శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

పుట్టెడు రోగాల ప్రభుత్వం!


'తొమ్మిది దారుల మట్టి కోట ఇది.. 
తెలుసుకోర నరుడా! 
చుట్టుముట్టినవి గట్టి రోగములు.. 
మట్టుబెట్టరా గురుడా!' 
- జనచైతన్యానంద స్వాములవారు తత్వం పాడుతుంటే శిష్యుడు ఆదరాబాదరా వచ్చి, 'స్వామీ! బయట ఓ వ్యక్తి పిచ్చి చూపులు చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరొచ్చి చూడాలి..' అన్నాడు.
స్వాములవారు బయటకి వచ్చి శిష్యుడితో 'ఏమైంది నాయనా!' అన్నారు.

'నేను వూర్లోకి వెళ్లి వస్తుంటే ఓ గుడిసె దగ్గర ఇతడు జ్వరంతో వణుకుతూ కనిపించాడు స్వామీ! ఇంతలో ఇతడి భార్య వచ్చి వైద్యానికి వెళదామంది. అంతే స్వామీ... ఇతగాడు ఒక్కసారిగా ఆమె చేయి విదిల్చుకుని పరుగుతీశాడు' అంటూ శిష్యుడు వివరించాడు. ఇంతలోనే ఒకామె పరుగున వచ్చి స్వాములవారిని చూస్తూనే, 'అయ్యోరా.. తమరే నా పెనిమిటిని కాపాడాలయ్యా.. ఆసుపత్రికి రమ్మంటే భయపడిపోతున్నాడు' అంటూ కాళ్ల మీద పడింది.

జనచైతన్యానంద స్వామి ఆమెను లేవదీసి, 'ఏ ఆసుపత్రికి తల్లీ?' అని అడిగారు.

'పేదోల్లం.. ఇంకే ఆసుపత్రికి ఎల్తామయ్యా.. సర్కారు దవాఖానాకే రమ్మన్నానంతే..' అందామె.

స్వాముల వారు తలపంకించి, కమండలంలోంచి నీళ్లు అతడి మొహం మీద కొట్టి మంచినీళ్లు తాగించారు. అతడు తేరుకున్నాక ఏవో గుళికలు ఇచ్చి వాళ్లని పంపించారు. వెంటనే శిష్యుడు 'ఈ వూర్లో ఇదేమి వింత స్వామీ? రోగం వచ్చాక చికిత్స వద్దంటే ఎలా?' అని అడిగాడు.

స్వాముల వారు తన జోలెలోంచి మాయాదర్పణం తీసిచ్చారు. శిష్యుడు అందులోని దృశ్యం చెప్పసాగాడు.

'ఏవేవో పాడుపడిన భవనాలు కనిపిస్తున్నాయి. వాటిలో తేళ్లు, పాములు పాకుతున్నాయి. వాటిని చూస్తూనే సామాన్యులు పారిపోతున్నారు. ఇదేమి స్వామీ?' అన్నాడు.

జనచైతన్యానంద స్వాముల వారు నిట్టూర్చి చెప్పారు, 'అదే నాయనా ఈ రాజ్యంలోని దౌర్భాగ్యం. నీకు కనిపించిన వన్నీ ప్రభుత్వ వైద్యశాలలే. వాటిలో సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేవు. పేదల ఆరోగ్యం పట్ల ఇక్కడి ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. అందుకు సంకేతాలే విషకీటకాలు'

'ఎంత దారుణం స్వామీ? ప్రజల కష్టాలు పాలకులకు పట్టవా?'

'సింహాసనం ఎక్కేవరకే సామాన్యుడు కనిపిస్తాడు నాయనా! ఆ తర్వాత వారి దృష్టి ప్రచారం పైనా, దోచుకోవడం పైనే. ఈ రాజ్యంలోని ప్రజల సంఖ్యను బట్టి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 84 వేల మంది వైద్య సిబ్బంది ఉండాలి. కానీ పట్టుమని పదివేల మందే ఉన్నారు. ప్రజలకు సరిపడినన్ని వైద్యశాలలూ కరవే'

'అంటే ఇక్కడి ప్రభుత్వ ఖజానా నిండుకున్నదేమో?'

'కాదు నాయనా! తమ వార్షిక లావాదేవీల పరిమాణం లక్షన్నర కోట్ల రూపాయలకు మించి పోయిందని పాలకులే జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ ఖజానా ఆదాయంలో అధికభాగం అక్రమ మార్గాన తమ అనుచరవర్గానికే కట్టబెడుతున్న లోపాలు నా దివ్యదృష్టికి గోచరిస్తున్నాయి నాయనా!'

'ఎంత ఘోరం స్వామీ! ఈ దురహంకార పాలకుల నుంచి ఇక్కడి అమాయక ప్రజలను కాపాడాలంటే ఏం చేయాలి?'

'జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పి చైతన్యవంతుల్ని చేయడమే మన కర్తవ్యం. ఆపై వాళ్లే తమ ఓటు హక్కు ద్వారా అక్రమ పాలకులను ఇంటిదారి పట్టిస్తారు'

'అవశ్యం స్వామీ!'
PUBLISHED IN EENADU ON 03.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి