శుక్రవారం, సెప్టెంబర్ 25, 2026

విశ్వామిత్రుడి గర్వం... వసిష్ఠుడి బలం... (పిల్లల కోసం రాముడి కథ-19)


మిథిలా నగరం లో  రాజ పురోహితుడైన శతానందుడు, రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి కథ చెప్పసాగాడు. 

‘‘రామా... ప్రజాపతి కుమారుడైన కుశుడు అనే మహారాజు ఉండేవాడు. అతడి పుత్రుడు కుశనాభుడు. అతడికి గాధి అనే సుతుడు కలిగాడు. ఆ గాధికి పుట్టిన వాడే విశ్వామిత్రడు’’ అంటూ ఎత్తుకున్నాడు. రామలక్ష్మణులు శ్రద్ధగా వింటున్నారు. 

మహా బలశాలి అయిన విశ్వామిత్రుడు వేల ఏళ్ల పాటు రాజ్య పాలన చేశాడు. ఓసారి అతడు ఒక అక్షౌహిణి సైన్యంతో భూ పర్యటనకు బయల్దేరాడు. అనేక నగరాలు, రాష్ట్రాలు చూస్తూ అతడు వసిష్ఠుని ఆశ్రామానికి వచ్చాడు. ఆ ఆశ్రమం పలురకాలైన వృక్షాలు, జంతువులు, పక్షులతో మనోహరంగా ఉంది. చాలా మంది మునులు, రుషులు అక్కడ తపోజీవనం సాగిస్తున్నారు. విశ్వామిత్రుడు ఆ ఆశ్రమంలో వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి ప్రణమిల్లాడు. వసిష్ఠుడు సాదరంగా స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నల అనంతరం వసిష్ఠుడు, ‘‘విశ్వామిత్ర మహారాజా... నీవు మాకు పూజ్యుడవు. నీకు, నీ సైన్యానికి తగిన ఆతిథ్యం ఇవ్వదలిచాను. స్వీకరించండి’’ అన్నాడు. 

దానికి విశ్వామిత్రుడు, ‘‘మహర్షీ... మీ ఆదరణ, మంచి మాటలే మాకు చాలు. మమ్మల్ని వెళ్లనివ్వండి’’ అన్నాడు. 

వసిష్ఠుడు అందుకు అంగీకరించక పట్టుబట్టడంతో విశ్వామిత్రుడు సరేనన్నాడు. 

వసిష్ఠుడు ఎంతో సంతోషించి, తన దగ్గర ఉన్న శబల అనే కామధేనువును పిలిచాడు. ‘‘ఓ శబలా... సైన్యముతో, పరివారముతో వచ్చిన ఈ మహారాజుకు తగిన భోజన పానీయాలను సమకూర్చు’’ అని ప్రార్థించాడు. 

ఆ వెంటనే శబల మహిమ వల్ల వేడి వేడి అన్నము, రుచికరమైన వివిధ ఆహార పదార్థాలు, పాయసాలు, పానీయాలు సిద్ధమైపోయాయి. విశ్వామిత్రుడి అంత:పుర జనులు, బ్రాహ్మణులు, పురోహితులు, మంత్రులు, సైనికులందరికీ ఎవరెవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో అవన్నీ వాళ్ల విస్తళ్లలోకి వచ్చాయి.  అన్ని వేల మందికి అంత అద్భుతమైన ఆతిథ్యం లభించినందుకు విశ్వామిత్రడు ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. విందారగించిన తర్వాత అతడు వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి, ‘‘మీ ఆతిథ్యం అపూర్వం. మీకు లక్ష గోవులను ఇస్తాను. వాటికి బదులుగా మీ శబలను నాకు ఇవ్వండి’’ అన్నాడు. 

వసిష్ఠుడు అందకు అంగీకరించక, ‘‘మహారాజా... శబలతో మా అనుబంధం విడదీయరానిది. మా తపస్సుకు ఈ కామధేనువే ఆధారం. శతకోటి ఆవులను ఇచ్చినా, బంగారు రాశులను ఇచ్చినా దాన్ని మాత్రం ఇవ్వలేను’’ అని చెప్పాడు. 

 విశ్వామిత్రుడు బంగారు ఆభరణాలతో అలంకరించిన పద్నాలుగు వేల ఏనుగులను ఇస్తానన్నాడు. నాలుగేసి అశ్వాలుగల  ఎనిమిది వందల స్వర్ణ రథాలను సమర్పిస్తానన్నాడు. పదకొండు వేల మేలు జాతి గుర్రాలను బహూకరిస్తానన్నాడు. కోటి ఆవులను, రత్నాల రాశులను కానుకగా స్వీకరించమన్నాడు. అయినా వసిష్ఠుడు ఒప్పుకోలేదు.

దాంతో విశ్వామిత్రుడు కోపించి సైనికుల సాయంతో బలవంతంగా శబలను లాక్కుని పోసాగాడు. ఇదంతా చూసిన శబల తల్లడిల్లిపోయింది. వసిష్ఠుడే తనను పంపించేస్తున్నాడేమో అనుమానంతో ఆ కామధేనువు, సైనికులను విదుల్చుకుని ఒక్క ఉదుటన వసిష్ఠుడి దగ్గరకు వెళ్లి కన్నీరు కారుస్తూ అడిగింది. 

వసిష్ఠుడు ఎంతో బాధ పడుతూ, ‘‘శబలా... నేను నిన్ను పంపించడం లేదు. ఈ రాజు గర్వంతో ఇలా  చేస్తున్నాడు. ఇతడు బలశాలి. క్షత్రియుడు. పైగా రాజు. సైన్యంతో వచ్చిన ఇతడిని ఎదుర్కొనే బలం నాకు లేదు’’ అన్నాడు. 

అప్పుడు శబల, ‘‘ఓ బ్రహ్మర్షీ... క్షత్రియుడి బలం కన్నా, బ్రాహ్మణుడి తపోబలమే మిన్న అయినది. నీ ముందు ఈ రాజు బలహీనుడే. నీ బ్రహ్మబలం సాయంతో ఇతడి గర్వాన్ని నేను అణచగలను.  అందుకు నీ అనుమతి కోరుతున్నాను’’ అంది. అందుకు వసిష్ఠుడు అంగీకరించాడు. 

వెంటనే శబల ‘అంబా’ అంటూ గట్టిగా హుంభారవం చేసింది. ఆ శబ్దం నుంచి వీరులైన సైనికులు పుట్టుకొచ్చారు. వాళ్లు విశ్వామిత్రుడు చూస్తుండగానే అతడి సైనికులతో తలబడి అందరినీ చంపేశారు. అది చూసి విశ్వామిత్రుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. రకరకాల అస్త్ర శస్త్రములతో వారిని సంహరించసాగాడు. అప్పుడు శబల కోపించి అనేకులైన సైనికులను సృష్టించింది. బంగారు రంగు వస్త్రాలను ధరించిన ఆ సైనికులందరూ పొడవాటి ఖడ్గాలతో, ఆయుధాలతో విజృంభించి విశ్వామిత్రుడి బలగాలన్నింటినీ మట్టుబెట్టసాగారు. విశ్వామిత్రుడు వారితో కూడా తలబడి గొప్ప శక్తిగల అస్త్రాలను ప్రయోగించసాగాడు. అది చూసిన వశిష్ఠుడు శబలను మరింతగా ప్రోత్సహించాడు. అప్పుడు శబల తన శరీరంలోని అవయవములన్నింటి నుంచి వీరాధివీరులైన యోధులను పుట్టించింది. వాళ్ల ప్రభావంతో విశ్వామిత్రుడి సైన్యమంతా సమసిపోయింది. దాంతో విశ్వామిత్రుడి వందమంది కుమారులు  యుద్ధానికి సిద్ధమై వసిష్ఠుడిపై దాడికి దిగారు. వారిని చూస్తూనే వసిష్ఠుడు గట్టిగా హుంకరించాడు. దాంతో వాళ్లంతా తమ సైన్యంతో సహా భస్మమైపోయారు. తన వందమంది కుమారులు, సైనికులందరూ నశించిపోవడంతో విశ్వామిత్రుడు ఒంటరిగా మిగిలిపోయాడు. రెక్కలు తెగిన పక్షిలాగా, కోరలు పీకేసిన పాములాగా శక్తిహీనుడయ్యాడు. అతడి గర్వం మొత్తం అణిగిపోయింది. నిరాశలో మునిగిపోయాడు. తన కొడుకులలో ఒకడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకు వెళ్లిపోయి పరమ శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 

విశ్వామిత్రుడు శివుడిని అనేక విధాలుగా స్తుతించి, ‘‘పరమేశ్వరా... నాకు దేవ, దానవ, గంధర్వ, యక్ష రాక్షసులతో సమానమైన అస్త్రవిద్యను అనుగ్రహించు’’ అని కోరుకున్నడు. శివుడు ‘తథాస్తు’ అని పలికి మాయమయ్యాడు. 

అసలే గర్వం అధికంగా ఉండే విశ్వామిత్రుడు దివ్వాస్త్రాలను పొందడం వల్ల మరింతగా బలవంతుడయ్యాడు. వెంటనే వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లి తన అస్త్రాలను ప్రయోగించాడు. వాటి ధాటికి ఆ తపోవనమంతా దగ్ధమైపోయింది. అక్కడి మునులు, తాపసులు నలుదిక్కులకు పరుగులు తీశారు. 

వసిష్ఠుడు దిగ్గున లేచి తన బ్రహ్మదండాన్ని పైకెత్తి విశ్వామిత్రుడితో, ‘‘ఓరీ... మూర్ఖుడా... ప్రశాంతమైన తపోవాటికను నాశనం చేశావు.  బ్రహ్మబలం ముందు నీ క్షత్రియ బలం ఎంత? ఇప్పుడు ప్రయోగించు చూద్దాం, నీ అస్త్రాలేపాటివో?’’ అని సవాలు చేశాడు. 

విశ్వామిత్రుడు తాను తపస్సుతో సాధించుకున్న దివ్యాస్త్రాలను వరసగా సంధించాడు. అతడు ప్రయోగించిన ఆగ్నేయ, వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, గాంధర్వ మొదలైన దివ్యాస్త్రాలన్నింటినీ వసిష్ఠుడి దండం కబళించింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి అన్నింటికన్నా అధిక శక్తిమంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి దేవతలు సైతం భయపడ్డాడు. ముల్లోకాలు తల్లడిల్లాయి. అయితే ఆ బ్రహ్మాస్త్రం కూడా వసిష్ఠుడి బ్రహ్మదండం ముందు నిలవలేక నిశ్శారమైపోయింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. తపో బలం ముందు అస్త్రాల బలం ఎందుకూ పనికి రానిదని గ్రహించాడు. ‘‘ఇప్పుడు నాకు నిజమైన బలం అంటే ఏమిటో అర్థమైంది. తీవ్రమైన తపస్సు చేస్తాను. బ్రహ్మర్షిగా మారుతాను’’ అని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో వచ్చే సారి తెలుసుకుందాం. జైశ్రీరామ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి