శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

అనుచిత హామీలు


'గురూగారూ, నమస్కారమండి'
'ఏంట్రోయ్‌, మొహం పెట్రొమాక్స్‌ లైట్‌లా వెలిగిపోతోంది! నెత్తిమీద ఆ కాగితాల కట్టేంటి?'

'మీకు తెలియనిదేముంటుందండీ. మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నందుకు ప్రయోజనం ఉండాలని ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్నా. ప్రజానీకానికి నేనేం చేయబోతున్నానో చెప్పడానికి హామీలన్నీ రాసుకొచ్చానండి'

'ఓ... బాగా ఎదిగావురా, ఎన్నికల మ్యానిఫెస్టో రాసుకొసుకొచ్చావన్నమాట!'

'అవునండి. మీరంటుంటారు కదండీ... ఏ పనైనా చేసేముందు బాగా కసరత్తు చేయాలనీ? అందుకని తెల్లారగట్ల లేచి మరీ వంద బస్కీలు, రెండొందల ఆసనాలు వేసి ఆ తరవాతే రాసుకొచ్చానండి'

'వార్నీ... నువ్వెక్కడ దొరికావురా? కసరత్తంటే అది కాదురా! కూలంకషమైన పరిశీలన. ఇతర పార్టీలకన్నా భిన్నంగా ఉండాలని అర్థం'

'నేనూ అదే చేశా గురూగారూ! మీరు ఇతర పార్టీల హామీలన్నీ చదివేసి రుబ్బేసి రమ్మన్నారు కదండీ? పొద్దున్నే బస్కీలు అవీ చేసేశాక, మొత్తం పేపర్లన్నీ చదివేసి, రుబ్బురోలులో వేసి రుబ్బేసి ముద్ద చేసేశానండి. దాన్ని నమిలి మింగేసి కాగితం తీసుకుని రాయడం మొదలెట్టానండి. ఇక చూస్కోండి గురూగారూ... కలం పరిగెత్తిందంటే నమ్మండి. ఈ కాగితాలన్నీ ఇవేనండీ!'

'చంపావురా! నీలాంటి శిష్యుణ్ని చేర్చుకున్నందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. సర్లే, ఏంచేస్తాం? ఏమేమి రాశావో చదివేడు. ఎలాగూ వదలవు కదా?'

'అయితే వినండి. ముందుగా విద్యా పథకమండి. మిగతా పార్టీలన్నీ ఏవేవో చెత్త రాశాయండి. నేనలా కాదండి. యువతీయువకుల పెళ్లిలోనే ఈ పథకం ప్రారంభమవుతుందండి. పిల్లలు పుట్టకుండానే కాన్వెంట్లలో సీట్లు రిజర్వ్‌ చేసి పెడతామండి. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను కొత్త దంపతులకు అందజేస్తామండి. ఆ పళంగా వాళ్లు ఓ పక్క కాపురం చేసుకుంటూనే ఈ పుస్తకాలు చదివి అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు, రైములు, పద్యాలు గట్రా బట్టీ పట్టాలని చెబుతామండి. భారతంలో అభిమన్యుడు పుట్టకముందే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు, పుట్టబోయే బిడ్డలు ఎంచక్కా సగం చదువు కడుపులోనే నేర్చేసుకుంటారన్నమాటండి. ఎలాగుందండీ?'

'కళ్లు తిరుగుతున్నాయిరా. కానీ, నువ్వెలాగూ వూరుకోవు కానీ, ఆ మిగతావి కూడా చెప్పెయ్‌'

'తరవాత వైద్యమండి. ఇది ఆరోగ్య ధీమా అనే నిర్బంధ పథకమండి. ప్రతివాళ్లు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలని ప్రచారం చేస్తామండి. జలుబొస్తే జరిమానా, జ్వరమొస్తే జైలుశిక్షని భయపెడతామండి. అప్పుడు ప్రజల్లో చైతన్యం పెల్లుబికి జాగ్రత్తగా ఉంటారండి. అందరూ రోజూ ఆసుపత్రికి వెళ్లి నాలుక, నాడీ, బీపీ గట్రా చూపించుకు తీరాలని షరతు విధిస్తామండి. దీనివల్ల ముందే జాగ్రత్త పడొచ్చండి. ఒకవేళ ఏ రోగమొచ్చినా జైళ్లలో పెట్టి జాగ్రత్తగా వైద్యంచేసి తిరిగి ఆరోగ్యవంతులవగానే వదిలేస్తామండి'

'నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయిరా? మిగతావి కూడా అయిపోయాక ఏకంగా డాక్టర్‌ దగ్గరకి వెళతాలే. చదివెయ్‌'

'ఇక పన్నుల విధానాన్ని పారదర్శకం చేస్తానండి. ప్రతి వస్తువు మీద విడివిడిగా పన్నులు వేయడం, ఆనక జనం గగ్గోలు పెట్టడం లేకుండా ముందే తీసేసుకుంటామండి. ఉద్యోగులైతే జీతాల్లో పన్నుల కోత ఉంటుందండి. వ్యాపారులైతే ఆదాయంలోంచి లాగేస్తామండి. అప్పుడు ఖజానా నిండిపోతుందంటే నమ్మండి'

'ఒరేయ్‌, నీర్సంగా ఉందిరా... ఇంకా అవలేదా?'

'అవుతాయవుతాయి... ఆగండి మరి! ఆడవాళ్లకు ప్రత్యేక పథకాలున్నాయండి. ఏ మహిళకైనా రొంప పడితే చీదుకోవడానికి జేబు రుమాలు పంచిపెడతానండి. ఆడాళ్లందరికీ అట్లకాడ, అప్పడాల కర్ర అందించి ఆకట్టుకుంటానండి. యువతులకైతే బొట్టుబిళ్లలు, కాటుకలు, లిప్‌స్టిక్‌లూనండి. వీధికొక ప్రభుత్వ దర్జీని పెట్టి చీరలు, జాకెట్లు చిరిగితే ఉచితంగా కుట్టించి పెడతానండి. మగవాళ్లంతా ఆదివారం ఇంట్లో వంట చేయాలని నిబంధన పెడతానండి. మహిళా ఉద్యోగులైతే వారానికి రెండుసార్లు ఆఫీసుకొస్తే చాలని చెబుతానండి'

'కడుపులో తిప్పుతోంది కానీ, తమాయించుకుంటాలే. మిగతావేంటి?'

'నేరాలు అదుపు చేయడానికో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందండి. నేరస్థులు, రౌడీలు, గూండాలందరికీ నిరాధార్‌ కార్డులు జారీ చేస్తానండి. అందరూ పేర్లు నమోదు చేసుకుంటే పట్టుకోవడం సులువు కదండీ? ఇక ఉచిత హామీలైతే ఉచితానుచితాలు మరిచి మరీ ఆలోచించానండి. కూలీలకు కంప్యూటర్లు పంచుతానండి. వాళ్లు ఎప్పటికప్పుడు కూలీ డబ్బులు ఎన్నొచ్చాయో నమోదు చేసుకోవచ్చండి. బిచ్చగాళ్లకు కూడా ఓట్లుంటాయి కదండీ. కాబట్టి, వాళ్లు అడుక్కోవడానికి కొత్త సీవెండి బొచ్చెలు పంచుతానండి. నిరుపేదలకు ఉచిత గోచీలు, వృద్ధులకు వూతకర్రలు అందిస్తానండి... ఇవన్నీ శాంపిల్‌గా కొన్నేనండి. కానీ, ఒకే ఒక్క సందేహం గురూగారూ! రేప్పొద్దున అధికారంలోకి వస్తే ఇవన్నీ నెరవేర్చగలనా అనేదే బెంగండి. ఏమంటారు?'

'నీకా బెంగ అక్కర్లేదురా! నీ దిక్కుమాలిన హామీలతో నువ్వెలాగూ అధికారంలోకి రావు. కాబట్టి నిశ్చింతగా ఉండు. అర్జంటుగా ఆంబులెన్స్‌ పిలు. నాకు స్పృహ తప్పుతోంది. అదొచ్చాక ముందు నన్ను ఆసుపత్రిలో చేర్పించి తరవాత ప్రచారానికి తగలడు!'

PUBLISHED IN EENADU ON 11.04.2014

1 కామెంట్‌: