మంగళవారం, ఏప్రిల్ 10, 2012

తరంగాల తతంగం

తరంగాల తతంగం



కోలు కోలోయన్న కోలో నా సామి...
కొమ్మలిద్దరు మాంచి జోడు...'- అంటూ కూనిరాగం తీస్తూ వచ్చి పడక్కుర్చీలో వాలారు గురువుగారు. శిష్యుడు సర్దుకు కూర్చుని మొహమాటంగా నవ్వాడు.
'ఏరా... ఈ పాట ఎరికొచ్చిందిరా?' ప్రశ్నించారు గురువుగారు.
'పాత పాట కదండీ?' అన్నాడు శిష్యుడు.
గురువుగారు నవ్వి, 'కాదురా కొత్తదే' అన్నారు.
'అయ్‌బాబో! ఇది కొత్తదేంటండి బాబూ? గుండమ్మకథలోదండి' అన్నాడు శిష్యుడు అయోమయంగా.
'కావచ్చు లేరా! కానీ ఇది నేటి గూండాల కథకి కూడా సరిగ్గా సరిపోద్ది మరి' అంటూ గురువుగారు నవ్వేశారు.
'అయితే గురువుగారు రాజకీయ పాఠం మొదలెట్టేశారన్నమాట. నేనే కనుక్కోలేకపోయా' అన్నాడు శిష్యుడు కుదుటపడి.

'ఈ పాటలో సామి అంటే ఎవరనుకున్నావ్‌ సుబ్రమణ్య సామి. మరాయన సుప్రీంకోర్టులో అర్జీ తగిలించబట్టే కదా, గూండాల కథ రసకందాయంలో పడింది? ఆ యవ్వారంపై కోర్టు అక్షింతలు వేస్తే కోలుకోలోయనిపించింది మరి. కొమ్మలిద్దరంటే వేరే చెప్పాలా? టూజీ కుంభకోణమే. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ 'జీ'లకు కూడా చుట్టుకునేలా ఉంది కదా? అందుకే సరదాగా పాటందుకున్నా'

'అన్యాయం గురూగారూ! అవతల తోటి అవినీతిపరుల లైసెన్సులు రద్దయిపోయి, జరిమానాలు కూడా పడితే మీరిలా సంబరపడ్డం భావ్యమా చెప్పండి?'
గురువుగారు ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి, 'ఇన్నాల్లనుంచీ నా వాగుడంతా రాసుకుంటున్నావు కానీ, నేనేంటో తెలుసుకోలేకపోయావురా! అదే నా బాధ. సర్లె... ఇంతకీ నీకా తరంగాల తతంగమైనా పూర్తిగా ఒంటపట్టిందా, అదీ లేదా?'

'తరంగాల తతంగమేంటి గురూగారూ?'
'అదేరా... ఈజీగా డబ్బులు కురిపించిన టూజీ యవ్వారమే. రెండో తరం సెల్లుఫోన్లకి సొగసులద్ది తైతక్కలాడించే అయ్యేవో అయస్కాంత తరంగాల కతే. ఆ తరంగాలే అవినీతి నేతల అంతరంగాలు. సర్కారుకు దక్కాల్సిన లచ్చల కోట్ల సొమ్ముకు గండి కొట్టిన 'కంత'రంగాలు. అనుంగు కంపెనీల జేబులు నింపిన అనంతరంగాలు. అడ్డగోలుగా అయినవారికి మేలు సేసిన 'మేత'రంగాలు. అనుమతులు దక్కించుకుని ఆ ఎమ్మటే అమ్ముకుని అసలుకెన్నో రెట్లు నొల్లుకున్నవారికి కోర్టు వేసిన జరిమానా ఎంతరా? సముద్రంలో కాకిరెట్ట కాదూ? అందుకనే ఆల్లంతా కలిసి, 'కోట్లు కోట్లోయమ్మ కోట్లో నా సామి... కట్టేది కూసింతే సూడు...' అని పాడుకోవచ్చురా. ఏమంటావ్‌?'

'అనేదేముందండీ... అంత బాగా చెప్పాక! ఇంతకీ ఈ వ్యవహారంలోంచి ఒంటపట్టించుకోవాల్సినవేమైనా ఉన్నాయాండీ?'
'ఎందుకు లేవురా? తేరిపారి చూస్తే తేరగా ఆరగించడానికి అన్నీ సూత్రాలే. ఏ పనికైనా నిబంధనలంటూ ఉంటాయి కాబట్టి, ముందుగా ఆటినో చూపు చూడాల. అవి కట్టుదిట్టంగా ఉంటే పనిగట్టుకుని మార్చేయాల. మరయ్యే మన పని సులువు చేసేలా ఉన్నాయనుకో... వాటినే నెత్తిమీద పెట్టుకోవాల. మరీ తరంగాల తతంగంలో జరిగిందదే కద? ఫోన్లు వాడేటోల్లు లచ్చల్లో ఉన్నప్పటి రూల్సునే, వాళ్లు కోట్లలోకి పెరిగినా సవరించలేదంటే తెలీడంలే? సవరిస్తే కజానాకే కద లాభం? ఆపని చేస్తామా? అమ్మమ్మా... అదిగో అలాంటప్పుడే కళ్లు మూసుకోవాల. పనికి టెండర్లెట్టి వేలమేస్తే అయినవాళ్లు వెనకబడతారనిపించిందనుకో... ఆ వూసే ఎత్తకూడదు. మనోళ్లకి ముందుగానే ఉప్పందించేసి లోపాయికారీగా దండుకున్నదేదో దండేసుకున్నాక, రెడీ ఒన్‌...టూ...త్రీ అని గబుక్కున లెక్కెట్టేసి ఎవరు ముందొస్తే వాళ్లకే పనోచ్‌ అని వూదరగొట్టేయాల. మరా అవినీతి రాజావోరు చేసిందదే కద?'

'కానీ ఏం లాభం గురూగారూ! అంతా బయటపడి జైల్లో పడితేనూ?'
'పడి గమ్మునున్నాడా? అసలిదంతా డబ్బుల మంతిరిగారికి తెలిసిందేనని చిదంబర రహస్యం అడ్డేసుకోలేదూ? అది కూడా నీకో పాటమే మరి. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, మరి ఢిల్లీ 'జీ'లన్నారు కదా, వాళ్లనుంచి ఏం నేర్చుకోవాలి?'
'అబ్బో... వాళ్లు చెప్పేది మరీ పెద్ద పాఠం... అదే నిమ్మకు నీరెత్తినట్టుండటం... కళ్ల ముందు కజానాకి కన్నం పడుతోందని తెలిసినా నోరు మెదపలేదు చూడూ, అదిగో... ఆ నిబ్బరాన్ని నేర్చుకోవాల. ఒకరు కుర్చీమీద కూచున్న నేతా'జీ'గారైతే, మరొకరు కీలక బాధ్యతల మంత్రీ'జీ'గారు. మరి ఈళ్లిద్దరూ ఇలా ష్‌... గప్‌చుప్‌ అని ఉండటానికి కారణమెవరో తెలుసా? తెర వెనకాలనుంచి తతంగమాడిస్తున్న మాతా'జీ'గారు. ఇలా పెద్దలందరూ పెదవి విప్పలేదంటే- నువు రాసుకోవాల్సిన అసలైన పాఠం వేరే ఉంది మరి. అదే అధికారం! ఆ పల్లకీలో కూర్చున్నవాళ్లకు మోతే కీలకం. పైగా మోసేది వేర్వేరు పార్టీలైనప్పుడు సంకీర్ణ ధర్మాలని కొన్ని ఉంటాయి మరి. వాటి ముందు అసలైన ధర్మాలు దిగదుడుపే. మింగుడుపడిందా?'

'భేషుగ్గా గురూగారూ! టూజీ వ్యవహారంలో త్రీ'జీ'ల పాఠం తిరుగులేనిదని తెలిసిపోయింది!'

PUBLISHED IN EENADU ON 8.2.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి