శనివారం, ఆగస్టు 29, 2026

బాలీవుడ్ లో నవ్వులు పంచిన తెలుగు వాడు !

తెలుగు ప్రాంతంలో పుట్టి...

ముంబైకి వలస వెళ్లి...

ఆర్థిక ఇబ్బందులు పడి...

రకరకాల  పనులు చేసి...

ఆఖరికి వెండితెరపై ఓ వెలుగు వెలగడం వెనుక... కేవలం విధి మాత్రమే ఉండదు. జీవితంలోని ప్రతి దశలోనూ ఉత్సాహాన్ని, ఉత్సుకతను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిత్వం కూడా ఉంటుంది.

అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడే... జానీలీవర్.

బాలీవుడ్ సినిమాల్లో కమేడియన్ గా నవ్వులు పంచిన జానీ లీవర్ తెలుగు వాడేనని చాలా తక్కువ మందికే తెలుసు. ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. అసలు పేరు జాన్ ప్రకాష్ రావ్ జనుముల. తండ్రి హిందూస్తాన్ లీవర్ లో కార్మికుడు.

కడుపు పట్టుకుని వలస వెళ్ళిపోయిన తండ్రి చిటికెన వేలు పుచ్చుకుని చిన్నప్పుడే ముంబై మహానగరం చేరాడు జానీ.   అక్కడ చదువు  7 వ తరగతి దాటలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు... కుటుంబ పరిస్థితుల మధ్య రాటుదేలాడు.  దొరికిన పనల్లా చేశాడు. ట్రాఫిక్ ఆగినప్పుడల్లా వాహనాల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి పెన్నులు లాంటి వస్తువులు అమ్మడం లాంటి పనుల్లో కూడా అవకాశాలనే చూశాడు. ఆ పనులను కూడా ఉత్సాహంగా కొత్తగా చేయాలని ప్రయత్నం చేసేవాడు. బాలీవుడ్ సినిమాల్లో హీరోల గొంతును అనుకరిస్తూ, మిమిక్రీ చేస్తూ, హిందీ సినిమా పాటలకి డ్యాన్సులు చేస్తూ అమ్మేవాడు. సరదాగా చేసే ఆ పనుల్లోనే ‘సేల్స్ మన్ షిప్’ చూపించేవాడు.

ఒకసారి హిందూస్తాన్ లీవర్ కంపెనీలో ఏదో ఫంక్షన్ జరిగితే, అక్కడ పని చేసే ఉన్నత ఉద్యోగుల గొంతులను మిమిక్రీ చేసి కడుపుబ్బ నవ్వించాడు. దానితో జానీ పేరు పక్కన లీవర్ చేరిపోయింది.  అందిన పనిని ఇష్టంగా చేసే ఆ తత్వమే అతడికి అదే కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తుంటేనే అనుకరణ కళతో హాస్యం పండించే అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు అతడిని ఇండియాలోనే తొలి ‘స్టాండప్ కమేడియన్’ గా పేరు తెచ్చిపెట్టాయి. జానీ టైమింగ్, హావభావాలు, మిమిక్రీ ప్రతిభ చూసి అనేక కామెడీ షోలు  అతడి కోసం క్యూ కట్టాయి. దాంతో  ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయి కమెడియన్ గా మారాడు జానీ లీవర్.

అలా ప్రదర్శనలు ఇస్తూ 1982 లో వరల్డ్ టూర్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బృందం తో కలిసి కామెడీ షో చేసే ఛాన్స్ తలుపు తట్టింది. అది జానీలీవర్ జీవితాన్ని మలుపు తిప్పింది. వెండితెరపై తొలి అవకాశాన్ని అప్పటి నటుడు సునీల్ దత్ ‘దర్ధ్ కా రిస్తా’ లో ఇచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోగా తన పని తాను చేసుకుంటూ తనలోని మిమిక్రీ, హాస్యాలను మేళవిస్తూ ‘హసీ కే హంగామా’ పేరుతో ఒక ఆడియో క్యాసెట్ విడుదల చేసాడు. ఆ క్యాసెట్ సూపర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పరిచయం చేసింది. కామెడీ స్టార్ గా మార్చేసింది. ఒక ఛారిటీ షో లో ఆయన ప్రతిభను గమనించిన బాలీవుడ్ నిర్మాత గుల్ ఆనంద్ ‘జల్వా’ సినిమా లో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు జానీ లీవర్.

1990 లో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా బాజీగర్’తో   స్టార్ కమెడియన్ అయిపోయాడు. అయినా కూడా తనకి ఇష్టమైన కామెడీ షో లని మాత్రం వదల్లేదు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా 1999లో మైఖేల్ జాక్సన్ ని అనుకరిస్తూ జానీ లీవర్ చేసిన స్కిట్ ను ఇప్పటికీ తలుచుకుంటునే ఉంటారు హాస్య ప్రియులు.

మొత్తం 350 పైగా సినిమాల్లో నటించిన జానీ లీవర్,  చాలా భాషల్లో మాట్లాడగలడు కూడా. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళం, తుళు. తుళు, తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసాడు. తెలుగులో మహేష్ బాబు  హీరో గా పరిచయమైన ‘రాజకుమారుడు’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసాడు కూడా.

సినిమాలతో పాటు, టీవీ షో లు కూడా అనేకం చేసాడు.

జానీ లీవర్ భార్య సుజాత. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. జానీ  సోదరుడు జిమ్మీ మోసెస్ కూడా హాస్య నటుడుగా, మిమిక్రీ కళాకారుడిగా రాణించాడు.

జానీ లీవర్ చివరిగా 2023 లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక కామెడీ షో లో కనిపించాడు.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి