శనివారం, ఏప్రిల్ 26, 2014

అసలు నిజం గ్రహిస్తే...




సెక్రట్రీ' 
'.......' 
'సెక్రట్రీ! ఏంటయ్యా, పిలిచినా పలక్కుండా ఏదో ఆలోచిస్తున్నావ్‌?'
'స...స... సార్‌! మన్నించండి. మనసేం బాగోలేదండి'

'అరెరె, అదేంటయ్యా, ఉన్నట్టుండి ఆ కన్నీళ్లేమిటి?'

'గుండె తరుక్కుపోతోందండయ్య'

'ఎందుకయ్యా అంతలా దుఃఖపడుతున్నావు... కొంపదీసి ప్రజలుగానీ చైతన్యవంతులైపోలేదు కద?'

'అబ్బే, అదేం లేదు సార్‌! ప్రజలింకా మత్తులోనే ఉన్నట్టున్నారు. నా బాధ అందుక్కాదు సార్‌. ఎగస్పార్టీవాళ్లంతా మిమ్మల్ని ఏకేస్తున్నారు సార్‌. ఒకాయన మిమ్మల్ని అవినీతి అనకొండ అంటున్నాడండి. మరొకాయన మిమ్మల్ని పట్టుకుని దొంగలముఠాకోర్‌ అంటున్నాడండి. బయటకి వెళ్తే ఈ మాటలన్నీ వినబడి మీ సెక్రట్రీగా సిగ్గుతో చితికిపోతున్నానండయ్య'

'ఓస్‌, ఆ మాత్రం దానికేనా ఇంత బెంబేలు పడిపోతున్నావ్‌? అయినా అన్నది నన్నయితే నిన్నన్నట్టు బాధపడతావేంటి?'

'వూరుకోండి సార్‌, మిమ్మల్ని అంటే- మీ దగ్గర పనిచేస్తున్న నన్ను అన్నట్టు కాదా చెప్పండి? ఇలాంటి మాటలు వింటుంటే ఛీ... వెధవ బతుకు, వెధవ బతుకు అనిపించి, గుండెలోతుల్లోంచి ఏడుపు ఎగదన్నుకుని వచ్చేస్తోందండి. మనిషన్నవాడు విని తట్టుకోగలిగే విమర్శలేనాండి అవి? ఏ మాత్రం హృదయం ఉన్నా కలుక్కుమనకుండా ఉంటుందా చెప్పండి? మనసనేది ఉంటే గింటే బతుకు మీదే అసహ్యం వేయదాండీ? ఏమాత్రం అభిమానం ఉన్నా బుర్ర భూమిలోకి కూరుకుపోదండీ? మన మీద తీవ్రమైన, సహేతుకమైన, ప్రాథమిక సాక్ష్యాధారాలతో కూడిన ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజంకాదని నిరూపణ అయ్యేవరకూ అన్నం నోటికి సహిస్తుందా చెప్పండి? రాత్రిళ్లు సుఖంగా నిద్ర పడుతుందా? అసలు మనస్ఫూర్తిగా నవ్వెలా వస్తుందండీ? ఇంట్లోవాళ్లకే మొహం చూపించలేకపోతామే, ఇక ప్రజల ముందు ఎలా నిలబడగలమండీ? అసలిలాంటి భావాలు కలగనివాడు మనిషేనంటారా?'

'ఆపెహె... ఎదవ ఏడుపూ నువ్వూను. ప్రపంచమంతా ఓదార్చగలుగుతున్నాను కానీ, నిన్ను మాత్రం వూరుకోబెట్టలేకపోతున్నాను. కొత్తగా పన్లోకి చేరావనీ, విశ్వాసం ఉన్నవాడివనీ తెలుసుకాబట్టి తమాయించుకున్నాను. అసలింతకీ నువ్వు బాధపడుతున్నావో, లేక నన్ను నానా మాటలూ అంటున్నావో తెలీటం లేదురా బాబూ! నీ అమాయకత్వంగూలా! రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదరా?'

'రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని నాకూ తెలుసండి. కానీ, వాళ్ల ఆరోపణల్లో కొన్ని విషయాలు మాత్రం ఎంతకూ మింగుడుపడటం లేదండి. నేనంటే కొత్తగా చేరాను కానీ, ఒకప్పుడు మీ ఆస్తులకు, ఇప్పటి మీ సంపదకు ఎక్కడైనా పొంతన ఉందాండీ? ఇప్పుడు మీ వ్యవహారాలన్నీ స్వయంగా చూస్తుంటే అబ్బో... నా బాసు ఇంత మహర్జాతకుడా అని ఓ పక్క ఆనందం కలుగుతూనే మరోపక్క వాళ్లంతా అంటున్నట్టు ఇంత కొద్దికాలంలో ఇన్నేసి కోట్లు, భవంతులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఎలా సాధ్యమయ్యాయా అనే అనుమానం కలుగుతుంది కదండీ?'

'అంటే నేనేదో కిరికిరిలు చేశానని నిర్ణయానికి వచ్చేశావన్నమాట. అంతేనా?'

'అబ్బెబ్బే, నా నిర్ణయంతో పనేముందండీ? నేను మీ దగ్గర ఉద్యోగిని. కాబట్టి మీరెలాంటివారో నాకు ముందే తెలుసు కదండీ? కానీ, నా ఆలోచనలన్నీ జనానికి కూడా వస్తాయేమోనని బెంగండి. అప్పుడేంటండి తమరి గతని దిగులండి'

'వార్నీ తస్సదియ్యా! చంపుతున్నావురా, నీ అనుమానాలు, బెంగలు, ఏడుపుల్తోటి. వాళ్ల ఆరోపణలు సరే, మనం కూడా వాళ్ల మీద దుమ్మెత్తి పోస్తున్నాం కదరా, వూరుకుంటున్నామా?'

'అవుననుకోండి. కానీ, వాళ్లంతా తాజా సంగతుల మీద మాట్లాడుతుంటే మీరెప్పుడో దశాబ్దాల నాటి విషయాలు లేవనెత్తుతున్నారండి. మీ నాన్న సంగతి నాకు తెలుసులే అంటే, మీ ముత్తాత గురించి నాకూ తెలుసులే అని బూకరించినట్టుందండి మీ వ్యవహారం'

'రాజకీయాల్లో నిస్సిగ్గుగా నిలదొక్కుకోవాలంటే ఇలాంటి అడ్డగోలు, బురద జల్లుడు విద్యలన్నీ నేర్చుకోవాలి కదరా? నువ్వు తప్పు చేశావని ఎవరైనా అంటే, అడ్డుకోకపోవడం నీదే తప్పని వాదించెయ్యాలి. తెలిసిందా?'

'నిజమేనండి. కానీ బెయిలు మీద ఉన్నోడికీ, మెయిలు మీద ఉన్నోడికీ తేడా తెలియదేంటండి? పైగా దేశవిదేశాల నుంచీ తాఖీదులు వస్తుంటే ఎన్నాళ్లు కళ్లు కప్పగలమా అని బెంగండి'

'ఒరేయ్‌, నువ్వు నా సెక్రటరీవా, సీబీఐ ఏజెంటువా, ఎఫ్‌బీఐ గూఢచారివా?'

'భలేవారండి బాబూ! నాకంతటి సీనెక్కడిదండీ? మీ కాళ్ల దగ్గర పడి ఉండేవాడిని. ఈ ఆలోచనలన్నీ జనంలో ఏమాత్రం కలిగినా ఏం చేయాలో తోచక ఏడుస్తూ కూర్చున్నానండి'

'ఓరి నీ సందేహాలు దొంగలెత్తుకెళ్లా! జనం గురించి నువ్వు బెంగపడకు. నిజానికి నా మీద నాకున్న నమ్మకం కన్నా, ప్రజల అమాయకత్వం మీద ఉన్న నమ్మకమే నాకెక్కువ. మనం విందుభోజనం చేస్తున్నా, చేయి విదిలించిన మెతుకులు తిని సంబరపడే సామాన్యులు వాళ్లు. అందుకనే నాకంత దిలాసా, భరోసా, కులాసా... తెలుసా? నా చుట్టూ ఆరోపణలు, విమర్శలు, విచారణలు, రిమాండ్‌లు, కమాండ్‌లు, హైకమాండ్‌లు, కరెంటులు, వారెంటులు, జాయింటులు... అన్నీ చుట్టుముట్టున్నాయని నాకూ తెలుసు. అందుకే ఐసీయూలో రోగికి ఆక్సిజన్‌ ఎంత అవసరమో, నాకిప్పుడు అధికారం అంత అవసరం. అందుకోసమే నా తపన, నటన... అన్నీను. కాబట్టి మన జనం తెలివిమీరనంతవరకు నాకు, నా నీడన నీకు ఎలాంటి బెంగా అక్కర్లేదు. అర్థమైందా? ఇక కుదుటపడి ప్రచారం సంగతేంటో చూడు'

'ఆహా... ఇన్నేసి పన్లు చేసి కూడా ఎంత తెగింపు, ఎంత బరితెగింపు! నాకిక ఏ చింతా లేదండి'

PUBLISHED IN EENADU ON 26.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి