మంగళవారం, ఏప్రిల్ 10, 2012

మత్తోన్మాదులు

మత్తోన్మాదులు



'మత్తు వదలరా... నరుడా!' అన్న తత్వం వినడానికి బాగానే ఉంటుంది. ఒంటపట్టించుకుందామని మాత్రం చూడకూడదు. ఎందుకంటే తత్వం కూడా ఓ మత్తు లాంటిదే. తలకెక్కిందా- మన తత్వాన్నే మార్చేస్తుంది. ఈ విషయం మన ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. అందుకే వాళ్లు తత్వం మాట పక్కనపెట్టి, మత్తును తలకెత్తుకున్నారు. ఏ మత్తని అడక్కండి. 'మత్తులందు మహా మత్తులు వేరయా!' అని కొత్తగా పాడుకోవాలి.

ఒకటా రెండా మనం ఓటేసి నెత్తిన పెట్టుకున్న నేతలు పలు 'మత్తో'న్మాదులు. నెలనెలా వచ్చిపడుతున్న వాటాలే అందుకు సాక్ష్యం. మంత్రుల ఇళ్లకు లక్షల రూపాయలు నడిచి వచ్చేస్తుంటే- 'ఆహా! ఏమందు, ఈ మందునేమందు... మందు మహిమనేమందు, అమందానంద కందలిత హృదయారవిందుండనై ముందు మందు విందునందుకొందు' అనుకోకుండా ఉంటారా? ఒక్క మంత్రులనేముంది, మన నియోజకవర్గ ప్రయోజకులూ తక్కువేం కాదు. లోటాలకు లోటాలు తాగుతూ సామాన్యులు మందభాగ్యులవుతుంటే, వాటాలకు వాటాలతో ఈ అసామాన్యులు 'మందు'భాగ్యులవుతున్నారు. పరగణాలో మందుకొట్టు కనిపిస్తే చాలు, 'ముందు కొట్టు' అని మరీ దండుకొంటున్నారు. వీరి వెనకే అధికారుల బారులు, పోలీసుల బాసులు, ప్రముఖుల గోముఖులు కూడా సిద్ధం. ఈ మత్తుకు బానిసైనవారి జాబితా తయారు చేస్తే- అందులో ముందుగా ప్రస్తావించాల్సింది ప్రభుత్వాన్నే! వేలకోట్ల ఆదాయం ఖజానాలో జమ అయితేనే కదా, జనాకర్షక పథకాల జమానా ముందుకెళ్లేది?

ఇంతమందికి ఇన్ని వాటాలు వేసేది సామాన్యుడి జేబులో చిల్లర పైసలతోనే. కాయకష్టం చేసి, కాసిని కాసులు జేబులో వేసుకున్నాడో లేదో- కుడివైపు గలాసు ఘల్లుమంటోంది. ఎడమవైపు సీసా రాగాలు పోతోంది. గుడి పక్కనుంచైనా, బడి పక్కనుంచైనా తల తిప్పితే చాలు, వ్యసనానందం వల వేస్తోంది. 'రావోయి మా కొట్టుకి ఓరయ్యో... మందున్నది అందుకొమ్మన్నది...' అంటూ ఊరిస్తోంది. అతడి నాలుక తడిస్తేనే కిందనుంచి పైదాకా నేతల చేతులు తడుస్తాయి. ఊరింపునకు లోబడి అటుకేసి అడుగులేశాడా- అమ్మాల్సిన ధరకన్నా అధిక మొత్తం సమర్పించుకోవలసిందే. అదేంటని అడిగితే చెప్పే నాథుడు లేడు.

అధికారైనా, అమాత్యుడైనా అందులోంచి పిండుకునేవాళ్లే కాబట్టి నోరెత్తేందుకు లేదు. నిబంధనలన్నీ నిషాలో తూగుతుంటాయి. దిక్కులు చూస్తే కిక్కు పోతుంది. ఏటా వేలకోట్లు కురవాలన్నా, వ్యాపారంలో పెట్టుబడికి అనేక రెట్లు రాబట్టాలన్నా 'మత్తు'ను వదలకూడదు. కాబట్టే కళ్ల ముందు కేటులున్నా, సిండికేటులున్నా మందు పొరలు కమ్మేసి ముందుచూపు ఆనట్లేదు. ఏబీసీడీ అంటూ ఏసీబీ ఎన్ని పేర్లు బయటపెట్టినా, సర్కారువారి నర్సరీ బడిలో 'జానీ జానీ... ఎస్‌ పాపా... ఈటింగ్‌ సుగర్‌... నో పాపా!' అనేసి సరిపెట్టేస్తారు.

అసలు అన్నింటికన్నా పెద్ద మత్తు- అధికారం! ఆ కిక్కు ఎక్కితే దిగదు. దిగనివ్వదు. అధికారం అందలం ఎక్కించగానే, బుద్ధి బురదగుంటలోకి లాగుతుంది. అది లేనప్పుడే ప్రజల కష్టాలు కళ్లకు ఆనతాయి. కాళ్లకు బలపాలు కట్టి తిరగమంటాయి. కనిపించిన ప్రతివాణ్నీ వాటేసుకుని బావురుమని ఏడవమంటాయి. వాడు ఏడవకపోయినా ఓదార్చమంటాయి. చేతులూపినా, చెక్కిళ్లు తుడిచినా, చేతిలో చెయ్యేసినా- అంతా అధికార మత్తు కోసమే! సూదిలాంటి సమస్య కూడా గునపంలా కనిపిస్తుంది. ఆ సమయంలో కళ్ల డాక్టరుకి చూపించుకుంటే 'ఇవి కళ్లా, మైక్రోస్కోపులా?' అని కిందపడిపోతాడు. అదే కుర్చీ ఎక్కితే కొండలాంటి సమస్యలైనా గులక రాళ్లలా ఆనతాయి. మళ్ళీ కళ్లు చూపించుకుంటే అవి టెలిస్కోపులా మారిపోయి ఉంటాయి. చూపులు పక్కదారి పడతాయి. సమస్యల పేరుచెప్పి సొమ్ము మళ్ళించే పథకాలను రచించమంటాయి.

నోరు 'జనం...జనం...' అన్నా, మనసు 'మనం...మనం...' అంటుంది. సొంత వ్యాపారాల్ని ఉరకలెత్తిస్తుంది. ఓట్ల పథకాలకు ఓనమాలు దిద్దిస్తుంది. బడ్జెట్‌ అంచనాలు పెంచేయమంటుంది. పన్నుల పరిధి విస్తరించమంటుంది. అంకెల గారడీ చేయమంటుంది.

అధికార మత్తు కమ్మేసినవారికి అసెంబ్లీ అయినా, పార్లమెంట్‌ అయినా ఒకటే. గెలిచి సభలోకి వెళ్లి కూర్చున్నాక వలువలు ఊడిపోయిన విలువలు సెల్‌ఫోన్లలో వీడియోలు చూపిస్తాయి. అవకాశం వస్తే చాలు అరిషడ్వర్గాలు అసభ్య నర్తనం చేస్తాయి. సమస్యలన్నీ సర్కారు సొమ్ముకు గీటురాళ్లుగా కనిపిస్తాయి. కళ్లముందు కుంభకోణాలు కరాళ నృత్యం చేస్తున్నా- సంకీర్ణ ధర్మం మౌనం మత్తులో మునిగిపోతుంది. తెరవెనక చేయి తోలుబొమ్మలాట ఆడిస్తుంటే, వికృత పాలన తైతక్కలాడుతుంది.

ఇన్ని మత్తుల మధ్య జనం ఉన్మత్తులై ఆశల మత్తులో జోగుతుంటారు. దానాదీనా ఎవరి దగ్గరకు వెళ్లి 'మత్తు వదలరా... నరుడా!' అని ఎంత తత్వం పాడినా ప్రయోజనం ఉండదు. ముందుగా ఈ తత్వం ఒంటపట్టించుకుంటే మంచిది. మనం కూడా గమ్మత్తుగా పడి ఉండవచ్చు.

PUBLISHED IN EENADU ON 21.2.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి