మంగళవారం, సెప్టెంబర్ 29, 2026

యూపీఐ ఛార్జీలు... ఇవిగో వాస్తవాలు

 

 

మార్కెట్ కి వెళ్లాలంటే జేబులో డబ్బులు వేసుకుని బయల్దేరక్కరలేదిప్పుడు. సెల్ ఫోన్ ఉంటే చాలు. చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా డిజిటల్ గా జరిగిపోతున్నాయి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అని తెలుసుగా? మరి ఇప్పుడు ఇలాంటి యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడతాయనే విషయంపై అనేక అపోహలు ఇటు వినియోగదారులలోను, అటు వ్యాపారులలోను ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిజానిజాలేంటో తెలుసుకుందాం.

మీరు ఈ పాటికే ‘ఎమ్ డీ ఆర్’ పదాన్ని వినే ఉంటారు. అంటే ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ అని అర్థం. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులపై ఎమ్‌డీఆర్ ఛార్జీలు పడతాయని, ఆ వ్యాపారులు ఆ భారాన్ని చివరకి వినియోగదారుడి పైనే రుద్దుతారని చాలా మంది భావిస్తున్నారు.  అసలు సంగతేంటో చూద్దాం.

ఎమ్డీఆర్ ను ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నమాట వాస్తవమే. ఇది డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మార్పులను తీసుకురానుంది. దీనికి సంబంధించిన నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.

మీరు ఒక వ్యాపారికి డిజిటల్ గా సొమ్ము చెల్లించారనుకోండి.  ఆ సొమ్ము అతడి బ్యాంకు కాతాకు జమ అవుతుందని తెలుసు కదా? అలాంటి లావాదేవీలను జరుపుతున్నందుకుగాను ఆ వ్యాపారి కాతాను నిర్వహించే బ్యాంకు ఇకపై కొంత ప్రాసెసింగ్ రుసుమును అతడి నుంచి తీసుకుంటుంది. అదే ఎమ్ డీ ఆర్.

ఇంతకీ దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత నిలకడగా ఉండేందుకు, ఇది మరింత మందికి చేరువ కావడానికి ఇది దోహదపడుతుంది.

-   వ్యక్తి నుంచి వ్యక్తికి జరిపే చెల్లింపులకు ఇది వర్తించదు. అంటే, మీరు మీ స్నేహితుడికో, కుటుంబ సభ్యులకో డబ్బులు పంపితే ఎవరికీ ఎలాంటి రుసుములూ పడవు. ఆ సొమ్ము ఎంత పెద్దదైనా సరే ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు. అంటే ‘పెర్సన్ టు పెర్సన్’ లావాదేవీలన్నీ ఉచితమే.

-   అయితే మీరు ఒక వ్యాపారికి డబ్బులు పంపారనుకోండి. అలాంటి ‘పెర్సన్ టు మర్చంట్’ నగదు బదిలీ రెండు వేల రూపాయలకు మించి ఉంటే ఆ వ్యాపారి నుంచి అతడి బ్యాంకు కొంత రుసుము తీసుకుంటుంది. అదే ‘ఎమ్ డీ ఆర్’ అన్నమాట. అది కూడా కేవలం 0.4 శాతం మాత్రమే. మీకు మాత్రం ఎలాంటి రుసుము పడదు. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యాపారి ప్రతి నెలా లక్ష రూపాయల లోపు మాత్రమే డిజిటల్ సొమ్మును వినియోగదారుల నుంచి తీసుకుంటున్నాడనుకోండి, అతడి పై ఎమ్డీఆర్ రుసుము పడదు. అంటే చిన్న వ్యాపారులకు పడదన్నమాట. అంతకు మించి లావాదేవీలు స్వీకరించే వ్యాపారి మాత్రమే రెండు వేల రూపాయలకు మించిన నగదు బదిలీలపై 0.4 శాతం నుంచి రుసుమును భరించాల్సి వస్తుంది. అది కూడా రూ. 75 వేల రూపాయల లావాదేవీ లోపు మాత్రమే. అంటే గరిష్టంగా అతడికి పడే రుసుము ప్రతి లావాదేవీకి రూ. 300 మాత్రమే. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల సరుకును     అతడి దగ్గర కొని, డిజిటల్ గా చెల్లించారనుకోండి. ఆ వ్యాపారి 0.4 శాతం లెక్కన రూ. 400 చెల్లించక్కరలేదు. గరిష్ట పరిమతి వల్ల రూ.300 చెల్లిస్తే చాలన్నమాట. ఈ పరిమితి వల్ల యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం వాటిపై ఎలాంటి ప్రభావం పడదు.  

-   సరే... ఆ మాత్రం రుసుమును మాత్రం వ్యాపారి ఎందుకు భరిస్తాడు, దాన్ని వినియోగదారుడిపైనే రుద్దుతాడు కదా? అనే అనుమానం కలుగుతుంది. కానీ దానికి కూడా ఒక నిబంధన ఉంది. ఏ వ్యాపారి కూడా ఆ రుసుమును ఏ రూపంలోనూ వినియోగదారుడి నుంచి తీసుకోకూడదు. అంటే ఎమ్డీఆర్ వల్ల వినియోగదారుడిపై ఎలాంటి భారమూ ఉండదన్నమాట.

-   అలాగే డిజిటల్ చెల్లింపుల తరహాను బట్టి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే... యుటిలిటీలు, బీమా, ఇంధనం, టెలికాం, రైల్వేలు, వ్యవసాయ ఉత్పాదకాలు వంటి నిత్యావసర రంగాలలో లావాదేవీలపై ఇంత శాతం అని కాకుండా, ప్రతి లావాదేవీకి కేవలం రూ. 5 మాత్రమే వర్తించేలా నిబంధన ప్రవేశపెట్టారు. ఈ రుసుము కూడా వినియోగదారుడి మీద పడదు. ఈ రంగాల్లో చెల్లింపులు కూడా రెండు వేల రూపాయల లోపు అయితే పూర్తిగా ఉచితం. ఆపై చెల్లింపులకు ఒక లావాదేవీకి రూ. 5 మాత్రమే ఎమ్‌డీఆర్ వర్తిస్తుంది. అంటే ఈ రంగాల్లో చెల్లించే మొత్తం ఎంత పెద్దదైనా కేవలం ఫ్లాట్ ఫీజు 5 రూపాయలు మాత్రమే ఉంటుంది.

పైగా ఇది కూడా ఆ సేవలందించే సంస్థలు లేదా వ్యాపారులు మాత్రమే భరించాల్సి ఉంటుంది.

-    మరి కొన్ని నిజాలు...

·    ఎండీఆర్‌ అంటే పన్ను కాదు. సెస్ లేదా సర్‌చార్జీ కూడా కాదు.

·    ఎండీఆర్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కానీ, భారత సంఘటిత నిధికి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) కానీ వెళ్లదు.

·    దీని వల్ల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) మారదు.

-   అసలు ఈ ఎమ్‌డీఆర్ విధింపు ఎందుకు?

·    దీర్ఘకాలిక, ఆర్థిక నిలకడ దిశగా దేశీయ యూపీఐ వ్యవస్థ కొనసాగడానికి.

·    సర్వర్లు, చెల్లింపు మౌలిక సదుపాయాలు, సైబర్‌ భద్రత, మోసాల నిరోధం, వినియోగదారు మద్దతు వ్యవస్థకు నిధులు సమకూర్చడానికి.

·    దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం యూపీఐను విస్తరించడానికి.  

·    మరింత మంది పౌరులు, వ్యాపారులను యూపీఐ పరిధిలోకి తేవడానికి.

-   ఇది ఏకపక్ష నిర్ణయం కాదు

·    బ్యాంకులు, ఇతర భాగస్వాములతో యూపీఐ, సేవల సారథ్య కమిటీలో విస్తృత చర్చల తర్వాతనే ఈ చట్రం రూపొందింది.

·    పార్లమెంటు ఆర్థిక స్థాయీ సంఘం (2026 మార్చి) తన 32వ నివేదికలో  యూపీఐ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వ భరోసా దిశగా ఆచరణీయ ఆదాయ సముపార్జన యంత్రాంగం ఏర్పాటుకు పిలుపునిచ్చింది. ఈ చర్చల్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా పాలుపంచుకున్నారు.

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి