మంగళవారం, ఏప్రిల్ 10, 2012

పేదరికం పరార్‌!

పేదరికం పరార్‌!


టట్టడాయ్‌... టడట్టడాయ్‌!
అరకొర దేశం రాజు అవకతవకలుంగారు గుర్రమెక్కి వ్యాహ్యాళికి బయల్దేరారు. మంత్రి గందరగోళకలుంగారూ అనుసరించారు.
టక్కు టిక్కు... టక్కు టిక్కు!

కొంతదూరం వెళ్లేసరికి గుడి ముందు ఓ బిచ్చగాడు కనిపించాడు. అవకతవకడి కనుబొమలు ముడివడ్డాయి.

టక్కు టిక్కు... టక్కు టిక్కు!

మరి కొంతదూరం వెళ్లేసరికి, ఎండిన డొక్కలతో మరో పేదవాడు ఎదురొచ్చాడు.

అవకతవకడి మొహం చికాగ్గా మారిపోయింది.

'గందరగోళకా!' అని అరిచారు రాజుగారు.

'చిత్తం ప్రభూ!' అన్నాడు గందరగోళకుడు.

'మనదేశంలో పేదలా, బిచ్చగాళ్లా... ఏమిటిది?'

'ఏ దేశంలోనైనా ఇది సహజమే ప్రభూ'

'ఆపు నీ అధిక ప్రసంగం. నా దేశంలో ఇలా ఉండటానికి వీల్లేదు. వెంటనే పేదలందరినీ పరిమార్చు...'

'హతవిధీ, పరిమార్చడమా?'

'అదే... పేదలందరినీ తగ్గించెయ్‌. అవకతవకడి దేశంలో పేదలున్నారంటే ఎంత అప్రతిష్ఠ, ఎంత నామర్దా? ఇరుగుపొరుగు దేశాల్లో మన పరువేంగాను, ఎక్కడైనా అప్పు పుట్టునా? విదేశాలకు పోయిన, వీపు వెనకనే నవ్వరా? అదియునుగాక... పేదలకు సాయమందించాలన్న, అందుకు మన ఖజానా చాలునా?'

'చిత్తం ప్రభూ! మీరు నిశ్చింతగా ఉండండి. రేపటికల్లా మనదేశంలో పేదరికాన్ని తుడిచేస్తాను'

'సెభాష్‌!'

ఇద్దరూ గుర్రాలను వెనక్కు మరలించారు.

టక్కు టిక్కు... టక్కు టిక్కు!

* * *

మర్నాడు సభలో సింహాసనం మీద కూర్చున్న అవకతవకడి దగ్గరకు గందరగోళకుడు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు.

'ప్రభూ! ఈయన మహా మేధావి. పేరు వక్రబుద్ధి. మనదేశంలో పేదరికాన్ని తుడిచిపెట్టి ఇప్పుడే వచ్చారు' అన్నాడు గందరగోళకుడు.

'అదెలా సాధ్యం, నిన్ననే కదా నీకు చెప్పింది?' అంటూ ఆశ్చర్యపడ్డాడు అవకతవకుడు.

'చెప్పాను కదా ప్రభూ! ఈయన మేధావని. ఆ సంగతి ఆయనే చెబుతారు వినండి'

వక్రబుద్ధి వినయంగా ముందుకు వచ్చి నమస్కరించి చెప్పాడు, 'నిజమే ప్రభూ! మీ దేశంలో పేదరికం లేనే లేదు. నేను నా అనుచరులతో పరిశీలన చేసి నిర్ధారణకు వచ్చాను' అన్నాడు.

'అదెట్లు? మేం మా కళ్లతో స్వయంగా పేదరికాన్ని చూశామే?' అన్నాడు అవకతవకడు.

వక్రబుద్ధి నవ్వాడు. 'మీరు చూసినవాళ్లంతా నిజానికి ధనవంతులే ప్రభూ! ఒకడు గుడి ముందు బిచ్చమెత్తుకుంటూ మరింత ఆర్జిస్తున్న ధనవంతుడు. మరొకడు తక్కువ తింటూ ఎక్కువ కాలం బతకాలని చూస్తున్న ఆశపరుడు' అన్నాడు.

'నిరూపించగలవా?'

'తప్పకుండా ప్రభూ! మీ చేతనే ఈ సంగతి ఒప్పించగలను. నేను అడిగిన వాటికి సమాధానం చెబితే చాలు'

'అటులనే కానిమ్ము...'

'మీ దృష్టిలో పేదలంటే ఎవరు?'

'ఏమీ లేనివారు...'

'ఏమీ లేనివారంటే?'

'అంటే, తినడానికి తిండి లేనివారు...'

'అట్లయిన దేశంలో అందరూ ఏదో ఒకటి తింటూనే ఉన్నారు ప్రభూ! కలో, గంజో, అంబలో ఏదో ఒకటి. అలా తినకపోతే ఈపాటికి చచ్చిపోయి ఉండేవారు కదా ప్రభూ!'

'భలే, మరి ఉండటానికి నీడ లేనివారు కూడా పేదవారేగా?'

'ఆ స్థితిలోనూ ఎవరూ లేరు ప్రభూ! ఏదో ఒక చెట్టు నీడనో, వంతెన కిందనో, చూరు కిందనో ఉంటున్నారు. లేకపోతే వారికి నిద్ర ఎలా పడుతుంది ప్రభూ!'

'అవున్నిజమే! అట్లయిన కట్టుకోవడానికి బట్టలేనివారి సంగతేంటి?'

'తమ దేశంలో వాళ్లు కూడా లేరు ప్రభూ! కనీసం మూడు మూరల గోచీనైనా పెట్టుకుంటున్నారు. అది కూడా లేకపోతే దేశంలో దిగంబరులు తిరుగాడేవారు కదా ప్రభూ!'

'నిజమే. కానీ మా దేశంలో అందరూ ధనవంతులే అన్నావు. అదెలా?'

'ఎందుక్కాదు ప్రభూ! గోచీని కొన్నాడంటే ఎంతో కొంత స్థితిపరుడేగా? వాడు బతికి ఉన్నాడంటే- ఏదో ఒకటి తింటున్నాడన్న మాటేగా? తిండి కొనుక్కున్నాడంటే- కాసినో కూసినో డబ్బులున్నవాడేగా? కాబట్టి అందరూ ఏదో ఒకటి ఉన్నవారే. కలవారే'

'ఆశ్చర్యమాశ్చర్యము. ఒక్క రాత్రిలో మా దేశంలో పేదరికాన్ని ఎలా మాయం చేశావు?'

'చాలా సులభం ప్రభూ! పేదలకు మనం ఇచ్చుకునే నిర్వచనాన్ని మార్చుకుంటే సరి. నేనదే చేశాను. మీచేత ఒప్పించాను'

అవకతవకడు ఉప్పొంగి పోయాడు. గందరగోళకుడిని సన్మానించాడు. వక్రబుద్ధిని సత్కరించాడు.

* * *
కొసమెరుపు: అలనాటి రాజు అవకతవకడు, మంత్రి గందరగోళకుడు, మేధావి వక్రబుద్ధి పునర్జన్మ ఎత్తి వర్తమానంలో పుట్టారు. ప్రణాళిక సంఘం సభ్యులుగా, సర్కారు నేతలయ్యారు. పట్నాల్లో రోజుకు 28.65 రూపాయలు, పల్లెల్లో రోజుకు 22.42 రూపాయలు ఖర్చు చేయగలవారు పేదలు కాదంటూ... పేదరికానికి అవకతవక, గందరగోళ, వక్రబుద్ధితో కూడిన నివేదికలు రూపొందిస్తున్నది వాళ్లే!

PUBLISHED IN EENADU ON 6.4.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి