సోమవారం, మార్చి 18, 2013

అవినీతోపాఖ్యానం




చంచల్‌గుడా జైల్లో చంచలంగా పచార్లు చేస్తున్నాడు అక్రమార్కుడు. ఇంతలో కొందరు ఖైదీలు గుంపుగా దగ్గరకు వచ్చారు. వారిలో బలిష్ఠంగా ఉన్నవాడొకడు చటుక్కున వచ్చి అక్రమార్కుడి చేతులు పట్టుకున్నాడు.
'తప్పదు. కాదనకూడదు. నేను అఖిలాంధ్ర ఖైదీల అధ్యక్షుణ్ని. మన వాళ్లంతా మీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. తమరు ఒప్పుకోవాలి' అన్నాడు చొరవగా.

అక్రమార్కుడు మొహం చిట్లించాడు. 'ఉండవయ్యా! అసలే బెయిల్‌ రాక నేనేడుస్తుంటే సన్మానమేంటి మధ్యలో' అన్నాడు చిరాగ్గా.

'అమ్మమ్మా! ఎంత మాట. అసలు మీకు సన్మానం చేయడానికి కారణం అదే. మేమంతా చిన్నాచితకా దొంగతనాలు గట్రా చేసి వచ్చినోళ్లం. గబుక్కున చేసిందేదో రుజువైపోయి జైల్లో పడ్డాం. మరి మీరో? తమరి నేరాల చిట్టా ఓ పక్కన తేలేలా లేదు. ఒకదాన్ని లాగుతుంటే మరొకటి బయటపడుతోంది. అందుకే కాస్త పెద్ద మనసు చేసుకుని మా బోటివాళ్లకు కొన్ని చెడ్డ మాటలు చెప్పాలి. తప్పదు. పైగా మాకు ఓట్లు కూడా ఉన్నాయి' అన్నాడు ఖైదీల అధ్యక్షుడు.

ఆఖరి మాట అక్రమార్కుడికి బాగా నచ్చింది.

'ఏమిటో మీ అభిమానం మీరూను. సరే అలాక్కానీండి' అన్నాడు అక్రమార్కుడు.

* * *

మర్నాడు సభలో ముందుగా సభాధ్యక్షులు- 'వారు ఈ సన్మానానికి ఒప్పుకోవడమే మనందరి అదృష్టం. మన ఖైదీల్లో బాగా చదువుకున్నవారిని, కవుల్ని ఎంపిక చేశాం. వాళ్లిప్పుడు అక్రమార్కులవారిని వేదికపైకి ఆహ్వానిస్తారు' అన్నాడు.

వెంటనే కొందరు చెట్లకున్న ఆకులు తెంపి జల్లుతూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు.

'అగణిత అక్రమ వక్ర మార్గ వైతాళికా!
ద్విగుణీకృత దుశ్చరిత్ర దురంధరా!
చండ ప్రచండ నీచకృత్య నిర్నిరోధా!
బహుపరాక్‌... బహుపరాక్‌...'
అంటూ అక్కడున్న ఓ గట్టు ఎక్కించారు.

అధ్యక్షుడు గొంతు సవరించుకుని, 'దొంగల్లారా, నేరగాళ్లలారా! అక్రమార్కులవారు జైల్లో ఉన్నా బయటి నీచ రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. వారికి అనేక అత్యవసర అకృత్య కార్యకలాపాలు ఉన్నందున త్వరగా ముగించాలని కోరుతున్నాను' అన్నాడు.

వెంటనే ఓ ఖైదీ లేచి, 'ముందుగా నేనొక పద్యాన్ని ఆయన కోసం రచించాను' అంటూ మొదలు పెట్టాడు.

'చేత చిన్న ముద్ద చూపించి బులిపించి...
బంగారు భూముల్ని చుట్టబెట్టి...
సెజ్‌ తాయిలాలు సిరి దోచు పథకాలు...
కరకు నేతా! నిన్ను చేరి కొలుతు!'
ఖైదీలందరూ చప్పట్లు కొట్టారు.

ఆ ఖైదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, 'నేను బతికుండగా అనేక దోపిడిలు చేశాను. ఎన్నోసార్లు జైలుకు వస్తూ వెళ్తున్నాను. నేను చేసిన పనులు బయటపడినప్పుడు నాకెంతో సిగ్గుగా అనిపించేది. ఇప్పుడు ఈ అక్రమార్కులవారిని చూశాక నా భావాలెంత తప్పో తెలిసివచ్చింది. కోట్లు దోచుకుని కూడా ఈయనగారు సిగ్గనేది లేకుండా ఉండగలగడం అత్యద్భుతం. కోర్టుకు వెళ్లినప్పుడల్లా ఏదో ఘనకార్యం చేసినట్టుగా నవ్వుతుండటం ఆశ్చర్యకరం. ఇది మనలాంటి నీచులందరూ నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం' అన్నాడు.

తరవాత మరో ఖైదీ లేచి, 'నేను శ్రీమాన్‌ అక్రమార్కులవారికి ఒక కవితాంజలిని సమర్పించదలిచాను...' అంటూ గొంతు సవరించుకున్నాడు.

'ఎవ్వారి తరమవును ఈ వెధవ పనులు...
అవని నేరములందు అన్నిటను మిన్న...
అసురులైన ఈతీరు అందుటను సున్న...
అన్నన్న! ఇది కదా... అకృత్యమన్న!'

ఆపై అతడు తన ఉపన్యాసం కొనసాగిస్తూ, 'మనమందరం నీచమైన పనులుచేసి చెడ్డవాళ్లమని అనిపించుకున్నవాళ్లమే. కానీ ఈయన? పైకి మంచిగా కనిపిస్తూ, అందరికీ మంచి చేయడానికే తన అవతారమన్నట్టు నమ్మిస్తూ మనందరికన్నా ఎక్కువగా దోచారు. ఇంత దోచి కూడా జనానికి మేలు చేసినట్టు నమ్మబలుకుతున్నారు. ఆ నంగనాచి, నయవంచక నయావిధానాలను నేర్చుకోండానికి మనం ఎన్ని జన్మలెత్తాలో అర్థం కాకుండా ఉంది' అన్నాడు.

ఇలా కొందరు మాట్లాడాక అధ్యక్షుడు లేచి, 'ఇప్పుడు అక్రమార్కులవారు మనందరికీ నీచ నికృష్ట పనులు చేయడంలో ఎలాంటి నైపుణ్యం చూపించాలో వివరిస్తారు. శ్రద్ధగా విని మరింత చెడిపోవాలని కోరుతున్నాను' అన్నాడు.

నవ్వో, ఏడుపో తెలియని మొహంతో అక్రమార్కుడు లేచి, 'మీ అందరి అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి, నాకు తెలిసిన కొన్ని చెడ్డమాటలు చెబుతాను. ఇవాళ ఎంత దోచుకున్నావన్నది కాదు ప్రశ్న. రేపు ఎంత దోపిడి చేస్తామనేదే పాయింటు. మీరందరూ ముందుచూపులేని మామూలు, సాదాసీదా, అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా కోట్లకు కోట్లు దోచుకోవడానికి పథక రచన చేసిన నీచ రాజకీయవేత్తను. అన్నింటికన్నా పెద్దసంపద ప్రజాధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం కావాలి. అందుకు ముందుగా ప్రజల్ని నమ్మించాలి. నిజానికి అదొక కళ. అంత తొందరగా అలవడదు. ఒకసారి అధికారం అందాక అమాత్యుల నుంచి, అధికారుల నుంచి, అనుచరుల నుంచి అందరికీ అవినీతి రుచి చూపించాలి. అదే నా కల. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా దోచాను. ఇవాళ జైల్లో ఉన్నా నాకు దిగులు లేదు. ఇది ఒకరకంగా ప్రజల్లో సానుభూతి కలిగించాలని ప్రయత్నిస్తున్నాను. నా కల నెరవేరితే మిమ్మల్నందరినీ విడుదల చేయిస్తాను. నా మంత్రివర్గ సహచరులుగా నియమించుకుంటాను' అంటూ ముగించాడు.

ఖైదీలందరూ ఆనందంతో చప్పట్లు మోగించారు. ఇంతలో పోలీసుల విజిల్‌ వినిపించడంతో అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

PUBLISHED IN EENADU ON 18.03.2013


శుక్రవారం, డిసెంబర్ 21, 2012

అద్దంలో అవినీతి కొండ...

అద్దంలో అవినీతి కొండ... 



'పందొమ్మిదొందల పద్దాలుగు... పందొమ్మిదొందల పదేను... పందొమ్మిదొందల...'
ఆగకుండా, ఆవేశంగా, అరుస్తూ అంకెలు లెక్కపెడుతున్న అప్పారావును అతడి భార్య పంకజాక్షి జబ్బ పుచ్చుకొని లాక్కొచ్చి, డాక్టర్‌ పిచ్చేశ్వరరావు ముందు కూలేసింది. అప్పారావు కూర్చుంటూనే బల్ల మీద ఉన్న మందుల చీటీ పుస్తకం తీసుకుని చకచకా నోట్లు లెక్క పెట్టినట్టు లెక్కబెట్టసాగాడు. నర్సు గబగబా వచ్చి అతడి చేతిలో పుస్తకం లాక్కుంది.

అప్పారావు 'కయ్యి...'మంటూ అరచి, 'ఛీ... నీ వల్ల లెక్క తప్పింది. మళ్ళీ మొదట్నుంచీ లెక్కెట్టాలి...' అంటూ పుస్తకం లాక్కుని, 'ఓట్రెండ్మూడ్నాలుగైదారేడు...' అంటూ లెక్కపెట్టసాగాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు అతడి వాలకాన్ని గమనిస్తూనే 'ఏమైందమ్మా?' అన్నారు పంకజాక్షితో.

పంకజాక్షి చీర చెంగుతో కళ్లొత్తుకుని ఓసారి చీది, 'ఏం చెప్పమంటారు డాక్టర్‌, పొద్దున్న పేపరు చూడగానే కెవ్వున కేకేశారండి. వంటింట్లోంచి పరుగెత్తుకు వచ్చి చూద్దును కదా, గాలిలో వేళ్లు తిప్పుతూ అంకెలు లెక్కెట్టడం మొదలు పెట్టారండి. ఇదేంటండీ అనడిగితే, లెక్క తప్పిందని మొదట్నుంచీ లెక్కలెడుతున్నారండి. ఈయన్ని మీరే కాపాడాలి...' అంది వెక్కుతూ.

'పేపర్లో ఏ వార్త చదువుతుండగా ఇలా జరిగిందో చెప్పగలవామ్మా?'

'ఆయ్‌... ఏదో నల్లధనం గురించండి. ముందు దాన్ని పైకి గట్టిగా చదివారండి. ఆ తరవాత అమ్మో... అమ్మో... అని గుండెలు బాదుకున్నారండి. వెంటనే ఓసారి ఏడ్చారండి. ఆపై పగలబడి నవ్వారండి. ఇహ అక్కడ్నుంచి ఇదండి వరస. వందలు, వేలంటూ లెక్కలెట్టేస్తున్నారండి. అదేదో పెద్ద సొమ్మంట గదండీ?'

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు నిట్టూర్చాడు. ఆపై చెప్పాడు, 'అవునమ్మా, మన దేశంనుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన నల్లధనం అది. ఏకంగా ఆరు లక్షల డెభ్ఫైమూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము. అది చదివే మీవారు షాక్‌కి గురై ఉంటారు...' అన్నాడు.

'అయ్యబాబోయ్‌ అంత సొమ్మాండీ? అదంతా ఉండుంటే ఎన్ని మంచి పన్లు చేయొచ్చోగదండీ...'

'అదే మన దేశ దౌర్భాగ్యం తల్లీ...'

'ఆ దౌర్భాగ్యం సంగతి సరేగానీ, ముందు నా సౌభాగ్యం సంగతి చూడండి డాక్టర్‌! ఈయన మళ్ళీ మన్లోకొస్తారంటారా?'

డాక్టర్‌ అప్పారావుకేసి చూశాడు.

'రెండొందలారు... రెండొందలేడు...' అంటున్నాడు.

అప్పారావు దగ్గరగా డాక్టరు వెళ్లి, 'నేను పొద్దున్నే లెక్క పెట్టేశా తెలుసా?' అన్నాడు.

'అవునా, ఎలా? అంత డబ్బు లెక్క ఓ పట్టాన తేల్తుందేంటీ? మీరు అబద్దాలాడుతున్నారు...' అన్నాడు అప్పారావు ఉక్రోషంగా.

'ఇదో పెద్ద డబ్బేంటి? ఇంతకన్నా ఎక్కువ డబ్బు చూపిస్తా. లెక్కెడతావా?' అంటూ డాక్టర్‌ ఓ మీట నొక్కాడు. వెంటనే ఆ గదిలో తెర మీద ఓ చిత్రం వచ్చింది. అందులో సముద్రంపై కాకి ఎగురుతోంది. అలా ఎగురుతూ అది రెట్ట వేసింది.

'నీకు ఏం కనిపించింది?' అని అడిగారు డాక్టర్‌.

'సముద్రంలో కాకిరెట్ట' అన్నాడు అప్పారావు.

'సరిగ్గా చెప్పావు. నువ్వు ఇందాకా లెక్క పెట్టిన డబ్బు కూడా అంతే' అంటూ మాటల్లో పెట్టి సూది మందు ఇచ్చాడు డాక్టర్‌.

అప్పటికి అప్పారావు దృష్టి మళ్లింది. నీరసంగా కూర్చుని 'అదెలా?' అన్నాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వరరావు చెప్పసాగాడు. 'చూడు అప్పారావ్‌, దేశంలో జరుగుతున్న కుంభకోణాల సంగతి మర్చిపోయావా? అధికారం ముసుగులో అవినీతి కథాకళి చూడటం లేదా? పదేళ్ల కాలంలో దేశంనుంచి తరలిపోయిన చీకటి డబ్బు చాలా విలువైనదే! కాదనను. కానీ మనదేశంలో ప్రజలిచ్చిన అధికారం అనుభవిస్తూ, దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడికి పాల్పడిన అవినీతి నేతల దారుణాల విలువ ముందు ఇదెంత? నువ్వన్నట్టు సముద్రంలో కాకిరెట్ట కాదూ? టూజీలో టక్కుటమారమైన కోట్లను లెక్కపెట్టగలవా? సీడబ్ల్యూజీ పేరు చెప్పి ఆటల్లో అరటిపళ్లుగా లాగించిన సొమ్మును సొమ్మసిల్లకుండా గణించగలవా? చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం కట్టిన నివాసాల్లోతిష్ఠ వేసిన చెదపురుగులు తినేసిన డబ్బుకు విలువ కట్టగలవా? ఆంధ్రా రాజావారి కుటుంబం ఆరగించిన లక్ష కోట్ల నిగ్గు తేల్చగలవా? దేశానికి అల్లుడైనా, రాష్ట్రంలో కొడుకైనా, తమిళ సీమ చెల్లాయైనా, కర్ణాటక సోదరులైనా ఎవరి వాటా ఎంతెంతో తేల్చి చూపగలవా? ఈ డబ్బంతా లెక్కపెట్టడానికి నీ జీవితం సరిపోతుందా చెప్పు?' అంటూ సముదాయించాడు.

అప్పారావు దిగాలుగా మొహం పెట్టి 'మరి ఈ దారుణాలను ఇలా కొనసాగనివ్వాల్సిందేనా? స్పందించే హృదయాన్ని బంధించి బతికేయాలా?' అన్నాడు.

డాక్టర్‌ అతడి భుజం తట్టి, 'చూడు అప్పారావ్‌, నీకు సామాజిక స్పృహ చాలా ఉంది. కానీ, ఇలా చీటికీమాటికీ తెలివి తప్పి ప్రవర్తించడం మాత్రం బాగోలేదు. నీ ఆవేశాన్ని సరైన దిశలోకి మళ్లించు. నీతిమాలిన నేతల పనిపట్టే సమయం వచ్చినప్పుడు వాళ్లకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండు' అన్నాడు ధైర్యం చెబుతూ.





PUBLISHED IN EENADU ON 21.12.2012

శనివారం, డిసెంబర్ 08, 2012

జైలే ఒక యోగం


జైలే ఒక యోగం 



'నమస్కారం గురూగారూ...'
'శీఘ్రమేవ కారాగారవాస ప్రాప్తిరస్తు!'

'అయ్యబాబోయ్‌, ఇదేం దీవెనండీ బాబూ? నేనేదో మీ దగ్గర నాలుగు రాజకీయ పాఠాలు నేర్చుకుని ఓ చిన్నపాటి నేతననిపించుకోవాలని తపిస్తుంటే, అంత మాటనేశారు!'

'భలేవాడివిరా, జైలుకెళ్లే యోగం అంత తొందరగా పడుతుందేంట్రా? అందుకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. లేదా ప్రస్తుత జన్మ వికృతం కావాలి. నీకది అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాలేమోనన్నదే నా బెంగ'

'ఏమిటో గురూగారూ, మీ మాటలోపట్టాన మింగుడు పడవు. కానీ, మీరు నా మంచి కోరేవారు కాబట్టి కాస్త వివరంగా చెబుదురూ'

'ఒరే, నీచ రాజకీయ నేతగా ఎదగాలనుకునేవాడికి జైలుకు వెళ్లడమనేది మహర్దశ లాంటిదిరా. ముందు ఈ పాఠం ఒంటపట్టించుకో'

'మీరెంత చెప్పినా నా మట్టి బుర్రకు ఎక్కడం లేదండీ. జైలుకెళ్లడమంటే ఎంత సిగ్గుచేటు, ఎంత తలవంపు? ఇక నలుగురిలో నవ్వగలమా, ఎవరినైనా పలకరించగలమా, మొహం చూపించగలమా, కళ్లలోకి సూటిగా చూడగలమా? ఇంటా బయటా నరకం కాదుటండీ?'

'అలాగంటావా? అయితే రేపట్నుంచి నా దగ్గరకి రాకు, సరేనా?'

'అంటే, రాజకీయ పాఠాలు అయిపోయాయాండీ? మీ దగ్గర పాసైపోయినట్టేనా? ఓ నేతగా ఎదగడానికి తగిన అర్హత సాధించినట్టేనా?'

'కాదురా సన్నాసీ, అడ్డంగా ఫెయిలైపోయావు. నేతగా ఎదిగే అవకాశమే నీకు లేదు. బయటికి పో!'

'గు... గు... గు... గురూగారూ! శాంతించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి'

'తప్పా? తప్పున్నరా? నీలాంటి మంచివాళ్ల మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు పట్టుకుంటాయి. సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటిసుగుణాలు నీలో ఇంకా ఏ మూలనో ఏడిశాయి. వాటిని చిదిమేస్తేనే కానీ నీచ రాజకీయాల్లో ఎదగలేవు. ముందు వాటిని వదిలించుకుని ఆనక వచ్చి అఘోరించు'

'అర్థమైంది గురూగారూ, పొరపాటున ఓ సాధారణ మనిషిలా ఆలోచించేశాను. దయచేసి పాఠం చెప్పండి. జైలుకెళితే కలిగే లాభాలేమిటో వివరించండి. నోరెత్తకుండా రాసుకుంటాను'

'అట్టారా దారికి, సమకాలీన రాజకీయ పరిణామాలు చూస్తూ కూడా పాఠాలు నేర్చుకోకపోతే ప్రజాసేవకు తప్ప ఇంకెందుకూ పనికి రావు. జైలు గేటులోంచి కాలు బయటపెడుతూ కూడా ఏమాత్రం ఆత్మన్యూనత కనబడనీయకుండా విశాలంగా నవ్వుతూ, పెద్ద ఘనకార్యం చేసినట్టు చేతులూపుతూ, ఘరానాగా కోర్టు వాయిదాలకెళ్లొస్తున్న నేతల్ని నిన్నా మొన్నా టీవీల్లో చూశావుగా? వాళ్లే నీకు ఆదర్శం! కాబట్టి, అలాంటి నేతగా ఎదగాలంటే ముందు నువ్వు మనిషిగా దిగజారాలి. అందుకు తగిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, కొంత సందేహం పీడిస్తోందండి. అరెస్ట్‌ చేశారంటే ఎంతో కొంత మనం చేసిన వెధవ పన్లు బయటపడినట్టే కదండీ? మరలాంటప్పుడు అన్నీ గమనిస్తున్న జనం మననెందుకు నమ్ముతారండీ? ఎంత సిగ్గు చిదిమేసుకుని చేతులూపినా నవ్వుకోరాండీ?'

'అదిగో మళ్ళీ సిగ్గు మాటెత్తుతావ్‌? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుగా లేదురా? నికార్సయిన నీచ నికృష్ట నేతగా ఎదిగిపోయాక ఇంకా సిగ్గేంట్రా, సిగ్గులేనెదవా? నువ్వు సిగ్గు పడాల్సింది సిగ్గులేని నేతగా ఎదగలేకపోయినప్పుడు మాత్రమే. అర్థమైందా?'

'సిగ్గొచ్చిందండి బాబూ సిగ్గొచ్చింది! ఇక సిగ్గు మాటెత్తితే ఒట్టు. కానీ జైల్లోకెళ్లి కూర్చున్నాక ఇక చేసేదేముంటుందండీ?'

'ఎందుకు ఉండదురా? నికృష్ట నేతకి అన్నీ అవకాశాలేరా! అసలు నిన్ను అరెస్టు చేయడమే నీచ రాజకీయమని గోల చేయవచ్చు. తడిగుడ్డతో గొంతులు కోయగలవాడివైనా సరే, నోట్లో వేలెడితే కొరకలేనంత అమాయకుడినని గొల్లుమనొచ్చు. కళ్లముందు కోట్లకు పడగెత్తినా సరే, ఎర్రని యాగానీ ఎరుగనట్టు యాగీ చేయవచ్చు. పేద ప్రజానీకానికి సేవ చేసేసి, వాళ్ల బతుకులెక్కడ బాగు చేసేస్తానోనని కిట్టనివాళ్లంతా కలిసి కాళ్లూ చేతులూ కట్టేసి లోపల పడేశారని మోరెత్తుకుని మరీ బుకాయించవచ్చు. జాలిగుండెలున్న జనం కరిగి నీరైపోయేలా సానుభూతి కోసం నీ తల్లినో, చెల్లినో, భార్యనో, బామ్మర్దినో యాత్రలకు పంపించవచ్చు. అసలు నీ అరెస్టంటూ జరిగి ఉండకపోతే జనమంతా ఈపాటికి కోటీశ్వరులైపోయేవారని వూరూవాడా హోరెత్తించవచ్చు. నిన్ను జైల్లో పెట్టడం మూలాన, రావలసిన స్వర్ణయుగం సరిహద్దుల్లో ఆగిపోయిందని భ్రమ కలిగించవచ్చు. పనిలో పనిగా ఎదుటి పార్టీల్లోని వాళ్లకి, నువ్వు అడ్డంగా దోచుకున్న ప్రజాధనంలో ఓ అర పైసా వాటా బయటికి తీసి ఎరలేయవచ్చు. అదిగదిగదిగో అన్ని పార్టీలవాళ్లూ నీకేసి వెనకా ముందూ చూడకుండా దూకేసి కాళ్లుచేతులు విరగ్గొట్టుకుంటున్నారని వూదరగొట్టొచ్చు. బుర్రకెక్కిందా?'

'ఎక్కిందండి. మరంతగా ఎదగడానికి ఏం చేయాలండీ?'

'అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. చట్టంలో లొసుగులు ఉపయోగించుకోవాలి. ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తూ జనం జెల్ల కొట్టాలి. ఖజానా కొల్లగొట్టి కోట్లకి పడగెత్తాలి. ఇన్ని చేసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు నీతికబుర్లు చెప్పే ఆత్మస్త్థెర్యాన్ని పెంచుకోవాలి'

'ఆహా, ఎంత బాగా చెప్పారండీ! నేనిక ఎన్ని వెధవ పన్లు చేసి, ఎంత తొందరగా జైలుకెళ్లి మీ పేరు నిలబెడతానో మీరే చూద్దురుగాని!'

'శెభాష్‌, అదేరా నువ్వు నాకిచ్చే గురుదక్షిణ, వెళ్లిరా!'


PUBLISHE IN EENADU ON 7.12.2012

శనివారం, నవంబర్ 24, 2012

 కృ ష్ణం వందే జగద్గురుం


నిర్మలమగు నా మానస సరసిని...

విషము చిమ్ము కాళింది శిరసిపై...

దివ్యమైన నీ పాదము మోపగ...

అంతరించె నా మోహము వింతగ!


పిశాచాల సందేహం


పిశాచాల సందేహం

విద్యాధర పురానికీ, వైశాలీనగరానికీ మధ్య ఉన్న దట్టమైన అడవిలో, కాలి బాటకు పక్కన ఉన్న ఒక మర్రిచెట్టు మీద, రెండు కొంటె పిశాచాలుండేవి.

ఆ రెండు పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా, రెండవది కుర్ర పిశాచి. కాలి బాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి, వాళ్ల బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా కుర్ర పిశాచి వాళ్లను ఆకర్షించి ాట పట్టించేది.

 ఒక రోజున, ఆ రెండు పిశాచాలూ చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న సమయంలో, అన్నింటికన్నా పెద్ద బలహీనత ఏది? అన్న విషయం చర్చకు వచ్చింది.

అప్పుడు వృద్ధ పిశాచి, ‘ఎవరి బలహీనత వల్ల, వారి చుట్టు పక్కల వాళ్లందరికీ మనస్తాపం కలుగుతుందో, అదె పెద్ద బలహీనత’ అన్నది.

అయితే, ఆ బలహీనత ఏదన్న విషయంలో, రెండు పిశాచాలూ ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో, కాలిబాట వెంట ఒక  మనిషి రావడం వాటి కంటపడింది. వృద్ధ పిశాచి, ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కాని, అతడి బలహీనత ఏమిటో దానికి అంతుపట్టలేదు. కారణం అతడి ముఖం చాలా గంభీరంగా  ఉన్నది.
వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి, కుర్రపిశాచి ఒక డబ్బు సంచీని సృ ష్టించి, కాలిబాట మధ్యలో పడవేసింది.
దారే వస్తున్న మనిషి, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక, ‘పాపం, ఎవరో డబ్బు సంచీని ఇక్కడ పారేసుకున్నారు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.
 అది చూసి పిశాచాలు రెండూ నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకూ అందరూ కూడా డబ్బు సంచీని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్లు. తర్వాత తలతిప్పి చుట్టుపక్కల చూసి, డబ్బు సంచీని దుస్తుల మాటున దాచుకుని, ఎవరూ లేని చోట విప్పేవాళ్లు. అప్పుడు సంచీలో రాళ్లో, తేళ్లో ఉండేలా చేసి, వాళ్ల భయం చూసి పిశాచాలు రెండూ పొట్ట  చెక్కలయేలా నవ్వుకునేవి.

 ఆ వచ్చిన వాడు, డబ్బు సంచీని వదిలి ముందుకు పోవడంతో, కుర్రపిశాచికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి, అపురూప సౌందర్య వతిలాగా రూపం ధరించి, ఒయ్యారంగా ఆ మనిషికి ఎదురు వచ్చింది.


అయితే, ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్లిపోశాగాడు. ఆమె కాలిలో ముల్లు గుచ్చుకున్న దానిలాగా, ‘అబ్బా’ అంటూ కూలబడి పోయింది.

 ఆ మనిషి వెనక్కు తిరిగి వచ్చి, చక్కని యువతి రూపంలో ఉన్న కుర్రపిశాచి కాలిలోని ముల్లును తీసేశాడు. ఆ మరుక్షణం, యువతి అతడి చేయి పుచ్చుకుని, ఎక్కడలేని ప్రేమ నటిస్తూ ‘నేను నిన్ను ప్రేమిస్తన్నాను. నన్ను పెళ్లి చేసుకో’ అన్నది.

 దానికతడు చిరాకు పడుతూ, ‘చిన్న ముల్లు తీయగానే, నా వెంటపడ్డావు. రేపు మరెవడో  ఇంతకంటే పెద్ద ముల్లు తీస్తే , వాడి వెంట పోతావు. నా కిలాంటి ప్రేమలంటే చెడ్డ చిరాకు’ అంటూ వెళ్లి పోయాడు.

 నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్రపిశాచితో, వృద్ధ పిశాచి, ‘అతణ్ణి నేను ఆట పట్టిస్తాను చూడు’ అంటూ మాయమైపోయింది.


ఆ మనిషి అలా నడిచిపోతుండగా, ఒక పొదచాటు నుంచి, ‘దాహం, దాహం’ అన్న మూలుగులు వినిపించాయి.

అతడు ఆగి చూడగా, మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి, అక్కడ పడి ఉన్నాడు. ఆయన ఒంటి నిండా గాయాలు. వెంటనే అతడు తన సంచీలోంచి మర చెంబొకటి తీసి, నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోటిలో పోశాడు.

  కొంత సేపటికి రాజులా ఉన్న వ్యక్తి తేరుకుని, ‘మీరు, నా ప్రాణం కాపాడిన మహానుభావులు. నేనీ దేశాన్నేలే రాజును. మీరు, నా వెంట రాజధానికి రండి. మీకు గొప్ప పదవి, కీర్తీ లభించేలా చూస్తాను’ అన్నాడు.
  అందుకు దారేపోయే మనిషి, ‘దాహంతో ఉన్నవారిని సేద తీర్చడం మానవ థర్మం. నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు’ తన దారిన తాను వెళ్లసాగాడు.

అతడు అలా వెళ్లగానే, కుర్రపిశాచి  మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ‘ఇతనెవరో, ఏ బలహీనతా లేని మనిషిలా ఉన్నాడు’ అన్నది.

 దానికి వృద్ధ పిశాచి, ‘లోకంలో, ఏదో  ఒక బలహీనతలేని మనిషంటూ ఉండడు. ఇప్పుడతణ్ణి మనుష్యరూపంలో వెంబడించి, అతడి బలహీనత ఏదో తెలుసుకుందాం. పద’ అన్నది.

వెంటనే అవి రెండూ తండ్రీ కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణికుల్లాగా నటిస్తూ, అతడి పక్కన చేరి, అతణ్ణి మాటల్లోకి దించాయి.

 కొద్ది సేపట్లోనే, ఆ మనిషి అడవి ప్రయాణంలో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు.

దారిలో తనకు డబ్బు మూట కనిపించడం, అందమైన యువతి తారసపడడం, మహారాజు దాహం తీర్చడం- ఇవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా, పిశాచాలు రెండూ వింత కనబరుస్తూ విన్నాయి.
 అంతా చెప్పాక, ఆ మనిషి పిశాచాలను, ‘ఇప్పడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తి కాంక్షా లేనివాణ్ణి  ఎక్కడైనా చూశారా?’ అని అడిగాడు.

‘చూడలేదు. చూడలేదు’ అన్నవి పిశాచాలు రెండూ ఏకకంఠంగా.

ఆ జవాబుకు అతడు సంతృప్తిపడి, తన చిన్ననాటి విషయాలు వాటికి చెప్పసాగాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సాయంతో జీవితాన్ని తానెలా తీర్చి దిద్దుకున్నదీ, అంచెలంచెలుగా వివరించడం మొదలు పెట్టాడు.

 పిశాచాలు రెండూ చాలా సేపు ఓపికగా విన్నాయి. కాని, ఆ మనిషి తనను గురించి గొప్పగా చెప్పుకోవడం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపికపోయి, మెదడు స్తంభించి, కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. మరి కాసేపటికి  చెవులు గింగుర్లెత్తడం, కళ్ల వెంట నీళ్లు కారడం మొదలైంది. అయినా ఆ మనిషి తనను గురించి చెప్పుకోవడం ఆపలేదు. ఇక భరించలేక, పిశాచాలు మాయమైపోయి, వాటి నివాసమైన మర్రిచెట్టును చేరాయి.

‘అయ్యోబూబూ, ఏం మనిషి. తల వాచేలా చేశాడు’ అన్నది కుర్రపిశాచి.

అందుకు వృద్ధ పిశాచి నవ్వి, ‘తల వాస్తే వాచింది కానీ, మన సందేహం తీరిపోయింది’ అన్నది.

కుర్రపిశాచం అర్థం కానట్టు చూసింది.

వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారగిలపడి, ‘చూశావా, అన్నిటికన్నా పెద్ద బలహీనత తనను తాను పొగడుకోవడం. ఒక మనిషికి  ఏ దుర్గుణాలూ లేకపోవచ్చు కానీ, తనను తాను పొగడుకోవడం అనే బలహీనత ఉంటే, ఇక అతడి సుగుణాలకు విలువ ఉండదు. ఒకరి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప, తానే పొగడుకోకూడదనే ఆలోచన లేకపోవడం వల్ల, నలుగురిలో చులకన అవుతుంటారు. ఇంతెందుకు, ఎప్పడూ మనుషుల్ని ఏడిపించే మనల్నే, ఏడిపించాడీ మనిషి’ అన్నది.

వృద్ధ పిశాచం చెప్పినదానికి, కుర్రపిశాచం అవునన్నట్టు తలాడించింది.




PUBLISHED IN CHANDAMAMA CHILDREN'S MAGAZINE IN 1988 DECEMBER ISSUE