సోమవారం, సెప్టెంబర్ 28, 2026

చావు బతుకుల మధ్య... మూడో స్థితి!


చావు తెలుసు... బతుకు తెలుసు... కానీ ఈ రెండింటి మధ్య ఉన్న మూడో స్థితి గురించి తెలుసా? దాన్నే ఇప్పుడు శాస్త్రవేత్తలు అధికారికంగా కనుగొన్నారు. ఈ సృష్టిలో ఏ జీవి అయినా చావు, బతుకులకు గురికావలసిందే. కానీ వీటి మధ్య మరో స్థితి ఏంటీ? అదే చూద్దాం.

మనం మరణించినప్పుడు మన శరీరంలోని కొన్ని కణాలు వెంటనే చనిపోవు. అవి కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారి, తమను తాము పునర్వ్యవస్థీకరించుకుంటాయి. కొన్నిసార్లు కొత్త రూపాల్లోకి పునర్నిర్మించుకుంటాయి.

చనిపోయిన జీవి నుండి సేకరించిన కొన్ని కణాలకు సరైన వాతావరణం కల్పిస్తే, అవి పూర్తిగా సరికొత్త జీవితాన్ని సంతరించుకోగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో అవి సొంతంగా కదిలగలవు. ప్రత్యేక ప్రవర్తనను పొందగలవు. కొన్ని పనులు చేసుకోగల సజీవ నిర్మాణాలుగా కూడా ఏర్పడగలవు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ స్థితి పూర్తిగా జీవమూ కాదు, మరణమూ కాదు. ఇది ఆ రెండింటికీ మధ్య ఉండే ఒక ప్రత్యేక దశ: అదే "మూడవ స్థితి" (Third State).

ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అదేంటంటే... అవయవ దానం విషయంలో అదే జరుగుతోంది కదా? అని. చనిపోయిన ఒక వ్యక్తి అవయవాన్ని మరో వ్యక్తి శరీరంలో అమర్చినప్పుడు అవి అంతక్రితం తాము చేసిన విధులనే నిర్వర్తిస్తాయి. దానికి... ఇప్పుడు కొత్తగా కనుగొన్న విషయానికి చాలా తేడా ఉంది. ఈ ‘మూడో స్థితి’తో జీవకణాలు తమంతట తాము సరికొత్త జీవ రూపాలుగా మారుతున్నాయనేదే ఇందులోని అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని నిర్ధారించిన ప్రయోగాలేంటో ఒకసారి చూద్దాం.

ఒక ప్రయోగంలో, మరణించిన కప్ప పిండం (frog embryo) నుండి తీసిన చర్మ కణాలను ప్రయోగశాలలోని పెట్రి డిష్‌లో ఉంచారు. అక్కడ అవి వాటంతట అవే కలిసిపోయి సూక్ష్మజీవులుగా ఏర్పడ్డాయి. వీటిని పరిశోధకులు 'జెనోబోట్స్' (Xenobots) అని పిలుస్తున్నారు. సాధారణ కణాల మాదిరిగా కాకుండా ఇవి... సొంతంగా కదలగలవు. తమకు జరిగిన గాయాలను తామే నయం చేసుకోగలవు. అంతేకాదు, తమ సంతతిని కూడ పెంచుకోగలవు. అంటే  ఇవి శారీరకంగా పెరగడం ద్వారా కాకుండా, చుట్టూ ఉన్న ఇతర విడి కణాలను ఒకచోట చేర్చి తమలాంటి ప్రతిరూపాలుగా మలచగలవని తేలింది.  

ఆ తర్వాత పరిశోధకులు మానవ ఊపిరితిత్తుల కణాలతో కూడా ఇదే విధమైన ప్రయోగం చేశారు. అందులో కూడా ఇదే విధమైన అంశాన్ని గమనించారు. ఈ కణాలు కూడా ఇలాగే చిన్న సజీవ రూపాలుగా ఏర్పడ్డాయి. పరిశోధకులు వాటికి 'ఆంథ్రోబోట్స్' (Anthrobots) అని పేరుపెట్టారు. ఇవి తమ పరిసరాల్లో సొంతంగా ప్రయాణించడమే కాకుండా, సమీపంలో దెబ్బతిన్న నరాల కణాలను (nerve cells) బాగు చేయడంలో కూడ సహాయపడ్డాయి.

కణాలు తమ గుర్తింపును మార్చుకుని కొత్త రూపాలను ఏర్పరుచుకునే ఈ సామర్థ్యాన్ని 'ప్లాస్టిసిటీ' (Plasticity) అంటారు. ఒక జీవి మరణించిన తర్వాత కూడా కొన్ని కణాలు కేవలం పనితీరునే కాకుండా, కొత్తగా సృష్టించే సామర్థ్యాన్ని కూడ నిలుపుకుంటాయని ఇది సూచిస్తోంది.

ఇంతకీ తమను తాము ఎలా పునర్వ్యవస్థీకరించుకోవాలో కణాలకు ఎలా తెలుస్తుంది?

·         జీవ-విద్యుత్ సంకేతాలు (Bioelectric Signaling): కణం పొరలలో (cell membranes) ఇమిడి ఉండే ప్రత్యేక అయాన్ ఛానెల్‌లు, పంపులు జీవసంబంధమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్‌ల వలె పనిచేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రధాన జీవి మరణించి, మెదడు, హార్మోన్ల నియంత్రణ నిలిచిపోయిన తర్వాత... సజీవంగా మిగిలిన కణాలు తమ పొరుగు కణాలతో నేరుగా సంభాషించడానికి, ఉమ్మడిగా ఒక కొత్త ఆకృతిని ఏర్పరచుకోవడానికి ఈ జీవ-విద్యుత్ సంకేతాలను ఉపయోగిస్తాయి.

·         ఒత్తిడి-జన్యువుల ఉత్తేజం (Stress-Gene Activation): ఒక జీవి మరణించిన తర్వాత, శరీర అంతర్గత సమతుల్యత (homeostasis) లోపించడాన్ని భర్తీ చేసేందుకు, అప్పటివరకు నిద్రాణంగా ఉన్న కొన్ని ఒత్తిడి-ప్రతిస్పందన (stress-response), రోగనిరోధక జన్యువులు (immune genes) ఒక్కసారిగా చురుకుగా మారుతాయని పోస్ట్‌మార్టం అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కణాలలో అంతర్లీనంగా దాగి ఉన్న కొత్త రూపాల్లోకి మారే సామర్థ్యాన్ని (cellular plasticity) వెలికితీస్తుంది.

సరే... ఈ ప్రయోగ ఫలితాల వల్ల మానవులకు ప్రయోజనం ఏమిటి? ఇది పునరుత్పత్తి వైద్యం (Regenerative Medicine)లో సరికొత్త అవకాశాలకు తెరతీస్తోంది.

భవిష్యత్తులో శరీరంలోకి మందులను చేరవేయడానికి, రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి లేదా దెబ్బతిన్న కణజాలాలను బాగు చేయడానికి రోగి సొంత కణాల నుండే ఈ 'బయోబోట్స్' (Biobots)ను రూపొందించవచ్చు. ఇవి కొన్ని వారాల్లోనే సహజంగా కరిగిపోతాయి. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థ వీటిని తిరస్కరించదు.  

మొత్తానికి ఇది విజ్ఞాన శాస్త్రంలో ఒక వింతైన కొత్త అధ్యాయం. మరణం అనేది ఎల్లప్పుడూ ముగింపు కాదని... ఆ తర్వాత కూడ కణాలు చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉండవచ్చని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఈ ‘బయోబోట్స్’ ఎలాంటి సంచలనాలకు తెరతీస్తాయో వేచి చూద్దాం.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి