మంగళవారం, ఏప్రిల్ 15, 2014

సవాళ్ల ఎత్తుగడ!


'ఏంట్రా, అలా మొహం వేలాడేసుకుని ఉన్నావ్‌?'
'ఏముందండీ, ఎగస్పార్టీవాళ్లంతా కట్టకట్టుకుని నా మీద పడుతున్నారండి. నేనొట్టి అవినీతి పరుడినటండి. రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకు కోట్లు దోచేశానటండి'

'ఓసింతేనా? ఈ మాత్రం దానికే బెంబేలు పడితే ఎట్లారా, పైగా వాళ్లు అంటున్నవన్నీ నిజాలేగా?'

'నిజమేననుకోండి! కానీ, బాహాటంగా అందరూ పదేపదే అంటుంటే అమాయక ప్రజలు ఎక్కడ నమ్మేస్తారోనని భయమండి'

'ఒరేయ్‌, నువ్వేదో ప్రచారంలో అలిసిపోయి గందరగోళానికి గురవుతున్నావు కానీ, కాస్త కుదుటపడు. నిన్నెవరైనా గబుక్కున నిజాయతీపరుడు, నికార్సయిన నేత అంటే- ఉలిక్కిపడాలి. ఎందుకంటే మనలో ఏ మూలైనా అలాంటి పనికిమాలిన మంచి గుణాలు ఉండేడిశాయేమోనని కంగారుపడాలి. వెంటనే మనల్ని మనం తరచి చూసుకుని వాటిని వదిలించుకోవాలి. అంతేకానీ తిడితే బెంగేంట్రా, గర్వపడాలి కానీ! మన నీచ చరిత్ర పత్రికల పుటల్లోకి ఎక్కిందని, చెరిపేసినా చెరిగిపోనంత చెడు చేశామన్నమాట వినీ లోలోపల సంబరపడిపోవాలి. అర్థమైందా?'

'వూరుకోండి. మీరెప్పుడూ తిరకాసుగానే మాట్లాడతారు. నన్ను చూసుకుని నేనెప్పుడూ గొప్పగానే భావిస్తానండి. నా అపారమైన తెలివితేటలవల్లనే కోట్లకు పడగలెత్తానని తెగ ముచ్చటపడిపోతానండి. అదంతా సరే కానీ, బరిలో ఉన్న తతిమ్మావాళ్లందరికీ నా వెధవ పనులే ప్రసంగాంశాలైపోతున్నాయండి. ఎన్నికలు దగ్గరపడిన ఈ సమయంలో ఎట్నుంచి ఎటొస్తుందోనని గుబులేసి మీ దగ్గరకి వచ్చానండి. పైగా ఈసారి యువ ఓట్లే కీలకమంటున్నారు కూడానూ...'

'ఇప్పుడర్థమైందిరా నీ బాధేంటో. నీకు తెలియక అడిగావని భ్రమలో పడను కానీ, అడిగావు కాబట్టి చెబుతా, గుర్తెట్టుకో! ఎదుటివాడు మన మీద బురద జల్లితే మనం కంగారుపడి అదంతా తుడుచుకునే పన్లో పడకూడదొరేయ్‌. దాని సంగతి తరవాత చూసుకోవచ్చు. ముందు వాడి మీద తారు పోసేయాలి. మన ఎదురుదాడికి వాడి దిమ్మ తిరిగిపోవాలన్నమాట. నీ అంత దిక్కుమాలిన నీచ చరిత్ర ఇంకెవరికీ ఉండదు కాబట్టి- నువ్వు ఎదుటివారిలో లోపాలు వెదకడం కాస్త కష్టమేననుకో. కానీ, ఎలాగోలా ఎప్పటెప్పటి సంగతులో ఎత్తి ఎదురెట్టెయ్యాలి. మోకాలికి, బోడిగుండుకీ ముడిపెట్టి అడ్డగోలుగా తిట్టిపోయాలి. నిజాన్ని ఎదుర్కోలేకపోయినప్పుడు మనకి తిట్లే శరణ్యమని తెలుసుకో. తెలిసిందా?'

'తెలిసింది కానీ, అక్కడే మనం కాస్త వీకండి. ఎంతలేసి నికృష్ట పనులు చేసినా, పైకి మాత్రం ఏమీ తెలియని అమాయక మొహంపెట్టి మెత్తగా నవ్వడం గట్రా అలవాటైపోయింది కదండీ? గబుక్కున తిట్లు లంకించుకుంటే ఎదురుతిరిగి జనంలో మన ఇమేజి డామేజి అవుతుందేమోనని సందేహమండి!'

'అదా నీ శంక? అవన్నీ పక్కనపెట్టెయ్యి. మహా మహా శాసనసభలోనే అమ్మ మాట తీసుకొచ్చి అందరూ సిగ్గుపడేలా మాటలు వాడేసిన మహానేతలున్నారురా మన చరిత్రలో. వాళ్లనోసారి గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మకు నువ్వెందుకు పుట్టావా అని బాధ పడే రోజొస్తుందంటూ నిండుసభలో ఎగస్పార్టీ నేతను అవమానపరచినవాళ్ల అడుగుజాడలే నీకు శరణు. ఆ మాటలకు పై సంగతులేసి, నీకు భార్యనెందుకయ్యానా అని నీ భార్య బాధపడుతుందను. నీకెందుకు పుట్టానా అని నీ కొడుకు ఏడుస్తాడను. అనడానికేముందిరా? అడ్డమైనట్టు అనొచ్చు! అది నేర్చుకో. ఇక నువ్వు గిల్లితే చాలు రెచ్చిపోయే ఏ ప్రముఖుల చేతనో ఎదుటివారిని తిట్టించు. నీ కనుసన్నల్లో నడిచే పేపరో, ఛానెలో ఉంటే వాటిలో పదేపదే చూపిస్తూ మాయ చేయడానికి ప్రయత్నించు. అన్నింటికన్నా గొప్ప సంగతొకటుందిరోయ్‌... అదే సవాలు! నువ్వే నానా మాటలు, అభూత కల్పనలు, అబద్ధాలు కలగలిపేసి అడ్డగోలు వాగుడు వాగేసి... ఇవన్నీ నిజం కాదని నిరూపించగలవా అని బహిరంగ సవాలు విసిరెయ్‌. నువ్వు నిరూపిస్తే నా ఆస్తులన్నీ నీకిచ్చేస్తా, కాకపోతే నీ ఆస్తులన్నీ నాకిచ్చేస్తావా అని తొడకొట్టెయ్‌. ఎదురెట్టి వీరంగం ఆడే విద్యలో ఇదొక కొత్త అధ్యాయం'

'ఈ కొత్త నీచోపాయమేదో బాగుందండోయ్‌! కానీ, జనం నమ్ముతారంటారా?'

'నీ వెర్రి సవాళ్లకి, పిచ్చి వాగుడికి ఎదుటివాడు చలించకపోయినా అమాయక జనం మాత్రం గందరగోళంలో పడతారనీ, ఎంత ధైర్యం లేకపోతే ఇలా సవాలు చేస్తాడు, ఈడు చెప్పేదంతా నిజమే కాబోలని కాస్తో కూస్తో భ్రమలో పడాలనేగా నీ తాపత్రయం? ప్రస్తుతానికి ఇదే నీకున్న ఏకైక మార్గం. అయినా నువ్వు భయపడుతున్నట్టు చైతన్యవంతులైన జనం నమ్మలేదనుకో. నిజాలు, నైజాలు తెలుసుకున్న ప్రజలంతా ఏకమై నిన్ను ఎన్నికల్లో ఛీ కొట్టారనుకో. అహ... అనుకో. నీకు పోయేదేముందిరా? తరతరాలకు తగినంత బొక్కేశావు, చట్టం నోరు నొక్కేశావు. ఎక్కడెక్కడ ఎంతెంత ఉందో తెలియనంతగా కూడబెట్టి కోటలు కట్టేశావు. ఇంకేంటి బెంగ? కూడబెట్టిందంతా కరిగిపోయేవరకూ తింటూ కూర్చున్నా నీ ముని ముని మునిమనవల వరకు చీకూ చింతా లేదుగా? ఏమంటావ్‌? ఇంకాసేపు మాట్లాడుకుంటే పచ్చి నిజాలు బయటికి వచ్చేస్తాయి కానీ ఇక పోయిరా!'

PUBLISHED IN EENADU ON 15.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి