బుధవారం, ఏప్రిల్ 09, 2014

జనమే జనమేజయులు


'డాక్టర్‌ గారూ... డాక్టర్‌ గారూ...'
'ఎవరండీ మీరు? అలా కంగారు పడుతున్నారేంటి? కుర్చీపై కాళ్లు పైకెత్తుకుని కూర్చుని చుట్టూ భయంభయంగా చూస్తున్నారేంటి?'

'ప..ప..పాములేమైనా ఉన్నాయేమోనని..'

'ఛ..వూరుకోండి. మా ఆసుపత్రిలో పాములేంటి? ఇంతకీ మీరెవరు?'

'నా పేరు పీడకలల పాపారావండి. భయంకరమైన కలలు వస్తుంటాయండి. మీరు గొప్ప వైద్యులని విని వచ్చానండి...'

'ఓ... అదా? రాత్రి కలలోకి పాములేమైనా వచ్చాయా?'

'అవునండి బాబూ.. హడలి పోయాను..ఆ దడ ఇంకా తగ్గలేదండి బాబూ..'

'సరే... కంగారు పడకుండా కలేంటో చెప్పండి..'

'ఓ రాత్రివేళ ఏదో చప్పుడైతే ఏంటాని నా మంచం పక్కన చూశానండి. ఓ నల్లత్రాచు పడగ విప్పి ఆడుతూ బుస కొడుతోందండి. వార్నాయనో.. అని ఒక్క ఉదుటన దూకేసి వీధిలోకి పరిగెత్తానండి. అక్కడండీ.. ఏం చెప్పమంటారండి బాబూ.. సినిమాల్లోలాగా... ఓ పెద్ద అనకొండ జరజరా పాకుతోందండి. నాలాగే చుట్టుపక్కల వాళ్లంతా ఇళ్లలోంచి బయటకి వచ్చేశారండి. ఎక్కడ పడితే అక్కడ పాములండి. మరి భయపడకుండా ఎలా ఉంటాను చెప్పండి?'

'అవును. మీ భయంలో అర్థం ఉంది. ఇంతకీ కల అయిపోయిందా?'

'ఎక్కడండి బాబూ! వూరు వూరంతా గగ్గోలు పెడుతూ పోలీస్‌ స్టేషన్‌కి పరిగెత్తామండి. అక్కడ చూద్దుం కదా, కుర్చీల్లో కట్ల పాములండి. దాంతో మండలాఫీసుకి ఉరికామండి. అక్కడ రెండు తలల నాగులండి. ఇలా ఏ ఆఫీసుకెళినా పసరికలు, జెర్రిగొడ్డులు, గోధుమ త్రాచులు, కొండచిలువలు, అనకొండలూనండి. అందరం పొలో మంటూ ఎమ్మెల్యే ఆఫీసుకు వెళ్లామండి. అక్కడ అయిదు తలల పాములున్నాయండి. ఆపై ఏకంగా అసెంబ్లీకే పోయామండి. అక్కడైతేనండీ... ఏకంగా వెయ్యితలల విషసర్పాలు కనిపించాయండి. చిత్రమేంటంటే, ఈ పాములు భూమి మీద బుసకొడితే ఆ భూమి బీడువారిపోతోందండి. ఇవి కొండల్ని సైతం చుట్టచుట్టేసుకుని కాటేస్తుంటే, ఆ కొండ మాడి మసైపోతోందండి. ఇదెక్కడి దిక్కుమాలిన కలండీ బాబూ? దీనికసలు వైద్యముందంటారా?'

'అన్నింటికీ వైద్యం ఉంటుంది. కాస్త నిదానించండి. మెలకువగా ఉన్నప్పుడు మెదడుకి చేరే సమాచారానికి వూహాశక్తి తోడై రాత్రిళ్లు కలలొస్తాయి. ఇప్పుడు చెప్పండి. నిన్న మీరు ఏం విన్నారు? ఏం చూశారు?'

'ఎన్నికల కాలం కదండీ? పత్రికల్లో ఘోరమైన అవినీతి కుంభకోణాల గురించి చదివానండి. సాయంత్రం ప్రతిపక్షనేత సభకెళితే ఆయనా అవే మాట్లాడాడండి..'

'అదీ సంగతి! మీలో ఏ రోగమూ లేదు. కానీ చాలా సున్నిత మనస్కులు. పైగా సామాజిక స్పృహ కూడా ఎక్కువనుకుంటాను. అందుకే ఈ కల వచ్చింది..'

'అంటే ఈ పిచ్చికలకి కూడా ఓ అర్థం గట్రా ఉండేడిశాయంటారా?'

'లేకేం? చెబుతాను వినండి. మీకు కనిపించిన పాములు అవినీతికి ఆనవాళ్లు. ఆ అవినీతి ప్రభావం ప్రతి ఇంటినీ సోకుతోంది. అందుకనే ఇళ్లలోకి పాములు దూరినట్టు కనిపించింది. వీధుల్లో అవినీతి అనకొండలు దర్జాగా తిరుగుతున్నాయి. మొరపెట్టుకోడానికి ప్రజలంతా ఏ కార్యాలయానికి వెళ్లినా అక్కడ అవినీతి పాతుకుపోయి కనిపిస్తోంది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అసెంబ్లీలోనే వేయితలల అవినీతి విషసర్పాలు మాటు వేశాయి. సామాన్యులు ఎక్కడికెళ్లినా లంచం బుస కొడుతోంది. ఓ వినతి పత్రం ముందుకు కదలాలంటే లంచం.. ఓ అనుమతి కావాలంటే లంచం.. ఇలా ఎక్కడ పడితే అక్కడ అవినీతి పుట్టలు పోసింది. ప్రజలకు చెందిన ప్రభుత్వ భూముల్ని అవినీతి పరులు ఆక్రమించుకుంటున్నారు. కలలో పాములు కొండల్ని చుట్టుకోవడమంటే గనులను దోచుకోవడమన్నమాట. ఇప్పుడు అర్థమైందా పాపారావుగారూ!'

'భేషుగ్గా డాక్టర్‌గారూ! కానీ ఈ అవినీతి సర్పాలను ఏం చేయాలో కూడా నాకు కలలో వస్తే బాగుండేది..'

'వాస్తవ పరిస్థితులే కలగా మారతాయి కాబట్టి మీకు పరిష్కారం తోచదు. కలని విశ్లేషించుకుని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి..'

'మరిప్పుడు నేనేం చేయాలంటారు?'

'అవినీతి సర్పయాగం!'

'అంటే.. అప్పుడెప్పుడో జనమేజయుడు సర్పయాగం చేసినట్టా? నాకంతటి శక్తి ఎక్కడిదండీ?'

'అదిగో అలాగే అనుకోకూడదు. ఇప్పుడు జనమే జనమేజయులు. మీరు, మీలాంటి ప్రజలందరూ కలసి అవినీతి సర్పయాగం చేసే అవకాశం వచ్చింది. మిమ్మల్ని ఇన్నాళ్లూ పాలించి, అవినీతి పాముల్ని పాలు పోసి పెంచిన నేతల్ని మీ ఓటు ద్వారా గద్దె దించండి...'

'కళ్లు తెరిపించారు డాక్టర్‌గారూ! ఇక వస్తా'

PUBLISHED IN EENADU ON 09.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి