గురువారం, అక్టోబర్ 30, 2025

వార్నాయనో... అన్ని బిలాలే!


 



‘అంతుపట్టని లేత గుండెలో ఎంత తోడితే అంతుంది..’ అన్నాడో సినీ కవి. లేత గుండె సంగతలా ఉంచితే అంతరిక్షం కూడా అలాంటిదే. అనంతమైన గగనాంతర సీమలతో పోలిస్తే... తొమ్మిది గ్రహాలు, లక్షలాది గ్రహ శకలాలు సహా భూమిపై ఉన్నే మనల్నందరినీ కూడా తన చుట్టూ తిప్పుకుంటున్న మన సూర్యుడే అంతరిక్షంలో పోలిస్తే ఓ నలుసులాంటి వాడు. ఇక మనమెంత? మనకు తెలిసిందెంత?

కోటాను కోట్ల తారలు, తారా మండలాలు మినుకు మినుకు మంటూ వెలుగులు పంచుతుంటే, వాటి మధ్య తమ చుట్టు పక్కల ఉన్నే పదార్థాలన్నింటినీ గుట్టు చప్పుడు కాకుండా కబళించే కృష్ణబిలాలు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అనే వీటి గురించి మనకి తెలిసింది చాలా చాలా తక్కువ. ఆఖరికి కాంతిని, కాలాన్ని కూడా స్వాహా చేస్తాయవి. వాటి బారిన పడిన పదార్థాలన్నీ ఎక్కడికి పోతాయో ఇప్పటికీ అంతుపట్టని విషయమే.

అలాంటి కృష్ణబిలాల గురించి ఓ కొత్త విషయం తెలిసింది. మనం చూడగలిగినంత మేరకు, మనకు తెలిసిన అంతరిక్షంలో వాటి సంఖ్యపై తాజా అవగాహన కలిగింది. ఈ విశ్వంలో దాదాపు 40 క్వింటిలియన్ బ్లాక్ హోల్స్ ఉన్నాయన్నదే ఆ కొత్త అంచనా. అంటే 40 పక్కన పద్దెనిమిది సున్నాలు పెట్టి అవి ఎన్ని కోటాను కోట్లో లెక్కపెట్టుకోవాలి.

కావాలంటే 40,000,000,000,000,000,000 ఎంతో ఓపిగ్గా తెలుసుకోండి. ఆధునిక కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, నక్షత్ర మండలాలు, విశ్వపరిణామానికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. విశ్వం మొత్తంలో ఉన్న పదార్థరాశిలో బ్లాక్ హోల్స్ వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇవన్నీ విశ్వంలో విస్తారమైన ఖగోళ దూరాల్లో నెలకొని ఉన్నాయి.  

సోమవారం, అక్టోబర్ 27, 2025

మొత్తానికి ... నువ్వొక అద్భుతం గురూ!


 

 నీకు తెలుసో తెలియదో కానీ, నువ్వొక ఖగోళ అద్భుతం గురూ. అసలు నీ శరీరంలో ఎన్ని పరమాణువులున్నాయో తెలుసా? తెలియక పోతే ఓ కలం, కాగితం తీసుకుని 7 పక్కన ముఫ్ఫై సున్నాలు చుట్టు. ఆ సంఖ్య ఎంతో లెక్కేసుకో. దాన్ని ఆక్సిలియన్ అంటారు. అంటే అది...

7,000,000,000,000,000,000,000,000,000,000 అన్నమాట.

ఇవన్నీ ఎక్కడివో తెలుసా? వందల కోట్ల ఏళ్ల క్రితం పుట్టిన పురాతన నక్షత్రాలు, సూపర్ నోవాల నుండి ఉద్భవించినవే. నీ శరీరాన్ని తయారు చేసిన ఈ కార్బన్, ఆక్సిజన్, కాల్షియం, ఐరన్ లాంటి పరమాణువులన్నీ విశ్వంలో అనేక దూరాల నుంచి ప్రయాణించి వచ్చి అన్నీ కలిసి చివరికి నిన్ను సృష్టించాయి. ఒక విధంగా నువ్వొక ‘నక్షత్ర ధూళి’ గాడివన్నమాట. నిజానికి ఈ విశ్వం జీవంతో, అనేక అవకాశాలతో నిండి ఉందనడానికి నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం. మరి
ఇదొక అద్భుతం కాక మరేమిటి గురూ?

ష్... మెదడు మాట్లాడుతోంది!


 


అవును... మెదడు మాట్లాడుతోంది. కావాలంటే మీ కణాలను అడగండి. మీ శరీరంలోని ప్రతి కణం మీ మెదడు మాటలు వింటోంది. లేకపోతే మీ మెదడు కేవలం ఓ ఆలోచనల పుట్ట అనుకుంటున్నారా? అబ్బే... అది చాలా శక్తిమంతమైన చికిత్సాలయం. ఓ మందుల దుకాణం కూడా. మన మెదడుకి, శరీరానికి విడదీయరాని బంధం ఉంది. మన మెదడులో పుట్టే ప్రతి ఆలోచన మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మన మానసిక స్థితి మన శరీర రక్షణ వ్యవస్థను నియంత్రించడమే కాదు, మన కణాల మరమ్మత్తు కూడా చేపడుతుందని సైన్స్ పదే పదే చెబుతూనే ఉంది. ఒత్తిడితో కూడిన ఆలోచనలు అవే రకమైన హార్మోన్లను విడుదల చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అదే శాంతమైన, సకారాత్మకమైన ఆలోచనలు శరీరం కోలుకోడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడతాయి. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు చక్కగా ఉండేలా చూసుకుంటే మన శరీరంలో రసాయనిక వ్యవస్థ కూడా బాగుపడి దీర్ఘకాల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరానికి సహజంగానే ఉండే రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో మన ఆలోచనలే అత్యంత కీలకమని మరోసారి నిరూపణ అయింది. మరింకేం? అనవసరంగా ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. జీవితం అదే బాగుంటుంది.

గురువారం, అక్టోబర్ 16, 2025

నల్లచుక్క కాదిది... నమ్మలేని వింత!


ముందు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న నల్ల చుక్కను చూడండి. మహా అయితే వధూవరుల బుగ్గన పెట్టే దిష్టి చుక్క కన్నా చిన్నదిగా ఉంది కదూ? ఈతరం అమ్మయిలు నుదుటను పెట్టుకునే బొట్టు బిళ్లంత కూడా లేని ఈ చుక్క అంతరిక్షంలో ఓ అద్భుతం. ఇప్పుడు దీని గురించి ఆశ్చర్యకరమైన, నమ్మలేని నిజాన్ని ఊపిరి బిగబెట్టి తెలుసుకోండి. అంతరిక్షంలో ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న ఈ నల్ల చుక్క, మన సూర్యుడి కన్నా 6.5 బిలియన్ రెట్లు పెద్దదైన కృష్ణబిలం. అంటే తెలుసుగా? బ్లాక్ హోల్. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ గా చెబుతున్న ఇది ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని నిశ్శబ్దంగా దాని చుట్టూ ఉన్న సమస్త పదార్థాలనూ లాగేసుకుని తనలో కలిపేసుకుంటోంది. అంతుపట్టని అంతరిక్షంలో ఉన్న అద్భుత శక్తులకు ఇదొక తాజా ఉదాహరణ. కృష్ణబిలాలనేవి రోదసిలో అంతుపట్టని ఆశ్చర్యాలకు నిలయాలు. అవి దేన్నయినా మింగేస్తాయి. కాంతిని, పదార్థాన్ని, శక్తిని దేన్నయినా కబళించేస్తాయి. ఆఖరికి విశ్వంలో అతి ముఖ్య అంశాలైన స్థల కాలాలను కూడా లోబరుచుకుంటాయి. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ దగ్గర ఏం జరుగుతుందో పరిశోధకులు ఊహిస్తూ, అనేక సిద్ధాంతాలను చేశారు. కానీ ఇలాంటి ఓ కృష్ణబిలాన్ని ఫొటో తీసి చూడగలగడం మాత్రం ఇదే తొలిసారి. అందుబాటులో ఉన్న నక్షత్రాలు, వాయు మేఘాలు, పదార్థాలన్నీ బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తికి లోనై, దానిలో పడి ఎవరికీ తెలియని చోటుకి వెళ్లిపోతున్నాయి.

ఈ ఫొటో కేసి చూస్తే ఆశ్చర్యంతో పాటు, భయం కూడా కలుగుతుంది. అంతుబట్టని ఈ అనంత విశ్వంలో మనమెంత అల్పులమో అర్థమవుతుంది. అదే సమయంలో ఈ ఫొటో ఆదునిక సాంకేతిక ప్రగతికీ, మనిషి నిరంతర కుతూహలానికి కూడా సంకేతం. సుదూర రోదసి తీరాల్లోకి తొంగి చూడడానికి ఈ ఫొటో ఓ కిటికీలాంటిది. ఫొటోలో కనిపించే చిన్న నల్ల చుక్క మనం ఊహించలేనంత పెద్దదే కాదు, మనకి తెలియని ఎన్నో రహస్యాలను మరింత పరిశోధించాని గుర్తు చేసే ఓ సూచిక కూడా.


మంగళవారం, అక్టోబర్ 14, 2025

మరణమా… నువ్వెప్పుడూ అర్థం కావు సుమా



జాతస్యహి ధృవో మృత్యు:’ అంటుంది భగవద్గీత. మరణం ఒక అంతం కాదని కూడా చెబుతుంది. పుట్టాక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎంత సహజమో మరణించాక మరో దేహాన్ని తీసుకోవడం కూడా అంతే సహజమని చెబుతుంది. ఏమైనా మరణం మనిషిని వెంటాడుతూనే ఉంది, ఆలోచనల్లోనో, భయంలోనో. ఇప్పుడు మరణం, దాని తర్వాత ఉనికి గురించి ‘క్వాంటమ్ ఫిజిక్స్’ కూడా చెబుతోంది. ‘బయోసెంట్రిజం’ అనే సిద్ధాంతం ప్రస్తుతం అటు శాస్త్రవేత్తలను, ఇటు తత్వవేత్తలను కూడా సమానంగా ఆకర్షిస్తోంది. దీని ప్రకారం జీవం, ఉనికి అనేవి ఈ విశ్వంలో అనుకోకుండా ఏర్పడిన ఘటనలు కావని, నిజానికి అవే విశ్వానికి పునాదులని చెబుతోంది. ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం మరణం అనేది ఒక అంతం కాదు. ఒక పరిశీలకుడి కోణంలో చూస్తే మరణం అనేది ఒక విశ్వంలోంచి మరో సమాంతర విశ్వంలోకి ఉనికి మార్పు మాత్రమే అంటుంది. సమాంతర విశ్వం అనేది కూడా ఒక  సిద్ధాంతమే. మనకి తెలిసిన విశ్వమే కాకుండా, దానికి సమాంతరంగా అనేక విశ్వాలు ఉన్నాయని చెబుతుందది. అంటే మనం చూసే వాస్తవం అనేది మనం ఎలా అనుభూతి చెందుతున్నామనేదానికి ముడిపడి ఉంటుంది.

బయోసెంట్రిజమ్ సిద్ధాంతానికి క్వాంటమ్ ఎఫెక్ట్, పరిశీలకుడి కోణం, క్వాంటమ్ ఎన్టాంగిల్ మెంట్, రెట్రో కాసాలిటీ లాంటి మరికొన్ని సిద్దాంతాలకు అనుగుణంగా ఉంది. వీటి ప్రకారం సృష్టిలో కణాలు గతంలోని ఘటనలపై కూడా ప్రభావం చూపుతాయని చెబుతారు. అలాగే సృష్టిలో కణాలన్నీ తమ మధ్య ఎంతెంత దూరాలున్నా సరే ఇతర కణాల మీద నిరంతర ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయంటారు. విశ్వంలో ఉనికి అనేది వాస్తవికతను రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక సిద్ధాంతాల ప్రకారం మరణం అనేది ఒక అంతం కాదు. అది స్థల కాలాలకు అతీతంగా ఉనికి అనేది మరో ఉనికిలోకి జరిగే రూపాంతరం మాత్రమే. ఈ సిద్ధాంతం మీద చాలా వివాదాలు, వాదనలు ఉన్నప్పటికీ… మరణం, మరణానంతర జీవితం గురించి మరో కొత్త
ఆలోచనా కోణాన్ని ఆవిష్కరిస్తోందన్నది మాత్రం నిజం.