఎదురు కేసు పెట్టి కాలయాపన చేశాక, విషయం సుప్రీం కోర్టు దాకా డేకి కేసు సరైనదేనని తేలినా... మరి ఆ మంత్రివర్యులపై చర్యలు లేవు సరికదా, ఆయనకు మరింత మంచి శాఖ కట్టబెట్టిన నీ పాలకుడి నాలిక పెట్టే మెలికలెలాంటివో గ్రహించొద్దురా నువ్వు?''

''నాకంత తెలివేడిస్తే ఇంకేమండీ? ఇన్ని కథలున్నాయన్నమాట మన నెత్తిన కూర్చున్న నేతల గురించి?''

''కథలు కాదురా పురాణాలు. అవినీతి  ఇతిహాసాలు. ఇంకా చెప్పాలంటే పౌరులకు సరఫరాల సంగతి చూసుకునే మరో మంత్రిగారు కారెక్కి కోట్ల విలువైన భూములను చుట్టబెట్టి బుసలు కొట్టి కాటేసి కాజేశారని బయటకు పొక్కినా మరి, నువ్వంటున్న దేవుడిలాంటి నీ నాయకుడు కిమ్మనలేదేమని నీకు అనిపించకపోతే ఎలారా? ఇహ కార్మికుల బాగోగులు చేసే శాఖలో గుమ్మటంగా కూర్చున్న మరో అమాత్యుడి భార్య అక్రమ ఆదాయం పైనా, ఆమె ఆధ్వర్యంలో జరిగిన భూ కొనుగోళ్ల అవకతవకలపైనా నోటీసులు జారీ అయినా ఆ మంత్రివర్యులు నైతిక బాధ్యత మాటే మరిచి పదవిలో ఊరేగుతున్నారంటే దానర్థం ఏంటో తెలుసుకోవద్దురా నువ్వు?''

''ఛీ... నా మీద నాకే కంపరమెత్తుతోందండి. నేను నా ఎదవ పరిశీలనాను...''

''ఒరెర్రోడా... నిన్ను నువ్వు తిట్టుకుందువుగాని కానీ, కాస్తాగు. ఇప్పుడు జల వనరుల్లో జలకాలాడుతున్న మరో మంత్రిగారి లేకి బుద్ధులెలాంటివో చెబితే నీ తల తిరిగిపోతుంది. ఓ యువకుడు చనిపోయినందుకు ప్రభుత్వం నుంచి అందిన అయిదు లక్షల సాయంలో సగానికి సగం తనకివ్వాలని ఆ పేదోళ్లను దేబిరించిన బాబు ఆయన. ఆ బాధితులు ఏకంగా  మీడియాతోనే మొరపెట్టుకున్న విషయం  బాహాటంగానే బయటకి వచ్చినా ఏమాత్రం తొణక్కుండా అంబరమెక్కి సంబరపడుతున్న ఘనుడాయన. మంత్రులే కాదురోయ్‌మీ పరగణా పాలకుడి బాబాయి హత్య కేసులో తీవ్రమైన నేరారోపణలు ఉన్న మరో ఎంపీ సంగతి కూడా కాలరెగరేసుకుని దర్జాగా ఊరేగుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తించలేదట్రా? ఇంకా మాట్టాడితే నిన్ను, నీ రాష్ట్రాన్ని ఏలుతున్న నేతల కతలు కంపరం పుట్టిస్తాయి. ఇసుక ర్యాంపుల్లో కులాసాగా కుర్చీ వేసుకుని కూర్చుని అనధికార లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన సొమ్ము దండుకునే వాళ్లు... ఏ సున్నపురాయికో అనుమతి తీసుకుని దాన్నడ్డం పెట్టుకుని గనుల్లో విలువైన ఖనిజాలు కొల్లగొడుతున్న కరోడాగాళ్లు... మద్యం సారా కాంట్రాక్టులు దక్కించుకుని నకిలీలు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఘరానాగాళ్లు... అమాయకులైన గిరిజనుల చేత నయానా భయానా గంజాయి పంటలు వేయించి ఆ సరుకుని లోపాయికారీగా సరిహద్దులు దాటించి కోట్లకు పడగలెత్తుతున్న కలేజాగాళ్లు... పేదలకిచ్చే బియ్యాన్ని అదిలించి విదిలించి సేకరించి ఓడలకెత్తించి విదేశాలకు రవాణా చేస్తూ కాసులు పోగేసుకుంటున్న కక్కుర్తిగాళ్లు... ఇలా నిన్నేలుతున్న ఏలికల అవినీతి అక్రమ అన్యాయ దౌర్జన్య దురంతాల గురించి చెప్పుకుంటూ పోతే ఏళ్లకేళ్లు పడుతుందొరేయ్‌. నేతలే కాదురా... ఆళ్ల అధినేత అయిన నీ పరగణా పరిపాలకుడి మీదనే ఏకంగా ఉన్న 38 కేసుల నిగ్గు తేల్చడానికి కోర్టులు కిందా మీదా పడుతున్నాయని తెలుసా నీకు?''

''వార్నాయనో బుర్రలో భూకంపం వచ్చినట్టుందండి మీరు చెబుతున్న నిజాలు వింటుంటే. మరి ఇలాంటి మంత్రుల్ని, నేతల్ని చుట్టూతా ఉంచుకుని మా పాలకుడు అవినీతికి దూరంగా ఉండాలంటూ సిగ్గూ ఎగ్గూలేని చిలుక పలుకులు పలుకుతున్నాడని ఇప్పటికి అర్థమైంది గురూగారూ...''

''మరి ఇందాకా ఏమన్నావ్‌?''

''మా పాలకుడు దేవుడన్నానండి...''

''మరి ఇప్పుడేమంటావ్‌?''

''ఛీ... ఛీ... ఆడు దేవుడేంటండీ దరిద్రం. ప్రజల్ని పట్టి పీడిస్తున్న దెయ్యమండి. పరగణాను పీల్చి పిప్పి చేస్తున్న రాక్షసగణ నాయకుడండి. జనాన్నినమ్మించి నట్టేట ముంచుతున్న ఈయన మనసంతా అక్రమాల సంతేనండి. ఆయన గుండె లబ్ డబ్‌మని కాకుండా డబ్ డబ్ డబ్బుమనే కొట్టుకుంటోందండి. ఆడి తపనంతా తాడిత పీడిత ప్రజల్ని మరింతగా పీడించడమేనండి. పైకి కనిపించే వినయం నిజానికి పరిణతి చెందిన అరాచకానికి అద్దమండి. ఇహ... ఆ నవ్వుంది చూశారూ... ముసిముసిగా కాదండి, తేనె పూసిన కత్తిలాగా కసికసిగా ఉంటుందండి. ఇలా నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానండి. ఆయ్‌!''

''సంతోషంరా. నీకొచ్చిన ఇంగితం నీ పరగణా ప్రజలకి కూడా వస్తే అదే చాలు. స్వర్ణయుగం వచ్చినట్టే. ఇక పోయిరా''

-సృజన

PUBLISHED ON 26.12.2022 JANASENA WEBSITE

ఆదివారం, డిసెంబర్ 11, 2022

అరాచక అస్త్ర నైపుణ్యం

 


''ఏంటయ్యా సెక్రట్రీ... అంత హడావుడిగా అటూ ఇటూ తిరిగేస్తున్నావ్‌? ఏంటి సంగతి?''

''అదే సార్‌... యుద్ధానికి సిద్ధం చేస్తున్నానండి...''

''యుద్ధమేంటయ్యా?''

''నిన్న బహిరంగ సభలో తమరు వక్కాణించారు కదండీ, పదహారు నెలల్లో యుద్ధం రాబోతోందని? మరి సెక్రట్రీగా నా బాధ్యతలు నాకుంటాయి కదండీ... అందుకే నా ఏర్పాట్లలో నేనున్నానండి...''

''వార్నీ... అదా? నువ్వు చురుకైనవాడివే కానీ, ఒఠ్ఠి అమాయకుడివయ్యా... బయట సభల్లో జనాన్ని సందడి చేయడానికి ఏదేదో చెబుతుంటాం. అవన్నీ నిజమనుకోకూడదు...''

''అయ్యా... తమరి మాటల్లో బయటికి కనిపించే అర్థాలేంటో, లోపలి నిగూఢార్థాలేంటో నాకేం తెలుస్తుందండి... నేను కూడా జనం లాగే మీరు చెప్పేదంతా నిజమని వెర్రిబాగులోడిలా నమ్మేశానండి... అందుకే నాకు తోచిన సన్నాహాలు చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఉన్నట్టుండి మీరు ఏం చేశావని అడిగితే సిద్ధంగా ఉండాలి కదండీ...''

''బాగుందయ్యా నీ ముందు చూపు... అసలింతకీ ఏమేం చేస్తున్నావో చెప్పు, దాన్ని బట్టి నీ తెలివేంటో, సంగతేంటో చూద్దాం...''

''ఏముందండీ... యుద్ధమంటే మరి కవచం, శిరస్త్రాణం, కత్తులు, డాళ్లు, కటార్లు, ఈటెలు, గుర్రాలు, విల్లంబులు, బాణాలు, అస్త్రాలు లాంటి సరంజామా అవసరం కదండీ... వాటినే సిద్ధం చేస్తున్నానండి...''

''ఓరోరి నా వెర్రి సెక్రట్రీ... ఇదేమన్నా చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్న రాజుల కథలో యుద్ధమనుకుంటున్నావేంటయ్యా... ఇలాంటివన్నీ వాడుకోడానికి? అసలింతకీ యుద్ధమంటే నీకేం అర్థమైందో అది చెప్పు ముందు?''

''అమ్మమ్మ... నన్నంత తేలిగ్గా అంచనా వేయకండి. తమరు సభలో వక్కాణించిన యుద్ధమంటే... రాబోయే ఎన్నికలని నాకూ తెలసండి.  కానీ తమరే నా ఏర్పాట్లేంటో పూర్తిగా వినకుండానే నన్ను చులకన చేస్తున్నారండి...''

''మరి ఎన్నికల యుద్ధానికి కవచాలు, కత్తులు, డాళ్లు, బాణాలు ఇవెందుకయ్యా?''

''సార్‌... సార్‌... తమరు కాస్త నిదానించాలి. నేను సిద్ధం చేస్తున్నవేంటో సరిగ్గా వింటే తమకే తెలుస్తుందండి...''

''సర్లె... సర్లె... నీ గొడవేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పు...''

''ఏంలేదండి... తమరు ఎన్నికలను యుద్ధమన్నట్టే... నేను ఏర్పాట్లకు ఆ పేర్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు అవేంటో చెబుతానండి. రాజ్యంగాన్ని, చట్టాన్ని క్షుణ్ణంగా చదివి వాటిలో లొసుగులేంటో, లోపాలేంటో కనిపెట్టానండి.  వాటన్నింటినీ గ్రైండర్లో వేసి బాగా రుబ్బి దాంతో మీకొక కోటు కుట్టించానండి. అదే మీ కవచమన్నమాటండి. ఈ మూడున్నరేళ్ల పాలనలో తమరు జరిపించిన మనీల్యాండరింగు పనులు, క్విడ్‌ ప్రో కో వ్యవహారాలు వీటన్నింటి మీదా ఎవరైనా ప్రజా ప్రయోజన కేసులు వేసినా... నిఘా సంస్థలు నిద్రలేచి నోటీసులు ఇచ్చినా అవేమీ మిమ్మల్ని తాకకుండా కాపాడే కవచమదే కదండి మరి. ఆ కేసులు ముందుకు సాగకుండా చట్టంలో లొసుగుల ఆధారంగా పిటీషన్లు తగిలించి అడ్డుకునే ఇలాంటి కవచాలను మీతో పాటు, మీ మంత్రి వర్గ సహచరులకి, నేతలకి కూడా వారి వారి కొలతల ప్రకారం తయారు చేయిస్తున్నానండి...''

''ఆహా... సెక్రట్రీ... అదరగొట్టావయ్యా... ఏదో అమాయకుడివనుకున్నాను కానీ ఇంత జగత్‌ కిలాడీవనుకోలేదు... చాలా ఆసక్తిగా ఉంది. నీ మిగతా ఏర్పాట్ల గురించి కూడా చెప్పు...''

''ఐపీసీలోని సెక్షన్లంటినీ పరిశీలించి వాటిలో మనకి ఉపయోగపడేవేంటో ఓ పక్కన పెట్టానండి. వాటిలో ఎవరూ వాడనివి, ఎప్పుడో కాలదోషం పట్టినవి కూడా వెలికి తీసి పదును పెట్టించానండి. అవన్నీ కత్తుల్లా ఉపయోగపడతాయండి. మరి ఎవరైనా తమర్ని కానీ, తమ విధానాలను కానీ విమర్శించినా, వ్యతిరేకించినా ఎడా పెడా ఈ కత్తులు వాడేయొచ్చండి. వీటిలో రాజద్రోహం కత్తి, శాంతి భద్రతల కత్తి, నిరసన ప్రదర్శనల కత్తి, ఊరేగింపు కత్తి, ప్రతిపక్ష నేతల సభల కత్తి... ఇలా రకరకాలండి. వీటన్నింటినీ మీరు ఉసిగొల్పగానే ఉరుక్కుంటూ జనం మీద పడే పోలీసులకు సమకూరిస్తే... ఎవరెక్కడ ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలు పెట్టినా ఈ కత్తులు దూసి, కేసులు పెట్టి, మక్కెలిరగదన్ని, బొక్కలో తోసి అణిచేయచ్చండి. అప్పుడిక తమరి శాంతి భద్రతలు కుక్కిన పేనుల్లా పడుంటాయండి...''

''సూపరయ్యా... మనసెరిగిన నీలాంటి సెక్రట్రీ ఒక్కడుంటే చాలయ్యా... అడ్డగోలు పాలనలో అడ్డు లేకుండా దూసుకుపోవచ్చు... ఇక మిగతా సన్నాహాలేంటో కూడా చెప్పు...''

''ఏముందండీ... మూడున్నరేళ్ల క్రితం తమరు అధికారం కోసం అంగలార్చిపోతూ, ఊరూవాడా పాదయాత్ర చేస్తూ నానా హామీలు ఇచ్చారు కదండీ? కానీ వాటిలో వేటినీ కూడా నెరవేర్చలేకపోయారు కదా? మరి రాబోయే యుద్ధానికి ఏ మొహం పెట్టుకుని వెళతారండీ? అందుకని... తమరు తరచు సభల్లోను, విలేకరుల సమావేశాల్లోనూ... ఇంత చేసేశాం, అంత చేసేశాం... అంటూ చెబుతూ ఉంటారే... అవిగో అలాంటి అడ్డగోలు అబద్ధాలన్నింటినీ పోగు చేసి, వాటికి మరిన్ని బుకాయింపు మసాలాలు, దబాయింపు దినుసులు కలిపి నూరించి ముద్ద చేసి దాంతో మీ మొహానికి అడ్డంగా ఓ శిరస్త్రాణం చేయించానండి. అది పెట్టుకుని మొహం చెల్లకపోయినా యుద్ధరంగంలోకి దూకేయొచ్చండి...''

''బ్రహ్మాండమయ్యా... ప్రజల ముందుకు ఎలా వెళ్లాలా అనే అనుమానం మనసులో పీకుతూ ఉండేది. ఆ బాధ లేకుండా చేశావు... ఇంకా చెప్పు...''

''ఇంతకాలం తమరు రకరకాల పథకాల పేర్లు చెబుతూ, వాటికి ఇన్నేసి వేల కోట్లు, అన్నేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టానంటూ పత్రికల్లో ఫుల్‌ పేజీ యాడ్లు అచ్చేయించారు కదండీ. మరి ఎన్నికల యుద్ధ సమయంలో ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వస్తే అలాంటివి కుదరవు కదండీ. అందుకని ఆ అంకెలన్నీ తీసుకొచ్చి, వాటికి మరిన్ని అంకెలు, పెద్ద పెద్ద సంఖ్యలు కలిపి, బాణలిలో  బాగా వేయించి, ఎండబెట్టి పొడి చేసి, దాంతో డాళ్లు చేయిస్తున్నానండి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు పచ్చి నిజాలనే కత్తులు దూసినా వాటి వల్ల గాయపడకుండా ఈ డాళ్లను అడ్డం పెట్టుకోవచ్చండి. ఇలాంటివి మీకు, మీ సైన్యానికి కూడా విడివిడిగా తయారు చేయిస్తున్నానండి...''

''తెలివైన వాడివేనయ్యా... తక్కినవి కూడా చెప్పు...''

''ఇప్పుడు అస్త్రాల గురించి చెబుతానండి. ప్రతి పక్షాలపై మీరు చేసే అన్యాయపు వ్యాఖ్యానాలను శాన పెట్టించానండి. అవన్నీ అడ్డగోలు విమర్శనాస్త్రాలండి. తమరి మంత్రి వర్యులు వాడే బూతులు, తిట్లు పదును పెట్టించానండి... అవన్నీ అసభ్యాస్త్రాలండి. ప్రతి మండలంలోను తమరి అనుచరులు, తమరి అండ చూసుకుని రెచ్చిపోయే గూండాలు రౌడీల కార్యక్రమాలను బాగా చెక్కించానండి. అవన్నీ విద్రోహాస్త్రాలండి. జనం మనసు దోచుకునే ప్రతిపక్ష నాయకులు సభలకు వచ్చేప్పుడు కరెంటు కట్‌ చేయించడం లాంటి పనుల్ని పోగు చేసి ఉంచానండి. ఇవన్నీ అంధకారాస్త్రాలు, ఆంక్షలాస్త్రాలు, నికృష్ట నిబంధనాస్త్రాలు గట్రానండి. ఇంకా పీపాల నిండా బురద సిద్ధం చేస్తున్నానండి. తమరు సభల్లో ఎగస్సార్టీల వాళ్లమీద బురదజల్లడానికండి. రాక్షసి బొగ్గుల బస్తాలు నిల్వ చేస్తున్నానండి. ఎన్నికల సమయంలో వాటిని రాజేసి మీరు ప్రతిపక్షాల మీద నిప్పులు చెరగొచ్చండి. డబ్బాల నిండా దుమ్ము పోగు చేశానండి. ఎన్నికల సభల్లో తమరు, తమ అనుచురులు అవతలివాళ్ల మీద దుమ్మెత్తి పోయొచ్చండి. ఇంకా ఆర్భాట అశ్వాలు, ప్రచార గుర్రాలు, అసంబద్ధ వాగ్దాన రథాలు, అసాధ్య హామీల గజాలు... ఇంకా ఇలా చాలా సిద్ధం చేస్తున్నానండి... యుద్ధానికి!''

''సెభాషయ్యా సెక్రట్రీ... నీ యుద్ధ సన్నాహాలు భేష్‌...''

''కానీ సార్‌... చిన్న సందేహం మాత్ర మనసులో పీకుతోందండి...''

''ఏంటయ్యా అది?''

''ఈ అస్త్రాలు, కవచాలు, కత్తులు ఎలాగూ ఏర్పాటు చేస్తామండి కానీ... తమరి పాలనని, ఏలుబడిని, హయాన్ని, అధికారాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు తమరి నిజస్వరూపాన్ని గ్రహించేస్తే... ఏమవుతుందా అనండి...''

''చూడు సెక్రట్రీ... నీ ఏర్పాట్లు సరేకానీ... నువ్వు నా దగ్గరున్న అసలుసిసలైన అస్త్రశస్త్రాలను గమనించినట్టు లేదయ్యా. అవి అధికారంతో రాటుదేలినవి. పరిపాలనతో పదునుతేలినవి. ప్రతిపక్షాలెన్ని ఆయుధాలతో రానీయవయ్యా, మనకి మాత్రం దిగులు లేదనుకో. ప్రజలకి లేనిపోని ఆశలు పెట్టి, తాయిలాల పంచి ఏమార్చి నమ్మించే సమ్మోహనాస్త్రం నా సొంతమయ్యా. గూండాలని మోహరించి ప్రయోగించే బూత్‌క్యాప్చరింగ్ బ్రహ్మాస్త్రం నా దగ్గరుందయ్యా. అనుచరులతో వీరంగం ఆడించి ఎక్కుపెట్టే దొంగ ఓట్ల దారుణాస్త్రం నా అమ్ముల పొదిలో సిద్దమయ్యా.  అవసరమైతే ఎలక్ట్రానిక్‌ యంత్రాలను సైతం మాయ చేసే ట్యాంపరింగ్‌ పాశుపతాస్త్రం మనదేనయ్యా. ఇంకా చెప్పాలంటే... నామినేషన్లు వేసే వారిపై ప్రయోగించే భయానకాస్త్రం, పోలింగ్‌ కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించే బీభత్సాస్త్రం, అధికారులను సైతం బెంబెలెత్తించే బెదిరింపాస్త్రం, పోలీసుల అండతో వేసే దమనాస్త్రం, సామాన్యులకు నోట్లు పంచిపెట్టి  ప్రలోభపెట్టే ఆర్థికాస్త్రం, మద్యం పారించి మత్తులో ముంచే వ్యసనాస్త్రం... అబ్బో... ఇలాంటివి చాలా మన ఆయుధ భాండాగారంలో ఉన్నాయయ్యా... కాబట్టి నువ్వూరికే అనుమానాలతో బుర్ర పాడు చేసుకోక... నీ ఏర్పాట్లలో నువ్వుండు... సరేనా?''

''మహాప్రభో! నన్ను, నా అమాయకత్వాన్ని మన్నించండి. మీ దగ్గరున్న అస్త్రాల ముందు నేనెంత? నా ఏర్పాట్లెంత? ఇంతకాలం తమ దగ్గర సెక్రట్రీగా పనిచేసినా... తమరి అసలుసిసలు నీచ నైజ, నిజ నికృష్ట స్వరూపాన్ని అవగతం చేసుకోలేకపోయాను. మూర్తీభవించిన  అరాకత్వానికి అవతార రూపం మీరు. అధికార విశృంఖలత్వానికి నిలువెత్తు నిదర్శనం మీరు.  మితిమీరిన అతి విశ్వాసానికి పరిమితి లేని ప్రతిరూపం మీరు. ప్రజలు నిద్రలో జోగినంతకాలం మీకు జయహో!''

-సృజన

PUBLISHED ON 8.12.2022 ON JENASENA WEBSITE