ఒక గాయకుడు పాడలేదంటే గొంతు సమస్య కారణం కావచ్చు. కానీ చెవి సమస్య కారణమవుతుందా? ఘంటసాల విషయంలో అదే జరగడం విచిత్రం. సాధారణంగా కొందరు గాయనీ,గాయకుల అలవాట్లు చిత్రంగా ఉంటాయి. ఘంటసాలకి రికార్డింగ్ సమయంలో చేతిలో కర్చీఫ్ ఉండాల్సిందే. పొరబాటున మరచిపోతే –‘కర్చీఫ్ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. ఆయనకున్న ఇంకో అలవాటు ఏంటంటే... పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకునేవారు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని అయన అభిప్రాయం. ఒకసారి ఏదో సమస్య వచ్చి తన పాట తన చెవికి వినిపించనట్లు అనిపించింది ఆయనకు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెవి చూపించుకున్నారు. డాక్టర్ పరీక్షించి ‘ఇదేమంత ఇబ్బంది కాదు. సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అయితే అందుకు ఘంటసాల అంగీకరించలేదు. తన పాట తన చెవికి తన చెవికి వినిపించే దాకా పది రోజులపాటు రికార్డింగ్ లకు వెళ్ళలేదు. కొన్నాళ్లకు డాక్టర్ చెప్పినట్టుగానే చెవి సమస్య దానంతట అదే సర్డుకొంది. అప్పుడాయన రికార్డింగ్‌కి హాజరయ్యారు. అప్పుడు ఆయన పాడిన పాట ఏంటో తెలుసా? ‘బుద్ధిమంతుడు’ (1969)లో ని ‘వేయి వేణువులు మ్రోగే వేళా... నను పాలింపగ నడచి వచ్చితివా...’ పాట!
సోమవారం, ఆగస్టు 19, 2024
బుధవారం, ఆగస్టు 14, 2024
గోదాట్లో సావిత్రి... అక్కినేని తెలివి!
మూగమనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న సమయంలో ఓ చిన్న ప్రమాదం జరిగింది. పడవ మీద నుంచి సావిత్రి నీటిలో పడిపోయింది. యూనిట్లో ఒక్కసారిగా కలకలం. ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.
ఆ సినిమాలో "ఈనాటి ఈ బంధమేనాటిదో .." పాట చిత్రీకరణ సమయంలో జరిగిందీ సంచలన సంఘటన. పాట షూటింగ్ లాంచీపై జరుగుతోంది. హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు . పి . ఎల్ . రాయ్ కెమెరా . పాటలో భాగంగా "ఎవరు పిలిచారనో... ఏమి చూడాలనో... ఉప్పొంగి ఉరికింది గోదావరీ...." అనే చరణం తీస్తున్నారు. సావిత్రి పడవ మీద నుంచి గోదావరి వైపు ఓ పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. అందరూ ఎవరి హడావుడిలో వాళ్లున్నారు. ఇంతలో లాంచి కింద ఉండే ప్రోపెల్లర్ కు సావిత్రి చీర కొంగు తగులుకుంది. ఇంకేముంది? ప్రొపెల్లర్ పళ్ళ చక్రం గిర్రున తిరిగేసరికి చీర మరింత చిక్కుకుపోవడంతో సావిత్రి, ఎవరో బలంగా గుంజిలాగినట్టుగా హఠాత్తుగా ఆ లాంచీ మీంచి గోదావరిలో పడిపోయారు. అనుకోని ఉపద్రవమే అయినా చటుక్కున తేరుకున్న సావిత్రి వెంటనే సమయస్ఫూర్తితో లాంచి అంచును పట్టుకోగలిగారు. ఆమె అలా లాంచీ పట్టుకుని వేలాడుతుంటే... యూనిట్టంతా హాహాకారాలు. లాంచీ ఆగిపోయింది. మరో పడవలోనున్న యూనిట్ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు హడావుడిగా లాంచీలోకి దూకారు. గబగబా ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు కానీ పైకి రావటం లేదు. ప్రమాదం లేదని తెలుసుకున్న యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకుని ''రండమ్మా... అంటూ అరుస్తున్నారు . అయినా ఆవిడ నీట్లోంచి పైకి రావటం లేదు. పరిస్థితిని ఏయన్నార్ గ్రహించారు. వెంటనే లాంచీలో ఓ మూల ఉన్న కేన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. సాసేపటికి ఆ కాన్వాస్ పట్టాను చుట్టుకుని సావిత్రి బయటకు వచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రోపెలర్ కు చుట్టుకుపోయి ఉంది. అప్పుడుగానీ, సావిత్రి నీటిలోంచి బయటకు రావడానికి ఎందుకు తటపటాయించారో అక్కడివారికి తెలియలేదు. చీర మొత్తం చుట్టుకుపోయి ఉంటుందని ఏయన్నార్ తెలివిగా ఊహించి కాన్వాస్ పట్టాను ఇవ్వడంతో సావిత్రి సమస్య తీరింది.
మంగళవారం, ఆగస్టు 13, 2024
ఎన్టీఆర్ అభిప్రాయం అలా మారింది!
ఇది1965 నాటి మాట. మద్రాసులో రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ ‘వీరాభిమన్యు’ షూటింగ్ జరుగుతోంది. బ్రేక్ లో నటీనటులంతా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు ఉన్నట్టుండి రాజకీయాల వైపు మళ్ళాయి. చర్చ ఆసక్తి కరంగా జరుగుతోంది. ఆ సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ వచ్చారు. రసవత్తరంగా సాగుతున్న రాజకీయ చర్చ విని పెదవి, మొహం చిట్లించి, “మనకెందుకు బ్రదర్ ఈ రాజకీయాలు? కూడు పెడతాయా? గుడ్డనిస్తాయా? మన పని సినిమాల్లో నటించడం, మన కుటుంబాల్ని పోషించుకోడం!” అంటూ తన పని లో తాను మునిగిపోయారు.
సోమవారం, ఆగస్టు 12, 2024
అరుదైన యోగం... అద్భుత ప్రయాణం!
నదుల్లో పుణ్య స్నానాలు అందరం చేస్తాం...
ఓ దణ్ణం పెట్టుకుని, మూడు మునకలు వేసి చక్కా వస్తాం...
ఏ సంకల్పమో చెప్పుకున్నా సాధారణంగా అది రెండు మూడు నిమిషాల వ్యవహారం...
కానీ దాదాపు గంట సేపు చేసే పుణ్యస్నానం అనుభవంలోకి రావడం అరుదైన విషయం...
శాస్త్ర నిర్దేశితంగా, సంప్రదాయబద్దంగా, విపులంగా, అనేక అంశాలను స్పృశిస్తూ... దేవ, రుషి తర్పణాలను, అర్ఘ్యాలను, పితృదేవతలకు జలతర్పణాలను అర్పిస్తూ, జన్మజన్మల పరంపరలో చేసే అనేకానేక పాతకాలను, పాపాలను ఉటంకిస్తూ వాటి నుంచి ప్రక్షాళన కోరుతూ, ప్రార్థన చేస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో తలమునకలవుతూ పునీతలమయ్యేలా చేసే పవిత్ర స్నానం ఎంతటి సంతృప్తిని కలిగిస్తుందో తొలిసారి అనుభవంలోకి వచ్చింది ఆదివారం నాడు.
ఈ ఆదివారం సామాన్యమైనది కాదు. పుష్యమీ నక్షత్రం, అమావాస్యలతో కూడి అరుదుగా వచ్చే భానువారం. ఈ రోజున గోదావరి స్నానం అత్యంత పుణ్యప్రదమైనదని శాస్త్రం చెబుతోంది. 'పుష్యార్క యోగం' అనే ఈ పుణ్యస్నానాన్ని ఆగస్టు 4 ఆదివారం నాడు సరస్వతి కొలువైన బాసర క్షేత్రంలో ఆచరించగలిగాం.
ఈ యాత్ర చేయాలనే సంకల్పం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడం, ఇందులో పాల్గొన్న అందరి చేతా సంపూర్ణ శాస్త్రీయ సంకల్ప సహితంగా పవిత్ర స్నానాలు చేయించడం వెనుక ఘనతంతా హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులైన మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారికే చెందుతుంది.
హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ శర్మగారితో పాటు, నేను, శ్రీనివాసన్‌గారు, రమణరావుగారు, గోపాల కృష్ణగారు కలిసి కారులో బాసర యాత్రకు బయల్దేరాం. ఉదయం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఎన్నో చక్కని అనుభూతులు. ప్రయాణమంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఇదొక చక్కని సత్సంగ యాత్రగా మంచి జ్క్షాపకాలను మిగిల్చింది. దారి పొడవునా ధర్మపరమైన ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. మా అందరి సందేహాలకు శ్రీకాంత్ శర్మ గారు ధర్మపరమైన సమాధానాలు అందించారు. అందరి కబుర్లలో ఎన్నో మంచి విషయాలు చోటు చేసుకున్నాయి.
ఎల్ అండ్ టీ సంస్థతో పెద్ద హోదాలో ఉన్న శ్రీనివాసన్ గారు, బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైరయిన గోపాల కృష్ణగారు పంచుకున్న అంశాల ద్వారా అన్ని ధర్మాల కన్నా మానవత్వమే సాటిలేనిదని అర్థమైంది. ఓ కుగ్రామంలో తన మేనత్త చనిపోతే, పాడె మోయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో శ్రీనివాసన్ గారు చొరవ తీసుకుని మరో వ్యక్తి సాయంతో కేవలం ఇద్దరే కలిసి పాడె మోసి, ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించడం... ఆఫీసు పని మీద, ఆఫీసు కారులో, బాస్‌తో కలిసి ప్రయాణిస్తూ, దారిలో ఎవరో యాక్సిడెంటుకు గురైన విషయాన్ని గుర్తించి కారు ఆపించి, ఆ ప్రమాదంలో కాలు విరిగి బాధపడుతున్న మహిళను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించడం... గోపాలకృష్ణగారు కూడా తన బంధువొకరు చనిపోయినప్పుడు అనవసర భయాలను, సందేహాలను పక్కన పెట్టి, సొంతవారు సైతం వారిస్తున్నా వినకుండా అంత్యక్రియలు జరిపించడం... లాంటి విషయాలు వింటుంటే అందరూ వీరిలాగా స్పందించగలిగితే సమాజం ఎంత బాగుంటుందో కదా అనిపించింది.
బాసరలో కన్నా నిజామాబాద్ జిల్లాలోని పుష్కర ఘాట్‌లో గోదావరి జలాలు నిర్మలంగా ఉంటాయనుకుని బినోలా గ్రామానికి ముందుగా వెళ్లాం. అక్కడ మేం ఊహించిట్టుగా స్నానం చేయడానికి అనువైన పరిస్థితులు లేకపోయినా, ఆ తీరంలోని ఓ పురాతనమైన ఆలయంలో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకున్నాం. గర్భగుడిలోకి వెళ్లి శివాభిషేకం చేసుకుని, లేత మారేడు దళాలతో అర్చించుకుని ఓ మంచి అనుభూతిని పొందాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వృద్ధుడైన ఆ గుడి అర్చకుడు మా అందరినీ భోజనాని ఆహ్వానించడం. స్నానాలకు వచ్చిన వారందరికీ ఆ అర్చకుడు, ఆయన కుటుంబీకులు కలిసి స్వయంగా వండి అన్నదానం చేస్తారట.
ఎక్కడో మారుమూల గ్రామంలో, ప్రధాన రహదారికి దూరంగా పంట పొలాల మధ్యగా సాగే మట్టి దారిలో, ఆ స్నానాలరేవుకి వచ్చే వారందరికీ వాళ్లు ఇలా ప్రతి రోజూ చేస్తారని తెలిసి ఎంతో ఆశ్చర్యమనిపించింది. ఆ గుడి ఆవరణలో అప్పటికే వంట కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఇదే కదా అసలైన ఆధ్యాత్మికత అంటే? అనిపించింది వారిని చూస్తే. పోనీ ఆ గుడికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు సైతం ఏమీ అందుతున్నట్టు కనిపించలేదు. అయినా ఆ బడుగు వృద్ధుడి ప్రయత్నం చూస్తే అన్నదాన సంకల్పానికి పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని అర్థమైంది. అక్కడికి అరుదుగా వచ్చే యాత్రికుల మీదనే వారు ఆధారపడి ఉండొచ్చు. కానీ వచ్చిన వారందరికీ వండి వార్చి వడ్డించాలని ఎక్కడుంది? ఆ వృద్ధుడికి తోచిన ఆర్థిక సాయం తలా కాస్తా అందించి తిరిగి బాసరకు బయల్దేరి మధ్యాహ్నానికల్లా బాసర చేరుకున్నాం.
అక్కడ ఓ ఘాట్‌లో ఉరవడిగా ప్రవహిస్తున్న గోదావరిలో తనివితీరా, సంతృప్తికరంగా, ఆధ్యాత్మికంగా పవిత్ర స్నానాలను ఆచరించాం. ఆ తీరంలోనే సిమెంటు చప్టా మీద శ్రీకాంత్ శర్మగారి మార్గదర్శకత్వంలో అపరాహ్నం వేళ అమావాస్య తిల తర్పణాలను పితృదేవతలకు సమర్పించుకున్నాం. ఆ తర్వాత అందరం బాసరలోని బ్రాహ్మణ అన్నదాన ఆశ్రమానికి వెళ్లాం. అక్కడ భోజనం నిజంగా అమృతప్రాయంగా ఉంది. కలగలుపు పప్పు,రెండు కూరలు, రసం, స్వీటు, అప్పడం లాంటి పదార్థాలను హాయిగా ఆరగించి, ఆ సత్రానికి ఇతోధికంగా ఆర్థిక విరాళాలు అందించి, బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లాం.
మాతో వచ్చిన రమణరావుగారు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి. ఆయన ఆలయ ఈవోకి ఫోన్ చేయడంతో ఒక వ్యక్తి ప్రత్యేకంగా మా కూడా వచ్చి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించాడు. వ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించి పూజించి జ్ఞాన సరస్వతిని ప్రత్యక్షం చేసుకున్న ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారిని తనివి తీరా దర్శించకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం. ఈ మొత్తం ప్రయాణమంతా రమణరావుగారే కారు డ్రైవ్ చేశారు. మేం యాత్ర చేసిన ఎర్టిగా కారు కూడా ఆయనదే. రానూ పోనూ దాదాపు 9 గంటల పాటు సాగిన యాత్రలో రమణరావు గారు ఎక్కడా ఎలాంటి అలసటకు కానీ, విసుగుదలకు కానీ గురి కాకుండా సురక్షితంగా హాయిగా మా ప్రయాణం సాగేలా చేశారు. అందరం కలిగి హైదరాబాద్‌కి రాత్రి పదిన్నర కల్లా చేరుకోవడంతో మా బాసర యాత్ర ముగిసింది. నిజంగా ఇదొక అరుదైన యోగం... అద్భుత ప్రయాణం!
శుక్రవారం, జులై 26, 2024
తాటకగా మారిన అందమైన యక్షిణి! (పిల్లల కోసం రాముడి కథ-9)
విశ్వామిత్రుడి వెంట బయల్దేరిన రామ లక్ష్మణులు రెండో రాత్రిని అంగదేశంలోని మునుల ఆశ్రమంలో గడిపారు. ఆ మర్నాడు మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలైంది. ఆ ఆశ్రమంలోని మునులు వారి కోసం ఒక నావను సిద్ధం చేశారు. ఆ నావపై గంగానది దక్షిణ తీరానికి వెళ్లసాగారు. ప్రవాహం మధ్యలోకి నావ రాగానే నది వేగం ఒక్కసారిగా పెరిగింది. అలల ఉధృతికి వచ్చే శబ్దాలు అధికమయ్యాయి. ఇది గమనించిన రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని అడిగాడు.
''మహాత్మా! ఉన్నట్టుండి నది వేగం ఎందుకు పెరిగింది? నీటిలోంచి వినిపిస్తున్న ఆ భయంకర శబ్దాలకు కారణమేంటి?'' అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు.
''రామా! పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తపస్సు చేశాడు. తనకు దగ్గరలో ఒక సరస్సు ఉంటే బాగుంటుందని తలపోశాడు. వెంటనే అక్కడొక చక్కని సరస్సు ఏర్పడింది. బ్రహ్మ మనో సంకల్పం వల్ల పుట్టింది కాబట్టి దానికి 'మానస సరోవరం' అనే పేరు కలిగింది. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి అది సరయూ నది అయింది. ఆ నది ఇక్కడ గంగానదితో కలుస్తోంది. రెండు నదీ ప్రవాహాల వల్లనే అలల వేగం, శబ్దం కూడా పెరిగాయి. పవిత్రమైన ఈ నదుల సంగమ ప్రదేశానికి నమస్కరించు'' అని చెప్పాడు. రామలక్ష్మణులు భక్తితో ఆయన చెప్పినట్టుగానే చేశారు.
తర్వాత వాళ్లు గంగానదిని దాటి దక్షిణ తీరానికి చేరి నడవసాగారు. చుట్టూ దట్టమైన అడవి. అలా నడుస్తూ ఉండగా రాముడు ఆసక్తిగా మరో ప్రశ్నను విశ్వామిత్రుడిని అడిగాడు.
''మహర్షీ! ఎంత దూరం నడిచినా ఎక్కడా మానవ సంచారం కనిపించడం లేదు. క్రూర మృగాలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక్కడ పెరిగిన మహా వృక్షాల వల్ల సూర్యరశ్మి కూడా నేల మీద పడటం లేదు. నిర్జనమైన ఈ అరణ్యం పేరేమిటి?'' అని వినయంగా ప్రశ్నించాడు.
విశ్వామిత్రుడు వివరించాడు.
''రామా! ఇప్పుడు దట్టమైన అడవిలా మారిన ఈ ప్రదేశంలో పూర్వం రెండు దేశాలు ఉండేవి. అవి దేవతలచే ఏర్పడినవి. అవే మలద, కరూశ దేశాలుగా పేరొందాయి. వాటిని దేవతలు ఎందుకు నిర్మించారో కూడా చెబుతాను విను. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు, వృత్రాసురుడిని చంపాడు. ఆ కారణంగా అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఫలితంగా అతడిని ఆకలి పీడించసాగింది. అప్పుడు దేవతలు ఇంద్రుడిని పవిత్రమైన ఇక్కడి గంగా జలాలతో మంత్ర పూర్వకంగా అభిషేకించారు. వెంటనే ఇంద్రుడి మాలిన్యం, పాపము కూడా తొలగిపోయాయి. అందుకు సంతోషించిన ఇంద్రుడు ఈ ప్రదేశంలో ధనధాన్యాలతో తులతూగే రెండు దేశాలు ఏర్పడతాయని, మలద కరూశ దేశాలుగా ప్రసిద్ధికెక్కుతాయని వరం ఇచ్చాడు. అలా దేవతలు నిర్మించిన ఈ దేశాలలో ప్రజలు ఎంతో వైభవంగా జీవించేవారు. అలాంటిది ఒక యక్షిణి కారణంగా ఆ రెండు దేశాలు నాశనమయ్యాయి. ఆమె పేరు తాటక. పుడుతూనే వేయి ఏనుగుల బలం ఆమె సొంతం. ఆమెకు మారీచుడనే రాక్షసుడు పుత్రుడిగా కలిగాడు. వాడు మహాకాయుడు. ఇంద్రుండంతటి పరాక్రమశాలి. దుర్మార్గులైన ఆ తాటక, మారీచుల వల్లనే ఈ రెండు దేశాలూ ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఇక్కడికి ఒకటిన్నర యోజనాల దూరంలోనే ఆమె ఉంటున్నది. తాటకవనంగా పేరొందిన ఆ దారినే మనం ముందుకు సాగాల్సి ఉంది. రెండు దేశాలను కబళించిన ఆ తాటకను నువ్వు వధించాలి. ఈ దేశాలకు ఆమె బెడదను తొలగించాలి'' అన్నాడు.
తాటక గురించి వినగానే రాముడి మనసులో మరో ప్రశ్న ఉదయించింది.
''మునీశ్వరా! సాధారణంగా యక్షులకు అంతటి పరాక్రమవంతులు ఉండవంటారు కదా? మరి అబల అయినప్పటికీ తాటకికి మాత్రం వెయ్య ఏనుగుల బలం ఎలా కలిగింది?''
అప్పుడు విశ్వామిత్రుడు తాటకి వృత్తాంతాన్ని విపులంగా చెప్పాడు.
పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు. అతడు మంచి ప్రవర్తన కలిగినవాడు, పరాక్రమవంతుడు. కానీ సంతానం లేనివాడు. ఆ చింతతో అతడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతడికి వెయ్యి ఏనుగుల బలంతో ఒక కుమార్తె పుడుతుందని వరం ఇచ్చాడు. ఆమే తాటక. ఎంతో అందచందాలతో ఎదిగింది. సుకేతుడు ఆమెను జంభాసురుడి కుమారుడైన సుందుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. వారిద్దరికి పుట్టిన వాడే మారీచుడు. ఒకసారి తాటక భర్త అయిన సుందుడు, అగస్త్య మునికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురై మరణించాడు. తన భర్త మృతికి కారణమైన అగస్త్యునిపై కోపంతో తాటక, మారీచుడితో కలిసి దాడికి సిద్ధపడింది. తనను చంపడానికి వస్తున్న ఆ ఇద్దరిని కూడా అగస్త్యుడు శాపించాడు. ఆ శాపం వల్ల మారీచుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాటక తన సుందరమైన రూపాన్ని పోగొట్టుకుని వికృతమైన నరమాంస భక్షకురాలిగా మారిపోయింది. అగస్త్యుడి మీద కోపంతోనే తాటక, ఆయన సంచరించిన ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసింది. రాక్షస స్వభావంతో నిరపరాధులైన ఇక్కడి జనులను కబళిస్తోంది.
ఇదంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! లోక కంటకిగా మారిన ఆ తాటకను నువ్వు చంపు. స్త్రీని చంపడం అధర్మమని సందేహించకు. ప్రజలకు మేలు చేకూర్చడమే రాజకుమారుడి ధర్మం కదా?'' అన్నాడు.
దానికి రాముడు వినయంగా, ''మహర్షీ! మీరు ఏమి చెప్పినా చేయమని నా తండ్రి నన్ను ఆదేశించారు. కాబట్టి నిస్సందేహంగా తాటకను వధిస్తాను'' అన్నాడు.
అలా అంటూనే తన కోదండాన్ని ఎక్కుపెట్టి నారి సారించి వదలడం ద్వారా ధనుష్టంకారం చేశాడు. ఆ వింటినారి నుంచి వెలువడిన మహా ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆ భయంకర శబ్దం తాటకి చెవులను సోకింది. వెంటనే తాటక ఆవేశంతో నలుదిక్కులా చూసి, ఆ ధ్వని వినిపించిన వైపు వడివడిగా వచ్చింది. అక్కడ రామలక్ష్మణులు కనిపించారు.
వికృతమైన ముఖంతో, మిక్కిలి లావైన, ఎత్తయిన శరీరంతో కోపావేశంతో వస్తున్న తాటకను చూసి రాముడు, లక్ష్మణుడితో ''చూశావా లక్ష్మణా ఈమె ఎంత భయంకరంగా ఉందో? ఈమెను చూస్తేనే సామాన్య జనం భయంతో గుండె పగిలి చనిపోతారు. ఈమె ముక్కు చెవులు ఖండించి పారిపోయేలా చేస్తాను'' అన్నాడు. కోపంతో చేతులు పైకెత్తి దూసుకు వస్తున్న తాటకను చూసి విశ్వామిత్రుడు ''రామలక్ష్మణులకు జయమగుగాక!'' అంటూ ఆశీస్సులు అందించాడు. ఈలోగా తాటక సుడిగాలిని సృష్టించి అక్కడంతా దుమ్ము, ధూళి రేగేలా చేసింది. తన మాయాశక్తితో కనబడకుండా రాళ్ల వర్షం కురిపించింది. రాముడు ఒక బాణంతో దుమ్మంతా చెదిరిపోయేలా చేసి, మరికొన్ని బాణాలతో రాళ్లను ఛేదించాడు. తాటక రెండు చేతులను కూడా ఖండించాడు. చేతులు తెగిపోయినా మీదకు వస్తున్న తాటకను లక్ష్మణుడు చూసి ముందుకు దూకి ఆమె ముక్కు చెవులను కోసేశాడు. కామరూపిణి అయిన తాటక తన మాయతో అనేక రూపాలు పొంది వారిని భ్రమపెట్టడానికి ప్రయత్నించింది. రాళ్ల వర్షం కురిపించసాగింది. ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు, వారిని అప్రమత్తం చేశాడు. ''రామా! ఈమెపై జాలి చూపించకు. పాపాత్మురాలైన ఈమె యజ్ఞయాగాలకు అవాంతరాలు కలిగిస్తూ ఉంటుంది. చీకటి పడితే రాక్షసులు మరింత బలం పుంజుకుంటారు. వెంటనే హతమార్చు'' అన్నాడు.
వెంటనే రాముడు శబ్దవేధి బాణాన్ని సంధించి తాటకపైకి ప్రయోగించాడు. ఆ బాణం గుండెల్లో గుచ్చుకోవడంతో తాటక అక్కడికక్కడే మరణించింది. తాటక మరణించగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడు పరమానందంతో రాముని ప్రశంసించి, ''మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు ఉదయం బయల్దేరి ఆశ్రమానికి చేరుకుందాం'' అన్నాడు. అయోధ్య నుంచి బయల్దేరాక మూడో రాత్రిని రామలక్ష్మణులు తాటక వనంలో గడిపారు. మర్నాడు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!
ర




