సోమవారం, సెప్టెంబర్ 28, 2026
చావు బతుకుల మధ్య... మూడో స్థితి!
చావు తెలుసు... బతుకు తెలుసు... కానీ ఈ రెండింటి మధ్య ఉన్న మూడో స్థితి గురించి తెలుసా? దాన్నే ఇప్పుడు శాస్త్రవేత్తలు అధికారికంగా కనుగొన్నారు. ఈ సృష్టిలో ఏ జీవి అయినా చావు, బతుకులకు గురికావలసిందే. కానీ వీటి మధ్య మరో స్థితి ఏంటీ? అదే చూద్దాం.
మనం మరణించినప్పుడు మన శరీరంలోని కొన్ని కణాలు వెంటనే చనిపోవు. అవి కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారి, తమను తాము పునర్వ్యవస్థీకరించుకుంటాయి. కొన్నిసార్లు కొత్త రూపాల్లోకి పునర్నిర్మించుకుంటాయి.
చనిపోయిన జీవి నుండి సేకరించిన కొన్ని కణాలకు సరైన వాతావరణం కల్పిస్తే, అవి పూర్తిగా సరికొత్త జీవితాన్ని సంతరించుకోగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో అవి సొంతంగా కదిలగలవు. ప్రత్యేక ప్రవర్తనను పొందగలవు. కొన్ని పనులు చేసుకోగల సజీవ నిర్మాణాలుగా కూడా ఏర్పడగలవు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ స్థితి పూర్తిగా జీవమూ కాదు, మరణమూ కాదు. ఇది ఆ రెండింటికీ మధ్య ఉండే ఒక ప్రత్యేక దశ: అదే "మూడవ స్థితి" (Third State).
ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అదేంటంటే... అవయవ దానం విషయంలో అదే జరుగుతోంది కదా? అని. చనిపోయిన ఒక వ్యక్తి అవయవాన్ని మరో వ్యక్తి శరీరంలో అమర్చినప్పుడు అవి అంతక్రితం తాము చేసిన విధులనే నిర్వర్తిస్తాయి. దానికి... ఇప్పుడు కొత్తగా కనుగొన్న విషయానికి చాలా తేడా ఉంది. ఈ ‘మూడో స్థితి’తో జీవకణాలు తమంతట తాము సరికొత్త జీవ రూపాలుగా మారుతున్నాయనేదే ఇందులోని అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని నిర్ధారించిన ప్రయోగాలేంటో ఒకసారి చూద్దాం.
ఒక ప్రయోగంలో, మరణించిన కప్ప పిండం (frog embryo) నుండి తీసిన చర్మ కణాలను ప్రయోగశాలలోని పెట్రి డిష్‌లో ఉంచారు. అక్కడ అవి వాటంతట అవే కలిసిపోయి సూక్ష్మజీవులుగా ఏర్పడ్డాయి. వీటిని పరిశోధకులు 'జెనోబోట్స్' (Xenobots) అని పిలుస్తున్నారు. సాధారణ కణాల మాదిరిగా కాకుండా ఇవి... సొంతంగా కదలగలవు. తమకు జరిగిన గాయాలను తామే నయం చేసుకోగలవు. అంతేకాదు, తమ సంతతిని కూడ పెంచుకోగలవు. అంటే ఇవి శారీరకంగా పెరగడం ద్వారా కాకుండా, చుట్టూ ఉన్న ఇతర విడి కణాలను ఒకచోట చేర్చి తమలాంటి ప్రతిరూపాలుగా మలచగలవని తేలింది.
ఆ తర్వాత పరిశోధకులు మానవ ఊపిరితిత్తుల కణాలతో కూడా ఇదే విధమైన ప్రయోగం చేశారు. అందులో కూడా ఇదే విధమైన అంశాన్ని గమనించారు. ఈ కణాలు కూడా ఇలాగే చిన్న సజీవ రూపాలుగా ఏర్పడ్డాయి. పరిశోధకులు వాటికి 'ఆంథ్రోబోట్స్' (Anthrobots) అని పేరుపెట్టారు. ఇవి తమ పరిసరాల్లో సొంతంగా ప్రయాణించడమే కాకుండా, సమీపంలో దెబ్బతిన్న నరాల కణాలను (nerve cells) బాగు చేయడంలో కూడ సహాయపడ్డాయి.
కణాలు తమ గుర్తింపును మార్చుకుని కొత్త రూపాలను ఏర్పరుచుకునే ఈ సామర్థ్యాన్ని 'ప్లాస్టిసిటీ' (Plasticity) అంటారు. ఒక జీవి మరణించిన తర్వాత కూడా కొన్ని కణాలు కేవలం పనితీరునే కాకుండా, కొత్తగా సృష్టించే సామర్థ్యాన్ని కూడ నిలుపుకుంటాయని ఇది సూచిస్తోంది.
ఇంతకీ తమను తాము ఎలా పునర్వ్యవస్థీకరించుకోవాలో కణాలకు ఎలా తెలుస్తుంది?
· జీవ-విద్యుత్ సంకేతాలు (Bioelectric Signaling): కణం పొరలలో (cell membranes) ఇమిడి ఉండే ప్రత్యేక అయాన్ ఛానెల్‌లు, పంపులు జీవసంబంధమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్ల వలె పనిచేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రధాన జీవి మరణించి, మెదడు, హార్మోన్ల నియంత్రణ నిలిచిపోయిన తర్వాత... సజీవంగా మిగిలిన కణాలు తమ పొరుగు కణాలతో నేరుగా సంభాషించడానికి, ఉమ్మడిగా ఒక కొత్త ఆకృతిని ఏర్పరచుకోవడానికి ఈ జీవ-విద్యుత్ సంకేతాలను ఉపయోగిస్తాయి.
· ఒత్తిడి-జన్యువుల ఉత్తేజం (Stress-Gene Activation): ఒక జీవి మరణించిన తర్వాత, శరీర అంతర్గత సమతుల్యత (homeostasis) లోపించడాన్ని భర్తీ చేసేందుకు, అప్పటివరకు నిద్రాణంగా ఉన్న కొన్ని ఒత్తిడి-ప్రతిస్పందన (stress-response), రోగనిరోధక జన్యువులు (immune genes) ఒక్కసారిగా చురుకుగా మారుతాయని పోస్ట్‌మార్టం అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కణాలలో అంతర్లీనంగా దాగి ఉన్న కొత్త రూపాల్లోకి మారే సామర్థ్యాన్ని (cellular plasticity) వెలికితీస్తుంది.
సరే... ఈ ప్రయోగ ఫలితాల వల్ల మానవులకు ప్రయోజనం ఏమిటి? ఇది పునరుత్పత్తి వైద్యం (Regenerative Medicine)లో సరికొత్త అవకాశాలకు తెరతీస్తోంది.
భవిష్యత్తులో శరీరంలోకి మందులను చేరవేయడానికి, రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి లేదా దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయడానికి రోగి సొంత కణాల నుండే ఈ 'బయోబోట్స్' (Biobots)ను రూపొందించవచ్చు. ఇవి కొన్ని వారాల్లోనే సహజంగా కరిగిపోతాయి. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థ వీటిని తిరస్కరించదు.
మొత్తానికి ఇది విజ్ఞాన శాస్త్రంలో ఒక వింతైన కొత్త అధ్యాయం. మరణం అనేది ఎల్లప్పుడూ ముగింపు కాదని... ఆ తర్వాత కూడ కణాలు చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉండవచ్చని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఈ ‘బయోబోట్స్’ ఎలాంటి సంచలనాలకు తెరతీస్తాయో వేచి చూద్దాం.
శుక్రవారం, సెప్టెంబర్ 25, 2026
విశ్వామిత్రుడి గర్వం... వసిష్ఠుడి బలం... (పిల్లల కోసం రాముడి కథ-19)
మిథిలా నగరం లో రాజ పురోహితుడైన శతానందుడు, రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి కథ చెప్పసాగాడు.
‘‘రామా... ప్రజాపతి కుమారుడైన కుశుడు అనే మహారాజు ఉండేవాడు. అతడి పుత్రుడు కుశనాభుడు. అతడికి గాధి అనే సుతుడు కలిగాడు. ఆ గాధికి పుట్టిన వాడే విశ్వామిత్రడు’’ అంటూ ఎత్తుకున్నాడు. రామలక్ష్మణులు శ్రద్ధగా వింటున్నారు.
మహా బలశాలి అయిన విశ్వామిత్రుడు వేల ఏళ్ల పాటు రాజ్య పాలన చేశాడు. ఓసారి అతడు ఒక అక్షౌహిణి సైన్యంతో భూ పర్యటనకు బయల్దేరాడు. అనేక నగరాలు, రాష్ట్రాలు చూస్తూ అతడు వసిష్ఠుని ఆశ్రామానికి వచ్చాడు. ఆ ఆశ్రమం పలురకాలైన వృక్షాలు, జంతువులు, పక్షులతో మనోహరంగా ఉంది. చాలా మంది మునులు, రుషులు అక్కడ తపోజీవనం సాగిస్తున్నారు. విశ్వామిత్రుడు ఆ ఆశ్రమంలో వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి ప్రణమిల్లాడు. వసిష్ఠుడు సాదరంగా స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నల అనంతరం వసిష్ఠుడు, ‘‘విశ్వామిత్ర మహారాజా... నీవు మాకు పూజ్యుడవు. నీకు, నీ సైన్యానికి తగిన ఆతిథ్యం ఇవ్వదలిచాను. స్వీకరించండి’’ అన్నాడు.
దానికి విశ్వామిత్రుడు, ‘‘మహర్షీ... మీ ఆదరణ, మంచి మాటలే మాకు చాలు. మమ్మల్ని వెళ్లనివ్వండి’’ అన్నాడు.
వసిష్ఠుడు అందుకు అంగీకరించక పట్టుబట్టడంతో విశ్వామిత్రుడు సరేనన్నాడు.
వసిష్ఠుడు ఎంతో సంతోషించి, తన దగ్గర ఉన్న శబల అనే కామధేనువును పిలిచాడు. ‘‘ఓ శబలా... సైన్యముతో, పరివారముతో వచ్చిన ఈ మహారాజుకు తగిన భోజన పానీయాలను సమకూర్చు’’ అని ప్రార్థించాడు.
ఆ వెంటనే శబల మహిమ వల్ల వేడి వేడి అన్నము, రుచికరమైన వివిధ ఆహార పదార్థాలు, పాయసాలు, పానీయాలు సిద్ధమైపోయాయి. విశ్వామిత్రుడి అంత:పుర జనులు, బ్రాహ్మణులు, పురోహితులు, మంత్రులు, సైనికులందరికీ ఎవరెవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో అవన్నీ వాళ్ల విస్తళ్లలోకి వచ్చాయి. అన్ని వేల మందికి అంత అద్భుతమైన ఆతిథ్యం లభించినందుకు విశ్వామిత్రడు ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. విందారగించిన తర్వాత అతడు వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి, ‘‘మీ ఆతిథ్యం అపూర్వం. మీకు లక్ష గోవులను ఇస్తాను. వాటికి బదులుగా మీ శబలను నాకు ఇవ్వండి’’ అన్నాడు.
వసిష్ఠుడు అందకు అంగీకరించక, ‘‘మహారాజా... శబలతో మా అనుబంధం విడదీయరానిది. మా తపస్సుకు ఈ కామధేనువే ఆధారం. శతకోటి ఆవులను ఇచ్చినా, బంగారు రాశులను ఇచ్చినా దాన్ని మాత్రం ఇవ్వలేను’’ అని చెప్పాడు.
విశ్వామిత్రుడు బంగారు ఆభరణాలతో అలంకరించిన పద్నాలుగు వేల ఏనుగులను ఇస్తానన్నాడు. నాలుగేసి అశ్వాలుగల ఎనిమిది వందల స్వర్ణ రథాలను సమర్పిస్తానన్నాడు. పదకొండు వేల మేలు జాతి గుర్రాలను బహూకరిస్తానన్నాడు. కోటి ఆవులను, రత్నాల రాశులను కానుకగా స్వీకరించమన్నాడు. అయినా వసిష్ఠుడు ఒప్పుకోలేదు.
దాంతో విశ్వామిత్రుడు కోపించి సైనికుల సాయంతో బలవంతంగా శబలను లాక్కుని పోసాగాడు. ఇదంతా చూసిన శబల తల్లడిల్లిపోయింది. వసిష్ఠుడే తనను పంపించేస్తున్నాడేమో అనుమానంతో ఆ కామధేనువు, సైనికులను విదుల్చుకుని ఒక్క ఉదుటన వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి కన్నీరు కారుస్తూ అడిగింది.
వసిష్ఠుడు ఎంతో బాధ పడుతూ, ‘‘శబలా... నేను నిన్ను పంపించడం లేదు. ఈ రాజు గర్వంతో ఇలా చేస్తున్నాడు. ఇతడు బలశాలి. క్షత్రియుడు. పైగా రాజు. సైన్యంతో వచ్చిన ఇతడిని ఎదుర్కొనే బలం నాకు లేదు’’ అన్నాడు.
అప్పుడు శబల, ‘‘ఓ బ్రహ్మర్షీ... క్షత్రియుడి బలం కన్నా, బ్రాహ్మణుడి తపోబలమే మిన్న అయినది. నీ ముందు ఈ రాజు బలహీనుడే. నీ బ్రహ్మబలం సాయంతో ఇతడి గర్వాన్ని నేను అణచగలను. అందుకు నీ అనుమతి కోరుతున్నాను’’ అంది. అందుకు వసిష్ఠుడు అంగీకరించాడు.
వెంటనే శబల ‘అంబా’ అంటూ గట్టిగా హుంభారవం చేసింది. ఆ శబ్దం నుంచి వీరులైన సైనికులు పుట్టుకొచ్చారు. వాళ్లు విశ్వామిత్రుడు చూస్తుండగానే అతడి సైనికులతో తలబడి అందరినీ చంపేశారు. అది చూసి విశ్వామిత్రుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. రకరకాల అస్త్ర శస్త్రములతో వారిని సంహరించసాగాడు. అప్పుడు శబల కోపించి అనేకులైన సైనికులను సృష్టించింది. బంగారు రంగు వస్త్రాలను ధరించిన ఆ సైనికులందరూ పొడవాటి ఖడ్గాలతో, ఆయుధాలతో విజృంభించి విశ్వామిత్రుడి బలగాలన్నింటినీ మట్టుబెట్టసాగారు. విశ్వామిత్రుడు వారితో కూడా తలబడి గొప్ప శక్తిగల అస్త్రాలను ప్రయోగించసాగాడు. అది చూసిన వశిష్ఠుడు శబలను మరింతగా ప్రోత్సహించాడు. అప్పుడు శబల తన శరీరంలోని అవయవములన్నింటి నుంచి వీరాధివీరులైన యోధులను పుట్టించింది. వాళ్ల ప్రభావంతో విశ్వామిత్రుడి సైన్యమంతా సమసిపోయింది. దాంతో విశ్వామిత్రుడి వందమంది కుమారులు యుద్ధానికి సిద్ధమై వసిష్ఠుడిపై దాడికి దిగారు. వారిని చూస్తూనే వసిష్ఠుడు గట్టిగా హుంకరించాడు. దాంతో వాళ్లంతా తమ సైన్యంతో సహా భస్మమైపోయారు. తన వందమంది కుమారులు, సైనికులందరూ నశించిపోవడంతో విశ్వామిత్రుడు ఒంటరిగా మిగిలిపోయాడు. రెక్కలు తెగిన పక్షిలాగా, కోరలు పీకేసిన పాములాగా శక్తిహీనుడయ్యాడు. అతడి గర్వం మొత్తం అణిగిపోయింది. నిరాశలో మునిగిపోయాడు. తన కొడుకులలో ఒకడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకు వెళ్లిపోయి పరమ శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
విశ్వామిత్రుడు శివుడిని అనేక విధాలుగా స్తుతించి, ‘‘పరమేశ్వరా... నాకు దేవ, దానవ, గంధర్వ, యక్ష రాక్షసులతో సమానమైన అస్త్రవిద్యను అనుగ్రహించు’’ అని కోరుకున్నడు. శివుడు ‘తథాస్తు’ అని పలికి మాయమయ్యాడు.
అసలే గర్వం అధికంగా ఉండే విశ్వామిత్రుడు దివ్వాస్త్రాలను పొందడం వల్ల మరింతగా బలవంతుడయ్యాడు. వెంటనే వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లి తన అస్త్రాలను ప్రయోగించాడు. వాటి ధాటికి ఆ తపోవనమంతా దగ్ధమైపోయింది. అక్కడి మునులు, తాపసులు నలుదిక్కులకు పరుగులు తీశారు.
వసిష్ఠుడు దిగ్గున లేచి తన బ్రహ్మదండాన్ని పైకెత్తి విశ్వామిత్రుడితో, ‘‘ఓరీ... మూర్ఖుడా... ప్రశాంతమైన తపోవాటికను నాశనం చేశావు. బ్రహ్మబలం ముందు నీ క్షత్రియ బలం ఎంత? ఇప్పుడు ప్రయోగించు చూద్దాం, నీ అస్త్రాలేపాటివో?’’ అని సవాలు చేశాడు.
విశ్వామిత్రుడు తాను తపస్సుతో సాధించుకున్న దివ్యాస్త్రాలను వరసగా సంధించాడు. అతడు ప్రయోగించిన ఆగ్నేయ, వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, గాంధర్వ మొదలైన దివ్యాస్త్రాలన్నింటినీ వసిష్ఠుడి దండం కబళించింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి అన్నింటికన్నా అధిక శక్తిమంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి దేవతలు సైతం భయపడ్డాడు. ముల్లోకాలు తల్లడిల్లాయి. అయితే ఆ బ్రహ్మాస్త్రం కూడా వసిష్ఠుడి బ్రహ్మదండం ముందు నిలవలేక నిశ్శారమైపోయింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. తపో బలం ముందు అస్త్రాల బలం ఎందుకూ పనికి రానిదని గ్రహించాడు. ‘‘ఇప్పుడు నాకు నిజమైన బలం అంటే ఏమిటో అర్థమైంది. తీవ్రమైన తపస్సు చేస్తాను. బ్రహ్మర్షిగా మారుతాను’’ అని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో వచ్చే సారి తెలుసుకుందాం. జైశ్రీరామ్.
శుక్రవారం, సెప్టెంబర్ 18, 2026
చిత్రగుప్తుడి సందేహం... యమ ధర్మరాజు సమాధానం (ఏది పెద్ద పాపం?)
అనగనగా ఒక రాజ్యంలో ఎంతో దయాగుణం కలిగిన ఒక రాజు ఉండేవాడు. ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ, వారికి నిరంతరం అన్నదానాలు చేసేవాడు. ఒకరోజు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రాజ్యం మొత్తానికి వైభవంగా విందు భోజనం ఏర్పాటు చేశాడు.
అయితే, అదే సమయంలో ఆకాశంలో ఒక రాబందు ఒక పామును నోట పట్టుకుని ఎగురుతోంది. ఆ రాబందు పట్టు నుంచి తప్పించుకోవడానికి పాము ఆకాశంలోనే విషాన్ని చిమ్మింది. దురదృష్టవశాత్తు, ఆ పాము విషపు చుక్కలు కింద రాజుగారి విందు కోసం సిద్ధం చేసిన వంటకాల పాత్రలో పడిపోయాయి.
ఈ విషయం రాజుకి కానీ, వంటల వారికి కానీ తెలియదు. విందు ప్రారంభమయ్యాక, మొదటి పంక్తిలో భోజనం చేసిన కొందరు ప్రజలు ఆ విషాహారం తిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనతో రాజ్యంలో అలజడి రేగింది. అక్కడే ఉన్న ఒక మహిళ, "ప్రజలను చంపడానికే రాజు కావాలని భోజనంలో విషం కలిపి చంపేశాడు!" అని ఊరంతా చాటింది. ఆ అపనిందతో రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధతోనే మంచం పట్టి కొద్దిరోజుల్లోనే కన్నుమూశాడు. కాలక్రమేణా, ఆ అబద్ధ ప్రచారం చేసిన మహిళ కూడా మరణించింది.
యమలోకంలో న్యాయ విచారణ:
అమాయకులైన ప్రజల చావుకు కారకులు ఎవరు? ఎవరి ఖాతాలో ఈ పాపాన్ని రాయాలి? అనే అంశంపై యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడి మధ్య పెద్ద చర్చ మొదలైంది.
చిత్రగుప్తుడు: "ప్రభూ! ప్రాణాలు తీసిన ఆ పాము ఖాతాలో ఈ పాపాన్ని రాయమంటారా?"
యమధర్మరాజు: "కాదు! పాము తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా విషం చిమ్మింది. కాబట్టి దానిది తప్పు కాదు."
చిత్రగుప్తుడు: "అయితే పామును పట్టుకొచ్చిన ఆ రాబందుది తప్పా?"
యమధర్మరాజు: "కాదు! రాబందు తన ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని వెతుక్కుంది. అది ప్రకృతి సిద్ధమైన నియమం. కాబట్టి దానిదీ తప్పు కాదు."
చిత్రగుప్తుడు: "మరి భోజనం పెట్టిన రాజుగారిది తప్పా?"
యమధర్మరాజు: "అస్సలు కాదు! రాజు ఎంతో మంచి మనసుతో ప్రజల కడుపు నింపాలని విందు పెట్టాడు. ఆహారంలో విషం కలిసిందనే నిజం ఆయనకు తెలియదు."
అప్పుడు చిత్రగుప్తుడు ఆశ్చర్యపోతూ... "ఈ పాపాన్ని ఎవరి కాతాలో రాయాలి?" అని అడిగాడు.
దానికి యమధర్మరాజు చిరునవ్వుతో... "నిజం ఏంటో తెలుసుకోకుండా, కేవలం ఊహించుకుని రాజుపై నిందలు వేసి సమాజంలో విషాన్ని చిమ్మిన ఆ మహిళ కాతాలో వెయ్యి" అని తీర్పు ఇచ్చాడు.
ఈ కథ మనకు నేర్పే జీవన సత్యం
నోటి మాటపై అదుపు ఉండాలి: మనం చూసింది, విన్నది నిజమో కాదో పూర్తి ఆధారాలు లేకుండా ఎదుటివారిపై నిందలు వేయడం చాలా పెద్ద తప్పు. మన ఒక మాట ఒకరి జీవితాన్ని, ప్రతిష్టను నాశనం చేయవచ్చు.
ఎవరి గురించైనా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి... మీరు వేసే నింద నిజమైనదేనా? లేక మీ ఊహాజనితమైనదా? నిజం తెలియని మాటలు మీ జీవితానికే ప్రమాదకరంగా మారవచ్చు!


