మంగళవారం, సెప్టెంబర్ 15, 2026

బాబా... భక్తి... భలే సినిమా!


బాబా జీవితం వేరు...

ఆయనపై భక్తి వేరు...

సినిమా ప్రపంచం వేరు...

ఈ మూడు వేర్వేరు అంశాలు కలిసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి!

ఆ సంచలనం పేరు ‘హనుమాన్ అంశ్’!   

ఆగస్టు 7న సాదాసీదాగా విడుదలైన  ఓ హిందీ సినిమా...

తొలి రోజు కేవలం రూ. 10 లక్షలు వసూలు చేసింది... రెండు వారాలైనా వసూళ్లు అంతంత మాత్రమే... చాలా మంది ‘డిసాస్టర్’ అనేశారు...

కానీ ఆ తర్వాత జరిగింది అద్భుతం...

 మూడో వారం నుంచి కేవలం ప్రేక్షకుల నోటి ప్రచారం వల్ల వసూళ్లు పుంజుకున్నాయి. నాలుగైదు వారాల్లో ఊహించని విధంగా పెరిగాయి. మొదటి వారంలో కేవలం 250 తెరలపై ఆడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరణ వల్ల 8000 తెరలకు పెంచాల్సి వచ్చింది.  సెప్టెంబర్ 11న ఓవర్సీస్ లో కూడా విడుదలైంది.

విడుదలైన 39 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలు చేసింది. భారత్‌లో రూ. 263 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది.

నలుగురు కలిసి కష్టపడి పోగుచేసుకున్న డబ్బు... రూ. 2 కోట్లు!

ఆ డబ్బుతో తీసిన ఈ సినిమా చేసిన వసూళ్లు... రూ. 280 కోట్లు!

అంటే.. పెట్టుబడికి 140 రెట్ల లాభం!

 

 

ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా అదెంత ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు.

ఆ సినిమాను ప్రేక్షకులు చెప్పులు విప్పేసి మరీ భక్తితో చూస్తున్నారు...

కొన్ని సన్నివేశాల్లో లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు...

కొన్ని చోట్ల కంటతడి పెడుతున్నారు...

చివరకు రామ నామంతో, హనుమాన్ స్మరణతో బయటకి వస్తున్నారు...

ఆ సినిమాలో గొప్ప స్టార్లు లేరు...

హీరోయిన్ లేదు...

ఉర్రూతలూగించే డ్యూయెట్లు లేవు...

ఫైట్లు, డ్రామా, కామెడీ లాంటి కమర్షియల్ మసాలాలేవీ లేవు...

కేవలం ఓ బాబా జీవిత కథ అది...

ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోయిన ఓ చిన్న పిల్లాడు ఆధ్యాత్మిక సాధనతో బాబాగా ఎలా మారాడో చెప్పే కథ...

అతడు చూపించిన మహిమలు, ప్రభావం గురించిన కథ...

ఆ బాబా పేరు ‘నీమ్ కరోలీ బాబా’.

అంతర్జాతీయంగా పేరు పొందిన ఆధ్యాత్మిక గురువు.

భారత్‌లోనే కాకుండా స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ఎందరో ప్రపంచ ప్రముఖులను సైతం ప్రభావితం చేసిన గొప్ప అవధూత.

·    నలుగురు భక్తులు కలిసిన వేళ...

‘హనుమాన్ అంశ్’ సినిమా గురించి చెప్పుకోవాలంటే నలుగురి గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా వెండితెర రూపం వెనుక వాళ్ల భక్తి ఉంది. తపన ఉంది. పట్టుదల ఉంది.

నలుగురివీ వేర్వేరు నేపథ్యాలు...

వృత్తి రీత్యా వైద్యుడు ఒకరైతే, లండన్ లో చదువుకున్న అమ్మయి మరొకరు.  మీడియా ప్రొడక్షన్ వ్యాపార రంగానికి చెందిన యువతులు ఇద్దరు...

ఒక విధంగా చెప్పాలంటే... వీరిని బాబా మీద భక్తే ఈ సినిమాకు సహ నిర్మాతలకుగా చేసింది.

సినిమా రచయిత, దర్శకుడు డాక్టర్ చతుర్వేది. సినిమా నేపథ్యం లేకపోయినా బాబా ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆసక్తితో కథ రాసుకున్నాడు. ‘స్వయం భూ  మీడియా నెట్‌వర్క్’ ద్వారా సినిమాకు శ్రీకారం చుట్టాడు. సంప్రదాయ మీడియా ప్రొడక్షన్ వ్యాపార రంగానికి చెందిన నమ్రత జి. సింగ్, సాంస్కృతిక విశేషాలను సినిమాల ద్వారా చూపించే స్వతంత్ర నిర్వాహకురాలు రాగిణి ఎస్ కూడా చేయి కలిపారు. వీళ్లు తామ దగ్గరున్న కొద్ది పాటి సొమ్ముతో బాబా మీద సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ చిత్రకూట్ లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య కేవలం 22 రోజుల్లోనే ముగిసింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కానీ, విడుదలకి కానీ డబ్బులు సరిపోలేదు. ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేద్దామనుకున్నా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో అనుప్రియ నాగర్ అనుకోకుండా వీరిని కలిసింది. ముంబైలో పుట్టి, లండన్ లో ‘యూనివర్శిటీ ఆఫ్ బాత్’ నుండి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ గా బయటకు వచ్చిన ఈ 21 ఏళ్ల అమ్మాయికి, బాబా గురించి తెలియడం కూడా కాకతాళీయమే. కాలేజీలో ఓ అసైన్ మెంట్ కోసం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సమాచారం సేకరిస్తుంటే... స్టీవ్ జాబ్స్ రాసిన ఓ వ్యాసం ద్వారా బాబా గురించి తొలిసారి తెలుసుకుంది. భారతీయురాలినై ఉండి, ఓ భారతీయ ఆధ్యాత్మిక వేత్త గురించి విదేశీయుల ద్వారా తెలుసుకోవడమేంటనే భావనతో బాబా జీవితం చదివింది. ఎంతగానో ప్రభావితమైంది. స్విట్జర్లాండులో ఓ మంచి ఉద్యోగంలో చేరాల్సి ఉన్నప్పటికీ, నీల్ కరోలీ బాబా గురించి ఓ పుస్తకం రాయాలనే ఉద్దేశంతో భారత్ బయల్దేరింది. వచ్చాక ఓ కుటుంబ స్నేహితురాలి ద్వారా ‘హనుమాన్ అంశ్’ సినిమా గురించి తెలిసింది. ఆ సినిమా స్క్రిప్టు చదివి తాను విదేశాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా పోగుచేసుకున్న సొమ్మును పోస్ట్ ప్రొడక్షన్ కోసం అందించి సహ నిర్మాతగా మారింది.

ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ సినిమా సంచలన విజయంతో ఈ నలుగురి పేర్లూ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. 

·    అనుకోకుండానే బాబా పాత్రలో...

‘హనుమాన్ అంశ్’ సినిమాలో బాబా పాత్రలో నటించిన నటుడు శోభినవ్ సత్య. ఈయనకి ఈ అవకాశం దక్కడం కూడా అనుకోకుండానే జరిగింది. మొదట్లో బాబా పాత్ర కోసం ఒక ముఖ్యమైన నటుణ్ణి అనుకుంటే అతను జబ్బుపడి తప్పుకున్నాడు. సెట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న శోభినవ్ కు ఆ వేషం దక్కింది. ఇప్పుడు అతడి నటన గురించి దేశమంతా మాట్లాడుతోంది.

·    కొసమెరుపులు...

ఈ చిత్రం అందించిన అపారమైన విజయంతో డాక్టర్ విశాల్ చతుర్వేది తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘రామ్ చరిత్ మానస్’ ‘హనుమాన్ చాలీసా’లను లోకానికి అందించిన గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్ర ఆధారంగా 'రామ్‌బోలా' చిత్రాన్ని తీయబోతున్నాడు.

·    తెలుగులోకి...

హిందీలో సంచలన విజయం సాధించిన ‘హనుమాన్ అంశ్’ సినిమాను ప్రముఖ  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో అందించనున్నారు. ఈయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా దీన్ని సెప్టెంబర్ 18 తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి