శుక్రవారం, ఆగస్టు 07, 2026

అంతరిక్షంలో అన్నదమ్ముల అద్భుత ప్రయాణం!


భూమి మీద నుంచి 50 ఏళ్ల క్రితం ఇద్దరు అన్నదమ్ములు చెరో దారిలో అంతరిక్షంలోకి బయల్దేరారు. అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా, విసుగూ విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్లలా ఇప్పటికి ఏకంగా 2500 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. అంతేకాదు... అంత దూరం నుంచి కూడా భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని పంపుతూనే ఉన్నారు.

ఇంతకీ ఆ అపూర్వమైన అన్నదమ్ములు ఎవరో తెలుసా?

వాయేజర్-1, వాయేజర్-2.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వీళ్లని తయారు చేసింది. 1977లో వీళ్లని అంతరిక్షంలోకి ప్రయోగించింది.

అన్నదమ్ముల్లాంటి ఈ అంతరిక్ష పరికరాలు (స్పేస్ ప్రోబ్స్) ఇప్పుడు ఎలాంటి ఘనతను సాధించాయో తెలుసా?

మానవులు ప్రయోగించిన ఓ పరికరం ఏనాడూ వెళ్లనంత దూరానికి ఇవి చేరుకున్నాయి.

ఆ దూరం 2500 కోట్ల కిలోమీటర్లకు పైమాటే.

అదెంత దూరమో అర్థం కావాలంటే అసలు మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి సూర్యకుటుంబం అంటారు కదా? 

సూర్యుడి నుండి నిరంతరం వెలువడే సౌర పవనాలు (solar winds), అయస్కాంత క్షేత్రం (magnetic field) కలిసి అంతరిక్షంలో ఏర్పరిచే ఒక భారీ 'బుడగ' లాంటి రక్షిత ప్రాంతాన్ని హెలియో స్పియర్ అంటారు. గెలాక్సీలోని ఇతర నక్షత్రాల విస్ఫోటనాల నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల (cosmic rays) నుండి ఇది మన సౌర వ్యవస్థ లోపలి గ్రహాలను రక్షిస్తుంది.

ఈ హెలియో స్పియర్ వెలుపలి సరిహద్దు (outer boundary)ను హెలియో పాజ్ అంటారు. ఈ ప్రాంతంలో సూర్యుడి నుండి వచ్చే సౌర పవనాలు తమ వేగాన్ని కోల్పోయి, నక్షత్రాల మధ్య ఉండే వాయువులు, ధూళితో (interstellar medium) ఢీకొంటాయి.  

నాసా ప్రయోగించిన వాయేజర్ 1, వాయేజర్ 2 వ్యోమనౌకలు ఈ సరిహద్దును దాటి పోయాయి. వాయేజర్ 1 ఆగస్టు 2012లో, వాయేజర్ 2 నవంబర్ 2018లో 'హీలియోస్పియర్' దాటిపోయి రికార్డు సృష్టించాయి.   

ఇక అక్కడి నుంచి మొదలయ్యే ప్రాంతాన్ని నక్షత్రాంతర రోదసి (interstellar space) అంటారు.

అద్భుత ఆవిష్కరణ...

అక్కడ అవి చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

సౌర వ్యవస్థ చివర భాగంలో ఉన్న హెలియోపాజ్  ప్రాంతంలో ప్లాస్మా ఉష్ణోగ్రతలు 54,000 నుంచి 90,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు నమోదయ్యాయి. అందుకే ఈ ప్రాంతాన్ని చాలామంది "అగ్ని గోడ" (Wall of Fire) అని పిలుస్తారు.

ఇంతటి భయంకరమైన వేడిలో కూడా వాయేజర్ నౌకలు ఎలా సురక్షితంగా ప్రయాణించాయి?

దీనికి కారణం అక్కడి పదార్థ సాంద్రత చాలా తక్కువగా ఉండటమే. అక్కడ కణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటంతో, అవి అంతరిక్ష నౌకకు వేడిని బదిలీ చేయలేకపోయాయి. అంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువైనా, వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎలాగంటే... మనం వేడిగా ఉన్న ఓవెన్‌లో గాలిలో చేయి కొద్దిసేపు ఉంచినా ఏమీ కాదు. కానీ ఓవెన్ లో వేడెక్కిన ఇనుప పాత్రను తాకితే మాత్రం వెంటనే కాలుతుంది కదా? అలాగన్నమాట.

ఈ మిషన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. సౌర వ్యవస్థ అంచు ఒక స్థిరమైన సరిహద్దు కాదు. అది సూర్యుని కార్యకలాపాలను బట్టి విస్తరిస్తూ, కుంచించుకుంటూ ఉండే సరిహద్దు. అందుకే వోయేజర్-1, వోయేజర్-2 రెండూ సూర్యుని నుండి వేర్వేరు దూరాల్లో హెలియోపాజ్‌ను దాటాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హెలియోస్ఫియర్ వెలుపల ఉన్న అయస్కాంత క్షేత్రం, లోపల ఉన్న అయస్కాంత క్షేత్రం దాదాపు ఒకే దిశలో ఉంది. ఇది శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది.

 మొత్తం మీద వాయేజర్ సోదరులు దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అమూల్యమైన సమాచారాన్ని భూమికి పంపుతూ, విశ్వ రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు.

మరి ఈ ప్రయోగం ఉద్దేశ్యం ఏమిటి?

వాయేజర్ స్పేస్ ప్రోబ్స్ ను అంతరిక్షంలోకి పంపడం వెనుక ఓ లక్ష్యం ఉంది. అంతుపట్టని ఈ విశ్వంలో ఎక్కడైనా మనలాంటి గ్రహాంతర వాసులు ఉంటే వాళ్లకి మన ఉనికి, మన భూమి గురించి తెలియజేయాలనే. అందుకే వీటిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఆధ్వర్యంలో ఒక గోల్డెన్ రికార్డును అమర్చారు. ఇందులో భూమిపై ఉన్న విభిన్న శబ్దాలు (గాలి, ఉరుములు, పక్షులు, జంతువుల అరుపులు), సంగీతం, సంస్కృతుల చిత్రాలతో పాటు, గ్రహాంతర వాసుల కోసం 55 ప్రపంచ భాషలలో శుభాకాంక్షలు రికార్డ్ చేశారు. ఇందులో 55 భాషల్లో శుభాకాంక్షలు ఉన్నాయి. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ‘‘తెలుగు మాట్లాడే ప్రజల నుంచి మా శుభాకాంక్షలు’’ అని అందులో ఉంటుంది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి