మంగళవారం, ఏప్రిల్ 10, 2012

సోదెమ్మ బోధ


సోదెమ్మ బోధ


'సోది చెబుతానమ్మ... సోది చెబుతాను. చెయ్యి చూసి చెయ్యబోయేది చెబుతాను. గీతలు చూసి రాతలు చెబుతాను. సోది చెబుతానమ్మ... సోది చెబుతాను'

సోదెమ్మ దారంట పోతూ ఓ పెద్ద భవనం ముందు ఆగింది. గూర్ఖా పరుగున వచ్చి, 'రుకో... ఏ బడా ఆద్మీకా ఘర్‌ హై... జావ్‌ జావ్‌' అన్నాడు.

సోదెమ్మ కస్సుమంది. 'మై భీ బడా సోదెకత్తే హు! జబర్దస్‌ న కరో! మామూలు సోది కాదు, రాజకీయ సోది చెబుతా! సామాజిక సోది చెబుతా... సంఝే!' అంది అంతకంటే గట్టిగా.

ఈలోగా ఇంట్లోంచి రాహుల్‌ బయటికొచ్చాడు. 'అమ్మా... అమ్మా! సోది చెప్పించుకుంటానే. ఏమీ తోచట్లేదు' అన్నాడు.

మాతాజీ మెత్తగా నవ్వారు. 'ఓకే బేటా. నీ ఆనందమే నా ఆనందం. అందుకోసం ఏమైనా చేస్తా' అన్నారు. పక్కనే ఉన్న ఆమె కూతురు ముచ్చటగా తల్లి బుగ్గ పుణికింది. ఆమె మరోసారి నవ్వారు.

సోదెమ్మ బుట్ట పుచ్చుకొని లోపలికి అడుగుపెట్టింది. దారిన పోతున్న సామాన్యుడికి ఇదేదో ఆసక్తిగా అనిపించి గేటులోంచి లోపలికి చూడసాగాడు.

సోదెమ్మ చాప పరచి, 'రా! యువరాజా, కూచో! ఏదీ చెయ్యి చూపించు' అంది. యువరాజు కూర్చున్నాడు కానీ చెయ్యి చాపలేదు. 'ఊహూ... చేయి చూపించను. సిగ్గుగా ఉంది' అన్నాడు.

'ఉన్న చెయ్యి చూపించడానికి సిగ్గెందుకు దొర. తీసిలా బుట్టమీద పెట్టు' అంది సోదెమ్మ.

లాల్చీ జేబులోంచి రాహుల్‌ చెయ్యి తీశాడు. అదంతా కట్టు కట్టి ఉంది. 'అందుకే చూపించనన్నాను. దెబ్బ తగిలింది. అందుకు బాధ్యత వహించి నాకు నేనే కట్టు కట్టుకున్నాను. మరిప్పుడెలా?' అన్నాడు.

సోదెమ్మ నవ్వింది. 'కట్టు కట్టిన చెయ్యే ఇక్కడెట్టు దొర. కనికట్టు చేసి కబురు చెబుతా. కళ్లు చూసి చెబుతా. కళ్ల ముందరిది చెబుతా. నుదురు చూసి చెబుతా. దాని రాత చెబుతా. ముఖం చూసి చెబుతా. మనసు విప్పి చెబుతా' అంది తన ధోరణిలో.

రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు వంగి, 'అయితే చెప్పు. ఇలా ఎలా జరిగింది?' అన్నాడు. సోదెమ్మ అందుకుంది.

'ఆ... ఉత్తరాన ఉసుపోశమ్మ పలుకు. పంజాబు సీమలో అంకాలమ్మ పలుకు. పశ్చిమాన గోవా గింగిర్లమ్మ పలుకు. ఆ పక్క సీమలో ఖండమ్మ పలుకు... ఉన్నదున్నట్టు పలుకు. ఉలుకులికి పలుకు...' అంటూ రాగం తీసింది.

'వీళ్లంతా ఎవరు?' అన్నాడు రాహుల్‌.

'మధ్యలో అడ్డురాకు దొర. ఏ అమ్మ పలకాలో ఆయమ్మే పలుకుద్ది. అది విని నేను పలుకుతా'

'సర్లె... సర్లె... అడ్డురాను చెప్పు!'

సోదెమ్మ మళ్ళీ రాగం అందుకుంది.

'ఆ... చేతులు మడిచావు దొర ... చేష్టలుడిగావు! హామీలు చింపావు... అదిరిపడ్డావు! ఎదుటోర్ని తిట్టావు... ఎగిరిపడ్డావు! కోపాలు చూపావు... కునారిల్లేవు! కులాల కుంపటి రాజేసినావు... మతాల మంటల్ని ఎగదోసినావు... ఇన్ని చేసి కూడ, ఇరుకున పడ్డావు! ఎందుకో తెలుసా దొరా? పేదోళ్ల కష్టాల పేరు మరిచావు... మామూలు మనుషుల ఊసు విడిచావు...'

గేటులోంచి అంతా వింటున్న సామాన్యుడు నిట్టూర్చాడు. 'అవును నిజమే! ఉత్తరప్రదేశ్‌లో స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకం కలిగించడం మీదకన్నా, సామాజికంగా ప్రజల్ని విడగొట్టడానికే ఆ పార్టీ నేతలంతా ప్రయత్నించారు. కులాల వారీగా, మతాల వారీగా ఆకట్టుకోవాలనే ఎక్కువగా చూశారు. లేకపోతే మేధావిగా దేశవిదేశాల్లో పేరొందిన శ్యామ్‌పిట్రోడాను ఓ ఎన్నికల సభలో ఒక వడ్రంగిగా ఈయనగారు పరిచయం చేయడం ఎంత హాస్యాస్పదం? ఆ ప్రాంతంలో ఆ కులంవారు ఎక్కువనే కదా? ఇది కుల రాజకీయాలకు ఉదాహరణ కాదా? ఇక ఆ పార్టీ నేతలంతా మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తలకెత్తుకోలేదా? ఎన్నికల సంఘం తప్పుపట్టినా పట్టించుకున్నారా? ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లినా ఆ నేతలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నమే జరగలేదన్నది ఎవరికి తెలియదు? ఆఖరికి ఎన్నికల సంఘాన్నీ ఓ మతానికి వ్యతిరేకిగా చిత్రించాలనుకోలేదా? ఎన్నికలకు రెండు నెలల ముందే ఓ ప్రధాన కులస్థుణ్ని ఆదరాబాదరా మంత్రివర్గంలోకి తీసుకోవడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇవన్నీ ఓ జాతీయ పార్టీ చేసే పనులేనా? అంతా అయిపోయాక బాధ్యత వహిస్తే సరిపోతుందా?' అనుకున్నాడు.

లోపల సోదెమ్మ చెబుతూనే ఉంది. 'మరిప్పుడు- ఏం చేయాలంటావు?' అన్నాడు రాహుల్‌.

'చేసిన తప్పుల్ని చూసుకో దొర. చేతి గాయానికి మందులేసుకో దొర. బాధ్యత వహించకు దొర. బాధ్యతగా నడుచుకో!' అంది సోదెమ్మ.

'అమ్మా... అమ్మా! నువ్వు కూడా చెప్పించుకోవే' అంటూ రాహుల్‌ సరదాపడ్డాడు. యువరాజు సరదా కాదనలేక మాతాజీ ముందుకొచ్చి చెయ్యి చాపారు. ఆమె చేతిలో నాలుగు వేళ్లకు కట్టుకట్టి ఉంది. ఒక్క చిటికెన వేలికి ఉంగరం తళుక్కుమంటోంది.

సోదెమ్మ కళ్లు మూసుకుని రాగం అందుకుంది.

'ఆ... రోట్లో పచ్చడి రుబ్బబోయావు. చేతి వేళ్లనే పచ్చడి చేసుకున్నావు! రుబ్బడానికి ఒక మనిషిని పెట్టావు... పక్క నుంచి నీవు పొత్రమ్ము తిప్పేవు! రుచులు వడ్డించే మార్గమిది కాదే తల్లీ! ప్రజల అభిరుచులు తెలుసుకోవే తల్లి! అధికారంతో మురిసేవు... వారసత్వమే నీకు వరమని తలచేవు... కానీ ఇప్పటికైనా నిజము తెలుసుకో! సామాన్యుల మనసును తెలుసుకోవాలమ్మ! సానుకూల పనులు సాధించాలమ్మ! అవినీతి అనుచరుల కంట కనిపెట్టమ్మ... అపుడు కానీ నీకు కలిసిరాదమ్మ!'

గేటు దగ్గరి సామాన్యుడు నవ్వుకున్నాడు. 'సంకీర్ణ పార్టీలను బుజ్జగిస్తూ సామాన్యుల మనోభావాలు గమనించకపోతే ఫలితాలిలాగే ఉంటాయి. ఇక ముందైనా ఈ సంగతి తెలుసుకుని ముందుకు సాగితే బాగుణ్ను!' అనుకుని ముందుకు సాగిపోయాడు.

సోదెమ్మ కూడా బుట్టవాయినం అందుకుని బయటపడింది!

PUBLISHED IN EENADU ON 10.3.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి