శుక్రవారం, ఆగస్టు 10, 2012

ఆటల్లో అరటిపండు

ఆటల్లో అరటిపండు


రాజకీయ ఒలింపిక్స్‌. స్టేడియంలో ప్రేక్షకులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. మైకుల్లో క్రీడల వివరాలు ప్రకటిస్తున్నారు. 'ఇప్పుడు పరుగు పందెం' అని వినిపించింది. వెంటనే ప్రధాని మన్మోహన్‌ స్టేడియంలోకి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చారు. కానీ... ఆశ్చర్యం! ఇంకెవరూ పోటీలో లేరు. పైగా ఒకే ఒక ట్రాక్‌ ఉంది. ఇంతలో సోనియా గాంధీ వచ్చి విజిల్‌ వేశారు. మన్మోహన్‌ సింగ్‌ నెమ్మదిగా నడవసాగారు. ట్రాక్‌కి బయట సోనియా గాంధీ నడుస్తూ 'అడుగులు వేయండి. అలుపు తీర్చుకోండి. మలుపు తిరగండి' అంటూ చెబుతున్నారు.
ఇదంతా చూస్తున్న గుంపులో గోవిందానికి సందేహం వచ్చింది. 'ఇదెక్కడి పందెం గురూ?' అన్నాడు పక్కవాడితో.

'అదంతేనోయ్‌! పనిగట్టుకుని స్టేడియానికి వచ్చాక నోరు మూసుకుని చూడటమే. ఆయన్ని పోటీకి ఎంపిక చేసింది ఆవిడే. ఇంకెవరూ పక్కన లేరు. ఇక పరుగెట్టినా, నడిచినా, డేకినా ఆయనేగా విజేత?' అన్నాడా అనుభవజ్ఞుడైన పక్కవాడు.

ఇంతలో కొందరు రాహుల్‌ గాంధీని చంకనేసుకుని వచ్చారు. నోట్లో వేలేసుకుని ఉన్న అతడికి స్పోర్ట్స్‌ షూ తొడిగి మన్మోహన్‌ వెనకాల ట్రాక్‌పైకి వెళ్లమని బతిమాలుతున్నారు. అతడేమో సోనియాకేసి చూస్తున్నాడు. ఆమె ఎటూ చెప్పకుండా 'ట్రాక్‌లోకి దిగాలో లేదో నిర్ణయించుకోవాల్సింది అతడే. ఎప్పుడు దిగుతానంటే అప్పుడే దింపండి' అంటున్నారు.

'వార్నీ! ఆవిడ చుట్టూ అంతమంది పెద్దపెద్దవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరూ ట్రాక్‌లో పరుగెత్తలేరా? మారాం చేస్తున్న ఆ పిల్లాడినెందుకు దిగమంటారు?' అన్నాడు గోవిందయ్య.

'వారసత్వ వీరుడు ఉండగా ఇంకెవరు దిగుతారయ్యా? అమ్మగారి ఆనందం కోసం ట్రాక్‌ను ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతారు. ఆ పిలగాడు పరుగు నేర్చుకునే వరకూ అంతే. ఈలోగా మన్మోహన్‌గారి నత్తనడకలు చూడాల్సిందే మనం. ఓపికుంటే చప్పట్లు కొట్టు, లేదా మరో పోటీ చూడు' అన్నాడు అనుభవజ్ఞుడు.

గోవిందయ్య మరోవైపు తల తిప్పాడు. అక్కడ షూటింగ్‌ జరుగుతోంది. కేంద్రమంత్రులందరూ వరసగా నిలబడి తుపాకులు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న లక్ష్యాలను గురి చూసి పేల్చారు. చిత్రం! వాటిలో ఒక్కటీ బోర్డుకు తగల్లేదు. అప్పుడే అక్కడికి వచ్చి చూస్తున్న సోనియా, మన్మోహన్‌ మాత్రం ఆనందంగా చప్పట్లు కొట్టసాగారు.

'గురి తప్పినా సంబరమేంటి?' అన్నాడు గోవిందయ్య.

'వాళ్లంతా వేర్వేరు పార్టీలనుంచి వచ్చిన సంకీర్ణ షూటర్లు. ప్రగతి లక్ష్యాలు సాధించడానికే గురిపెట్టి తూటాలు కాల్చారు. కానీ, ఏ లక్ష్యమూ ఇంకా అందలేదు మరి. అయితే బోర్డుకు బారెడు దూరం నుంచైనా తూటాలు దూసుకుపోయాయని వాళ్లిద్దరూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతానికివాళ్లకు ట్రిగ్గరైనా నొక్కడం చేతనైందని మనం ఆనందపడాలంతే' అన్నాడు అనుభవజ్ఞుడు.

గోవిందయ్య మరోవైపు చూశాడు. అక్కడ హర్డిల్స్‌ జరుగుతున్నాయి. ట్రాక్‌ మీద ముందుగానే అమర్చిన హర్డిల్స్‌ కాకుండా పరిగెడుతున్నవారికి కాళ్ల ముందు వేరేవాళ్లు అడ్డంకులు పెడుతున్నారు. 'అరె... క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందే ఈ వ్యవహారం?' అన్నాడు గోవిందయ్య.

'అది ఆంధ్రా మైదానం నాయనా! అక్కడ తలపడుతున్నవాళ్లంతా ఒకే జట్టు. కానీ, ఎవరు పరుగెడుతున్నా మరొకరు అడ్డాలు కల్పిస్తారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. అక్కడి అధికార పార్టీ సంస్కృతే అంత. అడిగితే అదంతా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. కళ్లప్పగించి చూడ్డమే' అంటూ వివరించాడు అనుభవజ్ఞుడు.

ఆ పక్క ఈత కొలనులో అంతా గందరగోళంగా ఉంది. అందులో ఓ గెడ్డపాయన ఈదుతుంటే మరికొందరు అడ్డంగా ఈదుతున్నారు. కొందరు ఉన్నచోటనే ఉంటూ నీళ్లని తపతపా కొడుతూ అల్లరి చేస్తున్నారు. 'దయచేసి అందరం ఒకే దిశగా కలిసికట్టుగా ఈదుదాం' అని ఆయన చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు.

'ఇలాటి ఈతను నేనెప్పుడూ చూడలేదు' అన్నాడు గోవిందయ్య.

'ఆయనే చెయ్యి తిరిగిన క్రీడాకారుడు చంద్రబాబు. ఆయనది, ఆయన అనుచరులది ఇప్పుడు ఎదురీతే. వీళ్లు మునుగుతారో, తేలుతారో, ఎప్పుడు గట్టెక్కుతారో తెలియకుండా ఉంది కాబట్టే కొలనంతా సుడిగుండంలా మారింది' అన్నాడు అనుభవజ్ఞుడు.

ఇంతలో ఆ మైదానంలో పెద్ద కలకలం రేగింది. కొందరు 'దొంగ... దొంగ' అని అరుస్తున్నారు. పోలీసులు విజిల్స్‌ వేసి పరిగెడుతున్నారు. ఓ యువ క్రీడాకారుడు అక్కడి పతకాలను చేజిక్కించుకుని పారిపోతుంటే పట్టుకున్నారు. మరి కొందరు ఆ యువకుడికి వత్తాసుగా జేజేలు పలుకుతున్నారు.

ఆ యువక్రీడాకారుడు పోలీసుల చేతుల్లో గింజుకుంటూ, 'ఎలాగూ ఇక్కడి పతకాలన్నీ నాకే వస్తాయి. ఈ మాత్రం దానికి ఆటలెందుకని ముందే పట్టుకుపోతున్నా. ఏం తప్పా? కావాలంటే స్టేడియంలో ప్రేక్షకులను అడగండి' అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు.

'వీడెవడడండీ బాబూ?' అన్నాడు గోవిందయ్య.

'అతడు ఒకట్రెండు ఆటల్లో గెలిచిన మాట వాస్తవమే. దాంతో తన శక్తి మీద తనకు నమ్మకం పెరిగిపోయింది. మొత్తం ఆటలన్నీ గెలిచేస్తాననుకుంటున్నాడు. గెలవకుండానే పతకాలు దోచేద్దామనుకున్న వాడు, తీరా గెలిస్తే ఏం చేస్తాడోననే చాలామంది దిగులు పడుతున్నారు' అన్నాడు అనుభవజ్ఞుడు.

'ఏంటో? ఈ ఆటలన్నీ చూస్తుంటే నాకు ఆయాసంగా ఉంది. చివరికి ఆటల్లో అరటిపండులా మిగిలిపోయేలా ఉన్నా. ఇక ఇంటికి పోతా' అంటూ గోవిందయ్య బయల్దేరాడు.

ఇంతలో తొలికోడి కూయనే కూసింది!

PUBLISHED IN EENADU ON 10.08.2012

గురువారం, జులై 12, 2012

ఎవరి సమర్థత వారిది...

ఎవరి సమర్థత వారిది...




'గురూగారూ! మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటుంటే నేను తప్పకుండా సమర్థుడిగా పేరు తెచ్చుకుంటాననే నమ్మకం కలుగుతోందండి...'
'అప్పుడే నమ్మకాల్దాకా వద్దులేగానీ, ముందు కుసింత నిదానించు. సేద తీరాక సెప్పు, అసలు సమర్దతంటే నీకేటర్దమైందో...'

'ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండీ? మనమెందులో అడుగుపెడితే అందులో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే సమర్థత కదండీ?'

'మరక్కడే పొరపడ్డావు. పదాలకి పెపంచికం అర్దాలేరు, రాజకీయ అర్దాలేరు. దాన్ని బట్టి అంతరార్దం కానుకోవాలి మరి...'

'మీతో వాదించి గెలవలేం కానీ, రాజకీయాల్లో సమర్థతకి అర్థమేంటో మీరే చెప్పండి...'

'అట్టారా దారికి! అధికార పీటమ్మీద నువ్వే బాసింపట్టేసుకుని కూసున్నట్టోపాలి వూహించుకో. ఇప్పుడు సెప్పు సమర్దుడివి కావాలనుకుంటే ఏం సేయాలో?'

'ఏముందండీ? మనల్ని ఇంతవాళ్లని చేసిన ప్రజలకి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలండి. సమస్యల్ని పరిష్కరించాలండి. అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలండి. అంతేనాండీ?'

'ఒరే... నువ్వరజంటుగా లెగిసి, ఎనక్కి సూడకుండా ఇంటికిపో. రేప్పొద్దున పప్పుల కొట్టెట్టుకుని నాక్కబురంపించు. నేనొచ్చి రిబ్బను సింపి, నువ్వందుకు తప్ప ఎందుకూ పనికి రావని ఉపన్నాసం వాగేసి సక్కా వత్తాను. సరేనా?'

'అయ్యబాబోయ్‌! అదేంటండీ, అంతమాటనేశారు? నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానంటారా?'

'ఇన్నాల్లూ రాజకీయ పాటాలంటా నన్ను తెగ వాగించి, ఇప్పుడిలా మాట్టాడితే ఒల్లు మండుకు పోదేంట్రా! నీ మాటలెవరైనా ఇంటే నిన్ననరు, నీకు పాటాలు సెప్పిన నన్నంటారు, వట్టి అసమర్దుడినని. పోయిరా...'

'బాబ్బాబు... బుద్ధొచ్చిందండి. కాస్త శాంతించి బోధించండి'

'ఏటీ? కుర్సీ ఎక్కి కూసున్నాక సమస్సెలు తీర్సేత్తావా? అన్నీ తీర్సేత్తే వచ్చేపాలి ఎన్నికల్లో ఇక హామీలేటుంటాయి? నీకసలు బుర్రుందాని! కాబట్టి సమస్సెని సెప్పు కింద తేలులా అట్టాగే పడుండనివ్వాల. కానీ పరిస్కారం సేసేత్తన్నట్టు అడావుడి మాత్రం సెయ్యాల. పథకాలెట్టాల, కానీ అమలు కానీకుండా సాగదీయాల. ఈలోగా బిల్లులెట్టి కజానా సొమ్ముని, కొబ్బరి బొండాంలో నీల్లలా జుర్రుకోవాల. అన్ని రంగాల్లో అభిరుద్ది సాదించాల, కానీ పెజానీకానిక్కాదు, నీకు! ఇప్పటికైనా అర్దమైందా?'

'అర్థమైంది మహప్రభో, మన్నించండి. నాకు సమర్థత లేదని ఒప్పుకొంటున్నాను. కాబట్టి దాని గురించి మొదట్నుంచీ చెప్పండి...'

'సరే... రాసుకో! రాజకీయ సమర్దత పలు రకాలు. అందులో సమర్దుడు బయటి పెపంచికానికి ఏమీ సేతకాని వోడిలాగే ఆనతాడు. ఉదారనకి మన పెదాన మంతిరి గోరిని సూడు. ఆయనొట్టి సేతకాని వోడని దేసిదేసాల్లో పుత్తకాలు తెగ రాసేత్తన్నాయి. కానీ అసమర్దుడా? కాదు. ఎందుకంటే అమ్మగోరికి అనిగిమనిగి ఉండటంలో ఆయనంత సమర్దుడు ఇంకెవరుంటారు సెప్పు? అందుకని ఆమెకు అనువుగా ఉంటమే ఆయన సమర్దతన్నమాట. ఇంకెన్ని పెత్రికలు ఏం రాత్తే ఏమవుద్ది? బోలెడు మంది మోత్తన్న పల్లకిలో అమ్మ కూసోబెట్టిన బొమ్మలా వూరేగుతున్నప్పుడు సొంతంగా ఏమీ సెయ్యకపోవడమే ఆయన సమర్దత. మోతగాల్లు తప్పులు సేసి కజానా సొమ్ముని మజా సేత్తన్నా నిమ్మకు నీరెత్తినట్టుండటమే ఆయన సమర్దత. కాబట్టి, నీకు పదవిచ్చినోరి మనసులో సమర్దుడిగా ఉండాలని సూడాలే తప్ప, పెజానీకం ముందు సమర్దుడివైపోవాలనుకున్నావనుకో. అదే నీ అసమర్దతని అర్దం సేసుకో. అర్దమైందా?'

'ఆహా... ఎంత బాగా చెప్పారండీ! ఇంకా ఇలాటి సమర్థులెవరో చెబుదురూ?'

'ఒకోరిలో ఒకో సమర్దత ఉంటదిరా. కొందరిలో బోలెడు సమర్దతలు కిక్కిరిసిపోయుంటాయి. ఏమీ సెయ్యకపోవడం దేశానికే పెద్దాయన సమర్దత అనుకుంటే- సొయంగా కుర్సీ ఎక్కక పోయినా, ఎక్కినోల్ల సాటుగా సెక్రం తిప్పడం మరో రకం సమర్దత. ఉదారనకి మన రాట్రంలో యువనేతని వేరే సెప్పాలా? ఆయన సమర్దతలు పలురకాలు. ఆయనగోరు సేసిన పన్లు ఎన్నెన్నో, నొక్కేసిన సొమ్ములెంతెంతో లెక్క సూడలేక సీబీఐవోల్లే కిందా మీదా పడిపోతుండటం సూత్తన్నావుగా? ఇన్ని సేసి కూడా తన వూపిరి, తిండి, పడక, నిద్ర అన్నీ పెజానీకానికే అంకితమన్నట్టు సాటుకోవడం మాగొప్ప సమర్దత. ఎదవ పన్లు సేత్తా కూడా, ఎదురెట్టి పెద్ద మగానుబావుడిలా పెజానీకానికి బ్రెమ కలిగించేలా సూసుకోడం అసలైన సమర్దత. సేసిన పన్లు బయటపడినా కూడా సానుబూతికి డోకా లేని ఏసాలెయ్యడం నికార్సయిన సమర్దత. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, ఇంతమంది రాజకీయ సమర్థుల మధ్య అవకాశం వచ్చినా ఏమీ చేయలేనివాళ్ల పరిస్థితి ఏమిటండీ?'

'సెయ్యలేనప్పుడు సేతులెత్తేయడం కూడా సమర్దతేరా. ఉదారనకి మన రాట్ర నేత సంగతి సూడు. కుర్సీమీద ఎంత కాలం ఉంటాడో, ఎప్పుడు దిగుతాడో తెలీని సిక్కులో ఉన్నాడు. ఏం సెప్పాలన్నా, ఏం సెయ్యాలన్నా విమానమెక్కి డిల్లీకెల్లాల్సిందే. అయినా పైకి నిబ్బరంగా ఉండటం ఆయన సమర్దత. దాన్ని కప్పిపుచ్చుకోడానికి విరాగిలా మాట్టాడతా పెద్దమనిసిలా సెలామనీ కావాలని సూడ్డం గమనించలేదా? మొన్నకి మొన్న బడికెల్లే పిల్లల సబలో ఏదాంతం మాట్టాడలేదా? మన సేతిలో ఏమీ లేదని, వచ్చేప్పుడు ఏమీ తీసుకురామనీ, పోయేప్పుడు ఏదీ ఎంటరాదనీ సెప్పే సందర్బమా అది సెప్పు? అలా ఎటుపోయి ఎటొచ్చినా డోకరా లేకుండా సూక్తులు మాట్టాడ్డం కూడా ఓ రకం సమర్దతే మరి!'

'అదరగొట్టారండీ! సమర్థత గురించి ఇంత సమర్థంగా చెప్పడం మీ సమర్థతే సుమండీ!'

'పొగడ్డంలో నీ సమర్దత కూడా అర్దమైందిలే కానీ... ఇక బయల్దేరు!'

Published in Eenadu on 12.07.2012

సోమవారం, జులై 02, 2012

కుతంత్ర రాజకీయం

కుతంత్ర రాజకీయం



'నమస్కారం గురూగారూ!'
'ఏంట్రోయ్‌ శాన్నాళ్లకి కనిపించావ్‌? సేతిలో ఏటది... పుత్తకమా?'

'అవునండి. విజయానికి 116 మెట్లని ఎవరో రాశారండి, చూద్దామని కొన్నా'

'వార్నీ, అందుకే నువ్వింకా ఎదగలేదొరే... ఇజయం సాధించాలంటే అడ్డదార్లు ఎతకాలి! మెట్లెవరికి కావాల్రా? మోకాళ్లు అరిగేట్లు ఎక్కద్దూ?'

'మరందుకేనండి. ఆ అడ్డదార్లేవో చెబుతారనే పుస్తకం కొనగానే ఇలా వచ్చా...'

'పోన్లే, బతికించావ్‌. ఇన్నాళ్లూ రాకపోతే నువ్వేమన్నా నా మీద కుట్రలు సేత్తన్నావేమో అనుకున్నా...'

'అయ్యబాబోయ్‌ అదేంటండీ బాబూ! మీ మీద కుట్రా? కలలో కూడా అనుకోనండి...'

'కలలో సంగతలా ఉంచు. ఇలలో మాత్రం నువ్వెన్ని కుట్రలు సేసైనా కుట్ర సంగతేంటో తెలుసుకోవాల్రా...'

'ఈ కుట్రల గొడవేంటండి బాబూ, సరిగా చెప్పండి...'

'ఏం లేదురా. కుట్రలు సేయడం వేరు. ఎదుటోల్లు కుట్ర సేశారని గగ్గోలు పెట్టడం వేరు. ఈ రెంటికీ తేడా తెలుసుకో ముందు. రాజకీయాల్లోకి రాగానే నువ్వెలాగా కుట్రలే మొదలెడతావు. ఏ పథకాన్ని అడ్డవెట్టుకుని ఎలా దోసుకోవాలన్న కాన్నుంచి, నీ నిజ రూపం జనానికి తెలీకుండా ఎలా జో కొట్టాలనేంత వరకు నీయన్నీ కుట్రలని పెత్తేకంగా సెప్పాలా? నేను సెప్పబోయేది ఆటి గురించి కాదు. సీటికీ మాటికీ ఎదుటోన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆడే నీపై కుట్రలు సేత్తన్నాడని ఎదురెట్టి బురదెయ్యాల. అప్పుడాడు కాదని సెప్పుకోడానికి నానా తంటాలూ పడతాడు. ఒకేల ఆడు నీ వంకర మాటలు పట్టించుకోకుండా వూరుకున్నాడనుకో, కాదన్లేదు కాబట్టి నిజమే కాబోలని జనం నమ్మేత్తారు. అర్దమైందా?'

'అబ్బో... ఇది రెండు విధాలా ఉపయోగపడే కుట్రన్నమాటండి...'

'సురుకైన వోడివే కానీ, ఇదొట్టి రెండిందాలే కాదు, వందిందాల పనికొచ్చే మాట. కిందపడినా అనచ్చు, మీదకి సేరినా అనచ్చు...'

'కిందున్నప్పుడైతే సరేగానీండీ, పైకెదిగాక ఎలా ఉపయోగపడుతుందండీ?'

'బలేవోడివే. నీ మీద కుట్రల్ని పెజానీకం నమ్మలేదని, తిప్పికొట్టిందని వాడేసుకోవచ్చు. అర్దమైందా?'

'భేషుగ్గానండి! ఇక ఈ కుట్రని వదలనంటే నమ్మండి. ఇంకా ఏయే సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుందో చెబుతారా?'

'ఒహటని కాదురా. దేనికైనా అడ్డమేసుకోవచ్చు. చివరాకరికి నువ్వు సేసిన కుట్రపన్లు బయటపడి అరెస్టులు గట్రా అయినా ఇది పనికొత్తాదిరా...'

'అప్పుడెలా పనికొస్తుందండీ?'

'ఏముందిరా... అరెస్టయ్యాక నీ సేతికి బేడీలేత్తారా? అన్నన్నన్నా... నేనెంత గొప్పోన్నీ, నా ఇలువేంటీ, ఇంతలేసి నీచపు పన్లు సేసాను కదా... నాక్కూడా మామూలు నేరగాడికేసినట్టు ఇనుప సంకెల్లు ఏత్తారా? బంగారు బేడీలెయ్యద్దా? ఇది నన్ను అవమానింసినట్టు కాదా? కావాలనే కుట్ర పన్ని ఇలా సేసారని గోలెట్టొచ్చు. జైల్లో ఏశారనుకో, వజ్రాలు పొదిగిన ఊసలు లేవుకాబట్టి ఇదంతా కుట్రనొచ్చు. వెండి కంచంలో అన్నవెట్టకుండా సీవండి బొచ్చెలో ముద్దేశారు కాబట్టి... కుట్రకాక మరేంటని ఎదురెట్టొచ్చు. నీపై విసారణ సేసిన అధికారిది, నిన్ను పట్టుకున్న పోలీసోడిది, నీకు సిచ్చేసిన జడ్జిగోరిది, ఆ వార్తలు రాసిన ఇలేకర్లది, ఇంటికి పేపరేసే కుర్రాళ్లది, ఆకరికి నీ జైలు గదికి కాపలాకాసే సెంట్రీది కూడా... కుట్రేననొచ్చు. రాసుకుంటన్నావా?'

'ఓ రాసుకున్నానండి. కుట్ర పదం వెనక ఇన్నేసి కుట్రలున్నాయన్నమాట. ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చెబుదురూ?'

'అంటిపండొలిచినట్టు అన్నీ సెబుతారేంట్రా? కుసింత అందిస్తే మిగతాది అల్లుకుపోవాల. అయినా అమాయకుడివి కాబట్టి ఇసదంగా ఇవరిత్తా. ఉదారనకి నువ్వు రోడ్డు మీదకొచ్చాక సెప్పు కరిసిందనుకో- అది కిట్టనోడి కుట్రేననాల. ఆడే రాత్రేల సెప్పులు మార్సేసాడనాల. ఈదిలో నడుస్తుంటే నెత్తిమీద కాకి రెట్టేసిందనుకో... అదీ అంతేననాల. ఆ కాకి ముందు మా ఇంటిమీద వాలి, ఆనక ఆడింటిమీద వాలిందనీ, అది కిట్టక నేను బయటకొచ్చినప్పుడే ఆడు ఉస్సుస్సని దాన్నదిలించాడనీ, అంచాతే నా నెత్తిమీద రెట్టేసిందనీ ఆరోపించాల. నీ కారు సెక్రానికి పంచరైందనుకో, ఎగస్పార్టీవోడు మేకులిసిరించాడనాల. నీ పెన్ను కక్కిందనుకో, ఇంకు ఆడిదేననాల. సివరాకరికి మీ ఆవిడ కొన్న వంకాయల్లో పుచ్చులున్నా, పొద్దుటేలే కూరలమ్మినోడు ఎగస్పార్టీవోల్ల మడిసనాల. ఇంత అడ్డగోలుగా దూసుకుపోయావనుకో. నయా రాజకీయాల్లో నీకిక డోకా ఉండదొరే...'

'అబ్బబ్బబ్బ... ఏం చెప్పారండీ? కానీ మరీ ఇంత చవగ్గా కుట్రలు ఆపాదిస్తే జనం నమ్ముతారాని...'

'మరీ నమ్మరనిపిత్తే నీ తరపున ఓ పేపరెట్టుకో. దాన్లో ఇంకు బదులు బురద నింపి అచ్చేయించుకో. రోజూ అదే దరువేత్తే నమ్మక సత్తారా? ఇయ్యాల ఏం ఏడిశావో సూడ్డానికైనా రోజూ కొంటారు'

'మరి... ఇన్ని పన్లుచేసి ప్రజల దగ్గర మొహం ఎలా చూపించాలండీ... సిగ్గేయదూ?'

'సిగ్గు మాట నీ నోట ఇనిపించిందంటే నువ్వు రాజకీయాలకి పనికి రావనే అర్థం. కాబట్టి దాన్నొదిలెయ్‌. ఇక పెజానీకం దగ్గరకి ఎప్పుడెల్లినా ఏడుపు మొగం పెట్టుకుని ఎల్లాల. లోకమంతా ఏకమై నిన్ను పెజాసేవ సేయనీయట్లేదన్నంత జాలిగా మొగమెట్టాల. అదే జైలుకెల్లేప్పుడు మాత్రం పెద్ద గనకార్యం సేసినట్టు నవ్వుతా, సేతులూపుతా ఎల్లాల... సిద్విలాసంగా వేనెక్కాల. అర్దమైందా?'

'ఆహా... మీ దగ్గరికొస్తే దివ్యోపదేశం లభిస్తుందండి. విజయానికి అడ్డగోలు దార్లని మీరో పుస్తకం రాస్తే లక్షల్లక్షలు అమ్ముడు పోతుందండి'

'మరీ ఎక్కువ పొగుడుతున్నావంటే కుట్రేదో సేత్తన్నావని అర్దం. కాబట్టి బజన ఆపేసి పోయిరా!'

PUBLISHED IN EENADU ON 26.06.12

మంగళవారం, జూన్ 12, 2012

అయ్యయ్యో... ఎంత కష్టం?

అయ్యయ్యో... ఎంత కష్టం?

'ఓలమ్మో... ఓరయ్యో... ఓలక్కో... ఓరన్నో... మాకెంతకట్టమొచ్చినాదోలమ్మా... మీరంతా కలిసి ఆదుకోవాలమ్మో...'

'ఓలమ్మలమ్మ... అంత దుక్కపడకే తల్లీ! సూడ్లేక పోతన్నాం. ఇంతకీ ఏ కట్టమొచ్చినాది?'

'ఇంకా అడుగుతారేటమ్మో... నాకు మాటలు పెగల్టం లేదు. నిచ్చేపంలాటి నా కొడుకును పోలీసులు ఎత్తుకుపోనారమ్మో...'

'అయ్యో తల్లీ, ఎంత కట్టం! కొడుకునెత్తుక పోతే ఏ తల్లి తల్లడిల్లదమ్మా? ఎండనక, కొండనక తారట్టాడతా మా గుమ్మంలోకొచ్చి గింగిరాలు తిరిగిపోతన్నావు. ఇంతకూ నీ కొడుకునెందుకు ఎత్తుకెల్లారే తల్లీ!'

'ఏటి సెప్పేదమ్మో... ఏవో దొంగతనాలు, దోపిడి సేశాడంటన్నారమ్మా... ఈ రోజుల్లో ఎవులు సేత్తంలేదు సెప్పండమ్మా... ఆల్లందర్నీ ఒగ్గేసి నా కొడుకునే అన్నాయంగా ఎత్తుకపోనారమ్మో...'

'ఏటేటీ? దొంగతనాలూ దోపిడి సేసినాడా? అదేటమ్మా, ముందుగాలే కొడుకును అదుపులో ఎట్టుకోలేక పోనావా? తోటకూర నాడే మందలించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు కదమ్మా? దోచేసినోడిని మరట్టికెల్లక ముద్దెట్టుకుంటారేటి? బాధగానే ఉంటదికానీ కూసింత ఓర్సుకోమ్మా...'

'అదొక్కటే కాదమ్మా! నా కొడుకు కట్టాలకు మొదట్నుంచీ లెక్కేలేదు తల్లీ...'

'అట్టాగా తల్లీ? ఎంతెంత కట్టపడిపోనాడమ్మా నీ కొడుకు?'

'ఏం సెప్పమంటారు తల్లీ! ఆల్ల నాయన కూసున్న కుర్సీ ఎక్కాలని ముచ్చట పడ్డాడమ్మా... కానీ అందరూ కలిసి అడ్డుకుని మరొకర్ని కూసోబెట్టేరమ్మా... అందుకని అలిగి రోడ్ల మీద పడ్డాడమ్మ బిడ్డ!'

'అయ్యో... తల్లీ ఎంత కట్టం? ఆ కుర్సీ ఎప్పుడోపాలి ఎక్కుదువులేరా... తొందరపడమాకని సెప్పలేకపోనావమ్మా! నట్టింట్లో కన్నకొడుక్కు సెప్పుకోలేక, ఇప్పుడిట్టా రోడ్డుమీద పడాల్సి వచ్చింది కదమ్మా? ఇంకేటమ్మా నీ బిడ్డ కట్టం?'

'ఏం సెప్పమంటావు తల్లీ? ఆ కుర్సీ ఎక్కినాయన్ని దించేదాక నా కొడుక్కి సుకం లేదమ్మా... అందుకోసరమే ఆయనకి మద్దతిచ్చేటోల్లని తనవైపు తిప్పుకోడానికి ఎంత సతమతమైపోయాడోనమ్మ బిడ్డ! ఆయనొట్టి అసమర్దుడని లోకానికి సాటాలని తిరగని సోటు లేదమ్మ... అంతలేసి తిరుగుడు ఎవులైనా తట్టుకోగలరా సెప్పండమ్మ?'

'అబ్బో... సానా కట్టం తల్లీ! అంతులేని ఆశలెట్టుకుంటే అంతేనని ముందుగాలే సెప్పలేకపోనావామ్మా? ఇప్పుడు నువ్వు కూడా ఇట్టా తిరగాల్సి ఉండకపోను... ఇంకేటమ్మా నీ కట్టం?'

'నా బిడ్డ ఐద్రాబాద్‌లో రాజబవనం కడుతున్నాడమ్మా... దానికి ఇటుకలు, సిమెంట, కూలీల పనులన్నీ సూసుకోడానికెంత ఆయాస పడిపోయాడో. ఇప్పుడయ్యన్నీ సూసుకోడానికి లేదే కదమ్మ?'

'ఏటీ రాజబవనమే! అవున్లేమ్మా... అంతోటి పెద్దిల్లు మొదలెడితే కట్టమే! మాం పూరింట్ల తాటేకులు మార్సడానికే ఆపసోపాలు పడిపోతామే. కానీ ఏటి సేత్తం? ఎవుల్నైనా పురమాయించుకో తల్లీ...'

'అదొక్కటే కాదమ్మా... రాట్రమంతటా బూములు సుట్టబెట్టాడమ్మా... ఎవురెవరికో కట్టబెట్టాడమ్మా... ఆల్లనుంచి సొమ్ములు పట్టాడమ్మా... కంపెనీలెట్టాడమ్మా... ఆ యవ్వారాలన్నీ నాకేటి తెలస్తయి సెప్పండమ్మ... ఇప్పుడేం సేతురో తెల్టం లేదమ్మ...'

'ఓలోలోలి! ఇయ్యెక్కడి కట్టాలమ్మా... ఎక్కడా ఇనలేదు? ఇన్నోసి పన్లు నెత్తి మీదెట్టుకుంటే ఎట్టాగమ్మా? ఎంత కట్టబడిపోనాడమ్మ బిడ్డ... ఇంకేటి కట్టాలు తల్లీ?'

'ఏమని సెప్పనమ్మ? ఎనిమిదేళ్ల కితం సక్కంగానే ఉండేవాల్లమమ్మ... అంతా పోగుసేసి మా కాడున్నది లచ్చల్లోనేనమ్మ ఆస్తంతా... పేనం సుకంగా ఉండేది... ఈమద్దె కాలంలో నా కొడుకు కాయకట్టం వల్ల లచ్చ కోట్లకు పడగలెత్తామమ్మా... ఆ నోట్లన్నీ లెక్కబెట్టి నా కొడుకు వేళ్లన్నీ నొప్పులేనమ్మా...'

'ఓలమ్మలమ్మ! ఎంత కట్టమమ్మ... ఎదవది కూలి డబ్బులు నెక్కెట్టుకోడాకే కిందిమీదులవుతామమ్మ మేమంతా. అట్టాంటిది అంతలేసి సొమ్ములొచ్చి పడిపోతా ఉంటే ఎంత కట్టం? బిడ్డ సేతులకు నొప్పి లేపనం రాయలేక పోయావమ్మా?'

'అది కాదమ్మా... ఆ డబ్బులేంటో, కంపెనీలేటో, మనుసులేటో, మాటలేటో, నాకేటి తెలుత్తాది సెప్పండమ్మ?'

'అయ్యయ్యో! ఇంటుంటే కడుపు తరుక్కుపోతావుంది. కుసింత ఓపిక పట్టమ్మ...'

'ఎట్టా పట్టేదమ్మ? పొరుగు రాట్రంలో కూడా బవంతుల పన్లెట్టుకున్నాడు బిడ్డ! ఎన్నెన్ని కోట్లో తీస్కెల్లి ఇదేశాలు పంపేడు. ఆటిని దొడ్డిదారిని తీస్కొచ్చి సొంత కంపెనీల్లోకి తోడుకున్నాడు. ఇన్నేసి యవ్వారాలు సూసుకోవాల్సి ఉంటే కొడుకుని తీస్కెల్లి జైల్లో పెడితే ఎట్టాగమ్మా?'

'ఓలమ్మో... ఎంత కట్టం! గుండెలవిసిపోతన్నాయి తల్లీ...'

'మీకట్టా అనిపించాలనేనమ్మా... సానుబూతి కురిపించాలనేనమ్మా... నా కట్టాలు మీకాడ ఏకరువు ఎట్టుకోడానికి వచ్చాను...'

'అవునుకానీ తల్లీ... ఇంతకీ మామేటి సేయాలంటావు సెప్పమ్మా...'

'ఏం లేదమ్మా... మీరంతా కలిసి నా బిడ్డకు మద్దతియ్యాల. ఆడెనకాల జనమంతా ఉన్నారని సాటి సెప్పాల... అదేనమ్మా నా కోరిక...'

'శానా బాగుంది తల్లీ! ఆడేమో దొంగతనాలు సేసేడూ? దోపిడి సేసేడూ? ఎవుల్ల బూములో గుంజుకుని మరెవుల్లకో అప్పజెప్పి మాయజేసి కోట్లు కొల్లగొట్టేడూ? ఇయన్నీ తెలుసుకుని కూడా నీ కొడుక్కి మద్దతియ్యటానికి మాకు మనసెట్టా ఒప్పుద్దమ్మా? నీతిమాలినోడికి జేజేలు కొడితే నవ్వులపాలు కామా! పున్నామ నరకానికి పోమా తల్లీ! నీ కట్టాలన్నీ ఇని ఓదార్చగలం కానీ మామేటీ సెయ్యలేమమ్మా. అవునుగానీ తల్లీ... ఇంతలేసి కట్టాలడిపోతా నీ బిడ్డ బయటుండే బదులు జైల్లోనే ఉంటే సుకం కదా తల్లీ? నీడపట్టున పడుండి ఇంత బువ్వ తింటాడు? కాసింత ఓర్సుకో తల్లీ! పోయిరా!'

PUBLISHED IN EENADU ON 12.6.2012

శుక్రవారం, జూన్ 08, 2012

అవినీతి మాంత్రికుడు



అవినీతి మాంత్రికుడు

పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే 'సారొత్తారొత్తారే... వస్తారొత్తారొత్తారే...' అనే పాట వినిపించింది. రాజకీయ బేతాళుడు, పిశాచాలు కలిసి చెట్టుకింద స్టెప్పులేస్తూ కనిపించాయి.
అక్రమార్కుడు ఉబ్బితబ్బిబ్బైపోయి, 'ఇదేంటి బేతాళా, నువ్వు నాకు వశమైనట్టేనా?' అన్నాడు.

బేతాళుడు భళ్లున నవ్వి, 'వార్నీ, నీకు ఆశ చాలా ఎక్కువయ్యా! అందుకే రాష్ట్రాన్ని అంతలా దోచుకున్నావు! రోజూ ఒకేలా మొదలెట్టడం ఎందుకని ఇలా కొత్తగా ఆలోచించానంతే. బాగుందా?' అన్నాడు.

అక్రమార్కుడు డీలా పడిపోయి సమాధి మీద నీరసంగా కూలబడ్డాడు. బేతాళుడు దగ్గరకొచ్చి, 'ఏమయ్యా, జైల్లో ఆహారం సరిపోవడం లేదా? రోజూ నువ్వు తినేలా అక్రమాల సన్నబియ్యంతో అన్నం వండటం లేదా? అందులోకి కమ్మని కాసుల కలగలుపు పప్పు వడ్డించడం లేదా? గనులు కూరిన గుత్తొంకాయ కూర చేయించలేదా? ఖనిజాల ఖైమా సంగతేంటి? సెజ్‌ల పులుసైనా పెట్టారా లేదా? పెట్టుబడుల పచ్చడి వేశారా? రాకరాక వచ్చిన అతిథివి కదా, భూముల బొబ్బట్లు చేయించొద్దూ? ఆశలు తోడెట్టిన గడ్డపెరుగుతోపాటు జుర్రుకోవడానికి మారిషస్‌ నుంచి మాయాజాలం మామిడిపళ్లు తెప్పించొద్దూ? కనీసం నంజుకోవడానికి నల్లడబ్బైనా వేయాలి కదా? అవినీతి అప్పడాలు, వక్రబుద్ధి వడియాలు కూడా లేవా? ఎంత దారుణం... ఎంత దారుణం!' అంటూ వగలుపోయాడు. పిశాచాలన్నీ ముసిముసిగా నవ్వసాగాయి.

అక్రమార్కుడు దీనంగా మొహం పెట్టి, 'బేతాళా! నీకిది భావ్యమా? వశం చేసుకుందామని వచ్చానుకదాని ఇలా ఎగతాళి చేస్తావా? నాకు తెలిసి అలనాటి విక్రమార్కుడి కథలో బేతాళుడు కథలు చెబుతాడు కానీ, నీలా కబుర్లు చెప్పడు...' అన్నాడు ఉక్రోషంగా.

బేతాళుడు నవ్వుతూనే దగ్గరకు వచ్చి, 'భలేవాడివయ్యా అక్రమార్కా! అలనాటి ఆయనకు, ఇలనాటి నీకు పోలికెక్కడుంది చెప్పు? ఆ విక్రమార్కుడు అవక్రమ పరాక్రమవంతుడు. మరి నువ్వో? అక్రమ వక్రబుద్ధుడివి. ఆయన ప్రజారంజకుడు. నువ్వు ప్రజావంచకుడివి. ఆయన జనాన్ని రంజింపజేసి ఆనందపరిస్తే, నవ్వు ఏడిపించి ఓదారుస్తున్నావు. ఆయన బేతాళుణ్ని వశం చేసుకోవాలనుకున్నది పరోపకారం కోసం, ప్రజాహితం కోసం! నువ్వు నన్ను వశం చేసుకోవాలనుకుంటున్నది అధికారం కోసం, ప్రజాధనాన్ని మరింత దోచుకోవడం కోసం! చెప్పిన తేడాలు చాలా, ఇంకా చెప్పాలా?' అన్నాడు.

విసిగిపోయిన అక్రమార్కుడి మొహం కోపంతో ఎర్రబడిండి. చర్రుమంటూ లేచి, 'బేతాళా, వూరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. చూస్తూ ఉండు. త్వరలోనే నీకు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. నీకు తెలియదేమో, నీకన్నాముందే నాకు ప్రజలంతా వశమయ్యారు, తెలుసా?' అన్నాడు ఆవేశంతో వూగిపోతూ!

ఆ మాటకు పిశాచాలన్నీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ కిందపడి దొర్లసాగాయి. బేతాళుడు కూడా శ్మశానం దద్దరిల్లేలా నవ్వి, 'అక్రమార్కా, నీకు చాలా తిక్కుందయ్యా! కానీ, దానికి ఓ లెక్క మాత్రం లేదు. అందుకే చట్టమన్నా, న్యాయమన్నా, నీతన్నా, నిజాయతీ అన్నా, ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అస్సలు లెక్కలేకుండా అడ్డమైన అక్రమాలు చేశావు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. అయినా నీ నోట ప్రజలనే మాట వచ్చింది కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు? ప్రజలు నిన్ను నమ్ముతున్నారని నువ్వెలా అనుకొంటున్నావు? నీకింత భరోసా ఎక్కడిది? జనాన్ని ఏ విధంగా ఆకట్టుకున్నావని భావిస్తున్నావు? అందుకు నువ్వు పాటించిన నయవంచక పద్ధతులు ఏంటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... ప్రజల మనసు నువ్వంటే విరిగిపోయినంత ఒట్టు' అన్నాడు.

అక్రమార్కుడు దిగాలుపడిపోయాడు. బేలగా మొహం పెట్టి, 'నీ శాపంతో చెడ్డ చిక్కొచ్చింది బేతాళా! నువ్వంత మాటన్నాక చెప్పక తప్పుతుందా? రాక రాక మాకు అధికారం అంది వచ్చింది. దాని ఆధారంగా ఎదగాలంటే అమాయకమైన ప్రజానీకానికి మత్తు చవి చూపించాలి. వాళ్లకేదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలి. అందుకే కొత్తకొత్త పథకాలు రచించాం. వాటి అమలు పేరిట వారికి కొంచెం విదిల్చి మేము, మా అనుయాయులు కోట్లకు పడగలెత్తాం. సోదాహరణంగా చెబుతాను, విను. జలపథకాల పేరిట ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కానీ కాంట్రాక్టులన్నీ మా అనుచరులకే ఇచ్చాం. వాళ్లు పనులు చేసినా, చేయకపోయినా కోట్ల కొద్దీ రూపాయల బిల్లులు చెల్లించాం. అదీ చాలకపోతే అంచనాలు సవరించి మరీ సొమ్ములు విడుదల చేశాం. ఆ ధనమంతా ఎవరిది? ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసినదే. ఫలితంగా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నా మేమంతా కోట్లు వెనకేసుకున్నాం. ఉపాధి పనుల పేరిట పేదలకు కొంత సొమ్ము పంచినట్టే పంచి, వాటి కోసం పెట్టే బిల్లుల పేరిట కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి నాయకుల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పారేలా ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఫీజులు ఇప్పించినట్టే విదిల్చి, ఆ నెపంతో మా వారిచేత వందలకొద్దీ కాలేజీలు పెట్టించి గ్రాంటులు మంజూరు చేశాం. ఇప్పుడా కాలేజీలన్నీ అరకొర వసతులతో మూతపడ్డాయి. విద్యా ప్రమాణాలు కూడా దిగజారాయి. రోగాలకు చికిత్స పేరిట అస్మదీయ వైద్యులకు కోట్లు పంపిణీ చేశాం. ఇలా ఏం చేసినా ప్రజలకు గోరంత, మేం మెక్కేది కొండంత ఉండేలా చూసుకున్నాం. కానీ పాపం... ప్రజలు అమాయకులు. మా వల్ల అవినీతి వ్యవస్థాగతమైందని, అందువల్ల అడుగడుగునా అణగారిపోక తప్పదని తెలుసుకోలేరు. వాళ్ల అజ్ఞానం మీదనే నాకు అనంతమైన నమ్మకం. వాళ్ల అమాయకత్వమే నాకు రక్ష' అంటూ మనసులోని మాయనంతా వెల్లగక్కాడు.

బేతాళుడు నిట్టూర్చి, 'ఎంతగా దిగజారిపోయావు అక్రమార్కా! అవినీతి మాంత్రికుడిలా కనిపిస్తున్నావు. ఇంత పచ్చిగా నిజాలు చెప్పాక ఇక నాకిక్కడేం పని?' అంటూ శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!



PUBLISHED IN EENADU ON 8.6.12