మంగళవారం, ఏప్రిల్ 10, 2012

దొంగ తెలివి


దొంగ తెలివి


పంకజం...!' అంటూ గావుకేక పెట్టాడు పాపారావ్‌. వంటింట్లోంచి నిదానంగా వచ్చి ఏమిటన్నట్టు కళ్లెగరేసింది పంకజం. అప్పటికే వగరుస్తున్న పాపారావ్‌, గ్లాసుడు నీళ్లు గటగటా తాగేసి, 'కూరలో అంతకారం వేశావేంటి?' అన్నాడు జీరబోయిన గొంతుతో.

అంతే... పంకజం తన చేతిలో ఉన్న మూకుడు అతడి నెత్తి మీద బోర్లించింది. ఆపై వీధిలోకి పరిగెత్తి 'ఓ ఎంకాయమ్మా... ఎల్లాయమ్మా... పుల్లాయమ్మా...' అంటూ కేకలేసింది.

పాపారావ్‌ అవాక్కైపోయాడు. ఏంటా అని వీధిలోకి వెళ్లి చూస్తే, చుట్టూ మూగిన ఆడవాళ్ల మధ్య నిలబడి వగర్పులు మొదలెట్టింది.

'ఈ వేధింపులు ఇక భరించలేనమ్మా. కూరలో కారం ఎక్కువైందట. ఎంత గట్టిగా అరిచాడో. అంతకన్నా ఒకేసారి చంపేయమనండి' అంటూ గోల చేసింది. ఏడుపు మొహం పెట్టుకుని, ముక్కు ఎగపీలుస్తూ హడావుడి చేసింది...

* * *

'అదిరా కథ. విన్నావుగా? దీన్నిబట్టి నీకేం తెలిసిందో చెప్పు చూద్దాం!' అన్నారు గురువుగారు నిమ్మళంగా పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ. గురువుగారు చదివి వినిపించిన కథని ఓసారి గుర్తు తెచ్చుకుని శిష్యుడు ఉత్సాహంగా చెప్పాడు.

'మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కడమంటే ఇదేనండి. పంకజం వట్టి గయ్యాళి రకమన్నమాటండి. కూర సరిగ్గా చేయకపోగా, అడిగిన భర్తను నలుగురిలో చులకన చేసిందంటే, అమ్మమ్మా... మహా జాణన్నమాటేనండి. పైగా మొగుడేదో ఆరళ్లు పెడుతున్నట్టు ఏకరువు పెట్టి సానుభూతి కోసం పాకులాడ్డమండి...'

గురువుగారు నవ్వుకున్నారు. 'పంకజాన్ని బాగానే తిట్టావులే కానీ, మరి ఆమెనుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటో గ్రహించావా?' అన్నారు.

'అయ్యబాబోయ్‌... ఆవిడ దగ్గర్నుంచి నేర్చుకోవడం ఏంటండీ?ఆ గుణమే మాచెడ్డదండి' అన్నాడు శిష్యుడు.

'అయితే నువ్వు రాజకీయాలకు పనికి రావురా! నా దగ్గరకి పదేపదే వచ్చి విసిగించకుండా, ఏదైనా కొట్టు పెట్టుకుని బతికెయ్‌...'

'అదేంటండీ అంతమాటనేశారు? మరీ అన్యాయం కాకపోతేనూ?'

'కాదేంట్రా మరి? నయా నీచ రాజకీయాల్లో దూసుకుపోవాలనుకుంటే ఇలాంటివాళ్లనుంచే పాఠాలు నేర్చుకోవాలి. గయ్యాళ్లు, అహంకారులు, నీచులు, నికృష్ఠులు, బడాచోరులు, నంగనాచులు, పచ్చి దొంగలు, పయోముఖ విషకుంభాలు, గోముఖ వ్యాఘ్రాలు... వీళ్లేరా మనకి గురువులు. ముందు ఆ సంగతి తెలుసుకో. వీళ్లు వేసే అధమాధమ ఎత్తుగడలన్నీ మన జీవనశైలిలోకి అనువదించుకోవాలి. లేదా ఇప్పటికే ఈ పనిచేసిన నేతలను గమనించి, వాళ్ల అడుగుజాడల్లో నడవాలి. అర్థమైందా?'

'ఆ మాత్రం తెలివేడిస్తే అల్లుకుపోతాకానీ, ఇలా మీ దగ్గర నొల్లుకుంటానా చెప్పండి? కాబట్టి ఉదాహరణ ఏదైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి గురూగారూ!'

'వార్నీ! ఆ బాధ్యతా నా నెత్తినే పెట్టావ్‌? ఊరూవాడా తిరుగుతూ ఊదరగొడుతున్న యువనేతని చూడు. పేపర్లు చదివేసి, టీవీలు చూసేస్తే సరిపోయిందట్రా! ఎప్పుడెవరు ఎలా మాట్లాడుతున్నారో చూసి వాటిలోని గూఢార్థాలను గుండెల్లో దాచుకోవద్దా!'

'అవునండోయ్‌! ఓదార్పు యాత్రలాగే చిత్రాతిచిత్రమైన ఆయన మాటలూ ఓ పట్టాన అర్థం కావండి. ఇంతకీ ఏంటన్నాడండీ?'

'అచ్చం ఆ గయ్యాళి పంకజంలాగే హడావుడి చేస్తున్నాడు. కాగితాల మీద కంపెనీలు కల్పించి, వాటిలోకి కాసులు మళ్లించి, విదేశాలకు పంపించి, పెట్టుబడులుగా తెప్పించి, సొంత వ్యాపారాలు విస్తరించి, అందుకు తోడ్పడిన అస్మదీయులకు అధికారాన్ని అడ్డమెట్టుకుని ప్రయోజనాలు చేకూర్చి, జనాన్ని ఏమార్చి, ప్రజల సొమ్ము దోచి, కోట్లకు పడగలెత్తి, చేసిందంతా చేసి, చేజారిన కుర్చీ కోసం అలమటిస్తున్నాడా... ఇప్పుడా అవినీతి కథలన్నీ బయటపడుతున్నాయనేసరికి వీధుల్లో తారంగం ఆడ్డం లేదూ? ఇదేంటయ్యా ఇలా చేశావని అడగడం తప్పా చెప్పు? అలా అడగడం వెనక ఆధారాలున్నా ఆ సంగతి మాట్లాడకుండా, తననేదో పనిగట్టుకుని వేధిస్తున్నారనీ, అంతకన్నా చంపేస్తేనే నయమని జనం ముందు జజ్జనకరి జనారే అంటూ ఆడిపోసుకుంటున్నాడంటే- ఏమనుకోవాలి?'

'సార్సార్సార్‌! ఇంతకీ మీరతడిని తిడుతున్నారా? పొగుడుతున్నారా?'

'అతడిని మనం కాదురా తిట్టేది. ఏమాత్రం కాస్త తెలివిడి ఉన్న సామాన్యులకైనా ఆ హక్కు ఉంటుంది. మనం తిడతామా చెప్పు? విల్లాలకు విల్లాలు నొల్లేసుకుని విలవిల్లాడిపోతున్నట్టు జనం ముందు నటించడం ఎలాంటి దగుల్బాజీలకైనా పెదబాలశిక్ష కాదూ? కేసెట్టిన సీబీఐకే దురుద్దేశాలు అంటగట్టడం నీలాంటివాళ్లకు ఓనమాలు కాదూ? ఆఖరికి న్యాయమూర్తుల్నే నమ్మకపోవడం, వారి నిజాయతీనే శంకించడం నీచులకు శ్రీరంగనీతులు కాదూ? దొరికిపోయిన దొంగ ఊరందర్నీ తిట్టినట్టు, కళ్లముందు జరిగే అవినీతి గురించి రాసిన పత్రికల్ని, చూపిన ఛానళ్లని ఏకడమంటే బరితెగింపును బడిలో నేర్చుకోవడం కాదూ?'

'ఆహా... కళ్లు తెరుచుకున్నాయి గురూగారూ! ఇతగాడు చివరాకరికి న్యాయసూత్రాల్ని, రాజ్యాంగ నియమాల్ని, ధర్మపన్నాల్ని కూడా తప్పుపట్టేలా ఉన్నాడు. ఎంత గొప్ప గడసరి గయ్యాళితనమండీ! మొత్తానికి అతడొక 'విజ్ఞాన' సర్వస్వం అన్నమాటే కదండీ!'

'ఆ... ఇప్పుడు నువ్వు రాజకీయాలకి తొలి అర్హత సాధించావురా! ఈసారికి పోయిరా!'

PUBLISHED IN EENADU ON 28.1.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి