శుక్రవారం, సెప్టెంబర్ 11, 2026

ఉప్పు అప్పులో అమ్మ రహస్యం


మా అమ్మ ఇరుగుపొరుగు వాళ్లను తరచూ "ఉప్పు" అడిగేది...

మా ఇంట్లో ఎప్పుడూ బోలెడంత ఉప్పు ఉండేది. అయినా సరే... ఎవరి  దగ్గరైనా "ఉప్పు" అడుగుతూనే ఉండేది.

చిన్నప్పటి నుంచి అది నాకు అస్సలు అర్థం కాకపోయేది.

‘ఇంట్లో "ఉప్పు" ఉండగా, మళ్లీ ఎందుకు అడుగుతోంది?’ అని చాలాకాలం ఆలోచించేవాడిని.

ఒకరోజు ఇక ఆగలేక అమ్మనే అడిగేశాను. అమ్మ నవ్వుతూ చెప్పింది...

‘‘మన దగ్గర ఉప్పు లేదని అడగడం కాదు నాన్నా... మన పొరుగింటి వాళ్ల దగ్గర "డబ్బు" కాస్త తక్కువ.  వాళ్లకు ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా! మన దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. నేనూ సంతోషంగా ఇస్తుంటాను. కానీ! ఎప్పుడూ, మనమే ఇస్తూ ఉంటే...వాళ్లకు తెలియకుండానే,  మనం తీసుకునే వాళ్లం... వాళ్లు ఇచ్చేవాళ్లు అనే చిన్న న్యూనతా భావం కలుగుతుంది. అందుకే... నాకు అవసరం లేకపోయినా, వాళ్ల దగ్గర ఏదో ఒకటి అడుగుతుంటాను. ఉప్పు కావచ్చు...పంచదార కావచ్చు... ఇంకేదైనా కావచ్చు.అలా అడగడం ద్వారా! వాళ్లకు ఒక విషయం గుర్తు చేస్తుంటాను...మీరు కూడా మాకు అవసరమే... మా జీవితంలో మీకూ, ఒక స్థానం ఉంది అని.

వాళ్లు మన దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడల్లా; మనం వాళ్లకు ఋణపడి ఉన్నాం అనే భావనకలగ కూడదు.వాళ్లు కూడా మనకు ఏదో ఒకటి ఇస్తున్నారు... మనకు కూడా, వాళ్ల అవసరం ఉంది... అనే ఆత్మగౌరవం వాళ్లలో ఉండాలి’’

అమ్మ అడిగింది "ఉప్పు" కాదు...

ఒక మనిషి "మనసును.

అమ్మ చేతిలోని ఆ చిన్న గిన్నె "ఉప్పు" వెనుక ఇంత పెద్ద "మనసు" దాగి ఉందని అప్పుడు మొదటిసారి తెలుసుకున్నాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి