ఆదివారం, మార్చి 13, 2022

అంతా 'హాం... ఫ‌ట్‌'!


 

సామాన్యుడు పేప‌రు తెర‌చి చూసేస‌రికి దాన్నిండా బ‌డ్జెట్ వార్త‌లే. అవ‌న్నీ చ‌దివేసి టీవీ పెట్టేస‌రికి అందులో అన్నీ బ‌డ్జెట్ మీద విశ్లేష‌ణ‌లే.  బుర్రంతా వేడెక్కి పోయింది. కాసేపు అలా తిరిగొద్దామ‌ని రోడ్డున ప‌డ్డాడు. గోతులు త‌ప్పుకుంటూ రాళ్లు త‌న్నుకోకుండా జాగ్ర‌త్త‌గా న‌డుస్తుంటే ఓ చోట జ‌నం ర‌ద్దీగా క‌నిపించారు. వెళ్లి చూసేస‌రికి "పీసీ స‌ర్కార్ ఐంద్ర‌జాలికుడు. గొప్ప మ్యాజిక్ షో" అని రాసి ఉంది. చూడాల‌ని స‌ర‌దా పుట్టి లోప‌లికి దూరిపోయాడు. చీక‌టిగా ఉన్న హాలులో ఓ సీటు చూసుకుని చ‌తికిల ప‌డేస‌రికి వేదిక మీద లైట్లు వెలిగాయి.  వేదిక మీద ఒకాయ‌న మెత్త‌గా న‌వ్వుతూ చేతులూపుతున్నాడు. ఆయ‌న చేతిలో మంత్ర‌దండం! షో మొద‌లైంది.

నేప‌థ్య సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ ఆయ‌న త‌ళ‌త‌ళ‌లాడే ఓ అట్ట‌పెట్టెను అంద‌రికీ బోర్లించి చూపించాడు.  ఏమీ లేవు. తర్వాత మూత వేసి దాని చుట్టూ మంత్ర‌దండం తిప్పి 'అబ్ర‌క‌ద‌బ్ర‌' అన్నాడు. ఆపై లోపల చెయ్యి పెట్టి బ‌య‌ట‌కి తీశాడు. అందులోంచి అంకెల ఆకారంలో ఉన్న అట్టముక్క‌లు ఒక‌దానికొక‌టి గొలుసులాగా అతుక్కుని బ‌య‌ట‌కి రాసాగాయి. జ‌న‌మంతా చ‌ప్ప‌ట్లు కొట్టారు.

"ఖాళీ పెట్టె లోంచి ఎన్ని వస్తున్నాయో! అద్భుతం క‌దా గురూ?" అంటూ ప‌క్క‌నున్న వాడు సామాన్యుడి కేసి చూశాడు.

సామాన్యుడు న‌వ్వేసి, "నేనింత‌క‌న్నా పెద్ద మ్యాజిక్ షో చూశాన్లే. దాని ముందు ఇదెంత‌?" అన్నాడు.

"అదెవ‌రి మ్యాజిక్ షో గురూ?"

"ఏపీ స‌ర్కార్‌... మ‌హేంద్ర‌జాలికుడు!"

"ఆయ‌న కూడా ఇలాగే సృష్టించాడా?"

"ఓ... ఈ అంకెలో లెక్కా? ఆయనైతే ఏకంగా 2 ల‌క్ష‌ల 56 వేల కోట్ల‌కు పైగా అంకెలు చూపించాడు తెలుసా?"

"అబ్బో... మీ వాడు గొప్ప‌వాడే..."

ఈలోగా వేదిక‌పై మెజీషియ‌న్ ఓ స‌న్న‌మూతి సీసా అంద‌రికీ చూపించాడు. ఆ త‌ర్వాత పెద్ద బొమ్మ చూపించాడు.

"ఇంత పెద్ద బొమ్మ ఈ సీసాలో ప‌డుతుందా?" అని అడిగాడు.

"అసాధ్యం... ప‌ట్ట‌దు" అన్నారు ప్రేక్ష‌కులు.

"అయితే ఇప్పుడు చూడండి" అంటూ మెజీషియ‌న్ వాటిపై ఓ గుడ్డ కప్పి క‌ర్ర తిప్పి తీసేశాడు.

అరె... అద్భుతం! అంత పెద్ద బొమ్మా ఆ సీసాలోకి ఎలా దూరిందో కానీ లోప‌ల ఒదిగిపోయి క‌నిపించింది. చ‌ప్ప‌ట్లు మార్మోగిపోయాయి. సామాన్య‌డు చ‌ప్ప‌ట్లు కొట్ట‌లేదు.

ప‌క్క‌వాడు అది చూసి, "ఏంటి గురూ! మీ వాడు ఇంత కంటే పెద్ద మ్యాజిక్ చేసేశాడా?" అన్నాడు.

"కాదా మ‌రి? ఆ స‌న్నమూతి సీసా మ‌ద్యం సీసా. అందులోకి మావాడు ఏకంగా రాష్ట్రాన్నే దూర్చేశాడు. అంతే కాదు ఆ సీసాలోంచి ఏకంగా వేల కోట్ల రూపాయ‌లు రాలుస్తున్నాడు. ఇప్పుడు కొత్త‌గా ఆ సీసా ద్వారా ఏకంగా 16,500 కోట్ల రూపాయ‌లు రాబ‌డ‌తాన‌ని ప్ర‌క‌టించాడు కూడా. ఆ మ్యాజిక్ ముందు ఇదెంత‌?" అన్నాడు సామాన్యుడు.

ఇంత‌లో వేదిక మీద మెజీషియ‌న్ "మీకిప్పుడు చుక్క‌ల లోకం చూపిస్తా" అన్నాడు. ఒక్క‌సారిగా హాలంతా చీక‌టిమ‌య‌మైపోయింది. ఇంత‌లో పైనంతా మిణుకుమిణుకుమ‌నే న‌క్ష‌త్రాలు, వాటి మ‌ధ్య‌న దూసుకుపోతున్న వెలుగులు.  స‌భికులు సంబ‌ర‌ప‌డిపోయారు.

"ఇది భ‌లేగుంది గురూ!" అంటూ ప‌క్కోడు సామాన్యుడి కేసి చూశాడు.

సామాన్య‌డు న‌వ్వి, "మావాడైతే ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తాడు. అన్నింటి మీద ప‌న్నులు పెంచేస్తే జ‌నానికి క‌ళ్ల‌ల్లో చుక్క‌లే క‌నిపిస్తున్నాయి. పెట్రోలు, సిమెంటు, మ‌ద్యం, ఇసుక‌, నిత్యావ‌స‌రాల ధ‌ర‌వ‌ర‌లు అన్నీ క‌లిపి మా చుట్టూ న‌క్ష‌త్రాల‌నే చూపిస్తున్నాయి తెలుసా?" అన్నాడు.

ఈసారి వేదిక‌పై మెజీషియ‌న్ చేతులు విచిత్రంగా ఊపాడు. వెంట‌నే పై నుంచి త‌ళ‌త‌ళ‌లాడే ఓ పెద్ద చీర పైనుంచి కిందికి జారింది.

"ఇదెవ‌రికి కావాలి?" అన్నాడు.

"నాకు.." అన్నారు చాలా మంది.

"అయితే దోసిలి ప‌ట్టండి" అన్నాడు మెజీషియ‌న్.

అంద‌రూ ఆశ‌ప‌డి దోసిలి ప‌ట్టారు.

మెజీషియ‌న్ 'అబ్ర‌క‌ద‌బ్ర‌' అంటూ మంత్ర‌దండాన్ని తిప్పి ఆ చీర‌ను ప్రేక్ష‌కుల  మీద‌కు విసిరాడు.

దాంతో అందరి చేతుల్లోకి వ‌చ్చిప‌డ్డాయి... చీర‌లు కాదు, జేబురుమాళ్లు. స‌భంతా న‌వ్వులే న‌వ్వులు. సామాన్యుడు న‌వ్వ‌లేదు. ప‌క్కోడు ఆశ్చ‌ర్యంగా చూశాడు.

"మా ఏపీ స‌ర్కార్  బ‌డ్జెట్‌లో చేసిందిదే. కేటాయింపుల‌న్నీ ఆ కోక‌లాగే నిగనిగ‌లాడుతూ క‌నిపిస్తాయి. చివ‌ర‌కి స‌వ‌రింపులు, కోత‌లు పోను మిగిలేది రుమాళ్లే. ప‌థ‌కాల‌కు చూపించే కోట్ల రూపాయ‌ల అంచ‌నా నిధులు, వాస్త‌వానికి వ‌చ్చేస‌రికి క‌రిగిపోతాయి. దాని ముందు ఇదెంత‌?" అనుకున్నాడు సామాన్యుడు.

వేదిక మీద మ‌రో ఐటెమ్. మెజీషియ‌న్ ఓ ఇత్త‌డి బిందెను ఎత్తి చూపించాడు. లోప‌లంతా ఖాళీ. ఈలోగా అసిస్టెంటు వ‌చ్చి దాన్నిండా నీళ్లు పోశాడు. 'వాట‌ర్ ఆఫ్ వ‌ర‌ల్డ్' అన్నాడు మెజీషియ‌న్‌. ఆపై క‌ర్ర తిప్పి బిందెను అమాంతం బోర్లించాడు.

ఆశ్చ‌ర్యం!

ఒక్క చుక్క కూడా కింద‌కి ప‌డ‌లేదు.

స‌భికులు లేచిపోయి మ‌రీ అర‌వ‌సాగారు. సామాన్యుడు, నీటి ప్రాజెక్టుల కోసం బ‌డ్జెట్‌లో చూపించిన అంచ‌నాలు గుర్తొచ్చి లేవ‌లేదు. 'అంకెలు ఘ‌నంగా క‌నిపించినా, ఆ త‌ర్వాత రెండు మూడు రోజుల్లో అంచ‌నాలు స‌వ‌రిస్తారు. ఆపై కోత‌లు త‌ప్ప‌వు. ఇక నిర్వ‌హ‌ణ మిన‌హాయించే ప్రాజెక్టుల‌కు ద‌క్కేదెంత‌?  ఈ బిందెలోంచి నీళ్లు రాన‌ట్టే, ఆ అంకెల నుంచి నిధులు రావు' అనుకున్నాడు.

"ఏం గురూ! ఈ మ్యాజిక్ కూడా నచ్చ‌లేదా" అన్నాడు ప‌క్కోడు న‌వ్వుతూ.

"న‌చ్చింది. అచ్చం మావాడిలాగే చేశాడులే" అన్నాడు సామాన్యుడు న‌వ్వ‌కుండానే.

ఇద్ద‌రూ క‌లిసి వేదిక‌మీద‌కి చూశారు. అక్క‌డి మెజీషియ‌న్ వేదిక‌కి ఈ ప‌క్క స్టాండుపై ఓ ఖాళీ పెట్టె, ఆ ప‌క్క మ‌రో స్టాండుపై మ‌రో ఖాళీ పెట్టె ఉంచాడు. "ఇదిగో చూడండి. ఈ కుందేలును ఈ పెట్టెలో పెడుతున్నాను. అది ఆ పెట్టెలోకి వ‌చ్చేస్తుంది. ఇది బ్లాక్ మేజిక్" అంటూ అని క‌ర్ర ఊపాడు. ఆ తర్వాత అవ‌త‌లి పెట్టె ద‌గ్గ‌ర‌కి వెళ్లి దాంట్లోంచి కుందేలును బ‌య‌ట‌కి తీసేస‌రికి స‌భికులంతా ఈలలు వేశారు.

"ఇందులో పెడితే అందులోకి ఎలా వ‌చ్చింది గురూ?" అంటూ పక్కోడు ఆశ్చ‌ర్యంగా అడిగాడు.

"అదంతేలే. అదే మ‌రి మ్యాజిక్కంటే. మా ఏపీ సర్కారైతే ఏవేవో ప‌థ‌కాలు ప్ర‌క‌టించి వాటిలో నిధులు పెడ‌తాడు. అయితే  ఆ నిధుల‌న్నీ దారిమ‌ళ్లి అయిన‌వారి జేబుల్లోకి వెళ్లిపోతాయి. కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా మావాడు ఒక చోట పెడితే మ‌రెక్క‌డో తేల్తాయి. మేం రోజూ చూసేదేలే..." అన్నాడు సామాన్యుడు తేలిగ్గా.

వేద‌క‌పై మెజీషియ‌న్ క‌ర్ర గిర్రున తిప్పేస‌రికి స‌భికుల మొహాల‌కు రంగురంగుల క‌ళ్ల‌జోళ్లు వ‌చ్చేశాయి. అంద‌రూ కేరింత‌లు కొట్టారు. "చూడండి... రంగుల రంగేళీ. మీ క‌ళ్ల ముందు అంతా వైభ‌వం, డ‌బ్బు, సంప‌ద‌... హ‌..హ్హ‌...హ్హ‌!" అన్నాడు. ఆ క‌ళ్ల‌ద్దాల లోంచి చూస్తే వేదిక అంతా బంగారంలాగా మెరిసిపోతోంది. ఎక్క‌డ చూసినా అక్క‌డ డ‌బ్బు క‌ట్ట‌లు కొండ‌ల్లాగా క‌నిపించాయి.

"ఇది మాత్రం అదుర్స్ క‌దా గురూ?" అన్నాడు ప‌క్కోడు.

సామాన్యుడు తాపీగా "ఓసారి క‌ళ్లజోడు తీసి చూడు" అన్నాడు. ఇద్ద‌రూ అలా క‌ళ్ల‌జోడు తీసి చూసేస‌రికి వేదిక మీద ఏవో కొన్ని చిల్ల‌ర డ‌బ్బులు త‌ప్ప కాసుల రాశులేమీ లేవు. పైగా అంతా మామూలుగానే ఉంది.

"అరె... ఇదేం మాయ‌?" అన్నాడు ప‌క్కోడు.

"నీకు మాయే. మాకు మాత్రం ఇది నిత్య స‌త్య‌మే. స్వ‌ర్ణ‌యుగం చూపిస్తానంటూ మావాడు ఇలాగే క‌ళ్ల‌కు గంతలు క‌ట్టాడు. బ‌డ్జెట్‌లో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆదాయం చూపిస్తూ మాయ చేశాడు. అంకెల గార‌డీ చేశాడు.మాట‌ల‌తో బురిడీ కొట్టించాడు. గంత‌లు తీసి  వాస్త‌వాలు చూస్తే  హాం... ఫ‌ట్‌. అంతా అప్పుల మ‌యం. ల‌క్ష‌ల కోట్ల రుణాలే క‌నిపిస్తాయి. అంచ‌నా ఆదాయాలు చూపించి హుళ‌క్కి చేయ‌డంలో మావాడు దిట్ట‌. మా ఏపీ స‌ర్కార్ ముందు, ఈ పీసీ స‌ర్కార్ ఎంత గురూ?" అంటూ సామాన్యుడు లేచాడు.

ప‌క్కోడు కూడా లేచి, "నాకూ మీ మేజిక్ షో చూపించ‌వూ, స‌ర‌దాగా ఉంది" అన్నాడు.

"వ‌ద్దు... వ‌ద్దు... నువ్వు చూసి భ‌రించ‌లేవు. ఈ మ్యాజిక్ షో చూస్తే నీకు ఆనందమైనా క‌లుగుతుంది. మాది చూస్తే అంతా విషాద‌మే!" అంటూ నిట్టూర్చి సామాన్యుడు నిర్వేదంగా సాగిపోయాడు.

-సృజ‌న‌

PUBLISHED ON 12.3.2022 ON JANASENA WEBSITE

ఆదివారం, మార్చి 06, 2022

మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాలు!



 ఏంట్రా అలా ఈసురోమన్న‌ట్టున్న‌వేం?” అని అడిగారు గురువుగారు, నీర్సంగా కాళ్లీడ్చుకుంటూ వ‌చ్చి చ‌తికిల‌బ‌డిన శిష్యుడిని చూసి.

శిష్య‌డు నిట్టూర్చి, “ఏం లేదు సార్‌. చిన్న కోర్టు వ్య‌వ‌హార‌మండి. బెడిసికొట్టిందండి...అన్నాడు.

ఓసింతేనా? దానికే బెంబేలు ప‌డితే ఎలా? ఇంత‌కీ ఏమైంది?”

ఏముందండీ... మ‌న‌కి వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చిందండి...

ఒరే... మ‌నం ఎద‌వ ప‌న్లు చేశాక తీర్పులు అలాగే ఎదురుతిరుగుతాయిరా... దానికే నీరుగారిపోతే ఎలా?”

మీకేమండి సార్‌... ఎన్న‌యినా చెబుతారు. తీర్పు విన‌గానే ప్రాణం చ‌చ్చిపోయిన‌ట్ట‌నిపించిందండి. ప‌రువు మొత్తం ఊడ్చుకుపోయిన‌ట్టే క‌దండి మ‌రి? ఛ‌... ఇంత బ‌తుకూ బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు అనిపించిందండి. పైగా గెలిచినోళ్లు సంబ‌రాలండి... త‌లెత్తుకోలేక‌పోతున్నానండి...

ఓరి నా వెర్రి శిష్యా... నువ్వు నా ద‌గ్గ‌ర‌కి ఎందుకొస్తున్నావురా, అది చెప్పు ముందు...

రాజ‌కీయాలు నేర్చుకుందామ‌నేక‌దండీ, అయితే ఏంటండీ?”

ఏంటంటావేంట్రా? పోలిటికల్ లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకునేవాడివి, ఇలా సిగ్గు ప‌డితే ఎలారా? సిగ్గూ శ‌రం, మానం అభిమానం... ఇలాంటివ‌న్నీ వ‌దిలేస్తేనే క‌ద‌రా నికార్స‌యిన నీచ నేత‌గా ఎదిగేది? ఇంత చిన్న విష‌యం నీకింకా ఒంట‌బ‌ట్ట‌కపోతే ఎలారా?”

ఊరుకోండి సార్‌... పాఠాలు వేరు, ప్ర‌తిష్ఠ వేరండి... అదే పోతే ఎంత అప్ర‌తిష్ఠండీ?”

ఒరే... నువ్వు రాజ‌కీయ నేత‌గా ఎదిగాక చేసేవ‌న్నీ అప్ర‌తిష్ట‌క‌ర‌మైన ప‌నులే క‌ద‌రా? అప్పుడే క‌దా నువ్వు అస‌మాన అసాధార‌ణ అధ‌మాధ‌మ నాయ‌కుడిగా చ‌రిత్ర‌లో మిగిలిపోతావు? ఏదో ఒక చిన్న కేసుకే ఇలా మ‌ధ‌న ప‌డిపోతే రేప్పొద్దున్న ఏ ముఖ్య‌మంత్రో అయి, నీ నికృష్ట ఆలోచ‌న‌ల‌న్నీ అమ‌లులో పెట్టేట‌ప్పుడు ఇంకెన్ని కేసులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో, మ‌రెన్ని తీర్పులు నీకు వ్య‌తిరేకంగా వచ్చి వెక్కిరిస్తాయో అది ఆలోచించు ముందు... అర్థ‌మైందా?”

అర్థ‌మైంది కానీ గురూగారూ, ఇప్పుడు న‌న్నేం చేయ‌మంటారండీ?”

ఏముందిరా... ఈ కోర్టు తీర్పును స‌వాలు చేస్తూ పైకోర్టుకెళ్లు. అక్క‌డా చుక్కెదురైతే రివిజ‌న్ పిటీష‌న్ త‌గిలించు. అక్క‌డా ఓడిపోతే స్పెష‌ల్ బెంచ్‌కెళ్లు. అక్క‌డ కూడా నీ ఎద‌వ ప‌నులు బ‌య‌ట‌ప‌డిపోయాయ‌నుకో, ఏకంగా ఆ తీర్పునిచ్చిన న్యాయ‌మూర్తుల మీద‌నే పిటీష‌న్ వేసెయ్యి. వాళ్లు ఈ కేసులో తీర్పులివ్వ‌డానికి అనర్హుల‌ని ఏవేవో కార‌ణాలు చూపించు...

అయ్య‌బాబోయ్ గురూగారూ! మీ బుర్ర‌లో ఇన్ని నీచ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయండీ? మీ అంత‌రంగంలో ఊరుతున్న నికృష్ట ఉపాయాలు వింటుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోందండి... ఎంత‌యినా మీకు మీరే సాటి గురూగారూ! అస‌లింత‌కీ మీరు ఇంత‌లేసి రాజ‌కీయాలు ఎక్క‌డ నేర్చుకున్నారండీ?”

ఓరేయ్‌... నీ పొగ‌డ్త‌లు ఆపు. న‌యా నీచ రాజకీయ నేత‌ల ముందు మ‌న‌మెంత‌? మ‌న తెలివితేట‌లెంత‌రా? చుట్టూ జ‌రుగుతున్న స‌మ‌కాలీన రాజ‌కీయం గ‌మ‌నిస్తే ఇలాంటి అద్భుత అకృత్యాల‌న్నో అవ‌లీల‌గా ఔపోస‌న ప‌ట్టొచ్చురా స‌న్నాసీ... కాబ‌ట్టి ముందు నీ ప‌ర‌గ‌ణాపై ప‌రిశీల‌న పెంచుకో. ఆపై నువ్వే నాకు పాఠాలు చెప్ప‌గ‌ల‌వు...

ఆ... అర్థ‌మైంది గురూగారూ! మీరు చెబుతున్న‌ది తాజాగా  అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించే క‌దండీనాకు న్యాయవ్య‌వ‌స్థ మీద గౌర‌వం అమాంతం పెరిగిపోయిందండి. ఎంత స్ప‌ష్ట‌మైన తీర్పండీ? స‌ర్కారు వారి కుయ‌త్నాల మీద ఎన్ని వ్యాఖ్యానాలండీ? అస‌లంత స్థాయిలో ఎక్క‌డికక్క‌డ ఎండ‌గట్ట‌డం ఆ నేత‌ల‌కు ఎంత నామ‌ర్దా? ఎంత సిగ్గుచేటు? ప‌రువు గోదాట్లో క‌లిసిపోయి త‌ల‌లు భూమిలోకి దిగిపోయుంటాయండి... అస‌లు మ‌ళ్లీ త‌లెత్తుకుని ప్ర‌జ‌ల ముందుకు ఎలా రాగ‌ల‌రండీ పాపం?”

ఓరి అమాయ‌కుడా? నువ్వెక్క‌డి సత్తెకాల‌పు స‌త్తెయ్య‌విరా? వాళ్ల మొహాల్లో అలాంటి భావాలేమైనా క‌నిపించాయిరా నీకు? ఎంచ‌క్కా విలేక‌రుల మైకుల ముందు మూతులెట్టుకుని ఎదురెట్టి వాగ‌లేదూ? రాష్ట్రంలో మూడు ముక్క‌లాట ఆగేది లేద‌ని మోర‌లెత్తుకుని మ‌రీ వ‌క్కాణించ‌లేదూ? అదిగో... ఆ తెగువ, ఆ తెంప‌రిత‌నమే నేర్చుకోవాలి నువ్వు. అస‌లీ వ్య‌వ‌హారాన్ని మొద‌టి నుంచీ గ‌మ‌నించావ‌నుకో, నీకు అడుగ‌డుగునా నీచ రాజ‌కీయ పాఠాలే క‌నిపిస్తాయి. ఏ స్థాయిలో అబ‌ద్దాలు ఆడ‌వచ్చో, ఎంత నీచంగా ప్ర‌చారాలు చేయ‌వ‌చ్చో, ఎంత బ‌రితెగించి బుకాయించ‌వ‌చ్చో... అన్నీ నేర్చుకోవాలి నువ్వు. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్నారు కానీ ఏమైనా నిరూపించ‌గ‌లిగారా? అంటే నీవ‌నుకున్న‌ది సాధించేందుకు ఎలాంటి నికృష్ట ఆరోప‌ణ‌ల‌కైనా వెనుకాడ‌కూడ‌ద‌ని అర్థం కావ‌డం లేదూ? ఓ వ‌ర్గం వారికే ప్ర‌యోజ‌నం క‌లిగిందంటూ ప్ర‌చారం చేశారు కానీ, అది అవాస్తవ‌మే క‌దా? అంటే అవ‌స‌ర‌మైతే నువ్వు కుల రాజ‌కీయాల‌ను కూడా ఎగ‌స‌న దోసి స‌మాజాన్ని తప్పుదోవ ప‌ట్టించ‌వ‌చ్చ‌ని తెలియ‌డం లేదూ? అస‌లా ప్రాంతం భారీ క‌ట్ట‌డాల‌కు ప‌నికిరాద‌ని, శ్మ‌శాన‌మ‌ని బుకాయించారే, దాన్ని బ‌ట్టి దుష్ప్ర‌చారాలు ఎలా చేయాలో నేర్చ‌కోవ‌ద్దూ? భూములిచ్చిన రైతులు పిడికిలి బిగించి ఉద్య‌మిస్తే ఏం చేశారో గ‌మ‌నించావ‌నుకో, నీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే జ‌నాన్ని ఎలా రాచి రంపాన పెట్టొచ్చో సులువుగా గ్ర‌హించలేవూ? ఉద్య‌మం సాగిన 27 నెల‌ల్లో రైతుల‌పై ఏకంగా 3853 కేసులు బ‌నాయించారంటే, అడ్డ‌గోలుగా చ‌ట్టాన్ని ఎలా వాడుకోవ‌చ్చో తెలిసిపోదూ? శాంతియుతంగా ర్యాలీలు చేసే మ‌హిళ‌ల్ని కూడా ఈడ్చిపారేశారంటే పోలీసు వ్వ‌వ‌స్థ‌ని ఎంతలా దుర్వినియోగం చేయ‌వ‌చ్చో తేట‌తెల్లం కాదూ? ఏకంగా 807 రోజుల పాటు సాగిన ఉద్య‌మంలో 189 మంది మ‌ర‌ణించినా చ‌లించ‌లేదంటే, ఎంత మొండిగా అధికారాన్ని చెలాయించ‌వ‌చ్చో అర్థం కాదూ? ఆఖ‌రికి తీర్పు చెప్ప‌బోయే న్యాయ‌మూర్తుల్ని కూడా ఈ కేసుల విచార‌ణ నుంచి తొలగించాలంటూ అడ్డ‌గోలు పిటిష‌న్ వేయించారంటే, అవ‌స‌ర‌మైతే న్యాయ‌వ్వ‌వ‌స్థ‌పై కూడా బుర‌ద జ‌ల్లే న‌య‌వంచ‌క విధానాల‌కు వెన‌కాడ‌క్క‌ర్లేద‌నే సూత్రం స్ఫురించ‌డం లేదూ? ఇలా చూస్తే ఒక‌టా, రెండా... ఈ మూడు ముక్క‌లాటలో  నువ్వు నేర్చుకోగ‌లిగే ముచ్చ‌టైన నికృష్ట‌పాఠాలెన్నో లెక్క తేల్చ‌డం సాధ్యం కాదురా... భ్ర‌ష్ట రాజ‌కీయాల‌కు నీ ప‌ర‌గ‌ణా ఓ పెదబాల‌శిక్ష‌! వికృత రాచ‌కేళికి అదొక విజ్ఙాన స‌ర్వ‌స్వం! నీచ ప‌రిపాల‌నక‌దో నిఘంటువు! అడ్డ‌గోలు విధానాల‌క‌దో అడ్డా! దుష్ట చేత‌ల‌క‌దో ద‌ర్ప‌ణం! అరాచ‌కానికదో అద్దం! కాదంటావా చెప్పు?”

ఆ పాటికి శిష్య‌డు క‌ళ్లు తేలేశాడు.

ఆపండి గురూగారూ... ఆపండి. ఇన్నేసి పాఠాలు ఒకేసారి చెప్పేస్తే నా బుర్ర తట్టుకోలేదండి. అస‌లింత‌టి అస‌మాన అద్వితీయ అకృత్యాల నేత‌గా ఎద‌గాలంటే నాకు ఎన్ని జ‌న్మ‌లు ప‌డుతుందో అర్థం కావ‌డం లేదండి. కానీ నాదొక సందేహం గురూగారూ! ఇలాంటి రాజ‌కీయాలన్నీ నేర్చుకుని అధికార పీఠం ఎక్కానే అనుకోండి, ఇన్నేసి ఎద‌వ‌ప‌నులు చేశానే అనుకోండి... మ‌రి ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌రంటారా? న‌న్నొక ద‌గుల్బాజీగా గుర్తు ప‌ట్టేసి సీటు దించేయ‌రంటారా?”

అస్స‌లు అన‌నురా... ప్ర‌జ‌లు చాలా తెలివైన వారు. వాళ్లు నీ నిజ‌స్వ‌రూపం ప‌సిగ‌ట్టి త‌మ వ‌ద్ద‌నున్న ఓట‌నే వ‌జ్రాయుధంతో చీల్చి చెండాడుతారు. ప‌ర‌గ‌ణా ప‌రిధిలోంచి త‌రిమి త‌రిమి కొడ‌తారు. కానీ ఈలోగా నువ్వీ దారుణ రాజ‌కీయ పాఠాల సాయంతో త‌రాత‌రాలు త‌ర‌గ‌ని ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటావు క‌దా? అదే క‌దా నీకు కావ‌ల‌సింది?”

అవునండోయ్‌... మీరు చెప్పిన‌ట్టు ఈ మూడు ముక్క‌లాట‌లో ముచ్చ‌టైన సూత్రాల‌న్నీ నేర్చేసుకుని నీచ రాజ‌కీయ ప‌ర‌మ‌ప‌ద సోపాన ప‌టంలో పాము తోక‌ప‌ట్టుకుని పైకి ఎగ‌బాకుతా! నిచ్చెన‌ల మీంచి నీతి నిజాయితీల‌ను తోసేస్తా!!

శెభాష్‌...ఇక పోయిరా!

-సృజ‌న‌

PUBLISHED ON 5.6.2022 ON JANASENA WEBSITE

బుధవారం, మార్చి 02, 2022

దండాలు మ‌హాప్ర‌భో...దండాలు!


 

ధిక్కార‌మును సైతునా...

అధికార ధిక్కార‌మును సైతునా...

ఎవ‌ర‌నుకుంటివి... ఏమ‌నుకుంటివి...

ఎంత‌టి వాడ‌ను నేన‌నుకుంటివి...

ఊరుకుందునా... ఊర‌క‌నుందునా...

ఊపిరి ఆపి ఊప‌కుందునా?

ఉక్కిరిబిక్కిరి సేయ‌కుందునా?

ధిక్కార‌మును సేతువా?

నా అధికార ధిక్కార‌మ‌నును సేతువా?

హ‌...హ్హ‌...హ్హ‌...హ్హా!

-అంటూ రాజుగారు అంతఃపురంలో గెంతులు వేస్తున్నారు. అధికారులు, అమాత్యులు, సేవ‌కులు, ప‌రిచారిక‌లు బిక్క‌చ‌చ్చిపోయి నోరెళ్ల‌బెట్టి చూస్తున్నారు.

ఇంత‌లో వార్తాహ‌రుడు విన‌యంగా వంగి వంగి వ‌చ్చాడు.

జ‌య‌ము జ‌య‌ము మ‌హారాజా... అన్నాడు, వంచిన త‌లెత్త‌కుండా.

రాజుగారు పిచ్చి గెంతులు ఆపి, “ఆ... ఏమిటి విశేషాలు వార్తాహ‌రా? మ‌న పాల‌న గురించి ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నారు?”

కిక్కురుమ‌న‌డం లేదు మ‌హారాజా! కుక్కిన పేనుల మ‌ల్లే ప‌డి ఉన్నారు...

హ‌...హ్హ‌...హ్హ‌... బాగు బాగు... జ‌నుల జీవ‌నమెట్లు సాగుతున్న‌ది?”

బెరుకుగా... బెంగ‌గా... భేషుగ్గా ఉంది ప్ర‌భూ...

బ‌హు బాగు... అట్లే ఉండ‌వ‌లె... ఎవ‌రూ త‌ల‌లెగ‌రేయ‌డం లేదు క‌ద‌?”

ఎంత‌మాట ప్ర‌భూ! జ‌నం ఆకాశంలో మేఘాల‌ను, ప‌క్షుల‌ను కూడా చూడ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. కిమ్మ‌న‌కుండా వంచిన త‌ల ఎత్త‌కుండా త‌మ ప‌నులు తాము చేసుకుంటున్నారు... త‌ల ఎత్తిన‌చో ఎక్క‌డ శ్రీవారు ధిక్కార‌మ‌ని భావింతురోన‌ని వారి భ‌య‌ము... న‌డుము నెప్పి లేకున్న‌నూ వంగి వంగి న‌డుచుచున్నారు. లేనిచో త‌మ‌రు అవిధేయుల‌ని త‌ల‌చెద‌ర‌ని బెదురుచున్నారు...

ఆహా... ఆనంద‌మానంద‌ము... ప్ర‌జ‌ల‌ట్టే భ‌య‌భ‌క్తుల‌తో ఉండ‌వ‌లె... ఏమందువు?”

ఏమందును ప్ర‌భూ... త‌మ‌రంటే భ‌య‌మున్న‌ది కాని భ‌క్తి సంగ‌తి సందేహ‌మే ప్ర‌భూ...

ఆ... ప‌నికి మాలిన భక్తి మ‌న‌కెందుల‌కు? ఇంత‌కూ నీవొచ్చిన కార‌ణంబేమి? ఏకాంత ఆనంద నృత్య విన్యాస‌మున‌కు అంత‌రాయ‌ము క‌లిగించిన‌దెందుల‌కు?”

కార‌ణ‌మున్న‌ది ప్ర‌భూ... రాజ్య‌మున ఒక క‌ళాకారుడు క‌ల‌డు. ఆతండ‌న్న జ‌న సామాన్య‌ములో ఎన‌లేని అభిమాన‌ములున్న‌వి... ఆత‌డి క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ములున్న ఎడ‌ల జ‌నం ఒడ‌లు మ‌రిచి పోటెత్తుదురు ప్రభూ...

అటుల‌నా? ఆ క‌ళాకారుడెటువంటి వాడు?”

ఝంఝూమారుత‌ములాంటి వాడు ప్ర‌భూ... ఆత‌డి మాట‌ల‌న్న జ‌నం చెవి కోసుకుందురు... ఆత‌డి ఆవేశ‌ము చూసి ఉప్పొంగిపోదురు...

అట్ల‌యిన ఆత‌డి ధ్యేయంబేమి?”

జ‌న‌చైత‌న్య‌మే ప్ర‌భూ... రాజ్య‌మున జ‌రుగు అవ‌క‌త‌వ‌క‌ల‌ను అత‌డు ప్ర‌శ్నించును... స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాటును... అరాచ‌క‌ముల ప‌ట్ల అప్ర‌మ‌త్తుల‌ను చేయును... పిడికిలి బిగించి పోరాడ‌మ‌ని పిలుపునిచ్చును... స్వ‌య‌ముగా స‌భ‌ల‌ను నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను ఉత్తేజితుల‌ను చేయును... వారి వెంట ఉండెద‌నంటూ తాను ముందుండి వారిని నడిపించును...

అంత‌టి ఘ‌నుడా? అట్ల‌యిన ప్ర‌మాద‌కారివ‌లె క‌నిపించుచున్నాడే? ఆత‌డి మాట‌లు ఆల‌కించి జ‌నం చైత‌న్య‌పూరితులైన‌చో మ‌న ఉనికికే భంగ‌ము వాటిల్లు అవ‌కాశ‌ము లేదందువా?”

త‌ప్ప‌క ఉన్న‌ట్లే ప్ర‌భూ... మ‌న రాజ్య‌మున ప‌లు స‌మ‌స్య‌ల‌ను అత‌డు ఇప్ప‌టికే ఎత్తి చూపినాడు... ప్ర‌జ‌ల‌కు కార్యాచ‌ర‌ణ‌మును కూడా సూచించినాడు...

ఏమా స‌మ‌స్య‌లు? ఏమా కార్యాచ‌ర‌ణ‌ములు?”

మ‌న రాజ్య‌మున గుర్ర‌ములు ప‌రెగెత్తుట‌కు సైత‌ము భ‌య‌ప‌డున‌టుల త‌యార‌యిన ర‌హదారుల గురించి జ‌న‌మును జాగృతుల‌ను చేసినాడు... ఆత‌డి సూచ‌న‌ల‌ను అనుస‌రించి జ‌నం ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల చిత్ర‌ముల‌ను ల‌క్ష‌ల కొల‌ది సేక‌రించి, వాటి దుస్థితి గురించి అనిత‌ర సాధ్య‌మైన ప్ర‌చార‌మును చేసినారు... వ‌లలు ప‌ట్టుకుని చేప‌ల వేట‌కు పోవుట‌యే కానీ తామే స‌మ‌స్య‌ల వ‌ల‌లో విల‌విల‌లాడుతున్నామ‌నే సంగ‌తి ప‌ట్ట‌ని మ‌త్స్య‌కారులను ఏకం చేసి వారిని సంఘ‌టిత‌ము చేసినాడు... వారి ఉపాధికి గండి కొట్టు త‌మ‌రి శాస‌న‌ము ప‌ట్ల విముఖ‌త‌ను ప్రోది చేసినాడు... వారిని పోరాట బాట ప‌ట్టించినాడు. శ్రీవారి నిష్క్రియాప‌రత్వ‌మును అడుగడుగునా ఎండ‌గ‌డుతున్నాడు... త‌మ‌రి పాల‌నా విధాన‌ముల‌లో లోప‌ముల‌ను వెలుగులోకి ఈడ్చుచున్నాడు... ప్ర‌భువుల అనిత‌ర సాధ్య‌మైన ప‌రిపాల‌న‌లో క‌ర్ష‌కులు, కార్మికులు, బ‌డుగులు, సామాన్యులు ఆఖ‌రికి ఉద్యోగులు సైతం ఎలా కునారిల్లుతున్నారో, ఎలా అణ‌గారిపోతున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తున్నాడు మ‌హ‌ప్ర‌భో! త‌మ‌రి హ‌యాములో దొంగ‌లు, దోపిడీదారులు, దుండ‌గులు, దౌర్జ‌న్య‌కారులు ఎలా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను భంగ ప‌రుస్తున్నారో ఎప్ప‌టిక‌ప్పుడు తేట‌తెల్ల‌ము చేయుచున్నాడు ప్ర‌భూ. మీ చ‌ల్ల‌ని నీడ‌న‌, మీ అండ‌న ప్ర‌జావ్య‌తిరేక శ‌క్తులు ఎలా ఏక‌మై, అనేక‌మై పెచ్చ‌రిల్లుచున్న‌వో విశ‌దీక‌రించుచున్నాడు. ఇటుల చెప్పుకుంటూ పోయిన ఆ క‌ళాకారుడి చేత‌ల జాబితా చేంతాడు క‌ట్టంతగా మారుతుంది మ‌హారాజా!

ఔరా... ఎంతటి ధిక్కార‌మెంత‌టి కండ‌కావ‌ర‌మెంత‌టి తెంప‌రితన‌మెంత‌టి తెగువ‌? అయిన అత‌డి మూల‌ముల‌ను దెబ్బ‌తీయ‌వ‌లె. ఆత‌డి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అడ్డుకొన‌వ‌లె. ఎవ‌రెక్క‌డ‌? ఆ కళాకారుడి చిత్ర‌విచిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగు ప్ర‌దేశ‌ముల‌నెల్ల ఆక్ర‌మించుకొనుడు. ఆయా ప్ర‌దేశాల‌లో అప‌రిమిత ఆంక్ష‌ల‌ను విధించుడు. అందుకొర‌కు మ‌న యంత్రాంగ‌మంత‌టినీ మోహ‌రించుడు. ఆత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు జ‌నం రాకుండ చేయుడు. అవ‌స‌ర‌మైతే మొత్తం క‌ళా ప‌రిశ్ర‌మ‌నే చిత్ర‌హింస‌ల‌కు గురిచేయుడు. క‌ళాకారుల సంఘ‌మునే క‌కావిక‌లు చేయుడు. హ‌...హ్హ‌...హ్హ‌... విజృంభించుడు!

మ‌న్నించండి ప్ర‌భూ! నాదొక విన్న‌పం. అట్లు చేసిన ఎడ‌ల ప్ర‌జ‌ల‌వినోద‌మున‌కు విఘ్న‌ము క‌లిగించిన‌వార‌గుదురేమో ఒక‌ప‌రి ఆలోచించ‌మ‌ని మ‌న‌వి...

ఆ మాట‌కి మ‌హారాజులో ఆవేశ‌ము పెల్లుబికింది. ఒక్కసారి విక‌టాట్ట‌హాస‌ము చేసి విరుచుకుప‌డ్డారు.

ఏమిటి ఆలోచించేది? నా పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు వినోద‌ము లేక‌పోయిన‌నూ ప‌ర‌వాలేదు. నా పాల‌నే ఆ వినోద‌మును అందించును. వినోద‌మున‌కు దూర‌మై ప్ర‌జ‌లు విషాద‌భ‌రితులైన‌ను నాకు స‌మ్మ‌త‌మే. నేనేంటో, నా అప్ర‌తిహ‌త అప‌రిమిత అరాచ‌క పాల‌నా తీరుతెన్నులు ఎలాంటివో ఇంకా తెలియ‌లేదా? నా ప‌రిపాల‌న తీరుతెన్నుల‌లో ఎన్ని అవ‌క‌త‌వ‌కలున్న‌నూ స‌రే... వాటిని ప్ర‌శ్నించే సాహ‌స‌ము ఎవ‌రూ చేయ‌రాదని క‌దా, నా అభిమ‌త‌ము. అట్లు చేసిన సొంత ప్ర‌జాప్ర‌తినిధినే బంధించి, చీక‌టి కొట్లో ప‌డేసి మక్కెలిర‌గ‌ద‌న్నిన వైన‌ము మ‌రచితిరా? నా ముందు రాజ్య‌మును వెల‌గ‌బెట్టిన వాడు నిర్మించిన ఖ‌రీదైన భ‌వ‌న స‌ముదాయ‌ముల‌ను సైత‌ము ప‌డ‌గొట్టి ధ్వంస‌ము చేసిన దురాగ‌త‌ముల‌ను విస్మ‌రించితిరా? ఆనాటి రాజ‌ధానినే నాశ‌న‌ము చేసిన సంగ‌తి గుర్తులేదా? ఆ రాజ‌ధానికి భూములిచ్చిన క‌ర్ష‌కుల త్యాగాన్నే కాల‌రాచిన నా అధికార క‌రాళ నృత్య విన్యాస‌మును తిల‌కించ‌లేదా? అదేమిట‌ని అడిగినంత‌మాత్రాన అమాయ‌కులపైన‌నూ చ‌ట్ట‌ములో ఏమూల‌నో దాగిన ఎక్కడెక్క‌డి కేసుల‌నో బ‌నాయించలేదా? ప‌్ర‌శ్నించిన వారిని త‌రిమిత‌రిమి కొట్టుటలేదా? వెంట‌ప‌డి వేటాడి వేధించుట లేదా? ఇదియే క‌దా నా పాల‌న తీరు? ఇదియే క‌దా నా అధికార వైచిత్రి? ఇంకా అర్థం కాలేదా? నా ముందు స‌ర్వులూ వంగి ఉండ‌వ‌లె. అణిగి ప్ర‌వ‌ర్తించ‌వ‌లె. అర్థ‌మైన‌దా? ఎనీ డౌట్స్‌?”

రాజుగారి అరివీర విజృంభ‌ణ‌కు అధికార గ‌ణం, ప‌రివార గ‌ణం గ‌డ‌గ‌డ వ‌ణికారు. అంద‌రూ క‌లిసి రాజుగారిని శాంతింపజేయ‌డానికి స్తోత్ర‌పాఠాలు అందుకున్నారు...

మ‌హాప్ర‌భో! శాంతించండి. మీ ఆగ్ర‌హావేశ కోప‌తాప విన్యాసాన్ని త‌ట్టుకోలేం.

క‌క్ష‌, కార్ప‌ణ్యాలు మీ ఉచ్చ్వాస‌నిశ్వాసాలు!

ప‌గ, ప్ర‌తీకారాలు మీ గుండె ల‌య విన్యాసాలు!

మీ సిర‌ల్లో అధికారం, మీ ధ‌మ‌నుల్లో అహంకారం ప్ర‌వ‌హిస్తున్నాయి!

మీ న‌ర‌న‌రాల్లో న‌య‌వంచ‌న‌బుస‌లుకొడుతోంది!

మీ క‌ణ‌క‌ణంలో కార్ప‌ణ్యం క‌ణ‌క‌ణ‌లాడుతోంది!

మీ వ్య‌వ‌హారాల్లో ద‌ర్పం దారుణంగా ప్ర‌స్ఫుట‌మ‌వుతోంది!

మీ తీరు అనిత‌ర సాధ్యం! మీ శైలి అన‌నుస‌ర‌ణీయం!

దండాలు మ‌హ‌ప్ర‌భో... దండాలు!

అంటూ అంద‌రూ సాగిల‌ప‌డ్డారు.

-సృజ‌న‌

PUBLISHED ON 26.2.2022 ON JANASENA WEBSITE