బుధవారం, జూన్ 06, 2012
నోరున్న నేరగాడి కథ
నిలదీసే నిజాలు!
నిలదీసే నిజాలు!
ఉదయించిన సూర్యుడి వెలుగుకి గదిలోకి సన్నగా పొడుగ్గా విస్తరించాయి నీడలు. అవి ఆ గది తలుపు వూసలవి. వూసల నీడలు తన మీద పడేసరికి ఖైదీ ఉలిక్కిపడ్డాడు. మంచి నీళ్లు తాగాలనిపించింది.
'బాబూ, దాహం...' అన్నాడు వూసల వెనకనుంచి చూస్తున్న సెంట్రీతో.
'ధన దాహమా, అధికార దాహమా?' ప్రశ్నించాడా సెంట్రీ.
ఖైదీ కళ్లెర్రజేసి కోపంగా- 'ఏం, వేళాకోళంగా ఉందా?' అన్నాడు గట్టిగా.
సెంట్రీ నవ్వి 'ఇందులో వేళాకోళానికేముంది? నీ దాహాలు ఎలాంటివో నాకు తెలియనిదా? భూదాహం, గని దాహం, కీర్తి దాహం, కరెంట్ దాహం, కంపెనీల దాహం... లాంటివెన్నో ఉన్నాయి కాబట్టి ఏ దాహమో తెలుసుకుందామని అడిగాను, తప్పా?' అన్నాడు.
ఖైదీ ఇక భరించలేక 'ఏయ్, నేనెవరో తెలుసా?' అంటూ గద్దించాడు.
సెంట్రీ ఏమాత్రం తగ్గకుండా, 'ఆపవోయ్, పెద్ద అరుస్తున్నావ్... అసలు నేనెవరో తెలుసా?' అంటూ టోపీ తీశాడు.
అతడికేసి తేరిపారి చూసిన ఖైదీ ఉలిక్కిపడ్డాడు. అచ్చం అది తన రూపే.'ఏమిటిది?' అనుకున్నాడు.
సెంట్రీ వూసల్లోంచి జైలుగదిలోకి నడిచి వచ్చేసి పక్కనే కూర్చున్నాడు. చిత్రంగా చూస్తున్న ఖైదీతో, 'ఇంకా గుర్తు పట్టలేదా? నేనే, నీ అంతరాత్మను!' అన్నాడు.
ఖైదీ నిట్టూర్చి, 'ఆఖరికి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా?' అన్నాడు దీనంగా.
'అంతరాత్మ దగ్గర కూడా అంతరాలు దేనికి? ఈ గదిలో నువ్వు ఒంటరివి. నీ మదిలో నేను తుంటరిని. కాదంటావా?'
'సరే... చెప్పు! ఇంతకూ నేను చేసిన తప్పేంటి?'
'చేయనిదేంటని అడగరాదూ! అహ... మనలో మాటలే. గొంతులో దాహం ఇన్ని నీళ్లు గుటకేస్తే తగ్గుతుంది. నీ దాహాలు ఎప్పటికి తీరేను? ధన దాహంతోనే కదా అడ్డగోలుగా దోచుకున్నావ్? అధికార దాహంతోనే కదా ఇన్ని ఆపసోపాలు పడుతున్నావ్? ఇప్పుడు చూడు, ఎలాంటి స్థితికి దిగజారావో! అందర్నీ ఓదారుస్తానంటూ బయల్దేరి, ఆఖరికి నిన్నెవరూ ఓదార్చడానికి లేని స్థితిని, ఎవరూ ఓదార్చలేని పరిస్థితిని తెచ్చుకున్నావు. తొలినుంచి చూస్తే నీ అడుగులన్నీ తప్పుల మడుగులే కదా?'
'అంటే... దుఃఖంలో ఉన్న ప్రజల్ని ఓదార్చాలనుకోవడం తప్పంటావా?'
'నా దగ్గర కూడా వాదనలెందుకు చెప్పు? దుఃఖంలో నువ్వున్నావా, ప్రజలున్నారా? అధికార పీఠం మీద పట్టు అనూహ్యంగా దూరమైన ఏడుపు నీది. వారసత్వ ఆశల్ని సంతకాలుగా మార్చినా- ఫలితం దక్కని ఏడుపు నీది. మహానేత కొడుకన్న ఏకైక అర్హత ఉన్నా అందలం ఎక్కించలేదన్న ఏడుపు నీది. ఎదిగిన ఒడినే కాలదన్ని వీధులకెక్కిన ఏడుపు నీది. చేసిన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ప్రజల మనోభావాలు మారిపోతాయన్న ఏడుపు నీది. ఇన్ని ఏడుపులు నీకు ఉండగా ఎడతెగని ఓదార్పులంటూ ఓర్పు లేకుండా ఒగరుస్తున్న నీ ప్రయత్నాలేంటో నేను గ్రహించలేననుకున్నావా?'
'నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఇంతకూ నువ్వు నాకు మిత్రుడివా, శత్రువ్వా?'
'ఆఖరికి ఈ స్థాయికొచ్చేశావన్నమాట. నీలో అనుమానం బాగా పెరిగిపోయింది. నీ చుట్టూ జరిగేదంతా కుట్రంటున్నావు. ఆ కుట్రకథతో జనాల్ని నమ్మించాలనుకుంటున్నావు. ఆఖరికి నీ అంతరాత్మనే శత్రువనుకుంటున్నావు. ఇక నువ్వు చేసేదేం లేదు. నీలో నువ్వే వగర్చుకో... ఓర్చుకో... ఓదార్చుకో...!'
ఖైదీ కళ్లెర్రబడ్డాయి.
'ఛ... నోర్ముయ్! వూరుకున్నకొద్దీ రెచ్చిపోతున్నావు. ఈ ప్రజాస్వామ్య సమాజంలో ఏ వ్యక్తయినా అనుకున్నది చేసే హక్కు లేదా? యాత్రలు చేసుకునే వీలు లేదా? ఏంటి పెద్ద చెప్పొచ్చావ్?' అంటూ అరిచాడు.
అంతరాత్మ పకపకమంటూ నవ్వింది. చూస్తుండగానే పెద్దగా ఎదిగిపోయింది.
'హ...హ...హ్హ...హ్హ...! ఇంకా నువ్వేంటో, నీ గతేంటో నీకు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. ఆత్మస్తుతీ, పరనిందా నీకెంతగా అలవాటయిపోయాయంటే, చివరికి నీలో ఉండే నామీద కూడా వాటినే ప్రయోగిస్తున్నావు. నా దగ్గరా నటనలా? నీలోకి నువ్వు తరచి చూసుకో. మొదట్నుంచీ నీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. నీ మనసులో ఉన్నదొకటి. పైకి మెత్తగా మాట్లాడుతున్నదొకటి. నన్ను నీ మది గదిలో ఖైదుచేసి నీ బుద్ధికి తోచినట్టు అడ్డమైన పనులన్నీ చేశావ్. ఫలితంగా ఇప్పుడు నువ్వే చంచల్‌గూడా జైల్లో ఓ ఖైదీగా మారావు. అధికార పీఠం అందుబాటులోకి వచ్చింది మొదలు నువ్వెన్ని పన్నాగాలు పన్నావో, ఎంతగా దోచుకున్నావో తెలియనట్టు అమాయక మొహం పెడతావేం? ఒకప్పుడు కేవలం మూడు లక్షల లోపు ఆదాయపు పన్ను కట్టిన నువ్వు, నాలుగైదు ఏళ్లలో ఏడు కోట్లకు పైగా ఎలా కట్టావంటే జవాబు చెప్పగలవా? మరో రెండేళ్లకల్లా ఏకంగా 84కోట్లు ముందస్తు పన్ను కట్టడం వెనక బాగోతాలు ఎప్పటికీ బయటకు రావనే అనుకున్నావా? ఒకటా రెండా... లక్ష కోట్లకు పడగలెత్తిన నీ సిరుల వెనక ఎన్నెన్ని విష పథకాలున్నాయో నాకు తెలియదనుకుంటున్నావా? భూములు, గనులు, ప్రాజెక్టులు, ఓడరేవులంటూ అభివృద్ధి పనుల మిషమీద అయినవారికి అడ్డగోలుగా కట్టబెట్టి, వాటికి ప్రతిగా కోట్లు కొల్లగొట్టి, నిజాలు బయటకొచ్చే సరికి అంతా కుట్రంటావా? ఇంతచేసీ ప్రజల్ని మభ్యపెట్టినట్టు, నీ అంతరాత్మనైన నన్నూ ఏమార్చాలని చూస్తున్నావంటే- నువ్వెంత కరడుగట్టిపోయావో తెలుస్తోందా? సీబీఐ ప్రశ్నలకైనా అడ్డదిడ్డంగా జవాబివ్వగలవేమో కానీ, నా ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పగలవా?' అంటూ గద్దించింది.
ఖైదీ కళ్లు గిర్రున తిరిగాయి. సూర్య కిరణాలు నిజాల బాణాల్లా చురుక్కుమనిపించడంతో జైలుగదిలో కళ్లు మూసుకున్నాడు ఆ కొత్త ఖైదీ!
Published in Eenadu on 06-06-2012.
సోమవారం, జూన్ 04, 2012
ఆటాడు కుందాం రా
ఆటాడు కుందాం రా
పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే చెట్టు చాటు నుంచి 'యు ఆర్ అండర్ అరెస్ట్' అని వినిపించింది. అక్రమార్కుడు దడుసుకుని చుట్టూ చూసేసరికి రాజకీయ బేతాళుడు చాటు నుంచి వచ్చి, 'భయపడ్డావా అక్రమార్కా? నేనేలే. నువ్వొచ్చి ఎలాగూ నన్ను చెట్టు మీంచి దించి భుజాన వేసుకుంటావు కాబట్టి, కాలయాపనెందుకని నేనే దిగిపోయా. నిన్ను చూడగానే సరదాగా దొంగాపోలీస్ ఆట ఆడాలనిపించింది. అలా సమాధుల వెనక దాక్కుంటూ ఆడుకుందామా?' అన్నాడు భుజం మీదకి దూకుతూ!
అక్రమార్కుడు బేతాళుడిని మోస్తూ ఎప్పటిలాగే నవ్వో ఏడుపో తెలియని తన మార్కు మొహం పెట్టి, 'నేనంటే నీక్కూడా ఆటలుగా ఉందా బేతాళా! మౌనం అక్కర్లేదని చెప్పి మాట్లాడమంటావు. మాటల్లో పెట్టి మనసులోది కక్కిస్తావు. ఏం చేస్తాం? ఎలాగోలా నిన్ను శ్మశానం దాటించి వశం చేసుకోవాలనే ఇదంతా భరిస్తున్నాను' అన్నాడు.
'అబ్బ! ఆశ... దోశ... అధికారం... అప్పడం!' అంటూ బేతాళుడు వికవికా నవ్వాడు. పిశాచాలు కూడా గొంతు కలిపాయి.
అక్రమార్కుడు తలపట్టుకున్నాడు. బేతాళుడు అది చూసి, 'పోన్లే. దొంగాపోలీస్ ఆట వద్దు. 'నాకది...నీకిది' ఆట ఆడుకుందామా? ఇందులో నువ్వు ఛాంపియనంటగా? సరేనా?' అన్నాడు.
'ఇదెక్కడి ఆట? దీన్ని నేనెపుడూ వినలేదే...' అన్నాడు అక్రమార్కుడు.
'అబ్బ... ఎంత అమాయకంగా మొహం పెట్టావయ్యా! ప్రజల ముందు ఉన్నావనుకున్నావా? వాళ్లయితే నమ్ముతారేమో కానీ నా దగ్గరెందుకయ్యా ఆ మొహం? నాకు తెలియదనుకోకులే. దీన్నే 'క్విడ్ ప్రొ కో' అని కూడా అంటారటగా? నువ్వు, నీ అనుచరులు కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఆర్జించింది దీంతోనేటగా? ఈ ఆటలో మెలకువలేంటో మాకూ నేర్పించవూ?' అన్నాడు బేతాళుడు, వచ్చే నవ్వు ఆపుకొంటూ.
ఏమనాలో తెలియని అక్రమార్కుడు వెంటనే బేతాళుణ్ణి భుజం మీద నుంచి దించి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూడసాగాడు.
బేతాళుడు పకపకమని, 'ఇదేంటయ్యా అక్రమార్కా! నేనేమైనా అమాయక ఓటర్ననుకున్నావా? కొంపదీసి చెంపలు నిమరవు కద? తల మీద ముద్దు పెట్టవు కద?' అన్నాడు.
అక్రమార్కుడు కనుబొమ్మలు ముడిచి, 'నువ్వు నిజంగానే బేతాళుడివా లేక సీబీఐ పంపిన విచారణాధికారివా?' అన్నాడు కోపంగా.
బేతాళుడు మళ్లీ భుజమెక్కి కూర్చుని, 'మొత్తానికి నీ అనుమానం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదయ్యా! ఆఖరికి శవం కాలుతున్న వెలుగులో నీ వెనక పడే నీడను చూసి కూడా సీబీఐ అనుకునేలా ఉన్నావు... హ...హ్హ...హ్హ!' అంటూ నవ్వాడు.
అక్రమార్కుడి మొహం జేవురించింది. కోపంతో కళ్లెర్రజేసి, 'మీరంతా ఇంతే. భూత ప్రేత పిశాచ గణాలు! రాష్ట్రంలో పార్టీలు, అధికారులు, పోలీసులు అందరూ మీలాగే ఏకమయ్యారు. ప్రజలకు మేలు చేయడం కోసం మేమింత కష్టపడితే దానికి లేనిపోని అర్థాలు తీస్తారా? ఎవరూ చేయని పనులు చేస్తే లోటుపాట్లు వెతుకుతారా? మంచి చూడకుండా, చెడు చూస్తారా? కానీ గుర్తుంచుకోండి. ప్రజలంతా గమనిస్తున్నారు. తెలిసిందా?' అన్నాడు ఆవేశంగా.
శ్మశానంలో పిశాచాలన్నీ భళ్లున నవ్వాయి. బేతాళుడు పగలబడి నవ్వి, 'సర్లేవయ్యా! అలాగే కానీ! నీ నమ్మకం నేనెందుకు కాదనాలి? మరైతే ఇప్పుడీ శ్మశానంలో ప్రజలెవరూ లేరు కదా? కాబట్టి నిజాలు చెప్పు. నువ్వాడించిన భూదారుణాల గుట్టు విప్పు. ఏ ధైర్యంతో ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టావు? ఎలా ఇందుకు పథక రచన చేశావు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... అధికార పీఠం ఎప్పటికీ అందనంత ఒట్టు!' అన్నాడు.
అక్రమార్కుడు కాసేపు నిరుత్తరుడయ్యాడు. తరవాత నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, 'ఎంత మాటన్నావు బేతాళా! నేను కలలో కూడా ఊహించలేని విషయమిది. ఇక తప్పుతుందా? విను. అధికారం అందుబాటులోకి వచ్చేసరికి నేనొక చిన్న కంపెనీకి అధిపతిని మాత్రమే. రాకరాక వచ్చిన అధికారం అండతో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలని భావించాను. అందుకు అనుగుణంగా అనుచర వర్గంతో కలసి పావులు కదిపాను. రాజధాని శివార్లలోని భూముల ధరల్ని రంకె వేయించడంతో మా పని మొదలు పెట్టాం. ముందుగానే అయినవారు, అనుంగు అధికారులు, ప్రముఖుల చేత భూములు కొనిపించి, అక్కడికి విదేశీ కంపెనీలు, రింగురోడ్లు, అంతర్జాతీయ ప్రాజెక్టులు రాబోతున్నట్లు ప్రచారం చేయించాం. అలా భూముల ధరలు పెరగడంతోనే అమ్మించి, సంపద సృష్టించడం ఎంత సులువో అస్మదీయులకు అర్థమయ్యేలా చేశాం. ఆపై అధికారులను ప్రలోభపెట్టి పనులు జరిపించాం. నా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి కావలసిన భూముల్ని ధారాదత్తం చేయడానికి తెర తీశాం. ఏ పరిశ్రమకైనా, ప్రాజెక్టుకైనా రాష్ట్రంలోని బంజరు భూముల్నే ఇవ్వాలి. కానీ వాటికి ధర ఉండదు కాబట్టి పచ్చని పంట పొలాల్ని సైతం ఇవ్వడానికి సమకట్టాం. సెజ్‌లను సృష్టించి రైతుల భూముల్ని వశపరుచుకున్నాం. ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి మా పనులకు అభివృద్ధి ముసుగు వేశాం. ప్రాజెక్టులొస్తే పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఊదరగొట్టాం. గ్రామాల రూపురేఖలే మారిపోతాయని ఊరించాం. ఇలా గనులు, కొండలు, అరణ్యాలు సైతం తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చేశాం. ఇదే నువ్వంటున్న క్విడ్ ప్రొ కో కార్యక్రమం. ఇక చాలా?' అన్నాడు నీరసంగా.
అంతా విని పిశాచాలు సైతం బాధగా నిట్టూర్చాయి. బేతాళుడు బాధగా మొహం పెట్టి, 'ఎంత పని చేశావు అక్రమార్కా! మీ మాయాజాలం వల్ల ప్రాజెక్టులు, పరిశ్రమలేవీ రాకపోగా వేలాది మంది అమాయక ప్రజలు భూములు కోల్పోయారు. ఉపాధి కోల్పోయి కూలీలుగా మారారు. సర్లె... శ్మశానంలోనైనా నిజం చెప్పావు. సంతోషం. సరైన సమాధానం చెప్పాక ఇంకా నేనెందుకు నీ భుజం మీద వూరేగుతాను? వస్తా' అంటూ బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!
PUBLISHED IN EENADU ON 4.6.2012
గురువారం, మే 31, 2012
వికృత యోచన
వికృత యోచన!
పట్టువదలని అక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి కొమ్మకు వేలాడుతున్న ఆశల శవాన్ని భుజాన వేసుకుని గబగబా నడవసాగాడు. శవంలోని రాజకీయ బేతాళుడు గట్టిగా గొంతు సవరించుకుని, 'అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు ఎక్కడా దాఖలాలు లేవనే డైలాగు విన్నావా అక్రమార్కా? చిత్రమేమంటే... ఈ రెండు గుణాలూ నీలో ఎక్కువగానే ఉన్నట్టున్నాయే?' అన్నాడు.
అక్రమార్కుడు మాట్లాడలేదు.
'అలనాటి విక్రమార్కుడిలాగా మౌనం పాటించక్కర్లేదని చెప్పాగా! సమాధానం చెప్పు?' అంటూ బేతాళుడు రెట్టించాడు.
అక్రమార్కుడు నిట్టూర్చి, 'నువ్వేమన్నా నేనేమీ అనలేను బేతాళా! బరువైన ఆశల్ని భుజాన వేసుకున్నాక తప్పుతుందా? నువ్వెలాగనుకుంటే అలాగే' అన్నాడు.
బేతాళుడు చటుక్కున భుజం దిగిపోయి అక్రమార్కుడి భుజం మీద చెయ్యి వేసి పక్కనే నడుస్తూ, 'ఇంత బరువు నువ్వు తట్టుకోలేవు కానీ, నా చెయ్యి మొయ్యి చాలు. చెయ్యంటే గుర్తొచ్చింది... అభయ హస్తం నీడలో ఎదిగి భస్మాసుర హస్తంలా మారిన నిన్నొక కోరిక కోరతాను. కాదనవుగా?' అన్నాడు.
'ఏమిటది?'
'అహ... ఏం లేదూ, ఈ శ్మశానాన్ని మాత్రం ఎవరికీ కట్టబెట్టకేం! ఎన్నో ఏళ్లనుంచి ఇక్కడే బతుకుతున్నా. కావాలంటే నువ్వు చెప్పిన కంపెనీ షేర్లని, నువ్వు నిర్ణయించిన అడ్డగోలు రేటుకు నోరెత్తకుండా కొనేలా ఎవరి మీదనైనా ఆవహించి పెట్టుబడి పెట్టిస్తాలే. ఇంతవరకు ప్రజల భూములిచ్చి పెట్టుబడులు పిండుకున్నావు కానీ, తొలిసారిగా మా మరుభూమిని ముట్టుకోకుండా ఉంటే చాలు- పెట్టుబడులు వచ్చే అవకాశమిది. బాగుంది కదూ?'
బేతాళుడి చతురోక్తికి అక్రమార్కుడి మొహం కోపంతో జేవురించింది. అది చూసిన బేతాళుడు చటుక్కున అతడి మొహం అరచేతుల్లోకి తీసుకుని మొహంలోకి మొహం పెట్టి చెంపలు నిమిరి, తలను బలవంతంగా వంచి నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడు.
'ఏమిటిది?' అన్నాడు అక్రమార్కుడు మరింత కోపంగా.
'ఏమో నాకేం తెలుసు? నువ్వు ఎక్కడికి వెళ్లినా అమాయక ప్రజల్ని ఇలాగే చేస్తుంటావుగా? అలా చేస్తే ఏమవుతుందోనని చేసి చూశా. అయినా అంత కోపం ఎందుకు అక్రమార్కా!' అన్నాడు బేతాళుడు వికవికా నవ్వుతూ.
అక్రమార్కుడు తమాయించుకుని 'కోపం నీమీద కాదులే. నా మీద పెద్ద కుట్ర జరిగింది. అది తలచుకుంటే ఒళ్లంతా కుతకుతలాడిపోతోంది' అన్నాడు.
'ఏమా కుట్ర, ఏమా కుతకుత?'
అక్రమార్కుడు ఆవేశాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. 'ఢిల్లీ నుంచి దూతలొచ్చారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం వాళ్లు ఏకమయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు వ్యూహరచన చేశారు. గెలవలేక, నా విజయాన్ని అడ్డుకోలేక, అరెస్ట్ చేసి ఎన్నికలు వాయిదా వేయిద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ జనం గుండెల్లో నేనెప్పుడో ఖైదీనని తెలుసుకోలేకపోతున్నారు...' అంటూ రెచ్చిపోయాడు.
బేతాళుడు శ్మశానంలో కింద పడి పొట్ట పట్టుకుని పకపకా నవ్వుతూ దొర్లసాగాడు. చెట్ల మీద, సమాధుల మీద కూర్చుని ఇదంతా వింటున్న పిశాచాలు కూడా కడుపుబ్బ నవ్వుతూ గెంతసాగాయి. అక్రమార్కుడు తెల్లమొహం వేశాడు.
బేతాళుడు తేరుకుని, 'హ...హ్హ...హ్హా! భలే నవ్వించావు అక్రమార్కా! బతికినన్నాళ్లూ నానా బాధలు పడి చచ్చి ఇక్కడికొచ్చాక మా పిశాచాలు వింటున్న గొప్ప జోక్ ఇదేనయ్యా! ఇక ఆపెయ్. ఈ కబుర్లన్నీ ప్రజల దగ్గర చెల్లుతాయేమో కానీ, నా లాంటి రాజకీయ బేతాళుడి దగ్గర కాదు సుమా! ఇప్పుడు చెప్పు? తలాతోకా లేని ఈ కుట్ర కథనెందుకు తలకెత్తుకున్నావు? ప్రజల మనసుల్ని ఎందుకు కలుషితం చేయాలని చూస్తున్నావు? నీ మదిలోని మాటను ఉన్నదున్నట్టుగా చెప్పకపోతే... ప్రజల్లో చైతన్యం వచ్చినంత ఒట్టు...'అన్నాడు.
అక్రమార్కుడు కంగారుపడ్డాడు. 'వద్దు బేతాళా! అంత మాటనకు. ప్రజలు నా నిజస్వరూపం గ్రహిస్తే నా ఆశలు నెరవేరవు. నిన్నెలాగైనా వశం చేసుకుని, తద్వారా అధికార పీఠం అధిరోహించడానికి సిద్ధపడ్డాక... నిజం చెప్పక తప్పుతుందా! విను. నాకు పూర్తిగా అర్థమైపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను చేసిన అడ్డగోలు, అకృత్య, అవినీతి పనులన్నీ బయటపడుతున్నాయి. వాటి ఫలితమే నా విచారణ. చివరికి చేరవలసిన చోటుకే చేరాను. ఇదంతా నేను ముందుగానే వూహించాను. గమనించావో లేదో, ప్రతి రోజూ ప్రజలకు తాజాగా కనిపించిన నేను... సీబీఐ విచారణకు రెండు రోజుల ముందునుంచే గెడ్డం పెంచాను. నా సానుభూతి వేషాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. నేను అరెస్టయ్యాక ఎవరెవరు ఎలా మాట్లాడాలో, ఏమేం చేయాలో కూడా ఏర్పాటు చేశాను. ఎందుకో తెలుసా? నా అరెస్ట్ తరవాత ప్రజల మనోభావాలు మారకుండా ఉండటానికే. మా హయాములో ప్రజల కోసం చేసింది ఆవగింజైతే, దాని వెనక నేను భోంచేసింది మేరు పర్వతమంతనే సత్యం వారికి బోధపడకుండా ఉండాలంటే- కన్నీటి కెరటాల్లో వారిని ముంచెత్తాలి. సానుభూతి సునామీలో ఊపిరాడకుండా చేయాలి. తమిళ తమ్ముడు రాజా, చెల్లెమ్మ కనిమొళి, కర్ణాటక కంత్రీ గాలి వంటివారి అరెస్టుల కథలన్నీ చూశాక నేను ఆఖరి అస్త్రంగా పన్నిన పన్నాగమిది. ఇక ఎప్పుడు బయటికి వస్తానో తెలియదు కాబట్టే కుట్ర కథను తెరపైకి తెచ్చాను. ఇలా ఎదురొడ్డి వీరంగమాడటం నా రాజకీయ చతురతకు సాక్షి. ఇది రెండు వైపులా పదునున్న ప్రచారాస్త్రం' అంటూ వికృత మనోభావాలన్నీ బయటపెట్టేశాడు.
బేతాళుడు తెల్లబోయి, 'మరీ ఇంత నీచ నికృష్ట తరహాలో ఆలోచించడం మా పిశాచాల్లో కూడా సాధ్యం కాదయ్యా! అయినా నువ్వు సరైన సమాధానం చెప్పాక నేనిక చేసేదేముంది? మరో నిశిరాత్రి కలుద్దాం. వస్తా' అంటూ చటుక్కున మాయమై, రివ్వుమంటూ ఎగిరి, తిరిగి చెట్టెక్కాడు.
PUBLISHED IN EENADU ON 30.5.2012
ఆదివారం, మే 27, 2012
కుతంత్రాల పుట్ట
కుతంత్రాల పుట్ట
పట్టు వదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టాడు. అక్కడ నిశ్చింతగా సంచరిస్తున్న పిశాచాలన్నీ అతడిని చూడగానే భయంతో 'కెవ్వు కేక' పెట్టి గుంపుగా చేరి గుబులుగా చూడసాగాయి.
'వీడిక్కడికి వచ్చాడేంటి? మనకు ఓట్లు లేవుగా?' అంది రక్తాక్షి అనే పిల్లపిశాచి.
'కొంపదీసి మనల్ని కూడా ఓదార్చడు కద?' అంది చిత్రనఖి అనేనడివయసుది.
'ఈ శ్మశానాన్నెవరికైనా ధారాదత్తం చేస్తున్నాడేమో, దానికి బదులుగా సొంత వ్యాపారానికి పెట్టుబడులు పట్టేసి ఉంటాడు' అంది రాజకీయాల్లో ఆరితేరి, ఆరిపోయిన వక్రదృష్టి అనే పిశాచం. శ్వేతకేశి అనే ఓ వృద్ధ పిశాచం వారిని వారించి, 'ఇతడు అధికార పీఠాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అక్రమార్కుడు. ఇప్పుడు రాజకీయ బేతాళుడిని వశం చేసుకోవడానికి ఇలా వచ్చాడు. ఇక మనకు భలే కాలక్షేపం' అంది.
పిశాచాలన్నీ 'కీ...క్రీచు...' మని నవ్వుతూ చప్పట్లు కొట్టాయి.
పట్టువదలని అక్రమార్కుడు ఓ చెట్టువద్దకు నడచి వెళ్లి, దాని కొమ్మకు వేలాడుతున్న ఆశల శవాన్ని భుజాన వేసుకుని మొహం గంటు పెట్టుకుని మౌనంగా నడవసాగాడు.
శవంలోని రాజకీయ బేతాళుడు వికవికమంటూ నవ్వి, 'రాజకుమారా! నీ ప్రయత్నం చూస్తే జాలేస్తోంది. నీ పట్టుదల చూస్తే ముచ్చటేస్తోంది. కాబట్టి నీకో అవకాశం ఇస్తున్నాను. అలనాటి విక్రమార్కుడిలాగా నువ్వు మౌనం పాటించక్కర్లేదు. నాతో కబుర్లు చెప్పవచ్చు. కానీ, నేను ఎలా అడిగే ప్రశ్నలకు అలా నువ్వు సమాధానాలు చెప్పాలి. లేకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది. నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోయిన నాడు నేను నీకు వశమవుతాను. ఈ షరతు బాగుందా?' అన్నాడు.
అక్రమార్కుడు నోరు విప్పాడు. 'చాలా బాగుంది బేతాళా! ఆశల శవంపై ఆవహించి మాట్లాడే నీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఈలోగా నువ్వేం బాధపడకు. నీకు నేనున్నాను' అన్నాడు.
బేతాళుడు పకపకా నవ్వాడు. 'అక్రమార్కా! ఆగాగు. నీకు ఓదార్చడం బాగా అలవాటైపోయింది. నా దగ్గర కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇంతకూ మంచి రోజులంటున్నావు, ఎలాగట?'
'త్వరలో నన్ను సీఎం పీఠంపై చూడబోతున్నావు. అప్పుడంతా స్వర్ణయుగమే. ఆశలన్నీ తీరిపోతాయి. ఎవరికీ ఏ లోటూ ఉండదు'
బేతాళుడు ఫక్కుమని, 'ఇవన్నీ ప్రజల దగ్గరకు పోయి చెప్పుకో. నా దగ్గర కాదు. నీ నాలుక మీద పలుకేంటో, నీ మనసులో కులుకేంటో నాకు తెలియదనుకోకు. నేనసలే రాజకీయ బేతాళుణ్ని, తెలిసిందా?' అన్నాడు.
'కోపగించుకోకు బేతాళా! ఏంటో ఈమధ్య నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినా ఇలాంటి మాటల్నే పలవరిస్తున్నాను. సరేకానీ, ఏవో ప్రశ్నలన్నావు... ఏమిటో అడుగు' అన్నాడు అక్రమార్కుడు.
'అక్రమార్కా! అసలెందుకు ఇంతలా కష్టపడుతున్నావని అడిగితే ప్రజలకేం చెబుతావో అది చెప్పు?' అడిగాడు బేతాళుడు.
అక్రమార్కుడు ఆవేశంగా నోరు విప్పి, 'ఈ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు. మేం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అణగార్చి వేసింది. నాపై కుట్రలు పన్ని అరెస్టు చేయాలని చూస్తోంది. రాష్ట్రంలో ప్రజలెవ్వరూ సుఖసంతోషాలతో లేరు....' అంటూ కసాయివాడు మాంసాన్ని ముక్కలు చేస్తున్న తరహాలో చేతిని పైకి కిందికీ వూపుతూ చెప్పసాగాడు.
బేతాళుడు పకపకా నవ్వి, 'ఆపెయ్, నీ ఉపన్యాసాలు రోజూ పత్రికల్లో చదువుతున్నాంలే. ఇప్పుడు నీ మనసులో మాటేంటో చెప్పు?' అంది.
అక్రమార్కుడు నవ్వో ఏడుపో తెలియని మొహం పెట్టి, 'గొప్ప చిక్కులో పడేశావు బేతాళా! అయినా నువ్వు శాపం పెట్టాక తప్పుతుందా? విను. ఒకటా రెండా, లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని నా అపార మేధాసంపత్తితో దారి మళ్లించాను. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సొంత వ్యాపారాలకు పెట్టుబడులు సేకరించి, అలా పెట్టినవారికి ఈ రాష్ట్రం నా సొంత జాగీరన్నంత ధీమాగా ఎక్కడ అడిగితే అక్కడ భూములు, గనులు కట్టబెట్టించాను. అందుకోసం జీఓలు సైతం మార్పించాను. అధికారుల్ని ప్రలోభపెట్టి పరుగులు పెట్టించాను. ప్రజల పేరిట పథకాలు రచించి, వాటి అమలు మాటున అయినవారికి అధిక మేలు జరిగేలా పావులు కదిపి అనుచరవర్గాన్ని పెంచుకున్నాను. పప్పుబెల్లాల్లా ప్రజలకు అందింది కొంతైతే, చాటుమాటున కొల్లగొట్టింది అంతకు లక్షింతలు ఉండేలా చూసుకున్నాను. ఒకప్పుడు ఇంటిని తాకట్టుపెట్టే స్థితినుంచి ఇప్పుడు పొరుగు రాష్ట్రానా కోటలు కట్టేంతగా వృద్ధి చెందాను. కానీ ఏం చేయను? తానొకటి తలిస్తే విధి వేరొకటి తలచినట్టు అనుకోకుండా అంతా తారుమారై అధికార పీఠంపై పట్టు కోల్పోయాను. ఇప్పుడు చూడు? నేను చేసిన నీతిమాలిన పన్లన్నీ ఒకటొకటికగా బయటపడుతున్నాయి. నా తరఫున పనిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఒకరొకరుగా అరెస్టవుతున్నారు. ఇదంతా ఏదో ఒకనాటికి జరుగుతుందని ముందే వూహించాను. అందుకే మరింత విజృంభించాను. పెంచి పోషించిన సొంత పార్టీనుంచి వేరుపడి వేరు పార్టీపెట్టినా... ఇంతవరకు ఎదిగిన పార్టీనే తిట్టి పోస్తున్నా... నా అనుచరులచేత అసంబద్ధంగా రాజీనామాలు చేయించి ఎన్నికలకు దారులు వేసినా... లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా ఖర్చుకు కారకుడినైనా... అన్నీ అధికారం కోసమే. మేం విసిరిన పప్పుబెల్లాలనే పదేపదే ముచ్చటిస్తూ ప్రజల్ని ప్రలోభపెడితే అధికారానికి చేరువ కావచ్చనే ఇలా ఎండనక, కొండనక శ్రమ పడుతున్నాను. వారిలో స్వర్ణయుగమంటూ ఆశలు కల్పించి వూరిస్తున్నాను. నీకు తెలియనిదేముంది? అధికారం ఉంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చు. కేసుల తీవ్రత తగ్గించుకోవచ్చు. కాబట్టి అస్థిరత, అనిశ్చితిని పెంపొందించడమే నా ముందున్న ఏకైక లక్ష్యం' అంటూ ఏకరవు పెట్టాడు.
అక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
PUBLISHED IN EENADU ON 26.5.2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)