సోమవారం, జనవరి 01, 2024

ఆటవిక ఆట వికట!


 

''కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు...

పట్టు పట్టు గెలుపునే పట్టు...

పదపదా ఇది మన సమయం పదా...

కదకదా  ఇది మన ఆట కదా...''

... హుషారుగా పాట పాడుకుంటూ వచ్చిన శిష్యుడిని ఎగాదిగా చూశారు గురువుగారు.

''ఏంట్రా? నాలుగు రోజుల్నుంచి అయిపూ, అజా లేవు. ఎక్కడికి పోయావ్‌?''

''ఎక్కడకేంటండి బాబూ! ఊరూ వాడా ఒకటే సందడండి. అందరూ ఆటల మీద పడ్డారండి. అబ్బో... ఎంత కోలాహలం? ఎంత హడావుడి? అధికారులని కాదు, నాయకులని కాదు అందరూ మైదానాల్లోనే కనిపిస్తున్నారండి. స్వయంగా ముఖ్యమంత్రిగారు క్రికెట్‌ ఆడారండీ బాబూ! పైగా ఆయన ఆడ్డమే కాదండి... ఆటల మంత్రికి బ్యాటెలా పట్టుకోవాలో దగ్గరుండి మరీ చూపించారండి... భలే సరదాగా ఉంది లెండి...''

''అంటే అవన్నీ చూస్తూ రాజకీయ పాఠాల సంగతి మర్చిపోయావన్నమాట. అంతేనా?''

''రాజకీయ పాఠానికేముందండీ? ఎప్పుడైనా నేర్చుకోవచ్చండి. కానీ ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ వస్తుందేంటండి? అందుకే మీరేమనుకున్నా సరేనని మైదానాలట్టుకుని అలా పోయానండి...''

''అయితే ఇక అట్నుంచటే ఉడాయించలేకపోయావ్‌? మళ్లి ఇటెందుకొచ్చావ్‌?''

''అయ్‌బాబోయ్‌! అలా కోపగించుకోకండి. ఎప్పటికైనా రాజకీయాల్లో రాటుదేలాలనే కదండీ మీ దగ్గర చేరింది? ఏదో ఎక్కడ చూసినా పాటలూ అవీ పెట్టి ఊదరగొడుతుంటే వెళ్లొచ్చానండి. కరపత్రాలు గట్రా పంచుతూ రారమ్మంటుంటే బాగోదని బయల్దేరానండి...''

''సరేలే. ఇంతకీ నువ్వు గమనించిందేంటో చెప్పు చూద్దాం?''

''అబ్బో... ఏం చెప్పనండి బాబూ? ఇది అలాంటిలాంటి కార్యక్రమం కాదుటండి. దేశ చరిత్రలోనే మైలు రాయంటండి. అసలింత వరకు ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదుటండి. ఇక మన రాష్ట్రం పేరు సువర్ణాక్షరాలతో రాసేసుకోవచ్చుటండి. రాబోయే కాలంలో ఇహ చూస్కోండి, నా రాజా... ఇండియన్‌ క్రికెట్‌ టీం నిండా ఆంధ్రా వాళ్లే ఉంటార్టండి.  ఒలింపిక్స్‌లో గోల్టు మెడల్స్‌ బోల్డు వచ్చేస్తయంటండి. ఇంటర్నేషనల్ గేమ్స్‌ లో ఇక మనకి తిరుగుండదటండి. మీరేమైనా చెప్పండి గురూగారూ, మన ముఖ్యమంత్రికి మాత్రం భలే ఆలోచన వచ్చింది కదండీ. ఏమంటారు?

''నేనేమనడానికేముందిరా. అన్నీ నువ్వే అంటున్నావు కదా? మరి ఇంత అద్భుతమైన ఆలోచనతో మన క్రీడలకి పదును పెడుతున్న సీఎం గారికి ఓ మంచి బిరుదు ఇవ్వద్దురా? ఆ సంగతి ఏమైనా ఆలోచించావా?''

''అవునండోయ్‌, నిజమే. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మీరు కూడా సమయానుకూలంగా బాగా సూచిస్తారండి...''

''మరయితే ఆ బిరుదేంటో ఆలోచించు ముందు. తర్వాత నేర్చుకుందువుగాని రాజకీయ పాఠాలు...''

''అలాగేనండి. ఆ... ఖేల్‌ రత్న?పోనీ... క్రీడారంగ మార్తాండ?  ఆటల చక్రవర్తి? కేళీ విలాస దురంధర? క్రీడాంగణా ధురీణ? ఏమో సార్‌... నాకు తట్టడం లేదు. మీరే చెబుదురూ?''

''ఆటలో అరటి పండు!''

''అయ్‌బాబోయ్‌... అదేంటండీ అలాగనేశారు? ఇది వెటకారమా? వెక్కరింపా? ఆయనంత కష్టపడి క్రీడాకారుల్ని పట్టుకుని, ప్రోత్సహించి, రాటుదేల్చి, క్రీడాస్ఫూర్తిని రంగరించి, నూరిపోసి, క్రీడల్ని ఉద్ధరించి, ఊరేగించి... రాష్ట్రానికి మంచి పేరు తెద్దామని తెగ ఆరాట పడుతుంటే మీరిలాంటి బిరుదు ఇస్తానంటారేంటండీ?''

''ఓరెర్రెదవా... ఈ బిరుదు ఆయనకి కాదురా, నీకు!''

''నాకాండీ? నేనేం చేశానండీ?''

''ఒక్క నీకే కాదురోయ్‌. మొత్తం జనాలందరికేననుకో...''

''అదేంటండి బాబూ? అయినా జనాలేం చేశారండీ?''

''పాపం వాళ్లేం చేయలేదురా. ఆయనే అందరినీ ఆటలో అరటి పళ్లు చేసేశాడు. అర్థమైందా?''

''ఏంటో సార్‌! మీ మాటలన్నీ మతలబుగా ఉంటాయి. కాస్త తేలిగ్గా చెబుదురూ?''

''అసలు ఆటలో అరటి పండు అంటే తెలుసురా? ఆడ్డం రాని వాడినీ, అయినా ఆటలోకి తెలియకుండా వచ్చిన వాడినీ, ఏమీ తెలియకపోయినా ఆడేస్తున్నవాడినీ, ఆడే వాళ్ల వెనక పరిగెత్తడం తప్ప ఇంకేమీ చేతకాని వాడినీ... ఇలా రకరకాల అర్థాల్లో దీన్ని వాడతార్రా. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఆంధ్రా వాళ్లంతా ఆటలో అరటి పళ్లయిపోయారన్నమాటే...''

''మొత్తానికి నన్ను మాటల్లో పెట్టి రాజకీయ పాఠం మొదలెట్టేశారని అర్థమైంది గురూగారూ. మరయితే చెప్పండి, మన ముఖ్యమంత్రిగారు ఇలా ఆటల పోటీలు పెట్టడం తప్పంటారా?''

''ఒరే బడుద్ధాయ్‌! ఇలా కొన్ని ప్రశ్నలు నేరుగా అడక్కూడదురా. ఇది రాజకీయాల్లో మొదటి పాఠం. ఒకవేళ నీలాగా ఎవరైనా అడిగినా సూటిగా జవాబు చెప్పకూడదు. ఇది రాజకీయాల్లో రెండో పాఠం. ఇక ఆంధ్రాలో ఆటల దగ్గరకి వద్దాం. ముఖ్యమంత్రిగారు తలపెట్టింది అలాంటిలాంటి కార్యక్రమమా చెప్పు? ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా వంద కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి, ఊరూ వాడా, పల్లెపల్లెల్లో, గ్రామగ్రామాన ఆటల పోటీలు పెట్టి వాటి ద్వారా జనాల్లో నిద్రపోతున్న క్రీడాకారుల్ని ఉన్నట్టుండి తట్టి లేపాలనే ఆలోచన ఉంది చూశావూ? మహ భేషైనదిరా. ఈయన కుర్చీ ఎక్కి నాలుగున్నరేళ్లయినా ఇంత వరకు ఆవులిస్తూ కూర్చుని, తీరా ఎన్నికలకు ముందు మూడు నెలలయినా లేని సమయంలో ఇంత హడావుడి చేస్తున్నందుకు ఎంత మెచ్చుకుంటే మాత్రం చాలుతుందిరా? ఆటలాడ్డం చక్కని వ్యాయాయమని, అందువల్ల ఆరోగ్యం వెల్లివిరుస్తుందని, జనాలందరూ తమ సమస్యలన్నీ మర్చిపోయి మైదానాల్లో పడి ఆడుకుని ఆనందించాలని, ఆటలు చూసి మైమరిచిపోవాలని తెగ ఆరాట పడుతున్న ఆయన అనితర సాధ్యమైన ఆశయాన్ని పొగడడానికి అసలు మన తెలుగు భాష సరిపోతుందిరా? అసలిది ఆటలాడుకునే కాలమా, కాదా, అందుకు అనువైన వాతావరణం ఉందా, లేదా అని కూడా చూడకుండా ఆయన పడుతున్న తాపత్రయానికి విలువగట్టగలవురా? ఓ పక్క పెద్ద పరీక్షలు ముంచుకొస్తుంటే, పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఆరాట పడుతుంటే, కొండల్లాంటి కోర్సులు పూర్తికాక విద్యార్థులు కిందా మీదా పడుతుంటే, అవేమీ పట్టించుకోకుండా వాళ్లలో అణగారిపోయి పడున్న క్రీడాసక్తిని మేల్కొలపాలనే ఆయన ఉద్దేశానికి ఎలా జోహార్లు అర్పించాలో తెలుస్తుందిరా మనకి? ఒకొక్క సచివాలయం పరిధిలో కనీసం 250 మంది ఆటలాడే వాళ్ల పేర్లని నమోదు చేయాలని అటు అధికారుల్ని, ఇటు అనుచరుల్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన చిత్తశుద్ధిని శంకించగలమట్రా? ఆటగాళ్ల పేర్లని నమోదు చేయని ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడకుండా, వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మరీ ఆటల అభివృద్ధికి పాటు పడుతున్న ఆయన తపనని కాదనగలమా? చదువులు చట్టబండలై, పరిశ్రమలు పలాయనం చిత్తగించిన పరిస్థితుల్లో యువతీయువకులందరూ పట్టాల కోసమో, పొట్ట కోసమో, ఉన్న ఊరు వదిలి వలసపోయాక...  ఏ గ్రామంలో చూసినా నాలుగు పదులు దాటిన నడివయసు వారో, వృద్ధులో మాత్రమే ఉన్నా సరే... ఆటలు సాగాల్సిందేననీ, ఆడేవాళ్లని తీసుకు రావలసిందేనని హుకుం జారీ చూసి ముందుకు సాగుతున్న ఈయన పట్టుదలను మెచ్చుకోకుండా ఉండగలమట్రా? ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో, ఆ తర్వాత ఉంటామో ఊడతామో కూడా తెలియక పోయినా సరే... జనంలో క్రీడాసక్తిని రగిలించాలని ఆయన పెట్టుకున్న లక్ష్యం ఎంత మహత్తరమైందో చెప్పగలువురా? ఈ లక్ష్య సాధన కోసం ఇంటింటి సర్వేలు చేయిస్తూ, గడపగడపకీ కరపత్రాలు పంచిపెడుతూ, ప్రచారంతో హోరెత్తిస్తూ, యువకులు ఎవరూ ముందుకు రాకపోయినా సరే... వెనకాడకుండా ఆఖరికి డ్వాక్రా మహిళల్ని, పొదుపు సంఘాల వారిని, చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులని కూడా బలవంతంగా తీసుకొచ్చి... ఆడి తీరాల్సిందేనని బెదిరిస్తూ, దేబిరిస్తూ క్రీడా విన్యాసాలు చేయిస్తున్న ఆయనగారికి ఏ బిరుదిస్తే మాత్రం చాలుతుందిరా? ఇదంతా ఎన్నికల స్టంటనీ, పేరుకుపోయిన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే దుష్ట ప్రయత్నమనీ విమర్శలు గుప్పిస్తున్నా పట్టంచుకోకుండా, ఒకటా... రెండా... ఏకంగా15 వేల సంచివాలయాల పరిధిలో ఆటల పోటీలు సాగాల్సిందేనని పట్టుదల పట్టి అను కున్నది ఆగకుండా చేసేస్తున్న ఆయన దూకుడుకి జోహార్లప్పించడం తప్ప, ఇక ఎవరైనా చేసేదేముందిరా? అలాగని అన్ని చోట్లా సరైన ఆట స్థలాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా, 5 వేలకు పైగా గ్రామాల్లో అసలు ఆడుకునే మైదానాలే లేకపోయినా ఖాతరు చేయకుండా, అసలు స్కూళ్లలో ఆటల మాస్టార్లు లేకపోయినా సరే, ఏకంగా 3వేల పీఈటీ పోస్టులు ఖాళీగా పడేడుస్తున్నా సరే, వాటిని నింపాలనే ధ్యాసే లేకుండా... 'నేను ఆడుకోవాలని చెబితే ఆడి తీరాల్సిందే ఖబడ్దార్‌' అన్నంత లెవెల్లో క్రీడల పునరుద్ధరణకు అకస్మాత్తుగా కంకణం కట్టుకున్న సీఎంగారి చిత్తశుద్ధిని కొలవడానికి ఏ కొలమానాలు సరిపోతాయిరా? ఆడ్డానికి పిల్లలు రావడం లేదన్నా వినకుండా, అరకొరగా వచ్చిన పిల్లల చేత ఆడించడానికి ఎంపైర్లు కూడా లేరు మొర్రో... అని అధికారులు మొత్తుకుంటున్నా, సొంత సైన్యంగా ప్రతి పనికీ వాడేసుకుంటున్న గ్రామ వాలంటీర్లే న్యాయనిర్ణేతలంటూ తీర్మానించి, జగమొండిగా జనం చేత ఆడిస్తూ,  జనంతో ఆడుకుంటున్న ఈ అపర క్రీడోద్ధారకుడి అసమాన విన్యాసాలని బిత్తరపోయి చూస్తూ మూర్చపోవడం తప్ప ఇక ప్రజలకిక వేరే దారేదిరా? ఆటస్థలాలు లేక ఇంటి స్థలాల లేఔట్లలో, ఇసుక గుట్టలు, కంకర రాళ్ల మధ్య, ఓ పక్క పందులూ గేదెలూ తిరుగుతుంటే, వాటి మధ్యనే సందు చూసుకుని ఆడేసుకోవాలంటున్న మీ అధినేత అసమాన, అనితర సాధ్య, అసాధ్య, అసంబద్ధ విధానాలకు విస్తుపోవడమే కదరా, ఇక నీకూ నాకూ నీ పరగణా ప్రజలకీ మిగిలింది? ఆడించమంటున్నాడే తప్ప అందుకు తగ్గ నిధులు విడుదల చేయడం లేదంటూ అధికారులు తలలు పట్టుకుని మొత్తుకుంటున్నా వింటున్నాడా మీవాడు? మా చేత అడ్డమైన పనులూ చేయించుకుంటున్నారంటూ ఆఖరికి వాలంటీర్లు కూడా అడ్డం తిరిగితే ఆగుతున్నాడా మీ నేత? సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా ఆటలకి దూరం జరిగి బహిష్కరిస్తున్నా ఖాతరు చేస్తున్నాడ్రా  మీ అగ్రజుడు?  విధిలేక చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులని కూడా బతిమాలి ఆడిస్తూ, అవసరమైతే బస్సులు పెట్టి మరీ జనాన్ని మైదానాలకు తరలిస్తూ ఏదో కిందా మీదా పడి అయిందనిపిస్తున్న అధికారుల అవస్థలను పట్టించుకుంటున్నాడ్రా నీ పాలకుడు? మనమేం చేస్తే అదే ఘనకార్యమనుకుంటూ, దానికే ఘనంగా ప్రచారం చేసుకునే వైఖరితో ఈ ఆటల కోసం పంచిపెట్టిన పరికరాల మీద కూడా తన బొమ్మలు ముద్రించుకున్న మీ ఏలిక తెలివితేటలని అసలు అంచనా వేయగలంరా మనం? ఇక ఆ పరికరాలు సైతం నాసిరకంగా ఉన్నాయని అందరూ గగ్గోలు పెడుతున్నా చెవికెక్కించుకుంటున్నాడా? క్రికెట్‌ వికెట్లు పాతుతుంటేనే విరిగిపోతున్నాయంటున్నా, వాలీబాల్ నెట్ లు తొలి మ్యాచ్‌కే చిరిగిపోతున్నాయంటూ గోల పెడుతున్నా, పరికరాలన్నీ నాసిరకంగా ఉంటున్నాయని మొరపెట్టుకుంటున్నా సరే... ఏమాత్రం చలించకుండా ఆటలాడిస్తున్నాడు చూడు, ఇలాంటి మీ వాడి ముందు సర్కస్‌లో పెద్దపులుల్ని ఆడించే రింగ్‌ మాస్టర్‌ కూడా తీసికట్టే కదరా? ఏమంటావ్, ఏం మాట్లాడవేం?''

''ఇంకేం మాట్లడతానండీ బాబూ... దిమ్మదిరిగి పోతేను. అమ్మమ్మమ్మా... ఆటల వెనక ఇంత లోతు ఉందాండీ? ఛీ ఛీ.. ఇది పచ్చి రాజకీయ నికృష్ట ఆలోచన తప్ప మరేదీ కాదని ఇప్పుడర్థమైందండి. ఎన్నికల ముందు ఎలాగోలా యువతని ఆడించి నాలుగు ఓట్లు దండుకోవచ్చనే  నీచ తలంపండి. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించాలనే దుష్ట యోచనే కానీ, క్రీడాభివృద్ధి చేసే పద్ధతిది కాదని తేలిపోయిందండి. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాలం కాని కాలంలో ప్రజాధనాన్ని దుబారా చేయడానికైనా వెనకాడని తెంపరి తనమేనండి ఇది. పాపం... అమాయక జనాన్ని వెర్రి వాళ్లని చేయడమేనండి ఇదంతానీ...''

''ఓరి నీ ఆవేశంగూలా! ఆటల వెనుక అర్థాలు గ్రహించాలి కానీ, ఊరికే వాగకూడదురా బడుద్ధాయ్‌. అయినా జనాలేమన్నా వెర్రివాళ్లనుకుంటున్నావేంట్రా? నీ ఏలిక అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అడ్డదిడ్డంగా ఆడుతున్న ఆటలన్నీ చూస్తూనే ఉన్నార్రా. అసలాటేంటో వాళ్లు మూడు నెలల్లో మొదలెడతారు. జనం ఓటుని స్పిన్‌ చేసి బౌలింగ్‌ చేస్తే మీవాడి వికెట్లు విరిగి అవతల పడతాయ్‌. ఓటు బ్యాట్‌ పైకెత్తి షటిల్‌ సర్వీసు చేస్తే కాక్‌ కకావికలైపోతుంది. ఆడింది ఇక చాల్లే అని ఓటర్లు ఖోఖో చెప్పారనుకో, అధినేత అనుచరులంతా కోర్టు బయటకెళ్లి నుంచో వలసిందే. ఒకొక్క ఓటరూ కూత పెట్టి కబడ్డీ ఆడితే మీ వాడి జట్టంతా ఔటయి చిత్తయిపోతారు. ఓటుని జనం పైకెగరేసి వాలీబాల్‌షాట్‌ లా కొట్టారనుకో నెట్‌ చిరిగిపోయి మరీ పాయింట్లు మారిపోతాయ్‌. తిక్కరేగిన ప్రజలు రెచ్చిపోయి ఫుట్‌బాల్‌ ఆట మొదలెట్టారనుకో, ఏలుతున్న వాళ్లంతా గోల్లోకి పడి గోల పెట్టాల్సిందే. అసలైన ఎన్నికల ఆట ముందుంది. తెలిసిందా?''

''అదిరిపోయిందండి బాబూ! మీ దగ్గరకి రాకపోయుంటే అసలీ ఆటల్లో అంతరార్థం తెలిసేదే కాదు నాకు. మొత్తానికి గొప్ప పాఠమే చెప్పారండి...''

''మరయితే ఇప్పుడు చెప్పరా. మీ వాడికి ఎలాంటి బిరుదు సరిపోతుందో?''

''ఖేల్ ఖతం ఖల్నాయక... నీచ క్రీడా నికృష్ట... అనాగరిక ఆటల సార్వభౌమ... దుష్ట కేళీ దురంధర... అపర క్రీడా విధ్వంసక... అడ్డగోలు ఆటల నాయక... ఆటవిక ఆట వికట.... బాగున్నాయాండీ?''

''సెభాష్‌రా... మరి వచ్చేప్పుడు పాడేవే పాట... దాని బదులు సరైన పాట పాడుతూ పోయిరా...''

''కొట్టు కొట్టు ఓటుతో దెబ్బ కొట్టు...

పట్టు పట్టు దుష్ట నేత పనిపట్టు...

పదపదా ఇది ఓటరు సమయం పదా...

కదకదా ఇది ఎన్నికల కాలం కదా!''

-సృజన

PUBLISHED ON 1.1.2024 ON JANASENA WEBSITE

శుక్రవారం, డిసెంబర్ 15, 2023

సెక్రట్రీ ముందు చూపు!

 


''నమస్కారం సార్‌! ఊరి నుంచి ఇవాళే వచ్చానండి. మీరెలా ఉన్నారు?''

''రావయ్యా, సెక్రట్రీ! డ్యూటీలో చేరావన్నమాట. నాకేం బాగానే ఉన్నానయ్యా...''
''రాత్రిళ్లు నిద్ర పడుతోందాండీ?''
''ఆ... పడుతోందయ్యా''
''పీడకలలేమైనా వస్తున్నాయాండీ?''
''అబ్బే లేదే...''
''తిండి సయిస్తోందాండీ? సరిగ్గా తింటున్నారా?''
''ఓ... భేషుగ్గా...''
''మరి తిన్నది అరుగుతోందాండీ?''
''సుబ్బరంగానయ్యా...''
''మనసులో బెంగగా ఏమైనా ఉందాండీ?''
''లేదయ్యా బాబూ... అసలేంటి ఇన్ని ప్రశ్నలు?''
''అమ్మయ్య... పోనీలెండి. నేను ఊరెళ్లానన్నమాటే కానీ మీ మీదే గుబులండి...''
''వార్నీ... నీ స్వామి భక్తి తెలుసులే కానీ, ఎందుకంత గుబులు?''
''అదేనండి... పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూశారు కదండీ? అవి విన్న దగ్గర్నుంచీ మీమీదే ఆలోచనండి...''
''ఎందుకయ్యా? వాటి వల్ల మనకేంటి సమస్య?''
''కాదండి మరీ? అక్కడా ఇక్కడా ఉన్నది తెలుగోళ్లే కదండీ? ఇంచుమించు ఒకేలా ఆలోచిస్తారు కదండీ? అందుకనండి...''
''అయితే?''
''అదేంటండీ బాబూ! నెక్స్ట్‌ మనమే కదండీ?''
''ఓ.. అదా? ఇంకా టైముంది కదయ్యా?''
''ఎక్కడుందండి బాబూ! మహా అయితే వంద రోజులంతే కదండీ? మామూలుగా అయితే ఒక సినిమా వంద రోజులు ఆడితే గొప్పండి. కానీ వంద రోజుల తర్వాత మన సినిమా ఆడుతుందో లేదోనని సందేహమండి...''
''ఎందుకాడదయ్యా... మన సినిమా సూపర్‌ హిట్టు కదా?''
''అని మీరనుకుంటే సరిపోద్దేంటండి? జనం అనుకోవద్దూ?''
''ఎందుకనుకోరయ్యా... తాయిలాలు పడేస్తున్నాంగా?''
''అయ్యా... పొరుగు ప్రభుత్వం కూడా తాయిలాలిచ్చిందండి. కానీ ఏమైందండీ? జనం తాపీగా తప్పించలేదండీ?''
''ఊరుకోవయ్యా... నీవన్నీ పిచ్చి భయాలు. మనం మీట నొక్కి మరీ నే....ఏ...ఏ...రుగా డబ్బులేస్తుంటే అలా ఎందుకు చేస్తారు?''
''మీరు మీటలు నొక్కుతున్నారు సరేనండి. కానీ ఇప్పుడు మీటలు జనం దగ్గరకి వస్తున్నాయండి. మరి వాళ్లేం మీటలు నొక్కుతారోనని గుండెల్లో ఒకటే దిగులండి...''
''నేను నమ్ముకున్న నా వెర్రి జనం అలా చేయరు లేవయ్యా...''
''మీరు నమ్ముకున్నారు కానీండీ, జనం మిమ్మల్ని నమ్ముకున్నారో లేదోనండి...''
''ఏందయ్యో సెక్రట్రీ? వేళాకోళంగా ఉందా? వెర్రిమొర్రి ప్రశ్నలు వేస్తున్నావ్‌?''
''అయ్యా... మీరు కోప్పడినా సరేనండి. సెక్రటరీ అన్నాక అన్నీ చెప్పాలండి, అడగాలండి. ఆనక ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని నన్నడిగారునుకోండి, నేనేం చెప్పగలనండీ? అందుకే అడుగుతున్నానండి...''
''అందుకనేనయ్యా... నేను కూడా ఇంత వరకు నువ్వేమడిగినా ఊరుకున్నాను. అసలు ప్రశ్నించే వాళ్లంటే నాకు ఒళ్లుమంటని తెలుసు కదా? వేరొకళ్లయితే ఈ పాటికి ఏ రాజద్రోహం కేసో, అక్రమ సందేహాల కేసో బనాయించి రాత్రికి రాత్రి రిమాండుకి పంపించేసే వాడిని. అర్థమైందా?''
''అర్థం కాకపోవడానికేముందండీ? మీ వ్యవహారం అంతా మొదట్నుంచీ చూస్తున్నవాడినేగా? ఎన్ని కేసులు? ఎన్ని రిమాండులు? ఎన్ని సెక్షన్లు? ఎన్ని దౌర్జన్యాలు? మీరు తల్చుకుంటే కేసుల మీద కేసులు తిరగదోడి ఊపిరి సలపకుండా చేయగలరని తెలుసండి. మీ పార్టీ ఎంపీనే చీకట్లో కుళ్లబొడిపించి పంపించారండి. ఇక ఎగస్పార్టీ వాళ్ల పాట్లు చూస్తున్నా కదండీ? ఎన్ని ఆంక్షలు? ఎన్ని అవరోధాలు? ఎన్ని ఆటంకాలు? ఎన్ని దాష్టీకాలు? మీగ్గానీ తిక్క రేగిందంటే ఇతర పార్టీల వారి యాత్రలు సాగకుండా వంతెనలు మూసేయగల్రండి. రోడ్లు తవ్వేయగలరండి. రూట్లు మార్చేయగల్రండి. ఇనుప కంచెలడ్డేసి నిరసనల్నిఉక్కు పాదాలతో తొక్కేయగలరండి. ఆడోళ్లనయినా చూడకుండా ఈడ్చి అవతల పారేయించగల్రండి. అంత దాకా ఎందుకండీ? మీకు ఇష్టం కాకపోతే సొంత బాబాయినైనా సరే... సర్లెండి, గోడలకు చెవులుంటాయి. మీ లోపాయి కారీ లొసుగులన్నీ నాకు తెలిసినవే కదండీ?''
''మరింకేమయ్యా... మనకి ఎదురు లేదని అర్థమైందిగా? అయినా మీ బెంగలన్నీ అర్థం లేనివేనయ్యా. మనం అమలు పరుస్తున్న పథకాలేంటో తెలిసి కూడా కంగారెందుకయ్యా? అవన్నీ మన ఓటు బ్యాంకును కాపాడుకునేవేగా? అందుకనేగా, రాష్ట్రం అప్పుల పాలైపోతున్నా, జీతాలివ్వడానికి కూడా కటకటలాడిపోతున్నా... ఎక్కడా ఆగకుండా పథకాలకి డబ్బులు పారిస్తుంట? నవ రత్నాల్లాంటి పథకాల సంగతి తెలిసి కూడా నసపెడతావేంటయ్యా?''
''అయ్యా... మీ ధీమా చూస్తుంటే ఓ పక్క ముచ్చటేస్తున్నా, మరో పక్క భయమేస్తోందండి. మరి పొరుగు రాష్ట్రం నాయకుడు కూడా మీలాగే తెగ ధీమా ప్రదర్శించాడండి. వేరే వాళ్లకి ఓటేస్తే 'ఆగమాగం' అని భయపెట్టాడండి. కానీ జనం 'ఆగం ఆగం' అన్నారండి. అనుకున్నది చేసేశారండి. మరి అక్కడ కూడా పథకాలు లేవేటండి? ఆయన దళిత బంధు అన్నా, రైతు బంధు అన్నా... జనం మాత్రం ఆయన్ని రాబందు అనుకున్నారండి మరి. మీరు నే...ఏ...ఏ...రుగా డబ్బులేసేస్తున్నామంటూ మురిసిపోతున్నారండి. కానీ మీరు వేసే దాని కంటే వాళ్ల దగ్గర నుంచి మీరు లాక్కునేది అంతకు పదింతలని జనం పసిగట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయండి. ఆనక అనలేదంటారని ముందుగానే చెబుతున్నానండి మరి...''
''అబ్బబ్బబ్బ... సెక్రట్రీ, చంపుతున్నావయ్యా. చూస్తుంటే నీ మనసులో చాలా బెంగలే ఉన్నాయని అర్థమైంది కానీ, ముందు అవ్వేంటో ఏకరువు పెట్టు. ఆనక చెబుతాను నీకు జవాబు...''
''అలా అన్నారు కాబట్టి చెబుతున్నాను వినండి. మీరు వెనకా ముందూ చూసుకోకుండా దూకుడుగా దూసుకుపోయారని నా అభిప్రాయమండి. అందకందక అధికారం అందిందని అయినవాళ్లందరికీ అడ్డూ ఆపూ లేకుండా గేట్లెత్తేశారండి. వాళ్లేమో రాష్ట్రం మీద పడి ఎక్కడికక్కడ దోచేశారండి. మీకు రావలసింది మీకిచ్చాకే మేస్తున్నారు కదాని మీరు గమ్మునున్నారండి. ఆళ్ల మీద ఎవరైనా ఫిర్యాదు చేసినా, అలా చేసిన వాడి మీదే కేసులెట్టించి హడలుగొట్టించేస్తున్నారండి పోలీసులు. మీరు పోలీసు అధికారుల సలాములే చూస్తున్నారండి, కానీ వాళ్ల సివాళ్లేంటో జనం చూస్తున్నారండి. మీరు ప్రతి వ్యవస్థని ప్రక్షాళన చేసేశానని చెప్పేసుకుంటూ పొంగిపోతున్నారండి. కానీ జనం మాత్రం మీ వల్ల ప్రతి వ్యవస్థ నాశనమైందనుకుంటున్నారండి. జనం వైపు నుంచి చూస్తే, ఆళ్ల పిల్లల చదువులు చతికిలబడ్డాయండి. ఎలాగోలా చదువుకున్నా, తగిన ఉద్యోగాలు లేవండి. ఏదో ఒకటి చేద్దామనుకున్నా రాష్ట్రంలో కంపెనీలు లేవండి. ఇక ఉపాధి మార్గాలు కూడా మూసుకుపోయాయండి. మీకు మాత్రం కళ్లు మూసుకుపోయాయండి. విద్యా వ్యవస్థ ఇలా నాశనమైందాండీ, ఇక ఆర్థికంగా చూస్తే ఉద్యోగులకు ఎప్పుడు జీతాలొస్తాయో చెప్పలేని పరిస్థితండి. పాత బిల్లులు పాసవక కాంట్రాక్టర్లు పనులకు రావడం లేదండి. ఎక్కడి పనులక్కడ పడకేశాయండి. మీరు మాత్రం కునుకుతున్నారండి. ఊర్లలో పరిస్థితి మరీ ఘోరమండి. పంచాయితీల కాతాల్లో సొమ్ముల్ని మీరు కొబ్బరిబొండాన్ని స్ట్రాతో పీల్చుకున్నంత సులువుగా లాగేసుకుంటున్నారండి. దాంతో పాపం సర్పంచులు పారిశుధ్యం పనులు కూడా చేయించలేక పోతున్నారండి. ఆళ్ల అవస్థ చూస్తున్న ప్రతి గ్రామంలోని జనానికి మన పాలన తీరు అర్థం కాదని ఎలా అనుకుంటామండీ? ఇక రోడ్లండి. పెట్రోలు వాడుతున్న ప్రతి వాడి నుంచి లీటరుకింతని రోడ్దు సెస్సు కింద వేల కోట్లు ఖజానాకి జమవుతున్నాయి కదండీ? మరి ఒక్క రోడ్డు బాగుందేమో చూపించగలరాండీ? అబ్బే మీరు మాత్రం హెలీకాప్టర్‌లో ఊరేగుతున్నారండి. ఒకేల కారులో వెళ్లినా అంత వరకు ఆదరాబాదరా రోడ్డేసేస్తుంటే మీరు కుదుపులు లేకుండా సాగిపోతున్నారండి. కానీ జనం ఒళ్లు హూనమైపోతోందని మీకు మాత్రం తెలియడం లేదండి. ప్రజల కళ్ల ముందు మీ పార్టీ వాళ్లంతా కోట్లకి పడగలెత్తుతున్నారండి. ఇసుక నుంచి కాసులు పిండుకుంటున్నారండి. మద్యంతో మోతుబరులవుతున్నారండి. కొండలు తొలిచి కాతాలు పెంచుకుంటున్నారండి. గనులు తవ్వి గోతాలు నింపుకుంటున్నారండి. మీ వాటా మీకొస్తోంది కదాని మీరు మాటాడట్లేదండి. కానీ పాపం జనం మాత్రం అంతకంతకు అణగారుతున్నారండి. రైతులకు కిట్టుబాటు లేదండి. కూలీలకు పనుల్లేవండి. వృత్తులు పడకేశాయండి. ఇవన్నీ పక్కనబెట్టి శాంతి భద్రతల కేసి చూస్తే... మీరు శాంతిగానే ఉన్నారండి. కానీ జనానికి భద్రత లేదండి. ఆడాళ్లకి రక్షణ లేదండి. అట్టడుగు జనులపై అఘాయిత్యాలు పేట్రేగిపోతున్నాయండి. మరి ఇన్ని వర్గాల ప్రజలంతా పరిస్థితిని గమనించడం లేదంటారా చెప్పండి. మరి ఇంకా వంద రోజుల తర్వాత మన సినిమా ఆడుతుందనుకుంటే ఎలాగండీ?''
''స్టాపిట్‌... యూ... రాస్కెల్! ఎంత ధైర్యం నీకు? నా ముందు ఇంత వాగుతావా? నిన్నేం చేస్తానో చూడు...''
''హ...హ్హ...హ్హా! ఇక నువ్వేం చేస్తావయ్యా! వంద రోజుల తర్వాత నీ సంగతేంటో నేను ముందే పసిగట్టా. అందుకే నీ సినిమా ఏంటో నీకు చూపించా. ఇదిగో నా రాజీనామా. నీ సెక్రట్రీ కొలువుకి గుడ్‌బై!''
                                                                                                                               -సృజన

PUBLISHED ON 15.12.2023

సోమవారం, డిసెంబర్ 04, 2023

సకల రోగాల సర్కారు!



ప్రజా వైద్యశాల. అత్యవసర విభాగం. ఆదరాబాదరా ఓ రోగిని తీసుకొచ్చారు. ఊబకాయంతో బాధపడుతున్న ఆ రోగి ఆపపోపాలు పడుతున్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఉండుండి వెక్కుతున్నాడు. నర్సులు పరుగులు పెడుతూ స్ట్రెచర్‌ మీద తీసుకొచ్చారు. డాక్టర్లు హడావుడి పడుతున్నారు.

ఇదంతా చూస్తున్న ఓ సామాన్య రోగి పక్కాయన్ని అడిగాడు.

''ఎవరండీ పాపం... ఎవరో పెద్దాయనలా ఉన్నాడే?''

పక్కాయన నిదానంగా చెప్పాడు.

''ప్రభుత్వం!''

''ఏంటీ? ప్రభుత్వమే! అయ్యో పాపం... ఏమైంది?''

''బ్రెయిన్ డెడ్‌''

''అరెరె... అంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్టేనా?''

''దాదాపుగా అంతే. ప్రస్తుతానికి మెదడు పనిచేయడం లేదని అర్థం...''

''అయ్యో పాపం... బతుకడం కష్టమా?''

''అలాగే కనిపిస్తోంది. మహా అయితే మూడు నెలలంతే...''

''అరెరె... ఇంతలా ఎలా ముంచుకొచ్చిందో?''

''ఎలాగంటే ఏం చెబుతాం? అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవద్దూ? చేజేతులా చేసుకుని ఇప్పుడేడిస్తే ఏం లాభం?''

''ఇంతకీ సమస్యేంటో?''

''ఒకటంటే చెప్పవచ్చు. అన్నీ ఒకేసారి చుట్టుముట్టాయిట. ఇందాకా డాక్టర్లు రిపోర్టులు చూస్తూ మాట్లాడుకుంటుంటే విన్నా...''

''ఏంటవి?''

''కడుపులో అవినీతి గ్యాస్ పెరిగిపోయింది. ద్రవ్యోల్బణంతో గుండె దడదడలాడిపోతోంది. కుంభకోణాల కొవ్వు పెరిగిపోయి. ప్రజా నాడి బలహీనంగా కొట్టుకుంటోంది. ధరవరల రక్తపోటు పెరిగిపోయింది. తిండెక్కువై ఊబకాయం పెరిగిపోయింది. పాలన అడుగు తీసి అడుగు వేయలేక పోతోంది. నియంత్రణ చేయాల్సిన కాలేయం పనిచేయడం మానేసింది. అక్రమాల పొగ ఎక్కువై ఊపిరితిత్తులు మొండికేయడంతో ఊపిరాడ్డం లేదు. కీలక నిర్ణయాలు తీసుకోలేక కిడ్నీలు పాడయ్యాయి. ఆశ్రిత పక్షపాతం మధుమేహమై దేశాన్ని కమ్మేసింది. ముందుచూపు మసకేసింది. ప్రజల్లో వ్యతిరేకత సూచనలు పెరిగిపోయి నోరు కూడా పడిపోయింది. చేతుల మధ్య సమన్వయం కుదరక చేతలకు పక్షవాతం వచ్చింది...''

''ఇంతలా ఆరోగ్యం పాడవడానికి కారణమేంటిట?''

''ఏది పడితే అది అందినంత మేరకు మితి మీరిపోయి అక్రమంగా భోంచేయడమే...''

''ఎంత తింటే మాత్రం మరీ ఇలాంటి పరిస్థితా?''

''కాదు మరీ. అది మామూలు తిండా? అందక అందక అధికారం అదిందేమో కుర్చీలో కూర్చుంటూనే తీరాల్లో ఇసుకంతా బొక్కేశాడు. కొండలు కొల్లగొట్టి కూరొండుకుని తినేశాడు. భూములు భోంచేశాడు. గనులు గుటుక్కుమనిపించాడు. ఇవన్నీ చాలవన్నట్టు సారా కాంట్రాక్టులు కుదుర్చుకుని గటగటా తాగేశాడు. మద్యం అక్రమ వ్యాపారంతో పీపాలకు పీపాలు పీల్చేశాడు...''

''అమ్మో... అయిన వాళ్లెవరూ వద్దనలేదా?''

''అసలీ తిండిని అలవాటు చేసింది వాళ్ల నాన్నే. మొదట్లో ఆయనే అధికారంలో ఉండేవాడు. కొడుకంటే మహా గారాబం. దాంతో ఏది పెడితే అది కొనిపెట్టాడు. ఎవరే పని మీద వచ్చి తనను కలిసినా కొడుక్కి ఏదో ఒకటి పట్టుకు రమ్మనేవాడు. అలా చిన్నప్పుడే స్థలాల చాక్లెట్లు, భవనాల బిస్కెట్లు, లంచాల లడ్డూలు, బినామీ జిలేబీలు, షేర్ల జహంగీర్లు, కంపెనీల కరకజ్జాలు, వాటాల చిరుతిళ్లు అలవాటైపోయాయి. ఇక  అలాంటిది అధికార భోజనం లేకపోతే ఆగగలడా? అందుకోసమే జనాన్ని నమ్మించాడు. తనకు మద్దతిస్తే తాయిలాలు పెడతానని బుట్టలో వేశాడు. అందరికీ ఆకలి తీరుస్తానని ఆకట్టుకున్నాడు. జనం పాపం కాబోసనుకుని రమ్మన్నారు. అలా వచ్చినోడి ప్రభుత్వం ఇలా కాక ఎలా తయారవుతుంది?''

''మరి జనానికి ఇస్తానన్న తాయిలాలు ఇచ్చాడా?''

''ఇచ్చినట్టు భ్రమ కల్పించాడు. చేతిలో చాక్లెట్టు పెట్టి జేబు కొల్లగొట్టాడు. జనం కోసమే వంటలు వండిస్తున్నానని హంగామా చేసి వాళ్ల దగ్గరున్నది కూడా లాక్కుని చప్పరించాడు...''

''మరిలా చేయకూడదని ఎవరూ చెప్పలేదా?''

''నొల్లుకోడం అలవాటైన వాడు, నీతులు చెబితే వింటాడేంటి? అలా చెప్పిన వాళ్ల మీద కక్ష కట్టాడు. తన తిండి చూసి దిష్టి పెడుతున్నారని ఆడిపోసుకున్నాడు. వాళ్లని వెంటాడి వేధించి తరిమి కొట్టాడు. అడిగిన వాడిని ఆయాసపెట్టాడు. కాదన్నవాడిపై కస్సుమన్నాడు. అలా అధికార భోజనానికి ఎక్కడా ఆటంకాలు లేకుండా చేసుకుని మరీ అడ్డంగా ఆరగించాడు. మొత్తానికి రాక్షస ప్రభుత్వమన్నమాట. అలనాడెప్పుడో భారతంలో బకాసురడనే రాక్షసుడికి రోజూ బండెడు భోజనం సమర్పించుకుంటామని జనం ఒప్పందం చేసుకున్నట్టే అయిందన్నమాట ఆఖరికి జనం పరిస్థితి...''

''మరింతకీ జనానికి అర్థమైందా?''

''బాగా అర్థమైంది. అందుకే ప్రజా వైద్యశాలలో ప్రభుత్వం అత్యవసర విభాగానికి చేరింది. ఇక డాక్టర్లు ఎంత వైద్యం చేసినా ప్రజలు పెదవి విరిచేస్తున్నారు. అవినీతి కేన్సర్‌ ఆఖరి దశకొచ్చింది. అక్రమాల అల్సరు పెరిగిపోయింది. వైషమ్యాల విషం నరనరాల్లోకి పాకిపోయింది...''

''పరిస్థితి ఇంతలా విషమిస్తే ఇక కష్టేమలే. చేజేతులా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవరం మాత్రం ఏం చేస్తాం? ఏమంటావ్‌?''

''అంతేలే. అంతేలే!''

-సృజన

PUBLISHED ON 2.12.2023 on JANASENA WEBSITE