‘అంతుపట్టని లేత గుండెలో ఎంత తోడితే అంతుంది..’ అన్నాడో సినీ కవి. లేత గుండె సంగతలా ఉంచితే అంతరిక్షం కూడా అలాంటిదే. అనంతమైన గగనాంతర సీమలతో పోలిస్తే... తొమ్మిది గ్రహాలు, లక్షలాది గ్రహ శకలాలు సహా భూమిపై ఉన్నే మనల్నందరినీ కూడా తన చుట్టూ తిప్పుకుంటున్న మన సూర్యుడే అంతరిక్షంలో పోలిస్తే ఓ నలుసులాంటి వాడు. ఇక మనమెంత? మనకు తెలిసిందెంత?
కోటాను కోట్ల తారలు, తారా మండలాలు మినుకు మినుకు మంటూ వెలుగులు పంచుతుంటే, వాటి మధ్య తమ చుట్టు పక్కల ఉన్నే పదార్థాలన్నింటినీ గుట్టు చప్పుడు కాకుండా కబళించే కృష్ణబిలాలు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. బ్లాక్ హోల్స్ అనే వీటి గురించి మనకి తెలిసింది చాలా చాలా తక్కువ. ఆఖరికి కాంతిని, కాలాన్ని కూడా స్వాహా చేస్తాయవి. వాటి బారిన పడిన పదార్థాలన్నీ ఎక్కడికి పోతాయో ఇప్పటికీ అంతుపట్టని విషయమే.
అలాంటి కృష్ణబిలాల గురించి ఓ కొత్త విషయం తెలిసింది. మనం చూడగలిగినంత మేరకు, మనకు తెలిసిన అంతరిక్షంలో వాటి సంఖ్యపై తాజా అవగాహన కలిగింది. ఈ విశ్వంలో దాదాపు 40 క్వింటిలియన్ బ్లాక్ హోల్స్ ఉన్నాయన్నదే ఆ కొత్త అంచనా. అంటే 40 పక్కన పద్దెనిమిది సున్నాలు పెట్టి అవి ఎన్ని కోటాను కోట్లో లెక్కపెట్టుకోవాలి.
కావాలంటే 40,000,000,000,000,000,000 ఎంతో ఓపిగ్గా తెలుసుకోండి. ఆధునిక కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, నక్షత్ర మండలాలు, విశ్వపరిణామానికి సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. విశ్వం మొత్తంలో ఉన్న పదార్థరాశిలో బ్లాక్ హోల్స్ వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇవన్నీ విశ్వంలో విస్తారమైన ఖగోళ దూరాల్లో నెలకొని ఉన్నాయి.

 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి