మంగళవారం, ఏప్రిల్ 10, 2012

అధికార పైత్యం!



అబ్బ! ఎంత నిజాయతీ! తల్చుకుంటేనే మనసు పులకించి పోతుంది. హృదయం ఉప్పొంగి పోతుంది. తనువంతా రోమాంచితమై వెంట్రుకలన్నీ ఒక్కుమ్మడిగా నిక్కబొడుచుకుని సూదుల్లా నుంచుంటాయ్‌. అసలీ మధ్య కాలంలో చూశామా ఇంతటి నీతి నిజాయతీలు! అమాత్యుల వారు ఎంత బాగా సెలవిచ్చారు! ఎంత నిబ్బరంగా వాక్రుచ్చారు! 'ప్రభుత్వం మాది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయగలం ఇలాంటి పన్లు?' అని చెప్పేసేసి ఎంత చక్కగా వివరించారు! ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి. ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న తతంగాన్ని ఉన్నదున్నట్టు ఒప్పుకోవడమంటే ఎంత నిబ్బరం ఉండాలి? ఎంత ధైర్యం కావాలి? అన్నింటికన్నా మంచి ఆయన మాటల్లో పారదర్శకతను గమనించారా! అసలెక్కడైనా మర్మమనేది ఉందా? లౌక్యమనేది కనిపించిందా? మరింకెందుకు గొడవ? ఇందిరా గాంధీ ఇళ్ల పథకం అసలెవరి కోసమో తేటతెల్లం అయిపోయిందని అఖిలాంధ్ర ప్రజానీకమంతా గ్రహించాలి. అది కేవలం ఏలిన వారి అనుయాయులకే అని అర్థం చేసుకోవాలి. అప్పుడెంత నిశ్చింతగా ఉంటుందో ఒక్కసారి వూహించండి.

ఈ విషయం తేలిపోతే పాపం అర్హులైన పేదవారు అనవసరంగా ఆశలు పెంచుకోవాల్సిన పని ఉండదిక. ఆశనేది లేకపోతే ఇక నిరాశకు చోటేదీ? కాబట్టి పేదలు పేదల్లాగా పడి ఉండచ్చు. ఎలాటి హడావుడి, ఆందోళన లేకుండా కాలం గడిపేయవచ్చు. కొంప కట్టుకునే ఆలోచన వదిలేసి కడుపు నింపుకొనే వీలు చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే ఆయన అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సూచించే జాబితాలోని వారికే ఇందిర ఇళ్లు ఇవ్వవలెనని ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించే మంత్రి పదవిలో ఉండి, ఓ పార్టీకి చెందిన వారికే లబ్ది చేకూర్చేలా ప్రవర్తించడమేంటని అనవసరంగా ఆయన్ని ఆడిపోసుకోకండి. ఆయనది సంకుచితత్వం కానేకాదు. ఇంకా మాట్లాడితే విశాల దృక్పథం! నిజమైన పేదలకు అసలైన శ్రేయోభిలాషి ఆయనే.

కాదూ కూడదూ, ఆయన మాటలు సరైనవి కానేకావని ఎవరైనా అన్నారంటే వారికి మెదడు మోకాల్లో ఉందనే అర్థం. అసలు ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేసి, నిజాయతీ రత్నలాంటి బిరుదేదో ఇవ్వాల్సింది పోయి, కోడిగుడ్డుకు ఈకలు పీకితే ఎలా? ఎలాటి దాపరికం లేకుండా, మెరమెచ్చు మాటలాడకుండా, లోపాయికారీగా పని జరిపించకుండా బహిరంగంగా మనసులోని మాట చెప్పారంటేనే తెలియడం లేదూ ఆయన మంచితనం ఏమిటో?

ఆ పథకం సంగతి పక్కన పెట్టండి. అసలే పథకం సరిగ్గా పేదలకు అందుతోంది కనుక? ఆ సంగతి ఆలోచించరేం? నీటి పథకాలు తీసుకుంటేవాటి గుత్తేదారులు అస్మదీయులేగా? అంచనాలు పెంచేసుకుని, పని జరక్కపోయినా జరిగినట్టు చూపించేసి ఖజానా సొమ్ము పంచేసుకోలేదూ? పైగా జనానికి ఇంత లాభం, అంత లాభమంటూ మసి పూసి మారేడుకాయ చేసే ప్రకటనలు గుప్పించడం లేదూ? అలాంటి మేడిపండు ప్రకటనలు ఇచ్చేవారిని వదిలేసి, పాపం చక్కగా కుండ బద్దలు కొట్టిన ఈయన్ని అనుకుంటారేం? అసలేమైనా ఇంగితమనేది ఉందా అని!

అసలు మంత్రులందరూ ఇదే బాటలో సాగితే ఇంకా మంచిది. 'ఇదిగో అబ్బాయ్‌... ఇదీ పథకం. దీంట్లో మావాళ్లే ఉంటారు. మీరూరికే ఆశలు గట్రా పెంచుకోకండి. మావాళ్లంతా అయిపోయాక ఒకటో, రెండో ఉంటే మీకే ఇప్పిస్తాం' అని ప్రతి పథకం మీద నిక్కచ్చిగా చెప్పేస్తే హాయిగా ఉంటుంది. కావాలంటే ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలోనూ జాబితాలు కూడా పెట్టిస్తే సరి. ఇక సామాన్యులు ధరఖాస్తులు పెట్టుకోవడాలు, ఎదురు చూడ్డాలు, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడాలు, కలలు కనడాలు, భ్రమల్లో తేలిపోవడాలు ఏవీ ఉండవు. అందరి మనసులూ తేటతెల్లంగా ఉంటాయి.

ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలి. వీలుంటే శాసనసభలో ప్రకటించేస్తే ఇంకా మంచిది. అసలు సమాచార కమీషనర్ల నియామకానికి ముందే ఆయన ఈ సంగతి ఆలోచించి ఉండాల్సింది. చట్టం, దాని ప్రయోజనం, ప్రజల హక్కు ఇవన్నీ ఆలోచించేది లేదని, కేవలం మా పార్టీవారికి పదవులు ఇప్పించడమే మా ముఖ్య లక్ష్యమని ముందే చెప్పి ఉంటే జనానికి గొంతు చించుకునే బాధ తప్పేది. గవర్నరు కూడా అవాక్కై గమ్మునుండిపోయేవారేమో. తిరస్కరించే అవసరం కూడా ఉండకపోను. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు.

పాలనలో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడండీ ఇలాంటి పనులు చేసే అవకాశం వస్తుంది? అర్థం చేసుకోరేం? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయినవారికి అడిగిందిచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకుని సొంత వ్యాపారాలు పెంచుకున్న హయాం సంగతి మర్చిపోయారా? అన్ని అడ్డగోలు పనులూ చేసి కూడా 'మాది దేవుడి పాలన' అంటూ మభ్యపెట్టేకన్నా, ఎంచక్కా 'మా తీరింతేనర్రా!' అని ప్రకటించడం ఎంత సబబో తెలుసుకోండి. అలాంటి కాపట్యం లేనందుకైనా అమాత్యుల వారిని ఆకాశానికెత్తాలి.

ప్రజలు కూడా ఎంత తొందరగా ఈ సంగతి గ్రహిస్తే అంత మంచిది. ఎందుకంటే అమాత్యుల వారు అన్నదానికి భిన్నంగా ఏమీ జరగడం లేదు. మరో మంత్రిగారేం చేశారో గుర్తు లేదా? కొడుకు పెళ్లి కోసం కళాశాల ప్రాంగణం కావలసి వస్తే ఏకంగా పరీక్ష కేంద్రాన్నే మార్చేయలేదూ? అప్పటి కప్పుడు మార్చేయడం వల్ల పాపం అభ్యర్థులు ఎంత హైరానా పడ్డారు? ఓ కన్నతండ్రి మరణం, ఓ కూతురి కంటతడి, ఓ కుటుంబం గుండెకోత ఇవన్నీ అవసరమా? పరీక్ష కేంద్రాలను ప్రకటించడానికి ముందే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలూ, సమర్తలూ గట్రా ఉన్నాయేమో వాకబు చేసుకుంటే ఇంతటి ప్రయాసలు ఉండేవా?

ఎక్కడి కక్కడ అధికార పైత్యం తైతక్కలాడుతుంటే ఊరికే విమర్శించి ఏమిటి లాభం? అంతకన్నా పారదర్శకమైన పాలన కావాలని కోరుకుంటే మంచిది. 'మేమింతే! మా పాలనింతే! మా ఇష్టం! ఇలాగే ఉంటాం! ఏదైనా చేస్తాం! చేయగలం! ఇదే మాకు అవకాశం! ఇకనైనా తెలుసుకోండి!' అని చక్కగా పత్రికల్లో అధికార ప్రకటనలు జారీ చేసేస్తే ప్రజానీకం అందరూ చక్కగా చదువుకుని, అర్థం చేసుకుని నోరు మూసుకుని పడుంటారు. ఏమంటారు?

PUBLISHED IN EENADU ON 5.3.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి