'నిను వీడని నీడను నేను, కలగా కదిలే కథ నేను...'
'ఎవరు నువ్వు?'
'నిజాన్ని'
'నా వెనకెందుకు పడ్డావ్?'
'నీ నీడను కాబట్టి'
'ఇంతకూ నువ్వు నిజానివా, నీడవా?'
'నీ నీడలో నిజాన్ని'
'ఏం కావాలి నీకు?'
'నువ్వు నిజం ఒప్పుకొంటే చాలు'
'ఇదేం తిరకాసు, నువ్వే నిజాన్నంటున్నావుగా?'
'అవుననుకో. కానీ, నీ నీడలో దాచేశావుగా?'
'ఏమిటా నిజం?'
'ఖనిజం, గనిజం, గజనిజం, విలనిజం...'
'అమ్మో... ఇన్ని నిజాలా- వీటి గురించి నాకేం తెలుసు?'
'అలా అంటావనే నీవెంట పడ్డా'
'పడితే పడు, నాకేం భయమా? నువ్వు నిజానివైతే నేను నీచ రాజకీయాన్ని. ఇంకా మాట్లాడితే అరాచకీయాన్ని. తెలుసా?'
'నిజం... రాజకీయాన్ని వణికించగలదు తెలుసా?'
'హహ్హహ్హా! పిచ్చి నిజమా! నువ్వు చెప్పేదేంటో తేలేసరికి రాజకీయం పబ్బం గడిచిపోతుంది. సమయానికి తేలని నిజం చచ్చినట్టేనని తెలుసుకో!'
'అహంకారంతో విర్రవీగకు. నిజం బయటికి పొక్కడంవల్ల ప్రభుత్వాలు తారుమారయ్యాయి. అధినేతలు కుర్చీలు దిగారు. ప్రజాచైతన్యం పెల్లుబుకుతోంది. అసలే ఇది ఎన్నికల కాలం!'
'ఎ...ఎ...ఏంటి భయపెడుతున్నావ్? నువ్వన్నది నిజమే కానీ, ఇప్పటికిప్పుడు ఏం తేలిందట, అంత రెచ్చిపోతున్నావ్?'
'కాదా మరి? ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజం, అమెరికాలో నిజం, అంతర్జాతీయ స్థాయిలో అవినీతి విలనిజం, రాష్ట్రంలో టైటానియం తవ్వుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులు అందిన ఘరానా పాలనిజం...'
'అస్తమానం నిజం... నిజం అని చిందులు తొక్కకు. నువ్వేదో బయటపడినా, నా దారులు నాకున్నాయి'
'ఏమిటో ఆ దారులు?'
'నువ్వెలాగూ నిజానివే కాబట్టి... నిజమే చెబుతాను విను. ఇదంతా కుట్రని ఎప్పటిలాగే బుకాయిస్తా. కేవలం ఆరోపణలేనని బింకం చూపిస్తా. మా ప్రజాదరణ చూడలేక కిట్టనివాళ్లు కల్పించిన కట్టుకథని కొట్టిపారేయిస్తా. గెలవలేమనే భయంతో ప్రత్యర్థులు పన్నిన పన్నాగమని మా పత్రికల్లో పేజీలకు పేజీలు అచ్చొత్తించి గగ్గోలు పెట్టిస్తా. మా ఛానళ్లలో పదేపదే ఊదరకొడతా. వీరంగం ఆడతా. ఎదుటివాళ్ల పుట్టుపూర్వోత్తరాల మీద ప్రశ్నలు గుప్పించి నిజానిజాల్ని, జనాల్ని కూడా గందరగోళపరుస్తా. తెలిసిందా?'
'పోన్లే... నీ నీడనైన నా దగ్గరైనా, నీలో నిజాన్ని నిర్భయంగా చెప్పావ్. కానీ, నిజం నిప్పులాంటిది కదా? దానివల్ల అభియోగాలు వచ్చి, విచారణ జరిగి, జైలుకెళ్లిన అనుభవాలు కూడా ఉన్నాయిగా?'
'ఉన్నాయి. ఉంటాయనీ తెలుసు. కానీ, జైలుకెళ్లినా దాన్ని జాలికథగా మార్చుకోగల సామర్థ్యం నాకుంది. అమాయకుడిలా నటిస్తూ, జైలుకెళ్లినా ఘనకార్యం చేసినట్టు, ప్రజలముందు సిగ్గులేకుండా మసలే నేతల్లా నేను విజృంభించగలను. ఇప్పటికే నీచరాజకీయ విశ్వరూపం చూపించాను. గమనించలేదా?'
'గమనించకేం? ఒక దశలో నిన్ను చూస్తే నాకే భయమేసింది. ఇలాంటి రాజకీయం అడుగుజాడల్లో నలిగిపోతూ ఊపిరాడక గిలగిల్లాడాల్సిందేనా అని కుమిలిపోయాను. ఇప్పుడిప్పుడే నాలో కొత్త ఆశలు చిగురించాయి'
'ఏమిటో ఆ ఆశలు?'
'ప్రజాచైతన్యంపై ఉన్న నమ్మకం. ప్రజలు అన్నీ గమనిస్తారనే భరోసా. ఒకప్పుడు ఇంటిని సైతం తాకట్టుపెట్టే స్థితిలో ఉన్న నేతలను అధికారపీఠంపై కూర్చోబెడితే- కేవలం కొన్నేళ్లలో ఎలా కోట్లకు పడగలెత్తారో... జనం తెలుసుకోలేకపోరనే ఆశావహ దృక్పథం. అధికారం అండగా పచ్చి దోపిడికి తెగబడినప్పుడు, ప్రజల ఆస్తులు ఎలా కైంకర్యమైపోయాయో సామాన్యులకు సైతం అర్థమవుతోందనే సూచన. కాబట్టి, నీలాంటి నికృష్ట రాజకీయాన్ని ఓటుహక్కుతో తోక ముడిచేలా చేస్తారనే ఆశ'
'ఓసి వెర్రి నిజమా! నువ్విలాగ ఆశలు పెంచుకుంటూ కూర్చో... నాకేం భయంలేదు. వందలు, వేల పత్రాలతో అభియోగాలు వచ్చినా- ప్రాథమిక సాక్ష్యాధారాలతో జైలుకెళ్లినా, రాజకీయ చదరంగంలో పావులు కదిపి, తెరవెనక అవగాహనతో బెయిలు ఇప్పించుకోగల శక్తిసామర్థ్యాలు నా సొంతం. ప్రజల ఆస్తులు దోచినా, వారి పేరిట ఏ అరకొర పథకాలో ప్రచారం చేసి, కాస్తోకూస్తో విదిలించి, మాయమాటలతో వారి మద్దతు పొందగలననే ధీమా నాకుంది. ఇక నువ్వేం చేయగలవు?'
'నీచ రాజకీయమా! తగ్గు తగ్గు. నువ్వు దేశాలు మార్చి, న్యాయాన్ని ఏమార్చడాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా బయటపెట్టింది. నీ అక్రమార్జన డొంక దేశదేశాల్లోనూ కదలనుంది. నిజం కార్చిచ్చుగా మారి, నీ అరాచకాలను కాల్చి బూడిద చేయనుంది. అందుకు ప్రజల చైతన్యం తోడ్పడుతుంది. ఈ ఎన్నికలవేళ- నిజానికి ఉన్న శక్తి ముందు నీ రాజకీయం ఎంత? సుడిగాలి ముందు గడ్డిపోచ ఎంత! తోకముడిచి పరుగందుకో... ఫో!'
'...'
PUBLISHED IN EENADU ON 07.04.2014
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి