మంగళవారం, ఏప్రిల్ 22, 2014

ప్రజాధన చోరాగ్రేసరుడు


'ఎవరండీ మీరు?'
'నేనొక సంఘం అధ్యక్షుడినండి. మిమ్మల్ని ప్రత్యేకంగా కలవడానికి వచ్చా'

'ఏ సంఘం అది?'

'అఖిలాంధ్ర దొంగ, దుండగ, దుర్జన, దగుల్బాజీ, నీచ, నికృష్ట, నయవంచక, అవినీతి, అక్రమార్కుల సంఘమండి. అఖిల భారత, అఖిల ప్రపంచ శాఖలకు అనుసంధానమండి'

'అద్సరే, కానీ నన్ను కలవడం ఎందుకు?'

'భలేవారండి బాబూ! మనకో సంఘం ఉంటే దాని భావజాలంతో అత్యంత సన్నిహిత సారూప్యం ఉన్న పెద్దమనుషులను కలుస్తుంటాం కదండీ? పైగా మీకు మేమంతా ఏకలవ్య శిష్యులమండి. మా కార్యాలయాల్లోను, మా ప్రతినిధుల ఇళ్లలోను మీ ఫొటో పెట్టుకున్నామండి. రోజూ తమరి మొహం చూసి కానీ మా వెధవ పనులను మొదలుపెట్టమండి. ఎప్పటి నుంచో మిమ్మల్నోసారి కలవాలనండి. ఇదిగో, ఇవాళ కుదిరిందండి'

'ఇంతకూ నాతో మీకేం పని?'

'ఇన్నాళ్లూ మేమేదో ఒక సంఘం పెట్టుకుని సభ్యుల సంక్షేమానికి ఏదో అరకొరగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నామండి. అసలిలాంటి సంఘం ఒకటి పెట్టి కడుపుకక్కుర్తితోనో, కడుపు మంటతోనో, ఎదగలేకో, ఎదిగే దారిలేకో, అవకాశాలు కనబడకో దారితప్పిన సహచరుల సాధకబాధకాలు పట్టించుకుని, వాళ్లు మరింత రాణించే తోడ్పాటు అందించాలనే ఆలోచన వచ్చినందుకు ఇంతకాలం నాలో నేను పొంగిపోయేవాడినండి. కానీ, నేనెంత అమాయకుడినో ఇప్పుడు అర్థమైందండి. ఎలాంటి సంఘం లేకుండానే మీరు మనలాంటివాళ్లను ఉన్నపళంగా ఉద్ధరించేశారండి. అందుకే నాకు, నా సంఘానికి, మా సభ్యులకు మీ ఆశీర్వచనాలు అందిస్తారని చక్కా వచ్చానండి'

'ఓ... అదా సంగతి! మీరు చెప్పిందంతా బాగుంది కానీ, దారి తప్పిన సహచరులనడమే నాకు నచ్చలేదు. అసలిదే సరైన దారి అయినప్పుడు ఇక తప్పడమేంటి?'

'ఆహా... ఓహో... చూశారా, ఎంత చక్కని పాయింటు లాగారో? నిజానికి నా ఉద్దేశం మనవాళ్లంతా సంఘం దృష్టిలో దారితప్పినవారేనండి. మన దృష్టిలో మనమే ఘనులమండి'

'సరిగ్గా చెప్పారు. ఇప్పుడు నాకు నచ్చారు. మరి నేనేదో ఉద్ధరించేశానని అంటున్నారు, అంత గొప్ప పనులు నేనేం చేశాను?'

'అమ్మమ్మ, ఏదో వినయం కొద్దీ తమరు అలా అంటున్నారు కానీ- తమంతటి వారు తమరేనండి! ఇంతకాలం మా సంఘ సభ్యులంతా ప్రజల సొమ్మును నేరుగా దోచుకుంటూ చట్టవ్యతిరేకులమనే ముద్ర వేయించుకున్నామండి. కానీ తమరు? దోచుకున్నది అదే ప్రజల సొత్తయినా, అదంతా చట్టబద్ధంగా సాగినట్టుగా భ్రమ కల్పించారండి. ఆ లెక్కన చూస్తే, మేమంతా ముసుగేసుకుని దొంగ పనులు చేస్తే, తమరు దొంగ పనులకే ముసుగేశారన్నమాటండి. నిజానికి అధికారం లేకుండానే తమరు ఇన్నేసి కోట్లను కొబ్బరి బొండంలో నీళ్లు తాగినట్టు పీల్చేశారంటే, అధికారం అంటూ మీకు అందింతే ఇంకెంతగా ఒలుచుకు తినేస్తారో, తలచుకుంటే ఒళ్లు పులకించి పోతోందండి'

'మీరు నా గురించి బాగానే తెలుసుకున్నారు కానీ, అంతా నేనొక్కడినే తిన్నట్లు చెప్పడం మాత్రం నచ్చలేదు'

'అబ్బెబ్బే, నేనింకా అక్కడి దాకా రాలేదండి. తమరెంత దయార్ద్ర హృదయులో నాకు తెలుసండి. మాలాంటివాళ్లెందరినో కోట్లకు పడగలెత్తించినవారు తమరేనండి. మీ చల్లని నీడలో చిన్నాచితకా దొంగలే కాదండి, బడాబడా చోరశిఖామణులూ పచ్చగా పచ్చనోట్లు పట్టేశారన్న నిజం దాచినా దాగనిది కాదా చెప్పండి? జాలిగుండెతో పాటు అపారమైన తెలివితేటలూ జతపడటం మీతోనే సాధ్యమైందండి'

'పొగడ్డానికి అంటున్నారా? నాకు పొగడ్తలంటే నచ్చదు. మీ మాటలకు ఆధారాలు చూపించగలరా?'

'ఇన్నేసి దగాకోరు పనులు చేసి కూడా పొగడ్తలంటే గిట్టకపోవడమనేది గొప్ప లక్షణం కాదండీ? ఇక మీ తెలివికి ఆధారాలు చూపిస్తా వినండి. ఇన్నేళ్లుగా మనరాష్ట్రంలో ఎందరెందరో అధికారం చలాయించారు. కానీ అసలిక్కడ ఇంతింతలేసి వనరులు ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని ఇన్నేసి కోట్లు బయటికి లాగవచ్చనే ఆలోచన ఎవరికైనా వచ్చిందాండీ? ఏళ్ల తరబడి తవ్వుకున్నా తరగని కోట్లాది టన్నుల ఖనిజాలున్న గనులు, కొండలు, ప్రాంతాలు ఉన్నాయని ఎవరు కనిపెట్టారు చెప్పండి? వాటిని అయినవారికి లీజుకిచ్చి గలీజు పనులు చేయవచ్చని, అప్పగించి అప్పనంగా ఆర్జించవచ్చని, కట్టబెట్టి కట్టలు పోగేయవచ్చని, ధారాదత్తం చేసి దోచుకోవచ్చని, ఇచ్చినట్టే ఇచ్చి పుచ్చుకోవచ్చని ఎవరికి తట్టింది చెప్పండి? అలాగే జన సంక్షేమం కోసం పథక రచన చేసి స్వజన సంక్షేమం చేసుకోవచ్చని, ప్రజల పేరు చెప్పి పనులు మొదలుపెట్టి ఆ ప్రజలు కష్టపడి కట్టే పన్నుల సొత్తును ఖజానా నుంచి ఘరానాగా దారి మళ్ళించవచ్చని ఒక్కరు... ఒక్కరంటే ఒక్కరికైనా తోచిందా చెప్పండి?'

'బాగుందండీ... ఇంతకీ నేనేం చేయాలంటారు?'

'మాకు మార్గదర్శనం చేయాలండి. మా సంఘాన్ని విస్తృతం చేయాలండి. మాకు మద్దతు ఇవ్వాలండి'

'తప్పకుండా. నిజానికి అది నా కల. అందుకే ఇప్పుడు అధికారానికి నిచ్చెనలు వేస్తున్నాను. నాతో పాటు చేతులు కలిపి కోట్లు కొట్టేసి నాకు వాటాలిచ్చిన దొంగలు, దగుల్బాజీలు, దగాకోరులను కూడా బరిలోకి దింపి అధికార పీఠానికి దారులు వేస్తున్నాను. ఎందుకంటే అవినీతికి అధికారం ఆక్సిజను లాంటిది. అది అందగానే వచ్చి కనబడండి. మీ సంఘ సభ్యులందరినీ కూడా కలుపుకొని రాష్ట్రమంతటా ఒక అవినీతి చట్రాన్ని పరుద్దాం. అక్రమాలను వ్యవస్థీకృతం చేద్దాం. అకమ్రార్జనకు రహదారులు నిర్మిద్దాం. బడుగు దొంగలందరికీ పక్కా ఇళ్లు నిర్మిద్దాం. దుండగులందరూ తలెత్తుకుని, బోర విరుచుకుని నడిచేలా చేద్దాం. మన కార్యకలాపాలని దేశానికి, ప్రపంచానికి కూడా విస్తరిద్దాం. సరేనా?'

'ఆహా... ఎంత మంచి మాట సెలవిచ్చారు? చిత్తం!

PUBLISHED IN EENADU ON 22.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి